Skip to main content

కేంద్రం వ్యతిరేకించినా రాష్ట్ర సర్కార్ పొడిగింపు ఉత్తర్వులు: కార్మిక, అధికారుల సంఘం హర్షం

సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీగా ఎన్.శ్రీధర్ మరో ఏడాది కొనసాగనున్నారు.
ఆయన పదవీకాలం గత డిసెంబర్ 31వ తేదీతో ముగిసిపోగా, మరో ఏడాది పాటు పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖకు ఆయన డిప్యుటేషన్‌ను ఏడాది కాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ నెల 5న ఉత్తర్వులు జారీ చేశారు. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఎన్.శ్రీధర్ 2015 జనవరి 1 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. సింగరేణి సీఎండీగా ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి.

కేంద్రం అయిష్టంగా ఉన్నా..
ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు సీఎండీ శ్రీధర్‌ను అదే హోదాలో కొనసాగించాలన్న ప్రతిపాదనను.. గత నెల 30న కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ కార్యాలయంలో జరిగిన సంస్థ వార్షిక జనరల్ బాడీ సమావేశంలో కేంద్ర ప్రతినిధిగా హాజరైన బొగ్గు గనుల శాఖ అండర్ సెక్రటరీ ఆల్కా శేఖర్ వ్యతిరేకించడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మెజారిటీ ఓట్లతో ఈ ప్రతి పాదనకు ఆ సమావేశంలో ఆమోద ముద్ర లభించింది. ఆరేళ్ల సుదీర్ఘ కాలం పాటు సీఎం డీగా శ్రీధర్ పనిచేయడంతో ఆయనను ఈ పదవిలో ఇంకా కొనసాగించడం పట్ల కేంద్రం అయిష్టతతో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐఎన్‌టీయూసీ, అధికారుల సంఘం హర్షం..
సింగరేణి సీఎండీగా శ్రీధర్ పదవీ కాలం పొడిగించడాన్ని అధికారుల సంఘం (కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా-సింగరేణి బ్రాంచి) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జక్కం రమేశ్, ఎన్‌వీ రాజశేఖర్‌రావు, ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ స్వాగతించారు. వీరు శుక్రవారం సింగరేణి భవన్‌లో సీఎండీ శ్రీధర్‌ను కలసి అభినందించారు.
Published date : 09 Jan 2021 03:24PM

Photo Stories