Skip to main content

జూన్‌లో గురుకుల అడ్మిషన్లు..?దరఖాస్తు గడువు పెంపు.. ?

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్‌లో నిర్వహించాలని గురుకుల విద్యా సంస్థల సొసైటీలు భావిస్తున్నాయి.
వాస్తవానికి ఇప్పటికే ప్రవేశ పరీక్షలు నిర్వహించి, మే మొదటి వారంలో ఫలితాలు ప్రకటించాలి. కానీ కరోనా దృష్ట్యా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలు పూర్తికాకపోవడంతో జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియపై స్పష్టత లేదు. ఏటా ఏప్రిల్ నెల చివరి వారంలో ఇంటర్ ఫలితాలు వెలువడేవి. అనంతరం గురు కుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు మార్గం సుగమమయ్యేది. ఇప్పటివరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సైతం సందిగ్ధంలో పడింది. దీంతో గురుకు లాల్లో అన్ని కేటగిరీల్లో ప్రవేశాల ప్రక్రియ నిలిచిపోయింది.

లాక్‌డౌన్ తర్వాతే...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. ఆ తర్వాత కూడా లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేయకుండా సడలింపుల ద్వారా ఒక్కో రంగానికి అనుమతులిస్తారు. ఎక్కువ మంది సమూహంగా ఏర్పడే కార్యక్రమాలకు అనుమతి ఉండదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ప్రవేశ పరీక్షలను మేలో నిర్వహించే అవకాశం లేదనిపిస్తోంది. లాక్‌డౌన్ సడలింపులతో అన్ని రకాల సెట్‌లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో గురుకుల పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల (టీజీసెట్)పై స్పష్టత రానున్నట్లు ఆయా శాఖల అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ప్రవేశ పరీక్షను జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ తర్వాత మరోసారి దరఖాస్తుకు గడువు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై సొసైటీలు చర్చించి నిర్ణయం తీసుకోనున్నాయి. ఐదో తరగతి ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తుకు కూడా మరోసారి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. బీసీ గురుకుల ఇంటర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును మే 10వ తేదీ వరకు పొడిగించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల జూనియర్ కాలేజీల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంది. అయితే లాక్‌డౌన్ సడలింపులపై స్పష్టత వచ్చాక అన్ని సొసైటీలు వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Published date : 29 Apr 2020 06:02PM

Photo Stories