జర్నలిజంలో మూడు నెలల సర్టిఫికెట్ కోర్సు అందిస్తున్న ఏపీ ప్రెస్ అకాడమీ
Sakshi Education
సాక్షి, అమరావతి/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు) : జర్నలిస్టులకు ఉపయుక్తంగా మూడు నెలల కాల పరిమితితో జర్నలిజం సర్టిఫికెట్ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ తెలిపారు.
యూజీసీ నిబంధనలను అనుసరించి ప్రెస్ అకాడమీ సొంతంగా నాలుగు సబ్జెక్టులతో కోర్సు రూపొందించినట్టు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ఉత్తీర్ణులై కోర్సులో చేరే జర్నలిస్టులకు 50 శాతం ఫీజు రాయితీతో కేవలం రూ.1500 చెల్లిస్తే సరిపోతుందని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసి జర్నలిజంపై ఆసక్తి ఉన్న యువత కూడా పూర్తి ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందొచ్చన్నారు. అనంతరం కోర్సు బ్రోచర్ను విడుదల చేశారు. కోవిడ్ దృష్ట్యా ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి వర్సిటీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. గురువారం(నేటి) నుంచి అడ్మిషన్లు ప్రారంభిస్తున్నామని, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ప్రెస్అకాడవీు.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంచినట్టు శ్రీనాథ్ వివరించారు. విక్రమసింహపురి వర్సిటీ రిజిస్ట్రార్ విజయ్కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, సెప్టెంబర్ రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించి, డిసెంబర్ మొదటి వారంలో తుది పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. వివరాలకు 91541 04393 నంబర్ను, pressacademy contact@gmail.com ను సంప్రదించాలని సూచించారు.
Published date : 22 Jul 2021 04:03PM