జీ మ్యాట్-2021 ఆన్‌లైన్ పరీక్షలో మళ్లీ చేరిన ఏడబ్ల్యూఏ విభాగం!
Sakshi Education
న్యూఢిల్లీ: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్) ఆన్‌లైన్ పరీక్షా విధానంలో గతంలో తొలగించిన అనలిటికల్ రైటింగ్ అసెస్‌మెంట్ (ఏడబ్ల్యూఏ) విభాగాన్ని తిరిగి చేర్చారు.
పరీక్షార్థులకు అదనపు సౌలభ్యాన్ని అందించడంతోపాటు, వాస్తవ పరీక్షా కేంద్రం అనుభూతినిచ్చేందుకు చేపట్టిన పలు చర్యల్లో ఇది కూడా ఒకటని జీమ్యాట్‌ను నిర్వహించే గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ కౌన్సిల్(జీమ్యాక్) తెలిపింది. వేగంగా మారుతున్న మార్కెటింగ్ అవసరాలకు అనుగుణంగా ఏడబ్ల్యూఏ వంటి జీమ్యాట్‌లోని కొన్ని అంశాలను ప్రారంభ ఆన్‌లైన్ పరీక్షలో తొలగించినట్లు జీమ్యాక్ అధికారులు తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా జీమ్యాట్‌ను ఆన్‌లైన్ ద్వారా జీమ్యాక్ చేపడుతోంది. ఇప్పటి వరకు 150 దేశాలు, ప్రాంతాల్లో 45 వేలకుపైగా పరీక్షలు చేపట్టినట్లు జీమ్యాక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 2,300 బిజినెస్ స్కూళ్లలో ప్రవేశాలకు జీమ్యాట్‌నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎంబీఏ ప్రవేశాలు ప్రతి పదింటిలో తొమ్మిదింటికి జీమ్యాట్ స్కోరే ఆధారం. జీమ్యాక్ అనే లాభాపేక్ష లేని సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 223 గ్రాడ్యుయేట్ బిజినెస్ స్కూళ్లున్నాయి.
Published date : 12 Feb 2021 04:08PM