Skip to main content

జగనన్న విద్యా కానుకతో స్కూళ్లకు హాజరైన విద్యార్థులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత విద్యాసంస్థలు సోమవారం తెరుచుకున్నాయి.
కోవిడ్-19తో చాలాకాలం ఇళ్ల వద్దనే ఉండిపోయిన 9, 10 తరగతుల విద్యార్థులు కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూ ఆనందంగా స్కూళ్లకు వచ్చారు. జగనన్న విద్యాకానుక కింద ఇచ్చిన బ్యాగులు, పాఠ్యపుస్తకాలతో మాస్కులు ధరించి హాజరయ్యారు. 6 అడుగుల భౌతికదూరం పాటింపచేస్తూ, శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేయించి సిబ్బంది వారిని లోపలకు పంపారు. ముఖ్యంగా ప్రభుత్వ స్కూళ్లను ‘మనబడి: నాడు-నేడు’ పథకం కింద సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో ఆయా పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. స్కూళ్లను ముందుగానే ప్రభుత్వం శానిటైజ్ చేయించింది. పాఠశాలలను హాఫ్‌డేతో ముగించి జగనన్న గోరుముద్ద కింద మధ్యాహ్న భోజనం అందించాక పిల్లలను ఇళ్లకు పంపారు. టీచర్లకు ముందుగానే కోవిడ్ పరీక్షలు నిర్వహించి నెగిటివ్ ఉన్నవారు మాత్రమే వచ్చేలా చర్యలు తీసుకున్నారు. విద్యార్థుల ఉష్ణోగ్రతలను పరిశీలించి జ్వరం ఉన్నవారిని వైద్యపరీక్షలకు పంపారు. ఇతర విద్యార్థులు కూడా పరీక్షలు చేయించుకునేలా దగ్గరలోని పీహెచ్‌సీల్లో విద్యా శాఖ ఏర్పాట్లు చేయించింది.

తల్లిదండ్రుల కమిటీలతో సమావేశం
విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా స్కూళ్లకు వచ్చి పేరెంట్స్ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరంలో ఐదు నెలల సమయం కోల్పోయినందున మిగిలిన కాలంలో స్కూల్ ముగిశాక ఇంటి వద్ద విద్యార్థులతో చేయించాల్సిన కృత్యాల గురించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు వివరించారు. జూనియర్ కాలేజీల్లోనూ ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు తరగతులను ప్రారంభించారు. పలు చోట్ల ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్యులు పాఠశాలలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్లలో మినహా అన్ని ప్రాంతాలలో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 99 శాతం పాఠశాలల్లో 87 శాతం మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. 39 శాతం మంది 9వ తరగతి విద్యార్థులు, 44 శాతం మంది పదో తరగతి విద్యార్థులు తరగతులకు వచ్చారు.

అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాం
స్కూల్‌ను ముందుగానే శానిటైజ్ చేయించడంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రుల చేతులను శుభ్రం చేయించాకే ప్రారంభించాం. నాడు-నేడుతోపాటు జగనన్న విద్యాకానుక వంటి పథకాలతో గతంలో కంటే స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. చేరికల కోసం భారీగా వస్తున్నారు.
- బి.పద్మలత, ప్రధానోపాధ్యాయురాలు, పునాదిపాడు జడ్పీ హైస్కూల్, కృష్ణా జిల్లా

90 శాతం వరకు విద్యార్థులు హాజరయ్యారు
తొలిరోజు 90 శాతం వరకు విద్యార్థులు హాజరయ్యారు. మా పాఠశాల మనబడి నాడు-నేడు కింద ఎంపికైంది. రూ.61 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
- వి.సత్యరాజు, హెచ్‌ఎం, జెడ్పీహెచ్ స్కూల్, కొయ్యాం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా

ఎంతో ఆనందంగా ఉంది
చాలాకాలం తర్వాత టీచర్లు, తోటి విద్యార్థులతో కలిసి చదువులు సాగించడం ఆనందంగా ఉంది. కోవిడ్ వల్ల ఇంట్లోనే ఉన్న సమయంలో ప్రభుత్వం దూరదర్శన్, ఆన్‌లైన్ ద్వారా ఇచ్చిన పాఠ్యబోధన వల్ల మేలు జరిగింది.
- శిరీష, టెన్త్ విద్యార్థిని

అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా సోమవారం విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వచ్చారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి రోజు దాదాపు 80 శాతం విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. అంతకు మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో వసతులు తప్పనిసరిగా ఉండాలన్నారు. వీటిపై ఆయా సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామని చెప్పారు.
- విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
Published date : 03 Nov 2020 04:17PM

Photo Stories