Skip to main content

జేఎన్‌టీయూ 70మందికి పైగా నకిలీ పీహెచ్‌డీలు కలిగిన అధ్యాపకులు!

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో నకిలీ పీహెచ్‌డీలు కలిగిన అధ్యాపకుల సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది.
2018లో ఇలాంటి వారి సంఖ్య 50 ఉంటే ఇప్పుడు 70కి పైగా ఉన్నట్లు తేలింది. పొరుగు రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో పీహెచ్‌డీ చేయకపోయినా చేసినట్లుగా సర్టిఫికెట్లు చూపిస్తున్న వారు కొంత మంది , ఇతర రెగ్యులర్ కోర్సులు చేస్తూ అదే కాలంలో పీహెచ్‌డీలు చేశామన్న వారు మరికొందరు ఉన్నారు. నిర్ణీత కాలంలో పీహెచ్‌డీ పూర్తి చేయకపోయినా చేసినట్లుగా చూపించేవారు, అప్పటికే చేసిన పరిశోధక అంశాలను తీసుకొని పీహెచ్‌డీలను పూర్తి చేశామని చెప్తున్నవారు ఉన్నారు. ఇలా జేఎన్‌టీయూ పరిధిలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో దాదాపు 70 మంది ప్రొఫెసర్ల పీహెచ్‌డీలు సరిగ్గా లేవని తేలింది. దీంతో వారిపై ఎలాంటి చర్యలు చేపట్టాలి? అనే దానిపై జేఎన్‌టీయూ ఆలోచనలు చేస్తోంది.

ప్రత్యేక పరిశీలన చేపట్టిన జేఎన్‌టీయూ
జేఎన్‌టీయూ పరిధిలోని దాదాపు 204 ఇంజనీరింగ్ కాలేజీల్లోని అధ్యాపకుల అర్హతల వెరిఫికేషన్‌ను ఇటీవల చేపట్టింది. దీనికి వివిధ కాలేజీలకు చెందిన విభాగాల అధిపతులు, ప్రొఫెసర్లు 320 మంది హాజరయ్యారు. వారంతా పీహెచ్‌డీ పట్టా తోపాటు రిజిస్ట్రేషన్ నెంబరు, అడ్మిషన్ నెంబరు, చేరిన తేదీ, పీహెచ్‌డీ పూర్తయిన ఏడాది, థీసిస్, మొదటి పేజీ, చివరి పేజీపై గైడ్ సంతకం వంటి వివరాలు అందజేశారు.ఓ 70 మందికి పైగా అధ్యాపకులకు సంబంధించి మాత్రం ఏదో ఒక పొరపాటు ఉన్నట్లుగా తేలింది.పీహెచ్‌డీ రెండేళ్లలో పూర్తి చేయడం, ప్రీ-పీహెచ్‌డీ లేకపోవడం, థీసిస్ సమర్పించకపోవడం, గైడ్ సంతకం లేకపోవడం, పబ్లికేషన్లు ప్రచురించకపోవడం, అడ్మిషన్ నెంబర్ వంటి సమాచారంలో పొరపాట్లు ఉన్నట్లుగా జేఎన్‌టీయూ గుర్తించింది.

పేరు తెలియని వర్సిటీల నుంచి..
దేశంలో ఎవరికీ పేరు తెలియని కొన్ని విశ్వవిద్యాలయాల నుంచి కొందరు అధ్యాపకులు పీహెచ్‌డీలు సమర్పించినట్లు తెలిసింది. వాటికి యూజీసీ గుర్తింపు ఉందా? ఉంటే, పీహెచ్‌డీ చేసిన కోర్సులకు, గైడ్‌కు అర్హత ఉందా? అన్న అనుమానాలు ఉన్నాయి.ఉత్తరాది రాష్ట్రాల్లోని పలు వర్సిటీలు ఇచ్చిన పీహెచ్‌డీలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయా పీహెచ్‌డీలు జారీ చేసిన వర్సిటీలకు లేఖలు రాసి నిగ్గు తేల్చాలని, ఆ బాధ్యతలను సంబంధిత కాలేజీలకే అప్పగించే యోచన చేస్తున్నారు. దీనిపైవారం రోజుల్లో వైస్ చాన్స్ లర్‌తో చర్చించి ముందుకు సాగాలని జేఎన్‌టీయూ అధికారులు భావిస్తున్నారు. బోగస్ పీహెచ్‌డీలతో పనిచేస్తున్న అధ్యాపకులున్న కాలేజీలకు నోటీసులు జారీ చేసే అంశాన్ని జేఎన్‌టీయూ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు.

ఎందుకీ పరిస్థితి..
రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఏటా పీహెచ్‌డీ ప్రవేశాల నోటిఫికేషన్ ఇచ్చి, పరిశోధనలు జరిగేలా చూడాలి. కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ సక్రమంగా సాగడంలేదు. దీంతో అనేక విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత ఏర్పడింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లోని 96 వేల సీట్లకు దాదాపు 30 వేల మంది అధ్యాపకులు అవసరం. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నట్లుగా చూపిస్తున్నా వారిలో సగం మంది బీటెక్ వారే. మరోవైపు పీహెచ్‌డీ కలిగి, బోధనలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉన్న వారు ప్రొఫెసర్ పోస్టుకు అర్హులు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు కూడా పీహెచ్‌డీ వారు అవసరం. ఇలా బీటెక్, ఎంటెక్ కాలేజీల్లో మొత్తంగా 16,667 మంది పీహెచ్‌డీ కలిగిన వారు అవసరం. కానీ రాష్ట్రంలో 1,500 మంది వరకే ఉన్నట్లు తేలింది. ఈ పరిస్థితుల్లో పీహెచ్‌డీ పట్టాల కోసం పక్కదారి పడుతున్నారు. పైగా అవి ఉంటే భారీగా వేతనాలను ఇస్తుండటంతో కొందరు ఆశ పడి బోగస్ పత్రాలను తెచ్చుకుంటున్నారు.
Published date : 14 Jan 2020 01:35PM

Photo Stories