ఇంజనీరింగ్ ఫ్రెషర్లకు కొత్త విద్యా సంవత్సరం ఎప్పటి నుంచి అంటే...
Sakshi Education
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థల్లో చేరే కొత్తగా చేరే విద్యార్థులకు విద్యా సంవత్సరం ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
కోవిడ్ నేపథ్యంలో ప్రవేశాల డెడ్‌లైన్‌ను పొడిగించినట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల తుది గడువును నవంబర్ 30వ తేదీ వరకు పొడిగించామని ఏఐసీటీఈ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. కోవిడ్ మార్గదర్శకాలను అమలు చేస్తూ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా తరగతులను ప్రారంభించవచ్చని సూచిం చారు. కరోనా విజృంభణ కారణంగా మార్చి 16 నుంచి యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. వర్సిటీలు, కాలేజీల్లో ఫ్రెషర్లకు నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించేందుకు యూజీసీ ఇటీవల అనుమతినిచ్చింది. తరగతులు ఆలస్యంగా ప్రారంభం అవుతున్న కారణంగా 2021లో వేసవి సెలవులను భారీగా కుదిస్తామని యూజీసీ పేర్కొంది.
Published date : 20 Oct 2020 06:15PM