Skip to main content

ఇక అన్ని వర్సిటీల్లో ఈ-గవర్నెన్స్, ఈ-ఫైల్ విధానం!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కాలేజీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వర్సిటీల కార్యకలాపాలు పారదర్శకంగా సాగేలా ఈ-గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. త్వరితగతిన ఫైళ్లు పరిష్కరించేందుకు ఈ-ఫైల్ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు సంబంధించి ఐటీ విభాగంతో పాటు మరికొన్ని సంస్థలతో ఉన్నత విద్యాశాఖ చర్చిస్తోంది. ప్రస్తుతం వర్సిటీల్లో కంప్యూటరీకరణ పూర్తిస్థాయిలో జరగనందున.. ఆయా వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో యూనివర్సిటీల సంఖ్య క్రమేణా పెరుగుతున్నా.. వాటి నిర్వహణలో ఆశించిన ప్రగతి కానరావడం లేదు. ఇందుకు గత ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక కారణమైతే.. స్వయంప్రతిపత్తి మాటున ఆయా వర్సిటీల అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా వర్సిటీల్లో ప్రమాణాలు దెబ్బతినడమే కాకుండా ఆర్థిక క్రమశిక్షణ లోపించింది. ఈ నేపథ్యంలో వాటిని దారిలో పెట్టేందుకు పారదర్శక విధానాలను అనుసరించడమే ఉత్తమ మార్గమని ఉన్నత విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది.

రాష్ట్రంలో 54 యూనివర్సిటీలు
1950లో రాష్ట్రంలో ఒకే యూనివర్సిటీ ఉండగా.. 2000 నాటికి 13 యూనివర్సిటీలు అందుబాటులోకి వచ్చాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో వర్సిటీల సంఖ్య పెరిగింది. దాదాపు జిల్లాకొక వర్సిటీ ఏర్పాటైంది. 2015 నాటికి రాష్ట్రంలో యూనివర్సిటీలు 37కు చేరగా ప్రస్తుతం 54 ఉన్నాయి. వీటిలో రాష్ట్ర వర్సిటీలు కొన్ని కాగా కేంద్రప్రభుత్వ పరిధిలోని సంస్థలు, ప్రయివేటు యూనివర్సిటీలు ఉన్నాయి.

గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగం
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు యూజీసీ నుంచి కొంత నిధులు వస్తున్నా.. సిబ్బంది జీతభత్యాలు, ఇతర అకడమిక్ వ్యవహారాలకు ప్రభుత్వమే నిధులు కేటాయిస్తోంది. ఈ నిధుల ఖర్చులో కొన్ని వర్సిటీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉప కులపతులు, ఎగ్జిక్యూటివ్ కమిటీల్లో తమ వారిని పెట్టుకొని ఇష్టానుసారం నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. యూనివర్సిటీల సొమ్మును అప్పటి ప్రభుత్వ పెద్దలు దారిమళ్లించడమే కాకుండా తమ ఎన్నికల ప్రచార సభలకు ఖర్చుచేయించారు. ఈ నేపథ్యంలో వర్సిటీలకు అందించే ప్రతి పైసా విద్యార్థుల కోసం ఖర్చుపెట్టేలా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్ చంద్ర ఆయా వర్సిటీల రిజిస్ట్రార్లతో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే వర్సిటీల్లోని బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్ధులకు బయోమెట్రిక్ హాజరును ప్రవేశపెడుతున్నారు. హాజరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా ప్రధాన సర్వర్‌కు అనుసంధానం చేస్తారు.

యూనివర్సిటీల వారీగా కేటాయింపులు (రూ.కోట్లలో)

ఆంధ్రా

238.16

ద్రవిడ

35

అంబేడ్కర్

70

కృష్ణా

5.79

ఉర్దూ

23

రాయలసీమ

35.19

నాగార్జున

50

పద్మావతి

75

విక్రమసింహపురి

37.58

శ్రీ వేంకటేశ్వర

150

వైఎస్సార్ ట్రైబల్

50

కృష్ణదేవరాయ

55

నన్నయ

31.61

వేమన

50.02

తెలుగు

4.28

ఓపెన్ వర్సిటీ

4.53

యూజీసీ ఎరియర్స్

503

Published date : 16 Jan 2020 12:18PM

Photo Stories