Skip to main content

ఈ ఏడాది నిరుద్యోగ భృతి లేదు: కేసీఆర్

సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది కూడా నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
తామిచ్చిన వాగ్దానం నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం ఉందని, వచ్చే ఏడాది లేదా ఆ తర్వాతి ఏడాది చూస్తామన్నారు. ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు సాధ్యం కాదన్నారు. మార్చి 7 (శనివారం)నమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సీఎం సమాధానమిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ప్రకారం రాష్ట్రంలో కూడా 10% ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. భైంసాలో అల్లర్లలో నిజమైన బాధితుల వివరాలు అందజేస్తే సాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో 70 శాతానికి పైగా బలహీనవర్గాల వారు ఉన్నందున రిజర్వేషన్ల పెంపుపై కేంద్రంతో పోరాడతామని, కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలసి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామని చెప్పారు. పీఆర్సీ కమిటీ గడువు ముగిసినా కొనసాగిస్తామని, సర్వీసు బుక్స్, ఇతర అంశాలను పూర్తిస్థాయి లో ప్రక్షాళన చేయాల్సి ఉందని పేర్కొన్నారు. వేతన సవరణ కోసం పీఆర్సీ ఆగలేదని స్పష్టం చేశారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు కేటాయించిన నీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామన్నారు. గతం లో ఏపీ సీఎం కక్ష పూరితంగా వ్యవహరించారని, తాము మహారాష్ట్ర సీఎంతో ఏడుసార్లు భేటీఅయి ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. సంక్షేమ రంగంలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు.

ఐకేపీ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
57 ఏళ్ల వయసు దాటిని వారికి వృద్ధాప్య పింఛన్లు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తామని తెలిపారు. నిరుద్యోగం ఉంటుందని, అయితే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ ఉద్యోగ అవకాశాలు పొందేలా ఎస్టీ, ఎస్సీ, బీసీలకు స్టడీసర్కిళ్ల ద్వారా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, ఐకేపీ కింద ఉన్న మూడు, నాలుగు వందల మంది ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు.
Published date : 09 Mar 2020 12:27PM

Photo Stories