హాస్టళ్ల హేతుబద్ధీకరణకు పాథమిక నివేదిక రూపొందించిన సంక్షేమ శాఖలు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ వసతి గృహాల హేతుబద్ధీకరణ అంశంలో మరో అడుగు ముందుకు పడింది.
విద్యార్థుల సంఖ్య, నమోదు ఆధారంగా వీటిని రేషనలైజేషన్ చే యాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు నివేదికలు రూపొందించాలని సంక్షేమ శాఖ లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వివరాలను సేకరించిన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, వాటిని క్రోడీకరిస్తూ ప్రాథమిక నివేదికలు రూపొందించారు. వీటిని ప్రభుత్వానికి సమర్పించేందుకు ఆయా శాఖలు తుదిమెరుగులు దిద్దుతున్నాయి. సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత ఈ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,850 ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 772, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 418, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 660 హాస్టళ్లున్నాయి. వీటిలో యాభైకంటే తక్కువ విద్యార్థులున్న వాటి నిర్వహణపై అంచనాలు రూపొందించాలని ప్రభు త్వం ఆదేశించింది. అదేవిధంగా తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను హేతుబద్ధీకరించాలని సూచించింది. ఈక్రమంలో శాఖల వారీగా హాస్టళ్ల పరిస్థితిని గమనించిన అధికారులు.. రాష్ట్రవ్యాప్తంగా 78 హాస్టళ్లలో యాభైకంటే తక్కువ మంది విద్యార్థులున్నట్లు గుర్తించారు. వీటిలో ప్రీమెట్రిక్ హాస్టళ్లే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లు చాలావరకు శాశ్వత భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని హేతుబద్ధీకరిస్తే ప్రస్తుతమున్న విద్యార్థులను ఎక్కడ విలీనం చేయాలనే అంశాలపై ఉన్నతాధికారులు చర్చించి ఒక అంచనాకు వచ్చారు.
Published date : 14 Jan 2020 01:38PM