గురుకుల విద్యా సంస్థల్లోనూ నేటి నుంచి తరగతి గదిలో బోధన..90 శాతానికి పైగా తల్లిదండ్రుల సమ్మతి..
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల పరిధిలో దాదాపు వెయి్యకిపైగా గురుకుల పాఠశాలలు, కళాశాలలున్నాయి. వీటి పరిధిలో 3.75 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా... సోమవారం నుంచి మాత్రం 9వ తరగతి నుంచి పై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమవుతోంది. విద్యార్థులకు సురక్షిత వాతావరణంలో వసతి, వారి ఆరోగ్య పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
విద్యార్థులకు కొత్త ప్లేట్లు, గ్లాసులు..
ప్రతి విద్యార్థి, బోధన, బోధనేతర సిబ్బంది తప్పకుండా మాస్కు ధరించాలి. అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకునేందుకు తరగతి గది బయట, వసతిగృహం ఎంట్రీ వద్ద శానిటైజర్ స్టాండులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి తరగతి గదికి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా వసతి గృహంలో ఇదివరకు గదికి 8 నుంచి 10 మంది విద్యార్థులు ఉండగా... ఇప్పుటు నలుగురు నుంచి ఆరుగురికి మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. కిచెన్ షెడ్లను శుభ్రం చేసి నిత్యావసరాలు, ఇతర సరుకులన్నీ కొత్తవి తెచ్చిపెట్టారు. విద్యార్థులకు కొత్త ప్లేట్లు, గ్లాసులు ఇస్తున్నారు.
ప్రతిరోజూ శానిటైజేషన్..
ప్రతి విద్యా సంస్థను రోజూ శానిటైజ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు స్థానిక సంస్థల సహకారం తీసుకోవాలని సూచించింది. విద్యాశాఖ సూచించినట్లు సొసైటీలు అకడమిక్ క్యాలండర్‌ను రూపొందించి అమలు చేస్తున్నాయి. తొలివారం సాధారణంగా కొనసాగినప్పటికీ... ఆ తర్వాతి నుంచి గురుకులాలు ఎక్కువ సమయం తరగతులు నిర్వహించనున్నాయి. ప్రతి గురుకుల పాఠశాల, కళాశాల, వసతిగృహంలో ఐసోలేషన్ గదులను సిద్ధం చేశారు. ప్రతి గురుకులానికి ఒక నర్సును ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు.
నో విజిటింగ్.. ఔటింగ్
గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో తల్లిదండ్రుల విజిటింగ్, విద్యార్థుల ఔటింగ్‌ను ప్రస్తుతానికి నిలిపివేశారు. అంటే తొలిరోజు విద్యార్థులను స్కూల్/కాలేజీకి పంపిన తర్వాత వారిని కలిసేందుకు గాని, వారు బయటకు వచ్చేందుకు గానీ ఇప్పట్లో అవకాశం ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అనుమతిస్తారు. నిబంధనలు అమలు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. మరోవైపు ప్రత్యక్ష తరగతుల ప్రారంభానికి హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి బోధన సిబ్బంది పలుమార్లు ఫోనులో మాట్లాడి వారి సమ్మతి తీసుకున్నారు. కాగా తొలి రోజు విద్యార్థులను తీసుకొచ్చే సమయంలో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకుంటారు.
తొలి ఐదు రోజులే కీలకం..
గురుకులం తెరిచిన తర్వాత తొలి ఐదు రోజులే కీలకం. ఈ సమయంలోనే ఏవైనా సమస్యలుంటే బయటపడతాయి. ఆరో రోజు నుంచి పరిస్థితి అనుకూలంగా మారుతుంది. 90 శాతానికి పైగా తల్లిదండ్రులు తమ పిల్లల్ని పంపేందుకు సమ్మతించారు. అన్ని జాగ్రత్తల నడుమ తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రిన్సిపాళ్లతో నిరంతరం సంప్రదిస్తూ పరిస్థితిని సమీక్షిస్తాం.
- మల్లయ్యభట్టు, కార్యదర్శి, బీసీ గురుకుల సొసైటీ