Skip to main content

ఏపీలో గిరిజన వర్సిటీ స్థాపనకు చర్యలు: ధర్మేంద్ర ప్రదాన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ చెప్పారు.
లద్దాఖ్‌ ప్రాంతంలో సిందూ కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థా పనకు ఉద్దేశించి సెంట్రల్‌ వర్సిటీస్‌ (సవరణ) బిల్లు–2021పై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఉన్నతవిద్యలో ప్రాంతీయ అసమతుల్యతను తగ్గించేందుకు లద్దాఖ్‌లో సెంట్రల్‌ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి చెప్పారు. ఇదేతరహాలో ప్రాంతీయ అసమానతను ఏపీ ఎదుర్కొంటోంది. ఏపీ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏపీకి గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. ఈ వర్సిటీ గిరిజనులకు మరింత సమీపంలో ఉండేందుకు వీలుగా రెల్లి గ్రా మం నుంచి సాలూరు ప్రాంతానికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. పార్వతీపురం సమీకృత గిరిజన అభివృద్ధిసంస్థ పరిధిలో ఈ ప్రాంతం ఉం ది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చి త్వరితగతిన వర్సిటీ ఏర్పాటుచేయాలి. అలాగే ఏపీలో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాని కోరాం. రాష్ట్ర విభజన అనంతరం టైర్‌–1 నగరాలు కోల్పోయి వైద్యరంగంలో సూపర్‌ స్పెషాలిటీ వసతుల లేమి ఏర్పడింది. అందువల్ల ఆరోగ్యరంగంలో మానవ వనరుల అభివృద్ధికి వీలుగా కేంద్ర సాయంతో 13 వైద్య కళాశాలలు స్థాపనకు సహకరించాలని కోరుతున్నాం..’ అని పేర్కొన్నారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ సమాధానం ఇస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్థాపనకు హామీ ఇచ్చింది. అయితే యూనివర్సిటీ స్థలానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఒక సూచన వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, ఆత్మీయ మిత్రుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాకు ఈ విషయమై లేఖ రాశారు. నాకు సంతోషకరమైన విషయమేంటంటే ఈ యూనివర్సిటీ ఒడిశాకు దగ్గరగా ఏర్పాటవుతోంది. సాలూరుకు సమీపంలో ఏర్పాటవుతున్న ఈ వర్సిటీ వల్ల ఒడిశా విద్యార్థులకు కూడా మేలు చేకూరుతుంది. ఈ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సి ఉంది. ముఖ్యమంత్రి ఈ విషయంలో హామీ ఇచ్చారు. యూనివర్సిటీ రహదారులు, విద్యుత్తు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని మోదీ సర్కారు స్థాపిస్తుంది..’ అని చెప్పారు.
Published date : 10 Aug 2021 05:18PM

Photo Stories