Skip to main content

డీఈడీ కాలేజీల్లో తనిఖీలు షురూ..

సాక్షి, అమరావతి: అడ్మిషన్లలో అవకతవకలకు పాల్పడుతున్న డీఈడీ కాలేజీల పనిపట్టడానికి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నడుం బిగించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన డీఈడీ కాలేజీలు మొత్తం 770 ఉన్నాయి.
వీటిలోని పలు కాలేజీల్లో అడ్మిషన్లలో అవకతవకలు జరిగి విద్యార్థులు నష్టపోతున్నారు. మరికొన్ని కాలేజీలు అసలు నడుస్తున్నాయో.. లేదో కూడా తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో డీఈడీ కాలేజీల స్థితిగతులను తెలుసుకోవడానికి పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ తనిఖీలు చేపట్టింది. మొదటి దశలో భాగంగా డాక్యుమెంట్ల పరిశీలన కోసం 354 కాలేజీలకు నోటీసులు పంపించింది. వారం వ్యవధిలో ఈ కాలేజీల డాక్యుమెంట్లను కమిషన్ పరిశీలించనుంది. ఈ తనిఖీల్లో కమిషన్ చైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు, వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ విజయ శారదా రెడ్డి, కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి నేతృత్వంలో సభ్యులు ప్రొఫెసర్ నారాయణరెడ్డి, సి.ఎ.వి.ప్రసాద్, అజయ్ కుమార్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొంటున్నారు. కాలేజీలకు సంబంధించిన సర్టిఫికెట్లు, అడ్మిషన్ రిజిస్టర్లు, పర్మిషన్లు, కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాలు, స్పాట్ అడ్మిషన్లు, గత మూడేళ్ల ఆదాయ వివరాలు, లెక్చరర్ల నియామకాలు, జీతభత్యాలు మొదలైనవన్నీ పరిశీలిస్తున్నారు. కొన్ని కాలేజీలు తనిఖీ నిమిత్తం ఇంకా తమ వద్దకు రాలేదని.. వాటికి తిరిగి నోటీసులు పంపించనున్నట్లు కమిషన్ అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని కమిషన్ చైర్మన్ జస్టిస్ కాంతారావు తెలిపారు.
Published date : 16 Dec 2020 03:21PM

Photo Stories