దేశానికే ఆదర్శ విద్యాలయం.. జార్ఖండ్ స్కూలుపై నీతిఆయోగ్ ప్రశంసలు
Sakshi Education
రాంచీ: జార్ఖండ్‌లోని పలము జిల్లాలో దల్సల్మా పాఠశాల దేశానికే ఆదర్శంగా నిలిచింది.
మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ఈ బడిలో చేపట్టిన అత్యుత్తమ స్వచ్ఛతా కార్యక్రమం జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ పాఠశాల చిత్రాలను నీతి ఆయోగ్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ‘స్వచ్ఛతతోపాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఈ పాఠశాల అనుసరిస్తున్న పద్ధతులు అద్భుతం. ఇది ఒక సామాజిక చైతన్య విప్లవానికి నాంది’అని నీతిఆయోగ్ అందులో పేర్కొంది. పాఠశాల గోడలపై ఆంగ్లం, హిందీ మాధ్యమాలలో అక్షర వర్ణమాల గీయించిందని, ఇలా చేయడం వల్ల పిల్లలు ఆడుతూపాడుతూ పాఠాలు నేర్చుకొనేందుకు తోడ్పడుతుందని తెలిపింది. అలాగే దివ్యాంగ విద్యార్థులకు తరగతి గదులు, మరుగుదొడ్లలో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయించడంపైనా నీతిఆయోగ్ కొనియాడింది. స్వచ్ఛమైన తాగునీరు, నిరంతర విద్యుత్‌ను అందుబాటులోకి తేవడంతోపాటు పచ్చదనానికి ప్రతీకగా ఈ పాఠశాల నిలిచిందని మెచ్చుకుంది. ఈ గొప్పదనం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనితా భెంగ్రాదేనని నీతి ఆయోగ్ తెలిపింది. ఆమె 15 ఏళ్లుగా ఈ పాఠశాలకు సేవలందించి అన్నిరకాలుగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేసిందని ప్రశంసించింది.
Published date : 08 Jan 2020 01:17PM