Skip to main content

చదువుతోపాటుసంస్కారం...రెండూ ముఖ్యమే !

విద్యార్థి విజయానికి చదువుతోపాటు సంస్కారం కూడా ముఖ్యమే. చదువు లక్ష్యం ఉద్యోగం, పేరుప్రతిష్టలు, కట్నకానుకలు మాత్రమే కాదు. చదువుతోపాటు సంస్కారం ఉండాలి.
అప్పుడు బంగారానికి తావి అబ్బినట్టు అవుతుంది. చదువుకున్నాక కూడా సంస్కారం రాలేదంటేఆ విద్య నిరర్ధకమే సుమా. ‘‘సానపెట్టిన వజ్రంబు కాంతులీను. పొలము చక్కగ దున్నిన ఫలములిచ్చు. అటులె అజ్ఞానియైన‌ను అవనిపైన విద్యనేర్చినయేని వివేకియగును’’అని అన్నారు పెద్దలు. ఈ పద్యం విద్య వివేకం కోసమేననే సందేశాన్ని అందిస్తోంది. సౌశీల్యం నిర్మాణం కావించేదీ, మానసిక బలం పెంచేదీ తెలివిని వికసింపజేసేదీ విద్య అని ఆనాడే స్వామి వివేకానంద చెప్పారు. విద్యద్వారా మనిషి తన కాళ్లమీద తాను నిలబడాలని ఆయన హితవు పలికారు. మరి ఇప్పుడు అలాంటి విద్య అందుబాటులో ఉందా? సంస్కారం అంటే వివేకం కలిగిన బుద్ధి అని అర్థం. వివేకం అంటే ఏది మంచి, ఏది చెడు అనేదానిని మనిషికి తెలియజేసే ఒక అంతర్గత శక్తి. విద్యార్థులకు అలాంటి విద్యను అందించడానికి పెద్దలంతా కలసికట్టుగా కృషి చేయాలి. అందువల్లనే ఒకటి నుంచి పదో తరగతిలోపల చదువు నేర్చుకున్నరీతిలోనే సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారాన్ని కూడా పాఠ్యాంశాల్లో భాగం చేయాలి. జరిగిపోయిన దానికి బాధపడుతూ కాలం గడపకుండా జరగాల్సిందేమిటనేదానిని గురించి ఆలోచించాలి. మనిషి ఎల్లప్పుడూ తన నడవడికను మార్చుకుంటుండడమే నిరంతర లక్ష్యం కావాలి. ఇలా మారిన వాళ్లు ఎంతమందో మహాత్ములయ్యారు. మనం కనీసం మనుషులమైనా చాలు కదా! గుర్తుంచుకోండి......‘‘సంస్కారాన్ని బోధించే ప్రక్రియనే చదువు’’ అనాలి.
Published date : 01 Feb 2020 04:01PM

Photo Stories