చదువు, సంస్కారానికి పెంపకమే కీలకం!
Sakshi Education
విద్యార్థికి చదువు, సంస్కారం రెండు ఆభరణాల వంటివి. రెండూ ఎంతో విలువైనవి. ఈ రెండింటితోనే విద్యార్థి సమాజంలోకి అడుగుపెట్టాలి. అప్పుడే ఆదర్శవంతమైన సమాజానికి బీజాలు పడతాయి.
అయితే చదువు బడిలో జరిగిపోతుంది. మరి సంస్కారం మాటేమిటి? ఒకవేళ బడిలో వీటి గురించి చెప్పినప్పటికీ సిలబస్ భారం కారణంగా ఉపాధ్యాయులు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. మరి వీటిని ఎవరు బోధించాలి. పిల్లలు ఎక్కడ నేర్చుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు తల్లిదండ్రులే. వీరే పిల్లలకు తొలి గురువులు. మార్గదర్శకులు. వారు నడిచిన బాటలోనే పిల్లలు నడుస్తారు. పిల్లలు తల్లిదండ్రులకు అతీతం కాదు. అన్నీ తమ ప్రత్యక్ష దైవాలనుంచే వారు నేర్చుకుంటారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత ఇందుకే వచ్చింది. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను చక్కగా పెంచాలి. సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. మరొకరికి మార్గదర్శకంగా మారేలా పెంచాలి. పెంపకాన్ని బట్టే పిల్లలు ఉంటారనే విషయాన్ని తల్లిదండ్రులు మరవకూడదు. ఒక విద్యార్థి దొంగగా మారినా లేక అబద్ధాల పుట్టగా మారినా అందుకు అతనిని మాత్రమే తప్పుబట్టలేం. ఇందులో అందరి పాత్ర ఉంటుందనేది తిప్పికొట్టలేని అంశం సుమా. పిల్లలు పెడదారి పట్టడానికి సినిమాలు, టీవీలు, సెల్‌ఫోన్లు కూడా కారణమే. పెడమార్గం పట్టిన కారణంగా వారు పవిత్రమైన కాయమును, జీవితమునూ వ్యర్థం చేసుకుంటున్నారు. మానవత్వంలో అనేక గుణాలు ఇమిడిఉంటాయి. ఇళ్ల వద్ద తల్లిదండ్రులు విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు సరైన బోధనలు చేయాలి, అమూల్యమైన, విలువైన ధనము సద్గుణమే. ఆవిధమైన గుణం ఉంటేనే మానవుడు దేవుడు కాగలడు. మొట్టమొదట శీలము, రెండోది అహింస, మూడోది దయ, నాలుగోది సంపత్తి. ఐదోది ఇంద్రియ నిగ్రహము. ఆరోది కీర్తి. ఆ ఆరింటివల్లనే మానవుడు మహానుభావుడౌతాడు.
Published date : 08 Jan 2020 01:10PM