బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్ల రద్దు వద్దు!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జాతీయ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బంది నియామకాల్లో రిజర్వేషన్లు ఎత్తేయాలని నిపుణుల కమిటీ సూచించడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వం నియమించిన 8 మంది నిపుణుల కమిటీ సిఫార్సు చేయడం సరికాదని, వాటిని కేంద్రం తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రధానమంత్రి మోదీకి బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘాల సమాఖ్య తరఫున ఆయన లేఖ రాశారు. రిజర్వేషన్లు ఎత్తివేయడమంటే దళిత, గిరిజన, బీసీ కులాలను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటికే పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటుపరం కావడంతో ఉద్యోగ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని సరిచేయాల్సిన అవసరం కేంద్రంపై ఉందని గుర్తుచేశారు.
Published date : 19 Dec 2020 03:57PM