Skip to main content

అఫిలియేషన్ ఆలస్యం.. విద్యార్థులకు సంకటం!

సాక్షి, హైదరాబాద్: కాలేజీల అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియ తీవ్ర ఆలస్యమవుతోంది. అటు కాలేజీలు, ఇటు యూనివర్శిటీ/ బోర్డు వైపు నుంచి జరుగుతున్న జాప్యంతో విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అందకుండా పోయే ప్రమాదం నెలకొంది.
సాధారణంగా ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలో యూనివర్సిటీ/బోర్డు సభ్యులు ఆయా కాలేజీల అర్హతలను ప్రత్యక్షంగా పరిశీలించి అనుబంధ గుర్తింపు ఇస్తారు. కానీ ఈ సంవత్సరం కోవిడ్-19 కారణంగా మార్చి రెండోవారంలో మూతపడ్డ విద్యా సంస్థలు ఇప్పటికీ తెరుచుకోలేదు. జూన్ నుంచి ఆన్‌లైన్ తరగతులు మాత్రమే ప్రారంభించారు. ఇప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయినా... మెజారిటీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ధ్రువీకరణ పూర్తికాలేదు. దీంతో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు కీలకమైన కాలేజీ అఫిలియేషన్ పత్రాన్ని యాజమాన్యాలు సంక్షేమ శాఖలకు సమర్పించలేదు.

ఎవరి పనుల్లో వారు బిజీ
క్రమంగా అన్‌లాక్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయడంతో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో వాయిదా పడ్డ పరీక్షల నిర్వహణ, అదేవిధంగా అడ్మిషన్లకు సంబంధించి సెట్‌ల నిర్వహణ, ఫలితాల ప్రకటన, కౌన్సెలింగ్ ప్రక్రియలో యూనివర్సిటీ, బోర్డు అధికారులు బిజీ అయ్యారు. మరోవైపు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ తదితర అంశాల్లో యాజమాన్యాలు బిజీ కావడంతో అనుబంధ గుర్తింపు ప్రక్రియకు బ్రేక్ పడింది. యూనివర్సిటీ/ బోర్డు అధికారులు ముందుగా కాలేజీని తనిఖీ చేసిన తర్వాత బోధన, బోధనేతర సిబ్బంది స్థితి, సాంకేతికత, మౌలికవసతులను పరిశీలించి అఫిలియేషన్ జారీ చేస్తారు. చాలాచోట్ల ప్రత్యక్ష తనిఖీలు ఇప్పటికీ పూర్తికాలేదు. ఇప్పటివరకు కేవలం 42 జూనియర్ కాలేజీలు మాత్రమే ఈపాస్‌లో అఫిలియేషన్ పత్రాలను అప్‌లోడ్ చేశాయి. వెయి్యకి పైగా ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ కాలేజీలు ఇప్పటికీ అఫిలియేషన్ పత్రాలు సమర్పించలేదు. మరోవైపు ప్రత్యక్ష తనిఖీల ప్రక్రియ పూర్తి అయ్యేందుకు మరికొంత సమయం పడుతుందని ఉస్మానియా పరిపాలన విభాగంలోని ఓ అధికారి తెలిపారు.

అఫిలియేషన్ ఉంటేనే ఉపకారం...
ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు సంబంధించి సంక్షేమ శాఖలు పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఆన్‌లైన్ దరఖాస్తులను అక్టోబరు నుంచి స్వీకరిస్తున్నాయి. డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్షేమ శాఖలు ఈ దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి... ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు అర్హులెవరో తేలుస్తాయి. కాలేజీ యాజమాన్యం అఫిలియేషన్ పత్రం సమర్పిస్తేనే ఆ కాలేజీ దరఖాస్తులను సంక్షేమాధికారులు పరిశీలిస్తారు. అఫిలియేషన్ పత్రం ఇవ్వకుంటే ఆ కాలేజీ విద్యార్థులకు ఈ పథకాలను అమలు చేయరు. దరఖాస్తుల గడువు ముగిసేలోగా కాలేజీలు అఫిలియేషన్ పత్రాలు సమర్పిస్తే విద్యార్థులకు మేలు జరుగుతుందని సంక్షేమశాఖ అధికారులు సూచిస్తున్నారు.
Published date : 09 Dec 2020 03:00PM

Photo Stories