అంగన్‌వాడీలకు వరం ఈ ఐఏఎస్
Sakshi Education
రాంచి: జార్ఖండ్‌లోని గిరిజన ఆధిక్య ప్రాంతమైన చైబసకు జిల్లా అభివృద్ధి అధికారిగా ఐఏఎస్ ఆదిత్య రంజన్‌ను ప్రభుత్వం నియమించింది.
రంజన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లాలో ప్రాథమిక విద్య తీరుతెన్నులపై అవగాహన కోసం అధ్యయనం ప్రారంభించారు. స్వస్థలం బొకారో అయినందువల్ల రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో విద్యావ్యవస్థ పరిస్థితిపై ఆయనకు అప్పటికే కొంత అవగాహన ఉంది. తాను చేపట్టిన అధ్యయనం ఈ అధికారికి దిగ్భ్రాంతిని కలిగించింది. అనేక అంగన్‌వాడీ కేంద్రాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని అసలు పనిచేయడం లేదు. మరికొన్నింటికి మరుగుదొడ్లు కూడా లేవు. కొన్ని కేంద్రాల వద్ద కనీసం తాగునీరు కూడా లభించని పరిస్థితి కొనసాగుతోంది. అయినప్పటికీ మధ్యాహ్న భోజన పథకం అమల్లో ఉండడం, గిరిజనులంతా పేదవారు కావడంతో వారి పిల్లలు భోజనం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లేవారు. వందకు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నా అన్నింటిలోనూ రకరకాల సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. తదుపరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఆలోచించేందుకు ఈ అధికారికి రెండురోజులు పట్టింది. తొలుత గిటిలిపి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంపై ఆయన దృష్టి సారించారు. దానిని రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొన్నారు. తన జీతంలో అత్యధిక భాగాన్ని తన లక్ష్యసాధన కోసం వెచ్చించారు. అంగన్‌వాడీ భవనాన్ని పునరుద్ధరించారు. మరుగుదొడ్లు ఏర్పాటు చేయించారు. కొద్దినెలల కాలంలోనే దాని రూపురేఖలు మార్చేశారు. 2015లో మొదలైన ఈ ప్రక్రియను మూడేళ్లపాటు కొనసాగించారు. మొత్తం అంగన్‌వాడీ వ్యవస్థనంతటినీ తీర్చిదిద్దారు. కొన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో సైన్స్ లేబొరేటరీ, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా అనేక ఆరోగ్య కేంద్రాలను కూడా గిరిజనులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దేవ్‌గఢ్ జిల్లాకు బదిలీ అయిన తర్వాత ఖాళీ సమయంలో అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు.
Published date : 18 Mar 2020 05:12PM