అందరితో కలసిమెలసి ఉండాలి!
Sakshi Education
విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక విద్యార్థులంతా బడికి రావడం మొదలవుతుంది.
పాతవారితోపాటు కొంతమంది కొత్తవిద్యార్థులు కూడా వివిధ తరగతుల్లో చేరతారు. వీరు ఇతర పాఠశాలల నుంచో లేదా ఇతర గ్రామాల నుంచో వస్తారు. కొత్తగా చేరినందువల్ల వీరిలో బెరుకుతనం, బిడియం ఉంటాయి. ఎవరితోనూ తొందరగా కలవరు. మెల్లమెల్లగా ఒక్కొక్కరికీ దగ్గరవుతుంటారు. ఇక పాత విద్యార్థుల సంగతి చెప్పేదేముంది. అందరితో ఆడుకుంటారు. పాడుకుంటారు. అప్పుడప్పుడూ కలహాలకు కూడా దిగుతారు. అయితే కలహించుకునే తత్వం అంత మంచిది కాదు. విద్యార్థి అంటే నేర్చుకునే వాడు అని కదా అర్థం. ఏమి నేర్చుకోవాలి. కేవలం పాఠ్యాంశాలేనా కాదు కాదు. ఐకమత్యం నేర్చుకోవాలి. కలుపుగోలుతనం నేర్చుకోవాలి. దానినే ఇతరులకూ నేర్పించాలి. కలసి ఉంటే కలదు సుఖము అన్నారు పెద్దలు. కలహించుకుంటూ ఉంటే సుఖం, ఆనందం రాదు కదా. ఆనందం కావాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదే కలుపుగోలుతనం. అందరితో మంచిగా ఉండాలి. అందరినీ అక్కాతమ్ముళ్ల మాదిరిగా భావించాలి. వారికి మరింత చేరువ కావాలి. మధ్యాహ్న భోజన సమయంలో తన కూర పెట్టడమో లేక అన్నం ఇవ్వడమో చేయాలి. అప్పుడు నీవంటే ఇతరులకు మరింత ఇష్టం ఏర్పడుతుంది. నీ గురించి ఇతరులవద్ద అంతా పొగుడుతారు. ఇంతకంటే కావాల్సిందేముంది. ప్రతి ఒక్కరినీ ప్రేమించాలి. అవసరమైన సమయంలో వారికి సేవ చేయాలి. వారికి ఏదో కావాలి అది ఇస్తూ ఉండాలి. ఈ గుణం అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తుంది. అప్పుడు వారితో చక్కగా ఆటలాడుకోవడమే కాకుండా పాఠాల గురించి చర్చించుకోవచ్చు. తెలియని విషయాలు తెలుసుకోవచ్చు.
Published date : 24 Jan 2020 01:25PM