ఏపీలో తగ్గిన ఎంబీబీఎస్ ఫీజులు... ప్రైవేట్ వైద్య విద్యార్థులకు బారీ ఊరట!
ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేటు, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020-21 నుంచి 2022-23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, మొత్తం 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులను నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేటు కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలన్నారు.
తాజా ఫీజుల వివరాలు ఇలా.. | |
ఎంబీబీఎస్ | |
కేటగిరీ | ఏడాదికి ఫీజు |
కన్వీనర్ కోటా | రూ.15 వేలు |
యాజమాన్య కోటా | రూ.12 లక్షలు |
ఎన్‌ఆర్‌ఐ కోటా | రూ.36 లక్షల వరకు |
డెంటల్ ఫీజులు | |
కన్వీనర్ కోటా | రూ.13 వేలు |
యాజమాన్య కోటా | రూ.4 లక్షలు |
ఎన్‌ఆర్‌ఐ కోటా | రూ.12 లక్షలు |
గతంలో ఫీజులు ఇలా.. | |
కేటగిరీ | ఫీజు |
ఎంబీబీఎస్ | |
కన్వీనర్ కోటా | రూ.12,155 |
యాజమాన్య కోటా | రూ.13,37,057 |
ఎన్‌ఆర్‌ఐ | యాజమాన్య కోటాకు 5 రెట్లు మించకుండా |
డెంటల్ | |
కన్వీనర్ కోటా | రూ.12,155 |
యాజమాన్య కోటా | రూ.5,46,978 |
ఎన్‌ఆర్‌ఐ | యాజమాన్య కోటాకు 5 రెట్లు మించకుండా |
సూపర్ స్పెషాలిటీ కోర్సుల ఫీజు రూ.15 లక్షలు
రాష్ట్రంలో ఐదు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సులు కూడా ఉన్నాయి. అవి జీఎస్‌ఎల్, కాటూరి, నారాయణ, ఎన్‌ఆర్‌ఐ, పిన్నమనేని సిద్ధార్థ కాలేజీలు. వీటిల్లో ట్యూషన్ ఫీజు రూ.15 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఫీజులు కూడా మూడేళ్ల పాటు అమల్లో ఉంటాయని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రెండ్రోజుల్లో నోటిఫికేషన్
ఫీజుల నిర్ణయం జరిగింది. ఇక అడ్మిషన్లకు రెండు మూడ్రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తాం. అడ్మిషన్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లూ చేశాం. అత్యంత పారదర్శకంగా అడ్మిషన్లు జరుగుతాయి.
- డా.శ్యాంప్రసాద్, వైస్ చాన్స్ లర్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ