Skip to main content

2021-22 విద్యా సంవత్సరం నుంచిఏరియా ఆస్పత్రుల్లోనూ పీజీ వైద్య సీట్లు..

సాక్షి, అమరావతి: ప్రభుత్వాస్పత్రుల బలోపేతం.. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది.

ఇన్నాళ్లూ జిల్లా స్థాయిలో ఉండే బోధనాస్పత్రులకే పరిమితమైన పీజీ వైద్య కోర్సులను నియోజకవర్గ స్థాయిలో ఉండే 100 పడకల ఏరియా ఆస్పత్రుల్లోనూ ప్రవేశపెడుతోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 19 ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో 71 డీఎన్‌బీ (డిప్లొమా ఆఫ్ నేషనల్ బోర్డ్) సీట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2021-22 నుంచి ఈఎన్‌టీ, గైనకాలజీ, ఫ్యామిలీ మెడిసిన్, పీడియాట్రిక్స్, ఆఫ్తల్మాలజీ, అనస్థీషియా విభాగాల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. సీట్లు మంజూరైన వాటిలో శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ, రాజాంలతోపాటు చిత్తూరు జిల్లాలోని కుప్పం ఏరియా ఆస్పత్రి కూడా ఉంది.

పెరగనున్న పీజీ వైద్య సీట్లు
ప్రైవేటు వైద్య కాలేజీల్లో ఒక్కో పీజీ వైద్య సీటు రూ.కోటిన్నరకుపైగానే ధర పలుకుతోంది. గత ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో రాష్ట్రంలో మొత్తం డీఎన్‌బీ సీట్లు 25 మించలేదు. దీంతో పీజీ మెడిసిన్ చదవాలంటే ఇప్పటికీ చాలామందికి అందని ద్రాక్షగానే ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం డీఎన్‌బీ సీట్లకు ప్రతిపాదనలు పంపి, వాటి ఆమోదానికి చర్యలు తీసుకోవడంతో మెడికల్ సీట్లు పెరగనున్నాయి. అంతేకాకుండా ఆయా ఆస్పత్రుల్లో డీఎన్‌బీ నిబంధనల మేరకు మౌలిక వసతులు కల్పిస్తారు. ఈ సీట్లు ఎండీ, ఎంఎస్‌కు సమానం కావడం వల్ల చిన్న చిన్న ఆస్పత్రుల్లో సైతం స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల పేద రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయి. కాగా 13 జిల్లాల ఏపీలో ప్రస్తుతం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలే ఉండగా ప్రభుత్వం కొత్తగా మరో 16 వైద్య కళాశాలలను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే.

బోర్డు ఆమోదం తెలిపింది
కోవిడ్ కారణంగా డీఎన్‌బీ సీట్లు సాధించేందుకు సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీఎన్‌బీకి వెళ్లి పరిస్థితులు వివరించి నివేదిక ఇచ్చాం. బోర్డు సానుకూలంగా స్పందించి మన నివేదికకు ఆమోదం తెలిపింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి సీట్లు అందుబాటులోకి వస్తాయి. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ఆధారంగా అభ్యర్థులు సీట్లు పొందొచ్చు.
-డా.రామకృష్ణారావు, కమిషనర్, వైద్యవిధాన పరిషత్

Published date : 16 Nov 2020 03:30PM

Photo Stories