JEE Main 2023: సెకండ్ సెషన్‌కు ఇన్ని లక్షల మంది.. పరీక్షకు ఇవి తప్పనిసరి
www.nta.ac.in లేదా https://jeemain.nta.nic.in వెబ్‌సైట్ల నుంచి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఎన్‌టీఏ సూచించింది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.4 లక్షల మంది హాజరయ్యే అవకాశముందని పేర్కొంది. దేశంలో 330 పట్టణాలు, విదేశాల్లోని 15 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 25 పట్టణాల్లో ఈ పరీక్షలకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేసింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి 15వ తేదీవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇంతకుముందు ఈ పరీక్షల షెడ్యూల్‌లో 6వ తేదీనుంచి 12వ తేదీవరకు నిర్వహిస్తామని పేర్కొన్నా.. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో 13, 15 తేదీల్లో కూడా పరీక్ష నిర్వహించనున్నట్లు అడ్మిట్‌కార్డుల్లో పొందుపరిచింది.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
ప్రస్తుతం తొలిరోజు పరీక్ష రాసేవారి అడ్మిట్‌కార్డులను ఎన్‌టీఏ విడుదల చేసింది. తదుపరి రోజులకు సంబంధించి పరీక్షరాసే వారి అడ్మిట్‌కార్డులను వరుసగా ముందు రోజుల్లో ఇవే వెబ్‌సైట్లలో ఉంచనుంది. పుట్టిన తేదీ, అప్లికేషన్ నంబరు నమోదు చేయడం ద్వారా అభ్యర్థులు అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి అడ్మిట్‌కార్డు కాపీలతో పాటు చెల్లుబాటయ్యే ఫొటో గుర్తింపుకార్డు కూడా తీసుకురావాలని సూచించింది.
చదవండి: JEE-Main 2023: జేఈఈ కటాఫ్ అంచనా.. 85–90!.. ఏప్రిల్ సెషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..
తొలి సెషన్ కన్నా ఎక్కువమంది అభ్యర్థులు
జనవరిలో నిర్వహించిన మొదటి సెషన్ పరీక్షకన్నా రెండో సెషన్‌కు ఎక్కువమంది హాజరుకానున్నారని ఎన్‌టీఏ అడ్మిట్‌కార్డుల నోట్‌లో తెలిపింది. తొలి సెషన్‌లో 8.6 లక్షల మంది హాజరుకాగా ఈసారి 9.4 లక్షల మంది పరీక్ష రాయనున్నట్లు పేర్కొంది. జనవరి సెషన్ సమయంలో ఇంటర్ పరీక్షల సన్నద్ధతతో పాటు ప్రాక్టికల్ పరీక్షలు కూడా ఉండడంతో ఈ పరీక్ష రాసిన విద్యార్థుల సంఖ్య తక్కువే. అప్పుడు పరీక్ష రాయని వారితోపాటు రాసినవారు కూడా రెండో సెషన్‌లో పరీక్ష రాయనున్నారు. ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు జేఈఈ పరీక్షకు వెసులుబాటు కలిగింది. తొలిసెషన్ పరీక్షకు 8,60,064 మంది పేపర్–1కు, 46,465 మంది పేపర్–2కు రిజిస్టరయ్యారు. వీరిలో పేపర్–1కి 8,23,967 (95.80 శాతం) మంది, పేపర్–2కి 95 శాతానికిపైగా హాజరయ్యారు.
చదవండి: EAMCET 2023: పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు
2.5 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక
జేఈఈ మెయిన్స్ రెండు విడతల పరీక్షలకు సంబందించిన తుది ర్యాంకులతో ఫలితాలు ఈనెలాఖరునాటికి విడుదల కానున్నాయి. రెండు సెషన్లలో సాధించిన మార్కుల్లో ఎక్కువ మార్కులను పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ప్రకటిస్తారు. ఏప్రిల్ 30 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ మొదలు కానున్నందున అంతకు ముందే ఈ ఫలితాలు వెలువడనున్నాయి. జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన తొలి 2.5 లక్షల మందికి అడ్వాన్స్‌డ్‌లో దరఖాస్తుకు అవకాశమిస్తారు.
కటాఫ్ 87 నుంచి 90 మార్కుల వరకు
జేఈఈ మెయిన్ నుంచి అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించడానికి కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీలో 87 నుంచి 90 వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్ మార్కులు పెరుగుతాయని భావిస్తున్నారు. గతేడాది జనరల్ కటాఫ్ మార్కులు 88. గత అయిదేళ్ల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటే ఈ సారి కటాఫ్ ఇంచుమించు 90 వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఏపీలో 25 సెంటర్లు ఇవే..
అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, నరసరావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం, అమరావతి, గూడూరు, మచిలీపట్నం, నంద్యాల, తాడేపల్లిగూడెం.
గత ఐదేళ్లలో జేఈఈ మెయిన్ కటాఫ్ మార్కులు, ఈ ఏడాది అంచనా వివరాలు
కేటగిరీ |
2018 |
2019 |
2020 |
2021 |
2022 |
2023 (అంచనా) |
జనరల్ |
74 |
89 |
90 |
87 |
88 |
87–90 |
ఈడబ్ల్యూఎస్ |
– |
– |
70 |
66 |
63 |
63–67 |
ఓబీసీ |
45 |
74 |
72 |
68 |
67 |
67–72 |
ఎస్సీ |
29 |
54 |
50 |
46 |
43 |
43–47 |
ఎస్టీ |
24 |
44 |
39 |
34 |
26 |
25–30 |
పీడబ్ల్యూడీ |
– |
35 |
0.11 |
0.069 |
0.0096 |
0.0031 |