JEE Mains 2024: వీలైనంత దగ్గరగా జేఈఈ పరీక్ష కేంద్రం
సాధ్యమైనంత వరకూ అభ్యర్థి నివాసానికి సమీపంలో ఉండే కేంద్రాన్ని కేటాయించేందుకు వీలుగా కసరత్తు చేపట్టింది. దరఖాస్తులో పేర్కొన్న స్థానికతను ఇందుకు కొలమానంగా తీసుకుంటున్నారు.
గూగుల్ మ్యాప్ ఆధారంగా అక్కడికి సమీపంలోని పరీక్ష కేంద్రాన్ని గుర్తిస్తున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి పరీక్షా కేంద్రాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్) - గైడెన్స్ | వీడియోస్
ఒక కేంద్రంలోనే ఎక్కువ మందికి అవకాశం
జేఈఈ మెయిన్స్ పరీక్ష జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఉంటుంది. తొలి విడత పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువు నవంబర్ 30తో ముగుస్తుంది.
తుది గడువు నాటికి ఎన్ని దరఖాస్తు లు అందు తాయి? ఎన్ని పరీక్ష కేంద్రాలుంటాయి? ఎన్ని సెషన్లుగా పరీక్ష పెట్టాలనేదానిపై డిసెంబర్ మొదటి వారంలో ఓ స్పష్టత వస్తుంది. అయితే ఈసారి ఒక్కో పరీక్ష కేంద్రంలో ఎక్కువ మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ఈ మేరకు అదనపు గదుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసే వీలుంది.
హైదరాబాద్‌లో ఎక్కువ కేంద్రాలు ఉంటాయి. ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ముందుగా దరఖాస్తు చేసే వారికి పరీక్ష కేంద్రం కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని ఎన్‌టీఏ భావిస్తోంది.
సాధారణంగా హైదరాబాద్‌లోని పలు పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ప్రాధాన్యత ఇస్తారు. ఈ నేపథ్యంలో వీరిని రంగారెడ్డి, హైదరాబాద్‌లోని కేంద్రాలకు కేటాయించి, ఇంకా మిగిలితే సమీపంలోని జిల్లా కేంద్రాల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు.
ప్రతి సంవత్సరం మారుమూల జిల్లా కేంద్రంలోని అభ్యర్థులకు కూడా హైదరాబాద్ వంటి దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించే వాళ్ళు. దీనివల్ల అసౌకర్యంగా ఉంటోందని అన్ని జిల్లాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
జేఈఈ పరీక్ష సమయంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఈసారి దృష్టి పెట్టబోతున్నారు. పలు కేంద్రా ల్లో కంప్యూటర్లు ఆగిపోవడం, లేదా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురవుతున్న ఉదంతాలున్నాయి. దీనివల్ల గంటల తరబడి పరీక్ష ఆలస్యమవుతోంది.
అప్పటికే ఇతర కేంద్రాల్లో పరీక్ష పూర్తవుతుంది. దీనిపై పరీక్ష కేంద్రం అధికారులు నిర్ణయం తీసుకో లేని పరిస్థితి ఉంటోంది. గత ఏడాది మూడు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తాయి.
విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అధికారులు ఎన్‌టీఏను సంప్రదించి, నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఈ టెన్షన్ కారణంగా విద్యార్థులు సరిగా పరీక్ష రాయలేదనే విమర్శలున్నాయి. దీన్ని దూరం చేసేందుకు ఈసారి జిల్లా స్థాయిలో యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
తక్షణ దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైతే పరీక్ష వాయిదా వేసే అధికారం జిల్లా అధికారులకే ఇవ్వాలనే యోచనలో ఉన్నారు.