Skip to main content

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్- 2018

ఇన్‌కంట్యాక్స్ ఇన్‌స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీబీఐ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (గెజిటెడ్), ఆడిట్ ఆఫీసర్ (గెజిటెడ్) వంటి ఉన్నత హోదా కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువులు కోరుకునేవారికి శుభవార్త.
లక్షల మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) మే 5న విడుదల చేసింది. ఎలాంటి ఇంటర్వ్యూలు లేకుండానే.. గ్రూప్-బి,ిసి ఉద్యోగాలు పొందే సదవకాశం సీజీఎల్ పరీక్ష ద్వారా లభిస్తుంది. ఈ పోస్టులకు ఎంపికై తే ఉద్యోగ భద్రత కలిగిన కేంద్ర ప్రభుత్వ కొలువుతోపాటు నెలకు రూ.50 వేలకుపైగా వేతనం అందుతుంది.

జాతీయ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ప్రతిష్టాత్మక ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోస్టులతో పాటు పలు కేంద్ర సర్వీసులకు కూడా భర్తీ చేస్తుంది. వాటి తర్వాత ప్రాధాన్యమున్న గ్రూప్-బి(గెజిటెడ్), నాన్ గెజిటెడ్, గ్రూప్-సి (నాన్ టెక్నికల్) పోస్టుల నియామాక ప్రక్రియను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) చేపడుతుంది. ఏటా సీజీఎల్ నోటిఫికేషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ జరుగుతుంది.

పోస్టులివే..
నోటిఫికేషన్‌లో ఖాళీల సంఖ్యను వెల్లడించలేదు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఐబీ, రైల్వే, విదేశాంగ మంత్రిత్వ శాఖలు, సాయుధ బలగాల కేంద్ర కార్యాలయాలు, ఇతర మంత్రిత్వ శాఖలు), వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్లు, అసిస్టెంట్/సూపరింటెండెంట్ (వివిధ మంత్రిత్వ శాఖల్లో), ఇన్‌స్పెక్టర్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎకై ్సజ్, ప్రివెంటివ్ ఆఫీసర్స్, ఎగ్జామినర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ, ఎన్‌ఐఏ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్), అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, డివిజినల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌వో), ఆడిటర్స్, అకౌంటెంట్/జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్, ట్యాక్స్ ఆసిస్టెంట్లు వంటి పలు రకాల పోస్టులను సీజీఎల్ పరీక్ష ద్వారా భర్తీ చేయనున్నారు.

డిగ్రీ చదివితే చాలు..
2018, ఆగస్టు 1 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు సీజీఎల్ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జేఎస్‌వో పోస్టులకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్ మ్యాథమెటిక్స్‌లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి (లేదా) డిగ్రీలో స్టాటిస్టిక్స్‌ను ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
  • ఏఏవో పోస్టులకు చార్టర్డ్ అకౌంటెంట్/మేనేజ్‌మెంట్ అకౌంటెంట్/కంపెనీ సెక్రటరీ/ఎంకామ్/మాస్టర్స్ ఇన్ బిజినెస్ స్టడీస్/ఎంబీఏ(ఫైనాన్‌‌స)/మాస్టర్స్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్ విద్యార్హతలు అభిలషణీయం.

పోస్టులను బట్టి వయసు :
పోస్టును బట్టి గరిష్టంగా 27 నుంచి 32 ఏళ్ల వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, వికలాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
  • ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు అర్హత సాధించాలంటే.. నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి. దేహదారుఢ్య పరీక్షలూ ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ :
అభ్యర్థుల తుది ఎంపిక పోస్టుల ఆధారంగా మూడు/నాలుగు దశల్లో ఉంటుంది. మొదటి దశలో టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష ఉంటుంది. ఇందులో కమిషన్ నిర్ణయించిన నిర్దేశిత మార్కులు సాధించిన వారినే తర్వాతి దశ టైర్-2కు పిలుస్తారు. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే. ఇందులోనూ నెగ్గితే తర్వాతి దశలో టైర్-3(డిస్క్రిప్టివ్ పరీక్ష)కు అర్హత లభిస్తుంది. టైర్-1, 2ల్లో రుణాత్మక మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి నాలుగో వంతు మార్కులు కోత విధిస్తారు. సెక్షన్ కటాఫ్ ఉండదు. టైర్-3 ఇంగ్లిష్/హిందీ భాషలో ప్రావీణ్యం పరీక్షించే విధంగా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్-1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

పరీక్షా విధానం :
  • టైర్-1ను గంట వ్యవధిలో మల్టిపుల్ చాయిస్ విధానంలో నిర్వహిస్తారు. నాలుగు సబ్జెక్టులు.. జనరల్ ఇంటెలిజెన్‌‌స అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
  • టైర్ -2: టైర్-1లో కమిషన్ నిర్ణయించిన కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు టైర్-2కు అర్హత లభిస్తుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. అయితే పేపర్-1, పేపర్-2లు అన్ని పోస్టులకు కామన్‌గా ఉంటాయి. ఇక జేఎస్‌వో పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే.. పేపర్-3 (200 మార్కులకు); అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏవో), అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్(ఏఏవో) పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే పేపర్-4 (200 మార్కులకు)కు హాజరు కావాలి. పేపర్-3 స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్‌పై; పేపర్-4 ఫైనాన్‌‌స అండ్ ఎకనామిక్స్ సబ్జెక్టులపై ఉంటుంది. ఇవి కూడా మల్టీపుల్ చాయిస్ విధానంలోనే ఉంటాయి. కామన్‌గా ఉంటే పేపర్-1,2ల్లో వరుసగా క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రెహెన్షన్ సబ్జెక్టులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్‌లో 100 ప్రశ్నలు.. 200 మార్కులకు; ఇంగ్లిష్‌లో 200 ప్రశ్నలు 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి.
  • టైర్ -1,2లో మెరిట్ జాబితాలో నిలిచిన వారికి టైర్-3 నిర్వహిస్తారు. గంట సమయంలో నిర్వహించే ఈ పరీక్ష పూర్తిగా ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో రాయాలి. హిందీ/ ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి. గమనిక: టైర్ -1, 2, 3లలో వేర్వేరుగా ప్రత్యేకంగా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ప్రిపరేషన్ గైడెన్స్
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఇందులో ప్యూర్ మ్యాథ్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ అధ్యయాల నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. అది కూడా బేసిక్ కాన్సెప్టులు ఉపయోగించి చేసే విధంగా ఉంటున్నాయి. గతంలో ఆల్జీబ్రా ఐడెంటిటీస్, ఇండిసెస్, సర్డ్స్ నుంచి టైర్-1, 2లలో కలిపి సుమారు 15 ప్రశ్నలు వరకు వచ్చాయి. ఫార్ములాలు గుర్తుంచుకుంటే ఈ చాప్టర్లల్లో వచ్చే ప్రశ్నలకు సులువుగానే సమాధానాలు గుర్తించవచ్చు. ట్రిగనోమెట్రీలో ముందుగా టేబులర్ వ్యాలూస్ నేర్చుకోవాలి. సైన్, కాస్, ట్యాన్, సెక్, కొసెక్, కాట్ వ్యాలూస్, వాటి మధ్య రిలేషన్‌‌స ఫార్ములాలు తెలుసుకుంటేనే ట్రిగనోమెట్రీలో సమస్యల పరిష్కారం సులువు అవుతుంది. ఇక జామెట్రీ నుంచి కూడా 15 ప్రశ్నల వస్తున్నాయి. ఇందులో ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ ఉంటాయి. ప్లేన్ జామెట్రీ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. దీన్ని చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని చదవాలి. అర్థమెటిక్‌లో రేషియో-ప్రపోర్షన్, ఇంట్రస్ట్, ప్రాఫిట్-లాస్, డిస్కౌంట్, పార్టనర్‌షిప్ బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్‌, పర్సంటేజెస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో నంబర్ సిస్టం, పర్సంటేజెస్, రేషియో-ప్రపోర్షన్‌‌స ముఖ్యమైన అంశాలు. అభ్యర్థులు తొలుత బేసిక్స్‌పై దృష్టిసారించాలి. ఈజీ టు హార్డ్ క్రమంలో సమస్యల సాధనను అలవరచుకోవాలి. ఇక గతంలో వచ్చిన ప్రశ్నల తరహాలోనే (మోడల్) ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. డేటా ఇంటర్‌ప్రెటేషన్ ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి. అర్థమెటిక్‌లో బేసిక్స్ నేర్చుకుంటే.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ సన్నద్ధత తేలిగ్గానే పూర్తవుతుంది.

ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ :
ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ సెక్షన్ నుంచి టైర్1లో 50 మార్కులు, టైర్2లో 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో వచ్చే ప్రశ్నలను మూడు రకాలుగా విభజించొచ్చు. అవి.. గ్రామర్ ఆధారిత ప్రశ్నలు, వొకాబ్యులరీ ఆధారిత ప్రశ్నలు, రీడింగ్ కాంప్రెహెన్షన్. మొదట గ్రామర్ రూల్స్ తెలుసుకోవడం, వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే గ్రామర్ ఆధారిత కాన్సెప్టుల ప్రశ్నలు ఎక్కువగా పునరావృతమవుతున్నాయి. ప్రీవియస్ బిట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో వచ్చే ప్యాసేజీలను అన్నింటినీ అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇవి తేలిగ్గానే ఉంటాయి. కాబట్టి ఆందోళన అనవసరం. రచయిత కోణంలో ఎస్సేను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ ప్రశ్నలు సమాచారం ఆధారిత డెరైక్ట్ ప్రశ్నలు కాకుండా.. ప్యాసెజ్‌లో అర్థం చేసుకొని సమాధానాలు ఇచ్చే విధంగా ఉంటాయి (ఉదా: ప్యాసేజ్‌కు నప్పే టైటిల్), వాటిని చివర్లో అటెంప్ట్ చేస్తే మంచిది. ఇంగ్లిష్ సెక్షన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు రీడింగ్ స్కిల్స్ ప్రధానం. కాబట్టి ఇంగ్లిష్ న్యూస్‌పేపర్‌ను చదవడం అలవాటు చేసుకోవాలి.

జనరల్ ఇంటెలిజెన్స్‌ అండ్ రీజనింగ్ :
అత్యంత సులువైన సెక్షన్ ఇది. కొద్దిపాటి శ్రమతో టైర్-1లో 50 మార్కులు పొందవచ్చు. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ టైప్ ప్రశ్నలు ఉంటాయి. అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్; స్పేస్ విజువలైజేషన్, కోడింగ్-డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్‌, వెన్‌డయాగ్రమ్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. బ్యాంక్ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు అలవోకగా చేయగలుగుతారు. ఇది స్కోరింగ్ ఎక్కువ చేయడానికి వీలు కల్పించే సెక్షన్. ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ అక్షరాల సంఖ్యను(1-26) గుర్తుపెట్టుకోవడం ద్వారా కోడింగ్, డీకోడింగ్, సిరీస్ ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.

జనరల్ అవేర్‌నెస్ :
ఇందులో స్టాటిక్ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఇది సిలబస్ దృష్ట్యా అతిపెద్ద సెక్షన్. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్‌, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి నిత్యం తన చుట్టూ జరిగే పరిణామాలను క్షుణ్నంగా తెలుసుకుంటే.. మంచి మార్కులు పొందే వీలున్న విభాగం ఇది. సహజంగా ఆసక్తి ఉన్న అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. మార్కెట్లో దొరికే అరిహంత్ పబ్లికేషన్స్‌ బుక్స్ చదివితే సరిపోతుంది. 50 మార్కులైనా విజయంలో కీలక పాత్ర ఈ సెక్షన్‌దే.

సూచనలు:
  1. ప్రిపరేషన్లో భాగంగా వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. మాక్‌టెస్ట్‌లు రాయడం ఎంత ముఖ్యమో వాటిని విశ్లేషించుకోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తించాలి.
  2. ఎలాంటి ప్రశ్నలు వదిలేస్తున్నారు? ఎందుకు వదిలేస్తున్నారు? తదితర అంశాలను విశ్లేషించుకోవాలి. తేలికైన ప్రశ్నలకు విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ప్రాక్టీస్‌తోనే ఇది సాధ్యపడుతుంది.
  3. నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు తప్పులు లేకుండా, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.

ముఖ్య తేదీలు..
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ:
2018, జూన్ 4 (సాయంత్రం 5 గంటల వరకు)
టైర్-1 పరీక్ష తేదీలు: 2018 జూలై 25 నుంచి ఆగస్టు 20 వరకు.
టైర్ - 2, టైర్- 3, టైర్- 4 తేదీలను తర్వాత నోటిఫై చేస్తారు.
ఫీజు: రూ.100 (మహిళలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు)
మరిన్ని వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.ssc.nic.in
Published date : 18 May 2018 01:04PM

Photo Stories