Skip to main content

ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్ స్కోర్ చేయండి ఇలా...!

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నిర్వహించే పోటీ పరీక్షల్లో ముఖ్యమైన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్)కు పోటీ తీవ్రంగా ఉంటుంది.
ఏటా దాదాపు 30 లక్షల మందికి పైగా అభ్యర్థులు సీజీఎల్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారు. జాతీయ స్థాయిలో సివిల్ సర్వీసెస్ తర్వాత కీలకంగా ఉండే ఉద్యోగాలను ఎస్‌ఎస్‌సీ.. సీజీఎల్ ద్వారా భర్తీ చేస్తుంది. ఈ ఉద్యోగాల్లో చేరినవారు పదోన్నతుల ద్వారా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) వంటి అఖిల భారత సివిల్ సర్వీస్ కేడర్‌కు చేరుకుంటారు. సీజీఎల్‌లో గ్రూప్-బి కేడర్ ఉద్యోగాలు పొందితే నెలకు రూ.50 వేలకు తగ్గకుండా జీతభత్యాలు అందుతాయి. ప‌రీక్ష‌ల ప్రిపరేషన్ టిప్స్ మీకోసం...

సీజీఎల్ పరీక్షలో టైర్ 1, 2, 3, 4 ఉంటాయి. ప్రతి దశలోనూ కటాఫ్ మార్కులు దాటూతూ తదుపరి దశకు చేరుకోవాల్సి ఉంటుంది. మొదట 100 ప్రశ్నలతో 200 మార్కులకు గంట వ్యవధిలో టైర్ 1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రెహెన్షన్ సబ్జెక్టుల్లో ప్రతి సెక్షన్ నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రుణాత్మక మార్కులూ ఉంటాయి.

రివిజన్‌తో జనరల్ అవేర్‌నెస్ :
  • టైర్ 1 పరీక్షలో అభ్యర్థులకు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, రీజనింగ్ సెక్షన్లలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు అధిక సమయం అవసరమవుతుంది. కానీ, జనరల్ అవేర్‌నెస్‌కు సమయం వృథా కాదు. ప్రశ్న చదవగానే సమాధానం తెలియకుంటే వదిలేయొచ్చు. ఇందులోని 25 ప్రశ్నలకు 10 నిమిషాల్లోనే సమాధానాలు గుర్తించాలి. దీనివల్ల ఇతర సెక్షన్లకు అదనపు సమయం లభిస్తుంది.
  • జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 25 ప్రశ్నల్లో 15 వరకు స్టాటిక్ జీకే ప్రశ్నలు ఉంటాయి. సైన్స్ సబ్జెక్టులైన బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లపై దృష్టిసారిస్తే ఎక్కువ స్కోరుకు అవకాశం ఉంటుంది. చరిత్రలో ప్రపంచ చరిత్రను వదిలేసి భారతదేశ చరిత్రను ఎక్కువగా చదవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్య యుద్ధాలు, ఢిల్లీ సుల్తానులు-ముఖ్య విధానాలు, మొగల్ చక్రవర్తులు.. వారి పాలనా కాలంలో నిర్మించిన ప్రముఖ కట్టడాలు, సంస్కృతి, చారిత్రక నిర్మాణాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఆయా పాలకుల కాలంలో మన దేశాన్ని సందర్శించిన ప్రముఖ విదేశీ యాత్రికుల గురించి తెలుసుకోవాలి.
  • జాతీయోద్యమాన్ని ప్రత్యేకంగా చదవాలి. యూరోపియన్ల రాక నుంచి తిరుగుబాట్లు, వైస్రాయిలు, పత్రికలు, సామాజిక సంస్కర్తలు, గాంధేయ యుగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.
  • రాజ్యాంగ అధికరణలు, ప్రాథమిక విధులు, ముఖ్య రాజ్యాంగ సవరణలు; ఎకనామిక్స్‌కు సంబంధించి జీడీపీ, బడ్జెట్, నీతి ఆయోగ్, జీఎస్‌టీ, ఎకనామిక్‌సర్వే, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్ పదజాలం తదితర అంశాలను రివిజన్ చేసుకోవాలి. ఇటీవల వార్తల్లో కనిపించిన వ్యక్తులు, ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ సంస్థల అధిపతుల వివరాలను మరోసారి చూసుకోవాలి.
  • ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు కాబట్టి జనరల్ అవేర్‌నెస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. సబ్జెక్టు పెద్దగా కనిపిస్తున్నా ఆందోళన చెందొద్దు.
రీజనింగ్‌లో స్కోరింగ్ :
  • సీజీఎల్ పరీక్షలో సులువైన సెక్షన్‌గా రీజనింగ్‌కు పేరుంది. తార్కిక శక్తి, విశ్లేషణ నైపుణ్యం, ఆలోచనల్లో స్పష్టతను పరీక్షించే సెక్షన్ ఇది. అభ్యర్థులు ఇప్పటికే రీజనింగ్‌కు సంబంధించి ఎంతో ప్రాక్టీస్ చేసి ఉంటారు. అందువల్ల కాన్సెప్టులను మరోసారి రివిజన్ చేసుకోవాలి. 50 మార్కులకు కనీసం 44 మార్కులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి.
  • ఈ సెక్షన్‌లో సమాధానాలు గుర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. మాక్‌టెస్టులు రాస్తూ కచ్చితత్వాన్ని చెక్ చేసుకోవాలి. క్యాలెండర్ చాప్టర్‌లో ఫార్ములాలు జాగ్రత్తగా గుర్తించుకోవాలి.
  • రిలేషన్స్, పజిల్స్ సెక్షన్లు గజిబిజిగా ఉంటే స్పష్టత తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. కోడింగ్ డీకోడింగ్ వేగంగా చేసేలా సన్నద్ధమవ్వాలి.
  • వెన్‌డయాగ్రమ్స్, నాన్ వెర్బల్ రీజనింగ్ (పేపర్ కటింగ్ ఫోల్డింగ్ వంటివి) ప్రశ్నల్లో ఉన్న మోడల్స్ అన్నింటిని మరోసారి ప్రాక్టీస్ చేయాలి.
క్వాంట్.. వేగంగా
  • సీజీఎల్ ఉద్యోగ అవకాశాలను నిర్ణయించే సబ్జెక్టుల్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఒకటి. జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ సబ్జెక్టులు టైర్ 1లో మాత్రమే కనిపిస్తాయి. కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. టైర్-1లో 50 మార్కులకు, టైర్-2లో 200 మార్కులకు ఉంటుంది. అత్యంత ప్రధానమైన సబ్జెక్టు ఇది. ఎంతో ప్రాక్టీస్, ప్రాథమిక భావనలపై గట్టి పట్టు ఉంటేనే స్కోరు చేయడానికి ఆస్కారం ఉంటుంది.
  • జామెట్రీ, మెన్సురేషన్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ వంటి తొమ్మిది, పదో తరగతుల్లో ఉండే ప్రశ్నలు ఈ సెక్షన్లలో ఎంతో ముఖ్యమైనవి. ఆయా చాప్టర్లలో ఎన్నో ఫార్ములాలు ఉంటాయి. వాటిని కంఠతా చేయాలి.
  • అర్థమెటిక్‌లో రేషియో-ప్రపోర్షన్, ఇంట్రస్ట్, ప్రాఫిట్-లాస్, డిస్కౌంట్, పార్టనర్‌షిప్ బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ అంశాలకు సంబంధించి గత పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • ఈ సెక్షన్‌లో ప్రశ్నలను వేగంగా పరిష్కరించడం కీలకం. మొత్తం 60 నిమిషాల్లో 20 నిమిషాల్లోనే ఈ సెక్షన్ పూర్తయ్యేలా చూడాలి.

ఆంగ్లం .. కాకూడదు అవరోధం
టైర్-1, 2, 3.. ఇలా ప్రతి దశలోనూ ఇంగ్లిష్ ఉంటుంది. ఒక్క రోజులో నైపుణ్యం లభించే సబ్జెక్ట్ కాదిది. నిరంతర పరిశ్రమతోనే ఇంగ్లిష్‌పై పట్టు వస్తుంది. అభ్యర్థులు గ్రామర్ రూల్స్‌తోపాటు, వొకాబ్యులరీని పునశ్చరణ చేసుకోవాలి. టైర్ 3లో రైటింగ్ పార్ట్ కూడా ఉంటుంది. ఆ దిశగా ప్రాక్టీస్ చేయాలి. సులువైన రీడింగ్ కాంప్రెహెన్షన్‌కు సంబంధించి ఎకనామిక్స్, లైఫ్ సెన్సైస్, హిస్టరీ టాపిక్స్‌ను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. కాంప్రెహెన్షన్‌ను అర్థం చేసుకోవడానికి వొకాబ్యులరీ ముఖ్యం కాబట్టి ఎక్కువగా దానిపై దృష్టిసారించాలి. ఇంగ్లిష్ సెక్షన్‌లోని ప్రశ్నలన్నీ పదో తరగతి స్థాయిలో ఉంటాయి కాబట్టి అభ్యర్థులు ఎక్కువగా ఆందోళన చెందకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి.
 
 జాగ్రత్త వహించాల్సిన విషయాలు...
 1.  పూర్తి సమయం ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
 2.  వినోదం, పార్టీలు, ఫంక్షన్లకు దూరంగా ఉండటం మేలు. 
 3.  రోజుకో మాక్‌టెస్టు రాస్తూ ఫలితాలను పూర్తిగా విశ్లేషించుకోవాలి.
 4.  తేలికైన ప్రశ్నలను విడిచిపెట్టకుండా చూసుకోవాలి. ప్రాక్టీస్‌తోనే ఇది సాధ్యపడుతుంది.
 5.  చివరి రెండు రోజులు సొంత నోట్సును రివిజన్ చేసుకోవాలి.  
 6. కరెంట్ అఫైర్స్ కోసం ప్రామాణిక మ్యాగజైన్‌ను సేకరించుకొని చదవాలి.
 7.  టైర్ 2ను దృష్టిలో ఉంచుకొని, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ సబ్జెక్టులను అధ్యయనం చేయాలి.
 8.  నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి తప్పు సమాధానాలు గుర్తించకూడదు.
 9.  టైర్ 1లో టైం మేనేజ్‌మెంట్ ముఖ్యం. కాబట్టి మాక్ టెస్టులు రాసేటప్పుడే 60 నిమిషాల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రాయాలి.
 10.  ముఖ్యంగా పరీక్ష వాయిదా పడే అవకాశముందనే వార్తలను పట్టించుకోకుండా సన్నద్ధతపై దృష్టిసారించాలి.
Published date : 11 Jul 2018 05:03PM

Photo Stories