Skip to main content

ద్రవ్యలోటు నుంచి వడ్డీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది?

  • 2017-18 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడుల వృద్ధిలో పెరుగుదల నేపథ్యంలో 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రపంచ వృద్ధి ఇదే విధంగా కొనసాగుతుందని విధాన నిర్ణేతలు భావించారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి మందగించడంతోపాటు భారత ఆర్థిక వృద్ధి 6.8 శాతానికి పరిమితమైంది. భారత్‌లో కొనసాగుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు, ఆర్థిక క్రమశిక్షణ, వివిధ సర్వీసుల సమర్థవంతమైన డెలివరీ, ఆర్థిక సమ్మిళితం కారణంగా వృద్ధితోపాటు స్థిరత్వాన్ని కొంతమేర గమనించవచ్చు. సవరించిన కోశ లక్ష్యాల ప్రకారం 2020-21 నాటికి ద్రవ్యలోటును జి.డి.పి.లో 3 శాతానికి, కేంద్ర ప్రభుత్వ రుణాన్ని జి.డి.పి.లో 40 శాతానికి పరిమితం చేయవలసి ఉంటుంది. మార్చి 2019 నాటికి కేంద్ర ప్రభుత్వ రుణ- జి.డి.పి. నిష్పత్తిని 48.8 శాతంగా అంచనా వేశారు. మార్చి 2020 నాటికి 46.7 శాతం, మార్చి 2021 నాటికి 44.6 శాతానికి రుణ-జి.డి.పి. నిష్పత్తి చేరుకోగలదని అంచనావేశారు.
  • కేంద్ర ప్రభుత్వ రాబడిని రుణేతర, రుణరాబడులుగా వర్గీకరించవచ్చు. రుణేతర రాబడుల్లో పన్ను రాబడి, పన్నేతర రాబడి, రుణాల రికవరీ, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించిన రాబడి భాగంగా ఉంటాయి. రుణరాబడిలో మార్కెట్ రుణాలు, ఇతర మార్గాల ద్వారా సేకరించిన రుణాలు ప్రధానాంశాలుగా ఉంటాయి. వీటిని ప్రభుత్వం భవిష్యత్తులో చెల్లించవలసి ఉంటుంది. 2018-19లో రుణేతర రాబడి లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి నికర పన్ను రాబడిలో తగ్గుదల కారణమైంది. కార్పొరేషన్ పన్ను రాబడిలో తగ్గుదల కారణంగా 2018-19లో ప్రత్యక్ష పన్నుల రాబడిలో 13.4 శాతం పెరుగుదల నమోదైంది. మరోవైపు వస్తు, సేవల పన్ను రాబడిలో తగ్గుదల కారణంగా పరోక్ష పన్నుల రాబడి బడ్జెట్ అంచనాల కంటే 16 శాతం తగ్గింది. జి.ఎస్.టి. కౌన్సిల్ నిర్ణయం మేరకు జి.ఎస్.టి.లో అనేక మార్పులు చేపట్టినప్పటికీ పన్ను వసూళ్లను స్థిరీకరించవలసిన అవసరాన్ని ఈ స్థితి ప్రస్ఫుట పరుస్తుంది.
  • గత ఆరేళ్లుగా పన్ను-జి.డి.పి. నిష్పత్తిలో పెరుగుదల నమోదవుతున్నప్పటికీ జి.డి.పి.లో పన్ను స్థూలరాబడిలో 2017-18తో పోల్చినప్పుడు 2018-19లో 0.3 శాతం తగ్గింది. జి.ఎస్.టి. వసూళ్లు తగ్గిన కారణంగా జి.డి.పి.లో పరోక్షపన్ను రాబడికి సంబంధించి 0.4 శాతం తగ్గుదల నమోదైంది.
  • 2016-17తో పోల్చినప్పుడు 2017-18లో రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్‌లో పెరుగుదలను గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల రెవెన్యూ వ్యయంలో పెరుగుదల కారణంగా ఆయా ప్రభుత్వాల బడ్జెట్ వ్యయంలో పెరుగుదల సంభవించింది. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు, అడ్వాన్సులతో పాటు మూలధన వ్యయం మొత్తం మూలధన వ్యయంలో భాగంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ప్రాజెక్ట్‌లు, ఆహార నిల్వలు, వేర్‌హోసింగ్ నిమిత్తం సేకరించిన రుణాల్లో తగ్గుదల కారణంగా 2017-18లో సవరించిన అంచనాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం రుణాలు, అడ్వాన్‌‌సల్లో తగ్గుదల ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాల సొంత పన్ను, పన్నేతర రాబడిలో గత రెండేళ్లుగా పెరుగుదలను గమనించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల సొంత పన్ను రాబడి 2011-12లో 5.6 లక్షల కోట్ల నుంచి 2018-19లో సవరించిన అంచనాల ప్రకారం 12 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే కాలంలో సొంత పన్నేతర రాబడి రూ. 1 లక్ష కోట్ల నుంచి 2.2 లక్షల కోట్లకు పెరిగింది.
  • రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చిన రుణాలపై వడ్డీ, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి డివిడెండ్లు, లాభాలతో పాటు ప్రభుత్వానికి రిజర్‌‌వబ్యాంక్ మిగులు బదిలీ, బహిర్గత గ్రాంట్లు, సేవల ద్వారా రాబడి కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిలో భాగంగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడి 2013-14లో 1.99 లక్షల కోట్లు కాగా 2018-19లో ప్రాథమిక అంచనాల ప్రకారం 2.46 లక్షల కోట్లకు పెరిగింది. 2018-19లో కేంద్ర ప్రభుత్వ పన్నేతర రాబడిలో ఇతరాల వాటా ఎక్కువకాగా తర్వాత స్థానంలో డివిడెండ్లు, లాభాలు నిలిచాయి. 2018-19 బడ్జెట్ అంచనాల కంటే పన్నేతర రాబడిలో పెరుగుదల సంభవించింది.
  • రికవరీ అయిన రుణాలు, అడ్వాన్‌‌సలు, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రాబడి రుణేతర మూలధన రాబడికి సంబంధించి ప్రధాన అంశాలు. రికవరీ అయిన రుణాల వాటాలో గత కొంత కాలంగా తగ్గుదలను గమనించవచ్చు. 2018-19 బడ్జెట్‌లో రుణేతర మూలధన రాబడి లక్ష్యం రూ. 0.92 లక్షల కోట్లు కాగా వాస్తవ రాబడి రూ. 1.03 లక్షల కోట్లకు చేరుకుంది.
  • భారత్ పన్ను-జి.డి.పి. నిష్పత్తి తక్కువగా ఉన్నందువల్ల అవసరమైన నిధులను ఆర్థిక క్రమశిక్షణ దృష్ట్యా అవస్థాపనా రంగానికి పెట్టుబడులుగా ప్రభుత్వం మరల్చలేకపోతుంది. ఈ నేపథ్యంలో వ్యయ నాణ్యత ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వ వ్యయంలో రక్షణ, వేతనాలు, పెన్షన్‌లు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలపై వ్యయం 60 శాతానికిపైగా ఉంది. రక్షణ రంగ వ్యయ వినియోగంలో సమర్థతను పెంపొందించడానికి రక్షణ మంత్రిత్వశాఖ ఇటీవలి కాలంలో అనేక చర్యలను తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయంలో వేతనాల వాటా 2013-14లో 8.9 శాతం కాగా 2018-19లో 12.7 శాతానికి చేరుకుంది. ఇదే కాలంలో వడ్డీ చెల్లింపుల వాటా 19.5 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గింది. బడ్జెట్ పరంగా వ్యయంతోపాటు అవస్థాపనా రంగంపై పెట్టుబడి నిమిత్తం కేంద్రప్రభుత్వం అదనపు బడ్జెటరీ వనరులను సమీకరించింది. 2016-17 నుంచి 2018-19 మధ్యకాలంలో రూ. 88452 కోట్ల అదనపు బడ్జెటరీ వనరులను ప్రభుత్వ సమీకరించింది.
  • కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాతోపాటు ఆర్థిక సంఘం గ్రాంట్లు, కేంద్ర ప్రభుత్వ స్పాన్సర్‌‌డ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వనరుల బదిలీ జరుగుతుంది. 2013-14 వరకు కేంద్రప్రభుత్వ స్పాన్సర్‌‌డ పథకాల అమలుకు సంబంధించి నిధులను రాష్ట్ర ప్రభుత్వాల కన్సాలిడేటెడ్ ఫండ్, ప్రత్యక్షంగా రాష్ట్రాల పథకాల అమలు ఏజెన్సీలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. 2014-15 తర్వాత కాలంలో ప్రత్యక్ష బదిలీలను నిలిపివేసి రాష్ట్రాలకు అన్ని విధాలైన బదిలీలను రాష్ట్రాల కన్సాలిడేటెడ్ ఫండ్‌‌స ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 14వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వ మొత్తం పన్ను రాబడిలో రాష్ట్రాల వాటాను 42 శాతంగా సిఫార్సు చేసింది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు జరిగిన మొత్తం బదిలీల్లో పెరుగుదల జి.డి.పి.లో 1.2 శాతంగా నమోదైంది.
Published date : 06 Sep 2019 05:49PM

Photo Stories