స్కాట్‌శాట్-1
పీఎస్‌ఎల్‌వీ-సీ35 ద్వారా ఇస్రో మొత్తం 8 ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో 3 దేశీయ ఉపగ్రహాలు, 5 విదేశీ ఉపగ్రహాలు. దేశీయ ఉపగ్రహాల్లో ప్రధానమైందిస్కాట్‌శాట్-1. దీని బరువు 371 కిలోలు. ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. వాతావరణ పరిశీలనకు, తుపానుల గుర్తింపు, వాటి గమనానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. 2009, సెప్టెంబరు 23న పీఎస్‌ఎల్‌వీ-సీ14 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఓషన్‌శాట్-2 ఉపగ్రహంలోని స్కాటెరోమీటర్ పరికరానికి కొనసాగింపుగా స్కాట్‌శాట్-1ని ప్రయోగించింది. స్కాట్‌శాట్-1లో కేయూ బ్యాండ్ స్కానింగ్ స్కాటెరోమీటర్ రాడార్ అనే పరికరం ఉంది. ఇది 13.515 గిగాహెర్‌ట్జ తరంగ దైర్ఘ్యంలో రాడార్ సూత్రంపై పనిచేస్తుంది. ఈ పరికరం నుంచి విడుదలయ్యే శక్తి తరంగాలు సముద్ర ఉపరితలాన్ని తాకి, తిరిగి ప్రతిధ్వనిలా పరావర్తనం చెందినప్పుడు కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. స్కాటెరోమీటరు నుంచి విడుదలయ్యే విద్యుత్ అయస్కాంత తరంగాలు, సముద్ర అలల మధ్య జరిగే అంతర చర్యలు ఈ ఉపగ్రహ విధిలో కీలకమైనవి. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ఉపరితలాల గాలుల అధ్యయనానికి స్కాట్‌శాట్-1 ఉపకరిస్తుంది. తుపానుల గమనం,హిమాలయాల్లో హిమ నిర్మాణం-తరుగుదల, మరీ ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ హిమం తరుగుదల, తుపాను తీరందాటే కచ్చిత సమయాన్ని అంచనా వేయడానికి స్కాట్‌శాట్-1 ఉపయోగపడుతుంది. దీని సమాచారాన్ని ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు ఉపయోగించుకుంటాయి. ఇస్రో ఓషన్‌శాట్-3ను ప్రయోగించేంత వరకు స్కాట్‌శాట్-1 కీలకంగా వ్యవహరిస్తుంది. దీని జీవిత కాలం 5 ఏళ్లు.
ప్రథమ్
స్టూడెంట్ శాటిలైట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఐఐటీ-బాంబే దీన్ని అభివృద్ధి చేసింది. దీని బరువు 10 కిలోలు. వాతావరణంలోని Ionosphereభాగాన్ని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించింది. ప్రధానంగా ఐనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్లను అధ్యయనం చేస్తుంది.
పైశాట్
బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు అభివృద్ధి చేసిన నానో ఉపగ్రహమే ఈ పైశాట్. దీని బరువు 5 కిలోలు. పైశాట్ ప్రాజెక్టు 2012లో ప్రారంభమైంది. 2014లో పూర్తయింది. ఇది 80 mరిజల్యూషన్‌తో భూమి ఉపరితలాన్ని చిత్రీకరిస్తుంది.
విదేశీ ఉపగ్రహాలు
పీఎస్‌ఎల్‌వీ-సీ 35 ద్వారా 3 అల్‌శాట్ ఉపగ్రహాల (Alsat - 1N, Alsat - B, Alsat- 2B)తో పాటు అమెరికాకు చెందిన పాత్‌ఫైండర్-1, కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్-19 ఉపగ్రహాలను ప్రయోగించారు. దీంతో ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా 21 దేశాలకు చెందిన 79 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించినటై్లంది. భవిష్యత్‌లో మరిన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించే దిశగా పీఎస్‌ఎల్‌వీ మార్కెటింగ్‌పై ఇస్రో వాణిజ్య విభాగం ఆంత్రిక్స్కార్పొరేషన్ దృష్టి సారించింది.
పీఎస్‌ఎల్‌వీ
ఇస్రో ఇప్పటి వరకు 37 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలను నిర్వహించగా, అందులో 36 వరుసగా విజయవంతమయ్యాయి. దీంతో ప్రపంచంలో అత్యంత విజయవంతమైన అతి కొద్ది రాకెట్లలో ఒకటిగా పీఎస్‌ఎల్‌వీ గుర్తింపు పొందింది. ఇస్రో ఒకే రాకెట్ ద్వారా రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, రాకెట్ ప్రయోగ టెక్నాలజీలో మరో మైలురాయిని అధిగమించింది.
ఇటీవలి కాలంలో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు..
పీఎస్‌ఎల్‌వీ | ప్రయోగ తేది | ప్రయోగించిన ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ - సీ 27 | మార్చి 28, 2015 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1డీ |
పీఎస్‌ఎల్‌వీ - సీ 28 | జూలై 10, 2015 | ఐదు బ్రిటన్ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ - సీ 30 | సెప్టెంబర్ 28, 2015 | ఆస్ట్రోట్‌శాట్, లాపన్-ఎ2 (ఇండోనేసియా), ఎన్‌ఎల్‌ఎస్-14 (కెనడా), 4 లీముర్ ఉపగ్రహాలు (అమెరికా) |
పీఎస్‌ఎల్‌వీ - సీ 29 | డిసెంబరు 16, 2015 | సింగపూర్‌కు చెందిన 6 ఉపగ్రహాలు- టెలియోస్-1, వెలాక్స్ -సి1, వెలాక్స్ -2, కెంట్‌రిడ్‌జ -1, గెలెస్సియ, ఆథెనోక్సాట్ -1 |
పీఎస్‌ఎల్‌వీ - సీ 31 | జనవరి 20, 2016 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 ఇ |
పీఎస్‌ఎల్‌వీ - సీ 32 | మార్చి10, 2016 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 ఎఫ్ |
పీఎస్‌ఎల్‌వీ - సీ 33 | ఏప్రిల్ 28, 2016 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1 జి |
పీఎస్‌ఎల్‌వీ - సీ 34 | జూన్ 22, 2016 | కార్టోశాట్ -2+ స్వయం + సత్యభామశాట్ + 17 విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ - సీ 35 | సెప్టెంబర్ 26, 2016 | స్కాట్‌శాట్ -1, ప్రథమ్, పైశాట్ + 5 విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-C-35
| Stage -1 | Stage-2 | Stage -3 | Stage 4 |
Propellant | Solid (HTPB based) | Liquid (UH25+N2O4) | Solid (HTPB based) | Liquid (MMH+MON-3) |
Stage Dia (m) | 2.8 (Core), 1 (Strap-on) | 2.8 | 2.0 | 1.3 |
Stage Length (m) | 20 (Core), 8.8 (Strap-on) | 12.8 | 3.6 | 2.4 |
HTPB: హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీ బ్యూటడైన్
UH25: అన్‌సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్+25% హైడ్రజైన్ హైడ్రేట్
N2O4: నైట్రోజన్ టెట్రాక్సైడ్
MMH: మోనో మిథైల్ హైడ్రజైన్
MON-3: మిక్స్‌డ్ ఆక్సైడ్‌స ఆఫ్ నైట్రోజన్
ఇస్రో మరోసారి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)ని విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ35 ద్వారా ఒకేసారి 8 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఒకే రాకెట్ ద్వారా రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించి, ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది.