Skip to main content

పారిస్ ఒప్పందం గమ్యం

సి.హరికృష్ణ, సివిల్స్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పారిస్ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ స్థాయిలో శీతోష్ణస్థితి మార్పు వల్ల కలిగే ప్రభావాల నివారణ, నియంత్రణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రస్తుతం శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలకు లోనుకాని దేశం లేదా ప్రాంతం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ప్రతి దేశం ఏదో ఒక విధంగా ప్రభావితమవుతున్నట్లు పలు అంతర్జాతీయ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా.. ముఖ్యంగా ఉష్ణమండల తీరప్రాంతాల్లో తుపాన్ల తీవ్రత పెరిగింది. రాబోయే కాలంలో మరిన్ని ప్రభావాలు కనిపించే అవకాశం ఉంది.

ఉదా: 2014, జనవరిలో ఉత్తర అమెరికాలో ఉన్నట్లుండి పోలార్ వోర్టెక్స్ సృష్టించిన సమస్యలకు శీతోష్ణస్థితి మార్పు కారణమా? కాదా! అనే విషయంపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత లేదు.

వాతావరణ మార్పు ప్రభావాలు ఉష్ణ మండల ప్రాంతాలపై ఊహించని స్థాయిలో ఉండొచ్చని అంచనా. ఎల్‌నినోకు, శీతోష్ణస్థితిలో మార్పుకు మధ్య సంబంధంపై స్పష్టత లేదు. ఆసియా, ఆఫ్రికాల్లో నీటి కొరత, వ్యవసాయ దిగుబడిలో తగ్గుదల వంటి సమస్యలు పొంచి ఉన్నాయి. అదేవిధంగా సమశీతోష్ణ మండల ప్రాంతాల్లో శీతల గాలులు, పంట సమయంలో ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు తగ్గడం, కొత్త రకాల వ్యాధుల ప్రబలత వంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

నిరుద్యోగ సమస్య, అభివృద్ధి, భారత్‌కు కలిగే ప్రయోజనాలను సాకుగా చూపి పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగింది. చరిత్రాత్మక ఉద్గారాల్లో మొదటి స్థానం, ప్రస్తుత ఉద్గారాల్లో రెండో స్థానంలో ఉన్న అమెరికా వంటి దేశం పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం శోచనీయం.

అప్పుడూ ఇంతే..
1997లో రూపొందించిన క్యోటో ప్రొటోకాల్ నుంచి కూడా అమెరికా వైదొలిగింది. భారత్, చైనా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇచ్చిన మినహాయింపును ఇందుకు సాకుగా చూపింది. అయినప్పటికీ యూరోపియన్ యూనియన్ (ఈయూ), రష్యా, జపాన్ వంటి దేశాలు క్యోటో ప్రోటోకాల్ బాధ్యతను తమ భుజస్కంధాలపై వేసుకొని, విజయవంతంగా అమలు చేశాయి.
 • రాజకీయంగా అమెరికాలో శీతోష్ణస్థితి మార్పుపై ఏకాభిప్రాయం లేకపోవడం శోచనీ యం. ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని మరో ప్రభుత్వం విచక్షణారహితంగా వ్యతిరేకించడం, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి వైదొలగడం సమంజసం కాదు.
 • ప్రపంచంలోని అన్ని దేశాలు నుంచి, ఆయా దేశాల వనరుల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా లాభపడుతున్న అమెరికా.. ప్రపంచ ఉనికికి, భవిష్యత్తు తరాల సుస్థిరతకు ప్రమాదకరంగా పరిణమించిన శీతోష్ణస్థితి మార్పు నివారణ బాధ్యత నుంచి తప్పుకోవడం చారిత్రక తప్పిదం.

మాటపై నిలబడిన భారత్
శీతోష్ణస్థితి మార్పు ద్వారా అధికంగా ప్రభావితమవుతున్న దేశాల్లో భారత్ ఒకటి. అభివృద్ధిని సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్న భారత్ కూడా ఉద్గారాల నియంత్రణకు కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. పారిస్ ఒప్పందంపై 2016, అక్టోబర్ 2న భారత్ సంతకం చేసింది. దేశ అభివృద్ధికి ఆటంకమైనప్పటికీ పారిస్ ఒప్పందానికి కట్టుబడి ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా.. భారత్‌ను విమర్శిస్తూ పారిస్ ఒప్పందాన్ని వ్యతిరేకించడం హాస్యాస్పదం.

యునెటైడ్ నేషన్‌‌స ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ ఒప్పందంలో భాగంగా క్యోటో ప్రొటోకాల్ అనంతరం పారిస్ ఒప్పందాన్ని రూపొందించారు. ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడాన్ని ఉపేక్షించకుండా ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు ఆ దేశంపై వివిధ రకాలుగా ఒత్తిడి తీసుకురావాలి. అమెరికా ఏకపక్ష, నిర్లక్ష్య వైఖరి వల్ల భవిష్యత్తులో అమెరికా ప్రజలు సైతం నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ ఏడాది నవంబరులో జర్మనీలోని బాన్ నగరంలో జరగనున్న కాప్-23 సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించాలి. పారిస్ ఒప్పందం ద్వారా లాభం కంటే భాధ్యతే పెరిగిందని భారత్ అంతర్జాతీయ స్థాయిలో తన వాదనను బలంగా వినిపించాలి.

కాప్-21 సదస్సు
ప్రపంచంలోని అన్ని దేశాలు భూతాపాన్ని నియంత్రించాలని 2015, డిసెంబర్‌లో పారిస్ నగరంలో జరిగిన కాన్ఫరెన్‌‌స ఆఫ్ పార్టీస్-21 (కాప్-21) సదస్సులో తీర్మానించాయి.

పారిశ్రామికీకరణకు ముందున్న భూమి ఉపరితల ఉష్ణోగ్రతల కంటే.. రెండు డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు పెరగకుండా చూడాలని ఐక్యరాజ్యసమితి శీతోష్ణస్థితి మార్పు ఒప్పందం (యునెటైడ్ నేషన్‌‌స ఫ్రేమ్ వర్‌‌క కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సభ్యదేశాలన్నీ నిర్ణయించాయి. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు.. తాము తగ్గించనున్న ఉద్గారాలపై స్పష్టతతో పాటు అవలంబించే మార్గాలను ఈ సమావేశంలో ప్రకటించాయి. ఈ సమావేశం వాడివేడీ చర్చల తర్వాత 195 దేశాలు ఒక సరికొత్త ప్యారిస్ ఒప్పందాన్ని అంగీకరించాయి. 2020లో ఈ ఒప్పందం అమల్లోకి వస్తుంది. పారిస్ ఒప్పందంలో తీసుకున్న తీర్మానాల అమలు ద్వారా.. భావితరాలకు నివాసయోగ్యంగా భూమిని మార్చేందుకు వీలవుతుంది.

ఉద్గారాల తగ్గింపునకు సభ్య దేశాలు అంగీకరించిన ముఖ్యాంశాలు
 • పారిశ్రామికీకరణకు ముందున్న సగటు ఉష్ణోగ్రతలతో పోల్చితే.. ప్రస్తుతం ఉష్ణోగ్రతల పెరుగుదలను రెండు డిగ్రీల లోపు నియంత్రించాలి.
 • సాధ్యమైనంత వరకు ఈ ఉష్ణోగ్రతల పెరుగుదలను ఒక డిగ్రీ సెంటీగ్రేడ్‌కు నియంత్రించాలి. దీని ద్వారా శీతోష్ణస్థితి మార్పు ప్రభావాలను పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంటుంది.
 • టెక్నాలజీ వినియోగం ద్వారా ఉద్గారాల తగ్గింపునకు కృషి చేయాలి. ఈ అంశంలో అభివృద్ధి చెందిన దేశాలు సాయం అందించాలి.
 • పారిస్ ఒప్పందానికి ముందు సభ్యదేశాలన్నీ తాము తగ్గించే ఉద్గారాల సమాచారాన్ని అందించాయి. అయితే, ఈ స్థాయిలో ఉద్గారాల తగ్గింపు.. సమస్య తీవ్రతను తగ్గించే విధంగానే ఉన్నాయి. కానీ, పూర్తిగా నిర్మూలించే విధంగా లేవని కూడా పారిస్ సమావేశంలో గుర్తించారు.
 • ఈ ఒప్పందం అమలు పారదర్శకతపై సభ్యదేశాలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి సమావేశమై మరింత స్థాయిలో ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి.
 • యూరోపియన్ యూనియన్, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు.. తమ నిధుల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సాయం అందించి, శీతోష్ణస్థితి అనుకూలతలను పటిష్టం చేయాలని నిర్ణయించాయి.
 • 2025 వరకు ఏటా వంద బిలియన్ ఆర్థిక నిధులను సమకూర్చాలని కూడా అభివృద్ధి చెందిన దేశాలు నిర్ణయించాయి.

భారత్ కీలక పాత్ర
 • శీతోష్ణస్థితి మార్పు ద్వారా తీవ్రంగా ప్రభావితం కానున్న దేశాల్లో భారత్ ఒకటి.
 • దీన్ని గుర్తించిన భారత ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకం కలగకుండా ఉద్గారాల తగ్గింపునకు కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. దీంతోపాటు, శీతోష్ణస్థితి మార్పు నియంత్రణకు సంబంధించిన ప్యారిస్ ఒప్పందం రూపకల్పనలో కీలకపాత్ర వహించింది.
 • 2015, అక్టోబర్ 2న భారత్ తన ఉద్గారాల తగ్గింపు ప్రణాళికను ప్రకటించింది. 2005 నాటి ఉద్గారాల్లో.. 33-35 శాతం ఉద్గారాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు భారత్ ప్రకటించింది.
 • దీంతోపాటు 2030 నాటికి 2.5-3 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ సమాన ఉద్గారాలను తగ్గించే వీలుగా అటవీ చట్టాన్ని విస్తరించనున్నట్లు కూడా భారత్ ప్రకటించింది.
 • ఉద్గారాల తగ్గింపునకు భారత్ చర్యలు: దేశంలో సౌరశక్తి విస్తరణ; ఉత్పాదకత, శక్తి సామర్థ్యం పెంపు; సమర్థవంతమైన వ్యర్థ వినియోగం; కాలుష్య రహిత రవాణా వ్యవస్థ

శీతోష్ణస్థితి మార్పు
భూతాపం (గ్లోబల్ వార్మింగ్). భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు అవాంఛనీయ పెరుగుదల భూతాపానికి దారితీస్తుంది. మానవ శక్తి వినియోగ చర్యల ద్వారా ‘కార్బన్ డై ఆక్సైడ్’ అధిక మోతాదులో విడుదలై భూతాపానికి కారణమవుతుంది. భూమిపైకి చేరుతున్న సౌరపుటంలో అత్యధికం తిరిగి రోదసిలోకి పరావర్తనం చెందుతుంది. కార్బన్ డై ఆక్సైడ్ వంటి వాయువులు ఈ సౌరశక్తిని కొద్దిగా గ్రహించి దీన్ని ఉష్ణంగా వాతావరణంలోకి విడుదల చేస్తున్నాయి. ఫలితంగా కార్బన్ డై ఆక్సైడ్ లాంటి వాయువులు భూమిపై వేడి పెరగటానికి కారణమవుతూ.. భూమి ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ వచ్చాయి. 1750కు పూర్వం 6.5 లక్షల ఏళ్లపాటు కార్బన్ డై ఆక్సైడ్ 120 ppm (Parts Per Million) మోతాదులో పెరిగింది. ఆ తర్వాత 2012 వరకు 262 ఏళ్లలో అత్యల్ప సమయంలో అదే మోతాదులో కార్బన్ డై ఆక్సైడ్ పెరగడం ద్వారా భూమి ఉపరితల ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగి భూతాపం సంభవించింది.

ప్రారంభంలో శీతోష్ణస్థితి మార్పునకు కారణం కార్బన్ డై ఆక్సైడ్ మాత్రమే అని గుర్తించారు. ఆ తర్వాత దాంతోపాటు అనేక ఇతర ఉద్గారాలు (మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, హైడ్రో ఫ్లోరో కార్బన్‌‌స తదితర) భూతాపానికి, తద్వారా శీతోష్ణస్థితి మార్పునకు కారణమవుతున్నట్లు గ్రహించారు. పై వాయువులన్నీ హరితవాయువు తెర మాదిరిగా సౌరశక్తిని గ్రహించి, తిరిగి దాని పరావర్తనాన్ని అడ్డుకుంటాయి కాబట్టి వీటిని హరితవాయువు ఉద్గారాలు అని పిలుస్తారు.భూతాపం ద్వారానే శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తుందని ఐపీసీసీ 1990లో విడుదల చేసిన తన మొదటి నివేదికలో స్పష్టం చేసింది.
Published date : 22 Jun 2017 06:01PM

Photo Stories