Skip to main content

నింగిలో నాలుగో దిక్సూచి - ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ 1డి

సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
భారత శాస్త్రవేత్తల సామర్థ్యానికి మరో నిదర్శనంగా పీఎస్‌ఎల్‌వీ-సీ27 నిలిచింది. మన అంతరిక్ష యాత్రకు నమ్మినబంటుగా పేరున్న ఈ నౌక 120 కోట్ల భారతీయుల ఆకాంక్షను నిజం చేస్తూ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహంతో నింగిలోకి దూసుకెళ్లింది. రోదసీ ఆధారిత దిక్సూచి వ్యవస్థను కలిగిఉన్న అతికొద్ది దేశాల సరసన సగర్వంగా చేరేలా చేసింది. ఈ విజయం 2016 మార్చి నాటికి సంపూర్ణ సమా చార ఉపగ్రహ వ్యవస్థ సాధించాలనే మన శాస్త్రవేత్తల సంకల్పాన్ని నిలబెట్టింది.

పూర్తిస్థాయి స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించి కీలక విజయాన్ని భారత్ సాధించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. దీంతో ఏడు ఉపగ్రహాల భారత ప్రాంతీయ దిక్సూచీ ఉపగ్రహ వ్యవస్థ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) సముదాయంలో నాలుగు ఉపగ్రహాలను ప్రయోగించారు. మే 28న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికయింది. నిర్దేశిత కక్ష్యలోకి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీ ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ27 ప్రయోగించింది. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 19 నిమిషాల 25 సెకన్ల తర్వాత పీఎస్‌ఎల్‌వీ-సీ27 రాకెట్ నాలుగో దశ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డీని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఇస్రోకు 29వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం. కాగా 28వ వరస విజయం. దీన్ని ఇస్రో ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించింది. పీఎస్‌ఎల్‌వీ-సీ27 బరువు 320 టన్నులు. దీని మొదటిదశ చుట్టూ ఉన్న ఆరు స్ట్రాప్-ఆన్ బూస్టరు మోటార్లు, ఒక్కో దానిలో 12 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. ఎక్స్‌ఎల్ రూ పంలో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించడం ఇది ఎనిమిదోసారి.

గత పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ ప్రయోగాలు:
పీఎస్‌ఎల్‌వీ-సీ11/ చంద్రయాన్; పీఎస్‌ఎల్‌వీ-సీ17/జీశాట్-12; పీఎస్‌ఎల్‌వీ సీ19/రీశాట్-1; పీఎస్‌ఎల్‌వీ-సీ22/ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ; పీఎస్‌ఎల్‌వీ-సీ25/ మంగళయాన్ పీఎస్‌ఎల్‌వీ-సీ24/ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి; పీఎస్‌ఎల్‌వీ-సీ26/ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సీ.

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి
ఇండియన్ రీజనల్ నావిగేషన్ వ్యవస్థలో ఇది నాలుగోది. దీనికి ముందు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ను పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా 2013, జూలై 1న, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి ని పీఎస్‌ఎల్‌వీ-సీ24 ద్వారా 2014 ఏప్రిల్‌లో, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ని పీఎస్‌ఎల్‌వీ-సీ-26 ద్వారా 2014, అక్టోబర్‌లో ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి బరువు 1425 కిలోలు. దీని నిర్మాణం మొదటి మూడు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలను పోలి ఉంటుంది. ఈ నాలుగింటిని భూ అనువర్తిత ((geo synchronous) కక్ష్యలోకి ప్రవేశపెట్టాయి. దీంతో జీపీఎస్ సేవలను ప్రారంభించడానికి వీలవుతుంది. జీపీఎస్ సేవలకు కనీసం నాలుగు ఉపగ్రహాలు అవసరం. వచ్చే ఏడాదికల్లా వీటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తారు. మూడు ఉపగ్రహాలను భూస్థిర (Geo stationary) కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. దీంతో ఏడు ఉపగ్రహాల ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటు పూర్తవుతుంది.

విస్తృతమైన సేవలు
భారత్‌తోపాటు భారత ప్రధాన భూభాగం నుంచి 1500 కిలోమీటర్ల వరకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహాన్ని 282.52 కిలోమీటర్లు అపోజీ (భూమికి దూరంగా), 20,664 కిలోమీటర్లు పెరిజీ (భూమికి దగ్గరగా) కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ27 ప్రయోగించింది. చివరి కక్ష్యకు పీఎస్‌ఎల్‌వీ చాలా దగ్గరగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డిని ప్రయోగించారు. దీని ద్వారా అన్ని రకాల రవాణా వ్యవస్థల్లో ఉపగ్రహ ఆధారిత దిశా నిర్దేశం లభిస్తుంది. వ్యక్తిగత సేవలతో పాటు, సైనిక అవసరాలకూ ఇది ఉపయోగపడుతుంది. ప్రమాదంలో ఉన్న నౌకలు, విమానాల నుంచి వచ్చే సంకేతాలను గ్రహించి తక్షణ సహాయ చర్యలను అందించడానికి ఉపయోగపడుతుంది. మొబైల్ ఫోన్లతో, వాహనాలతో అనుసంధా నించడం ద్వారా వ్యక్తిగత పొజీషనింగ్, నావిగేషన్ సేవలు విస్తరిస్తాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డిలో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి.
  1. నావిగేషన్ పేలోడ్: దీని ద్వారా వినియోగదారులకు దిక్కులను, మార్గాన్ని సూచించే సంకేతాలు లభిస్తాయి. దీనిలో అధిక సామర్థ్యమున్న రుబీడియం అణు గడియారం ఉంటుంది.
  2. రేంజింగ్ పేలోడ్: దీనిలోని సీ-బ్యాండ్ ట్రాన్స్ పాండర్ ద్వారా ఉపగ్రహ పరిధి నిర్దేశితమవుతుంది. లేజర్ ఆధారిత రేంజింగ్‌కు ఉపయోగపడే కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్స్‌ను కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్- 1డిలో అమర్చారు.

జీపీఎస్
గ్లోబల్ పొజీషనింగ్ వ్యవస్థను తొలిసారిగా 1973లో అమెరికా రక్షణ విభాగం అభివృద్ధి చేసింది. ఉప గ్రహాల ఆధారంగా సైనికులకు, సైనిక వాహనాలు, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల దిశానిర్దేశం కోసం ప్రారంభంలో జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అనేక వాణిజ్య, సాంకేతిక అనువర్తనాలకు ఈ వ్యవస్థను విస్తరించారు. అన్ని ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థలను ప్రస్తుతం జీపీఎస్ పేరుతోనే పిలుస్తున్నాము. వ్యక్తిగత నావిగేషన్ సేవలతో పాటు ట్రాఫిక్ వ్యవస్థ ఏర్పాటు, విపత్తు నిర్వహణకు జీపీఎస్ ఉపకరిస్తుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న మానవ రహిత పర్యావరణ కేంద్రాలను అనుసంధానించడానికి, వాటి నుంచి సమాచారాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది. పర్వతారోహకులకు, నౌకల గమనానికి కావాల్సిన దిశానిర్దేశానికి కూడా ఉపకరిస్తుంది. అమెరికా జీపీఎస్ వ్యవస్థలో ఆరు కక్ష్యల్లో.. ఒక్క దానిలో నాలుగు చొప్పున మొత్తం 24 ఉపగ్రహాలు ఉంటాయి. రష్యా అభివృద్ధి చేసిన జీపీఎస్ వ్యవస్థ- జీఎల్‌ఓఎన్‌ఏఎస్‌ఎస్(గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం). ఇదే తరహాలో యూరప్(గెలీలియో), చైనా (బిడౌ), జపాన్ (క్వాసి జెనిథ్) కూడా జీపీఎస్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా భారత్‌లో బ్యాంకింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఈ రకమైన సేవల కోసం విదేశీ ఉపగ్రహాలపై ఆధారపడటం కంటే దేశీయ నావిగేషన్ వ్యవస్థపై ఆధారపడడం మంచిది. పూర్తి భద్రతతో కూడిన సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎంతగానో ఉపకరిస్తుంది.

పీఎస్‌ఎల్‌వీ
ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమ ఖ్యాతి చాటడంలో పీఎస్‌ఎల్‌వీ (పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ధృవ కక్ష్యలోకి ఉపగ్రహాల్ని ప్రయోగించడానికి తొలుత దీన్ని రూపొందించారు. భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇది ప్రయోగించగలదు. ఇది నాలుగు దశల నౌక. మొదటి, మూడో దశల్లో ఘన ఇంధనం, రెండు, నాలుగో దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. పీఎస్‌ఎల్‌వీ-జనరిక్ రూపంలో మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. పీఎస్‌ఎల్‌వీ కోర్ అలోన్ (core alone(CA)) రూపంలో స్ట్రాప్ ఆన్ మోటర్లు ఉండవు. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో ఈ స్ట్రాప్‌ఆన్ మోటార్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటివరకు చేపట్టిన 29 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 26 కార్యాచరణ ప్రయోగాలు. సెప్టెంబరు 20, 1993న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 28 ప్రయోగాలు వరసగా విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో 72 ప్రయోగాలు జరిగాయి. వీటిలో 32 స్వదేశీవి కాగా,40 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ప్రపంచంలో పూర్తి విజయవంతమైన అతికొద్ది రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆస క్తి కనబరుస్తున్నాయి. ఆస్ట్రేలియా మినహా దాదాపు అన్ని ఖండాల్లోని దేశాల ఉపగ్రహాలను ఇస్రో ప్రయోగించింది.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగతేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్ - 1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హామ్‌శాట్ (Hamsa)

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా)పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సార్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏప్రిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ

పీఎస్‌ఎల్‌వీ-సీ25

నవంబర్ 5, 2013

మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ24

ఏప్రిల్ 4, 2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి

పీఎస్‌ఎల్‌వీ-సీ23

జూన్ 30, 2014

స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-71,ఎన్‌ఎల్ ఎస్-72 (కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ26

అక్టోబరు 16,2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి

పీఎస్‌ఎల్‌వీ-సీ27

మార్చి 28, 2015

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి

Published date : 18 Apr 2015 03:55PM

Photo Stories