Skip to main content

మేక్ ఇన్ ఇండియా ‘రక్షణ’!

అంతరిక్షంలో భారతదేశ మార్కును సాధించినప్పటికీ స్వయం రక్షణ కోసం ఆయుధాలను సొంతగా తయారుచేసుకునే సామర్థ్యం ఇంకా సమకూరలేదు. ఇప్పటికీ మన రక్షణ ఉత్పత్తుల్లో దాదాపు 60 శాతం పరికరాలు, విమానాలు, యుద్ధ సామగ్రిని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా అడుగులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ధీరేంద్ర సింగ్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ తమ నివేదికను సమర్పించిన నేపథ్యంలో దీనిపై ఫోకస్...
ఆయుధోత్పత్తికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, భారీ పెట్టుబడులు భారత ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు లేకపోవటంతో మొదటి నుంచి దిగుమతుల కోసం రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలపై ఆధారపడాల్సి వచ్చింది. 2010 సంవత్సరం వరకు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా ఉన్న చైనా స్థానాన్ని నేడు మన దేశం ఆక్రమించింది. మన రక్షణ దిగుమతుల్లో 25 శాతం తగ్గితే 1.20 లక్షల మందికి ఉన్నత నైపుణ్య ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. వచ్చే 5 సంవత్సరాల వ్యవధిలో రక్షణ ఉత్పత్తుల్ని భారత్‌లో 70 శాతం సమకూర్చుకోగలిగితే దేశంలో ఉపాధి, ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు ప్రోత్సాహంతోపాటు అమూల్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని కూడా నిలుపుకోవచ్చు.

ధీరేంద్ర సింగ్ కమిటీ ఏర్పాటు
బెంగళూరులోని ఎలహంకలో పదో వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా-2015’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తూ రక్షణ రంగంలో ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉందని పేర్కొన్నారు. మానవ వనరుల సృష్టికి విశ్వవిద్యాలయాలను ప్రారంభిస్తామని తెలిపారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణకు సంబంధించి యుద్ధ పరికరాలను తయారుచేయటానికి ప్రభుత్వం పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. రక్షణ రంగ తయారీలో స్వావలంబన సాధించేందుకు అవసరమైన చర్యలు సత్వరమే చేపడతామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించారు. రక్షణ రంగంలో సేకరణకు సంబంధించి నూతన విధానాల రూపకల్పన (న్యూ డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ-డీపీపీ) కోసం కేంద్ర హోంశాఖ కార్యదర్శి ధీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ఇటీవలే తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫార్సులు
ఈ కమిటీ రక్షణ రంగంలోని వివిధ విభాగాలను, త్రివిధ దళాధిపతులను, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ)ను సంప్రదించి 43 సిఫార్సులను చేసింది. ఇందులో 15 సిఫార్సులు ప్రత్యక్షంగా భారత్‌లో తయారీ విధానంతో ముడిపడి ఉన్నాయని, మిగిలినవి సేకరణకు సంబంధించినవని పేర్కొంది. ఈ నివేదికకు ‘కమిటీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఫర్ ఎమెండ్‌మెంట్ టు డీపీపీ-2013’ అని పేరు పెట్టారు.
  • క్లిష్టమైన రక్షణ ప్రాజెక్టులలోను, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలోనూ ప్రభుత్వ రంగ సంస్థలతో సమానంగా ప్రైవేటు రక్షణ కంపెనీలను కూడా తీసుకోవటం.
  • ప్రొక్యూర్‌మెంట్(సేకరణ విధానం)లో ఏకైక బిడ్డింగ్(అమ్మకం) జరిగినపుడు సదరు అమ్మకందారు మధ్యలోనే ప్రాజెక్టును నిలిపేసి వెనక్కి వెళ్లకుండా నిలుపుదల చేయటం.
  • రక్షణ ఉత్పత్తులను తయారుచేస్తున్న ప్రభుత్వరంగ సంస్థలకు, ఆయా ప్రాజెక్టులకయ్యే వ్యయంలో 85 శాతం ఏవిధంగానైతే ఇస్తున్నారో, అదే విధంగా ప్రైవేటు కంపెనీలకు వర్తింపజేయాలి.
  • చిన్న, మధ్య తరహా కంపెనీలకు రూ.500 కోట్లలోపు ఉన్న రక్షణ ప్రాజెక్టులను ఏ విధంగా కేటాయించాలనే విషయంపై ఒక ప్రత్యేక విధి విధానాన్ని రూపొందించాలి.
  • ప్రైవేటు సంస్థల్లో షేర్ల వాటా స్వరూప స్వభావాలను మార్చటానికి ప్రభుత్వ అనుమతి ఉండాలి. క్రాస్ హోల్డింగ్‌కు పాల్పడకూడదు.
  • ప్రైవేటు కంపెనీలకు ప్రభుత్వ పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) మౌలిక సదుపాయాలను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి.
  • 2014-15 బడ్జెట్‌లో నూతనంగా కేటాయించిన రూ.100 కోట్ల సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి నిధి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, చిన్న, మధ్య తరహా(ఎస్‌ఎంఈ) సంస్థలకు చేయూతనివ్వాలి.
  • రక్షణ ఎగుమతులకు స్వయం ప్రతిపత్తిగల ఏకగవాక్ష పద్ధతిని ఏర్పాటుచేయాలి.
  • యుద్ధ విమానాలు, రవాణా పరికరాలు; యుద్ధ నౌకలు, జలాంతర్గాములు; సాయుధ యుద్ధ వాహనాలు; సంక్లిష్ట క్షిపణుల తయారీ; నిఘా, సమాచార నియంత్రణ, కమాండ్ మొదలైన విభాగాలు; కీలకమైన పేలుడు ముడిపదార్థాలైన టైటానియం, అల్యూమినియం, కార్బన్, నికెల్, కోబాల్ట్‌లు, వాటి సమ్మేళనాలు- వంటి ఆరు విభాగాల్లో స్వదేశీ పరికరాలు, ఉత్పత్తులను ప్రోత్సహించాలి.
  • 2027 నాటికి 70 శాతం సైనిక విభాగాలకు అవసరమైన పరికరాల తయారీలో స్వావలంబన.
  • ‘మేక్ ఇన్ ఇండియా’ను దృష్టిలో ఉంచుకొని త్రివిధ దళాల ఆయుధాల అవసరాల సేకరణలో ప్రస్తుతం ఉన్న 30-40 శాతం నుంచి 2016-17 సంవత్సరానికి 60 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.
విదేశాల నుంచి కొనుగోలు చేసినా, దేశీయంగా తయారు చేసినా.. రక్షణ సేకరణ విధానం పటిష్టంగా ఉండాలి. లేకపోతే బోఫోర్స్ కుంభకోణం, అగస్టావెస్ట్‌లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోళ్లలో అక్రమాల వంటి పరిణామాలు పునరావృతమవుతాయి.

వివిధ వర్గాల అభిప్రాయాలు
ధీరేందర్ సింగ్ కమిటీ రిపోర్టును రక్షణ మంత్రిత్వ శాఖ తొలిసారిగా బహిర్గతపరచి (పబ్లిక్ డొమైన్) పారిశ్రామిక వర్గాల, ప్రభుత్వ విభాగాల, వివిధ వర్గాల ప్రజల నుంచి విలువైన సూచనలు, సలహాలను తీసుకుంటోంది.
  • దేశీయ పరిశ్రమల వాటాను ప్రతి ఏటా పెంచే విధంగా నిబంధన చేర్చాలి.
  • ‘మేక్ ఇన్ ఇండియా’ అంటే సేకరించిన విడిభాగాలను భారత్‌లో బిగించటం కాదు కదా! మేధోసంపత్తిని కూడా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది.
  • మామూలు సెజ్(స్పెషల్ ఎకనమిక్ జోన్)లు ఏర్పాటుచేస్తున్న విధంగానే రక్షణ రంగ పరికరాల ఎకనమిక్ జోన్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కొన్ని పారిశ్రామిక సంస్థలు సూచించాయి.
  • క్రాస్ హోల్డింగ్ నిబంధనల ద్వారా పరిశ్రమలను నియంత్రిస్తున్నాయి అని కొన్ని పరిశ్రమలు వాదిస్తున్నాయి.

ఆధునికీకరణ దిశగా చర్యలు
దేశంలో 9 ప్రభుత్వరంగ రక్షణ సంస్థలు (డీపీఎస్‌యూ)లతోపాటు 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, 50 డీఆర్‌డీఓ ప్రయోగశాలలు, రెండు లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, 760 కోట్ల డాలర్ల ఆయుధ ఉత్పత్తిని సాధిస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఆధునికీకరణ జరగలేదు. ప్రస్తుతం టీసీఎస్, టాటాపవర్, గోద్రెజ్, హెచ్‌సీఎల్, ఎల్‌ఎండ్‌టీ, మహింద్రా, కిర్లోస్కర్ వంటి మల్టీనేషనల్ సంస్థలతోపాటు 6 వేల చిన్న, మధ్య తరహా సంస్థలు కూడా రక్షణ ఉత్పత్తిలో పాలుపంచుకుంటున్నాయి. క్షిపణుల అభివృద్ధిలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం భారీగా ఉన్నప్పటికీ రక్షణ రంగ పరికరాల తయారీలో వీటి పాత్ర అంతగా లేదు.

రక్షణ రంగ కేటాయింపులు
కేంద్ర ప్రభుత్వం 2015-16 బడ్జెట్‌లో రక్షణ రంగానికి రూ.2,46,727 కోట్లు కేటాయించింది. ఇందులో అగ్రభాగం త్రివిధ దళాలు, ప్యారామిలిటరీ దళాల జీతభత్యాలకే!! రక్షణ రంగ పరికరాల పరిశోధన, అభివృద్ధిపై 7 శాతం నిధులను మాత్రమే కేటాయిస్తోంది. తమ రక్షణ బడ్జెట్‌లో ఆర్ అండ్ డీకి చైనా 20 శాతం, అమెరికా 12 శాతం కేటాయిస్తున్నాయి. భారత్ 2010-14 మధ్య అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంది. మొత్తం అంతర్జాతీయ రక్షణ పరికరాల దిగుమతుల్లో ఇది 15 శాతం. సౌదీ అరేబియా 5 శాతం, చైనా 4 శాతం, పాకిస్థాన్ 4 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి మన దేశం ఏటా దిగుమతుల కోసం ఎంత పెద్ద మొత్తం కేటాయిస్తుందో అర్థం చేసుకోవచ్చు.

అమెరికాతో జరిగిన ఒప్పందాలు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గణతంత్ర వేడుకలకు భారత్‌కు వచ్చినప్పుడు రక్షణ రంగానికి సంబంధించి అనేక కీలక కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. డ్రోన్ల దిగుమతి, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో, ఆపదల్లో కూడా రక్షణ పరికరాలను, సహాయ సామగ్రిని మోసుకుపోయేందుకు ఉపయోగపడే అత్యాధునికమైన సి-130 యుద్ధ వాహక విమానాల తయారీకి సంబంధించినవి ఇందులో ముఖ్యమైనవి. రక్షణ తయారీ రంగంలో విదేశీ కంపెనీల ప్రమేయాన్ని భారత్ అంతగా ఇష్టపడనప్పటికీ ఇంత భారీస్థాయిలో దిగుమతి ఒప్పందాలు కుదుర్చుకుంది.

వివిధ కమిటీలు
1992లో అప్పటి రక్షణ మంత్రి సలహాదారు, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం సారధ్యంలో ఏర్పాటైన కమిటీ స్వావలంబన దిశగా కీలక సిఫార్సులు చేసింది. రక్షణ ఉత్పత్తుల్లో 30 శాతం స్వదేశీ, 70 శాతం విదేశీగా ఉన్న పరిస్థితిని తిరగరాయాలని పేర్కొంది. అయితే ఇప్పటికి కేవలం 10 శాతం మాత్రమే పెంచుకోగలిగాం. 2004లో ఏర్పాటైన కేల్కర్ కమిటీ సైతం దేశీయ ప్రైవేటు రంగానికి రక్షణ ఉత్పత్తుల్లో చురుకైన పాత్ర కల్పించాలని, డీఆర్‌డీఓకు నూతన జవసత్వాలను కల్పించాలని సిఫార్సు చేసింది. ఇవన్నీ ప్రభావవంతంగా అమలుకాలేదు.

కేంద్రం చర్యలు
రక్షణ ఉత్పత్తుల విడిభాగాలు, పరికరాలు, ఉపవ్యవస్థలు భారతదేశంలోనే తయారయ్యేలా సమీకరించింది. సరళంగా, త్వరితంగా నిర్ణయాలు తీసుకునేలా, జవాబుదారీతనంతో నూతన విధానాల రూపకల్పన చేస్తోంది. సాంకేతిక రంగ అభివృద్ధి నిధిని ప్రారంభించి, రక్షణ రంగ ఉత్పత్తుల నమూనాల తయారీకి 80 శాతం వరకూ నిధుల్ని సమకూర్చే విధానాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. రక్షణ రంగ పరిశోధనల్లో ఇకపై శాస్త్రవేత్తలు, సైనికులు, విద్యావేత్తలు, పరిశ్రమల నిపుణుల సేవల్ని కూడా వినియోగించుకోనుంది. ఈ కార్యక్రమాలన్నిటినీ అమలు చేస్తే రక్షణ రంగ అతిపెద్ద దిగుమతిదారు అనే అపప్రద తొలగించుకొని స్వావలంబన దిశగా అడుగులు వేయవచ్చు.

రక్షణ రంగ కేటాయింపులు
స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం దేశాల వారీగా 2014లో రక్షణ రంగ కేటాయింపులు..

దేశం

కేటాయింపు (బిలియన్ డాలర్లలో)

అమెరికా

610

రష్యా

84.5

చైనా

216

ఇండియా

50

ప్రపంచం మొత్తం

1776


భారత్‌కు 2010-14ల మధ్య ప్రధాన రక్షణ పరికరాల ఎగుమతి దేశాలు
  1. రష్యా (70 శాతం)
  2. అమెరికా (12 శాతం)
  3. ఇజ్రాయెల్ (7 శాతం)
Published date : 25 Sep 2015 01:05PM

Photo Stories