Skip to main content

మాతుఝే సలామ్

సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
సెప్టెంబర్ 24, 2014 భారత అంతరిక్ష చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైన వేళ సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజిది. తొలి ప్రయత్నంలోనే అరుణ గ్రహం ప్రయోగ విజయంతో ‘ఘన’కీర్తి గాంచింది. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్‌లకు మాత్రమే సాధ్యమైన... ఈ ఘనత తనకూ వర్తిస్తుందని సగర్వంగా చాటి చెప్పింది భారత్. 66.6కోట్ల కిలోమీటర్ల అలుపెరగని ప్రయాణంలో తనపై ఉంచిన నమ్మకాన్ని మంగళ్‌యాన్ మంగళ ప్రదం చేసింది. అంగారక కక్ష్యలోకి చేరి మువ్వన్నెల పతాకం ముసిముసిగా నవ్వేలా చేసింది. ఆసియాలోనే అంగారక ప్రయోగాన్ని విజయవంతంగా తలపెట్టిన మొదటి దేశంగా చరిత్రను సృష్టించింది.

సెప్టెంబర్ 24 న ఉదయం గం. 7.52 నిమిషాలకు మంగళ్‌యాన్ అంగారక కక్ష్యలోకి ప్రవేశించిందని ఇస్రో అధికారికంగా ప్రకటించడంతో యావత్ భారతావని ఉప్పొంగిపోయింది. అసాధ్యమనుకున్న వారంతా నివ్వెర పోయేలా ఇస్రో తన మొదటి అంతర గ్రహ ప్రయోగంలో అజరామర విజయం సాధించింది. 2013 నవంబర్ 5న PSLV-C25 ద్వారా మంగళ్‌యాన్‌ను ప్రయోగించిన తర్వాత 66.6 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక కక్ష్యలోకి చేరింది. నవంబర్ 5, 2013న PSLV-C25 రాకెట్ మార్స్ ఆర్బిటార్ మిషన్ (మామ్) ను 248 కి.మీ పెరీజి, 23,550 కి.మీ అపోజీ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భూమి గురుత్వాకర్షణ పరిధిని దాటి మామ్‌ను తీసుకెళ్లే లక్ష్యంతో ఆరుసార్లు కక్ష్య మార్పిడి ప్రయోగాలు జరిగాయి. డిసెంబర్ 1, 2013న దీన్ని విజయ వంతంగా హీలియోసెంట్రిక్ కక్ష్యలోకి తీసుకెళ్లడంతో అంగారక ప్రయాణం మొదలైంది.

మూడు మార్పులు
చంద్రుడు భూ కక్ష్యలోనే ఉండటం వల్ల 2008లో సులభంగా చంద్రయాన్-1ను చంద్రుడిపైకి పంపించారు. మంగళ్‌యాన్‌ను భూమి గురుత్వాకర్షణ నుంచి వెలుపలకు తీసుకెళ్లి హీలియోసెంట్రిక్ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం పెద్ద సవాలు. వీటన్నింటినీ అధిగమించిన తర్వాత మంగళ్‌యాన్ ట్రాన్సిస్టరీలో 3 సార్లు మార్పులు చేశారు. మొదటిది డిసెంబర్ 11, 2013న, రెండోది జూన్ 11, 2014న, మూడోది సెప్టెంబర్ 22, 2014న ట్రాన్సిస్టరీలో మార్పులు జరిగాయి. ఇవి చాలా కీలకమైనవి. వీటి ద్వారానే అంగారక గ్రహంవైపు కచ్చితంగా మంగళ్‌యాన్ ప్రయాణం సాగింది.

అమ్మలాంటి మామ్... అందించిన అద్భుత విజయం
అంగారకుడిపై మంగళ్‌యాన్ నిర్వహించే పరిశోధనల కంటే సంక్లిష్టమైనది, అసలైన విజయంగా భావించాల్సినది మార్స్ ఆర్బిట్ మిషన్ (మామ్) అంగారక కక్ష్యలోకి మంగళ్‌యాన్‌ను చేర్చడం. ఇందుకోసం భూమి నుంచి ఉపగ్రహానికి సంకేతాన్ని పంపించాలి. దీన్ని నిర్వహించడం చాలా కష్టమైన పని. భూమి నుంచి సంకేతాలు వెళ్లడానికి 12.8 నిమిషాలు పడుతుంది. ఉపగ్రహం నుంచి భూమికి పంపించడానికీఅంతే సమయం కావాలి.

అటానమీ... భావి ఆవిష్కరణల సంజీవని
ఒకవేళ ఉపగ్రహం తనంతట తాను ఈ ప్రక్రియను నిర్వహించడాన్నే ఉపగ్రహ అటానమీ అంటారు. ఉపగ్రహంలోని ఎలక్ట్రానిక్ మెదడును అటానమీ అంటారు. ఇది తనంతట తానే ఎత్తును, ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించగలదు. భూమి నుంచి ఎలాంటి కమాండ్లు అవసరం లేకుండానే ఉపగ్రహం తనంతట తాను చర్యలను నిర్వహించుకోవడానికి అటానమీ ఉపకరిస్తుంది. దీని ద్వారా ఉపగ్రహం అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. తన తప్పిదాన్ని గుర్తించి సరిచేసుకుంటుంది. భూమి నుంచి కనిపించని సమయంలో కార్యకలాపాలను నిర్వహించడాన్ని సాధ్యం చేస్తుంది. ఇలాంటి ప్రత్యేక గుణం ద్వారా భవిష్యత్తులో అద్భుతమైన ఉపగ్ర హ అనువర్తనాల ఆవిష్కరణ జరగుతుంది.

ఈ అటానమీని వినియోగించే దశలోనే చాలా ప్రయోగాలు విఫలమయ్యాయి. భూమి ఆకర్షణతోపాటు, సూర్య చంద్రులు, అంగారకుడి ప్రభావాలు ఉపగ్రహంపై ఉండే సందర్భంలో చాలా జాగ్రత్తగా దూరాన్ని, ఎత్తును, దిశను లెక్కించి సరైన కక్ష్యోలికి మంగళ్‌యాన్ ప్రవేశించింది. ఈ దశలో లిక్విడ్ అపోజీ మోటార్ (LAM)ను విజయవంతంగా మండించడం ద్వారా సరైన సమయంలో అంగారక కక్ష్యలోకి మంగళ్‌యాన్ ప్రవేశించింది. సెప్టెంబర్ 24న 7:47:46 సెకన్లకు LAM పూర్తిస్థాయిలో మండిన సమాచారాన్ని గుర్తించారు. 7:52:46 సెకన్లు పూర్తిస్థాయిలోకి ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రా డీప్ స్పేస్ నెట్‌వర్క్ మంగళ్‌యాన్ నుంచి సంకేతాలను అందుకొని భారత్‌కు సమాచారాన్ని చేరవేసింది.

తొలి ప్రయత్నంలో తిరుగులేని విజయం
రోదసీ అన్వేషణలో చంద్రయాన్-1 తర్వాత భారత్ సాధించిన విజయం మంగళ్‌యాన్. ఇప్పటివరకు అంగారకునిపై జరిగిన 51 ప్రయోగాల్లో 21 మాత్రమే విజయవంతమయ్యాయి. అయితే మొదటి ప్రయత్నంలోనే భారత్ విజయం సాధించింది. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే ఇలాంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇస్రో ఘనత. ఈ కార్యక్రమం కేవలం 26 నెలలకు ఒకసారి మాత్రమే నిర్వహించాల్సి ఉంటుంది. దీన్నే లాంచ్ విండో అంటారు. మనకు ఉన్న లాంచ్‌విండో 2013 అక్టోబరు 28- నవంబర్ 19 వరకు మాత్రమే. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆగస్టు 2012లో ప్రభుత్వం నుంచి ఇస్రోకు అనుమతి లభించింది. లాంచ్ విండోకు అప్పటికి 15 నెలలు మాత్రమే మిగిలి ఉంది. అయినప్పటికీ యూఆర్‌రావు అధ్యక్షతన ఉన్న సలహా కమిటీ సూచించిన పరికరాలను 2013 మార్చి నాటికి ఇస్రో సిద్ధం చేసింది. నిర్దేశిత లాంచ్ విండోలోని PSLV-XL రూపంలో ఉన్న PSLV-C25 ద్వారా మంగళ్‌యాన్‌ను ఇస్రో భూకక్ష్యలోకి నవంబర్ 5న ప్రయోగించింది.

విజయ సారథులు వీరే
Bavitha మంగళ్‌యాన్‌కు ఎం. అన్నాదురై ప్రోగ్రాం డెరైక్టర్‌గా వ్యవహరించారు. ఈయన గతంలో చంద్రయాన్-1కు డెరైక్టర్‌గా పని చేశారు. ప్రస్తుతం చంద్రయాన్-2కు కూడా అదే హోదాలో కొనసాగుతున్నారు. విక్రం సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డెరైక్టర్ ఎస్. రామకృష్ణ PSLV-C25 రాకెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. PSLV కార్యక్రమానికి ప్రాజెక్టు డెరైక్టరుగా పి.కున్హికృష్ణన్ వ్యవహరించారు. ఇక మంగళ్‌యాన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా ఎస్.అరుణన్ కీలకపాత్ర పోషించినవారు. కేవలం రూ. 450 కోట్ల స్వల్ప ఖర్చుతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప విషయం. అమెరికా సెప్టెంబరులోనే తలపెట్టిన మావెన్ ప్రయోగంలో ఇది పదో వంతు మాత్రమే. దీనిద్వారా ఇస్రో సామర్థ్యం ఏపాటిదో వేరే చెప్పనక్కర్లేదు. చైనా నిర్వహించిన చాంగే-1కు అయిన వ్యయంలో సగంతోనే చంద్రయాన్-1ను కూడా ఇస్రో దిగ్విజయం చేయడం తెలిసిన విషయమే. ఇప్పటికి ఇస్రో PSLV ద్వారా 40 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించి అంతరిక్ష వాణిజ్య రంగంలో తన కంటూ ప్రత్యేక స్థానాన్ని పొందింది.

అంత ఆసక్తి ఎందుకో?
గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై దృష్టి సారించి ఎన్నో పరిశోధనలను నిర్వ హిస్తున్నాయి. ఆసియాలో చైనా, జపాన్ కూడా ఈ తరహా శోధనలను చేపట్టాయి. అంగారక గ్రహ ంపై ఈ స్థాయిలో ఆసక్తి ఎందుకు? దీనిపై పలు అంశాలలో శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు. ఒకప్పుడు అంగారకునిపై జీవం ఉండేదా? ఉంటే ఇప్పుడు ఏమైంది? కొందరైతే జీవం అంగారకుడిపైనే ఆవిర్భవించిందని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడు మనిషి సౌర వ్యవస్థ ఆవల భూమి లాంటి గ్రహాన్ని గుర్తించినా దాన్ని చేరడం అసాధ్యం. కాబట్టి అంగారకుడిని మానవ, ఇతర జీవ నివాస యోగ్యంగా మార్చే ప్రయత్నమే సబబు అని గుర్తించి అరుణగ్రహంపై ఆసక్తిని చూపుతున్నారు. భవిష్యత్తులో ఈ గ్రహంపై శాశ్వత నివాస స్థావరాలను ఏర్పాటు చేయడంతోపాటు అనేక రకాల సాంకేతిక పరిశోధనలను నిర్వహించాలన్నది ప్రధాన లక్ష్యం. కాగా అంగారక గ్రహం తన వాతావరణాన్ని ఎందుకు కోల్పోతుందో తెలుసుకోవడంతోపాటు, జీవం ఉనికికి నిదర్శనంగా భావిస్తున్న మీథేన్‌ను గుర్తించడం ఇతర లక్ష్యాలు.

మామ్ పరికరాలు- విధులు
    Bavitha
  1. లైమన్ ఆల్ఫా ఫోటో మీటరు: అంగారకుని వాతావరణంలో డ్యుటీరియం, ప్రోటియం అనే హైడ్రోజన్ ఐసోటోపుల మధ్య నిష్పత్తిని పరిశీలిస్తుంది. అంగారకునిపై ఇది వరకు నీరు ఉందో ? లేదో? అనే అంశంపై అన్వేషిస్తుంది. అంతేకాక ఆ నీరు ఎలా అదృశ్యమైందో కూడా తెలియజేస్తుంది.
  2. మార్స్ కలర్ కెమెరా:అంగారక ఉపరితల నిర్మాణాన్ని చిత్రీకరిస్తుంది. అంగారక వాతావరణాన్ని తెలుసుకుంటుంది. అంగారక, చంద్రుల ఫోబోస్, డెమోస్‌లను పరిశోధిస్తుంది.
  3. థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రో మీటర్:ఇది అంగారక ఖనిజ సంపదను శోధిస్తుంది. అంగారకుని నుంచి వచ్చే ఉష్ణ ఉద్గారాలను లెక్కిస్తుంది. ఇది రాత్రి, పగలు పనిచేస్తుంది.
  4. మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్:అంగారక వాతావరణం, ఉపరితలంలో మీథేన్ ఉందో? లేదో? పరిశీలిస్తుంది. అంగారక వాతావరణంలోని బిలియన్ భాగాల్లో మీథేన్‌ను లెక్కిస్తుంది.
  5. మార్స్ ఎక్సో స్ఫెరిక్ న్యూట్రల్ అనలైజర్:అంగారక వాతావరణంలో తటస్థ కణాల సంఘటనాన్ని శోధిస్తుంది. ఇది ఒక క్వాడ్రాపుల్ మార్స్ స్పెక్ట్రోమీటర్.
మరిన్ని విజయాలు మన సొంతం కావాలి
రానున్న కాలంలో ఇస్రో మరిన్ని సంక్లిష్ట ప్రయోగాలను నిర్వహించనుంది. చంద్రయాన్-2లో భాగంగా చంద్రునిపైకి ఆర్బిటార్‌ను ప్రయోగించడంతో పాటు, చంద్రుని ఉపరితలంపైకి ల్యాండర్‌నూ ప్రయోగించనున్నాం. దీనికోసం మొదట రష్యాతో ఒప్పందం కుదుర్చుకొన్నా, 2013 జనవరిలో తానే స్వశక్తితో నిర్వహించాలని ఇస్రో సంకల్పించింది. అంతేకాదు.. 2020 నాటికి అంతరిక్షంలోకి, చంద్రునిపైకి భారతీయులను తీసుకెళ్లాలని లక్ష్యంతో ముందుకెళ్తుంది. అయితే మన అంతరిక్ష కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడంలో GSLV-MARK-III ప్రయోగం కీలకమైంది. ఇన్‌శాట్ ఉపగ్రహాల ప్రయోగానికి ఏరియెన్ లాంటి విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను GSLV-MARK-III తో అధిగమించి మరిన్ని మేలిమి విజయాలతో ప్రపంచ యవనికపై భారత కీర్తి వెలుగు లీనాలని ఆశిద్దాం.
Published date : 02 Oct 2014 06:11PM

Photo Stories