కమ్యూనికేషన్ ఉపగ్రహంజీశాట్-15
జీఎస్‌ఎల్‌వీ మార్క్-III
జీశాట్-15 బరువు 3164 కిలోలు. ఈ స్థాయి బరువున్న కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ మార్క్-I, మార్క్-II ప్రయోగించలేవు. ఈ ఉపగ్రహ నౌకల పేలోడ్ సామర్థ్యం తక్కువ. అందుకే ఈ ఉపగ్రహాలను ఏరియేన్ వంటి విదేశీ రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించింది. అయితే భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే వీలున్న సరికొత్త జీఎస్‌ఎల్‌వీ మార్క్-III అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. 4500- 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ఇది ప్రయోగించగలదు. జీఎస్‌ఎల్‌వీ మార్క్--IIIకు సంబంధించిన ఒక పరీక్ష ప్రయోగాన్ని ఇస్రో 2014, డిసెంబరు 18న విజయవంతంగా నిర్వహించింది. జీఎస్‌ఎల్‌వీ మార్క్-IIIను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే భారీ ఉపగ్రహాల కోసం విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా విదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను జీఎస్‌ఎల్‌వీ మార్క్-III ద్వారా ప్రయోగించేందుకు వీలవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో కొన్ని వేల కోట్ల టర్నోవరును ఉపగ్రహాల లాంచింగ్ మార్కెట్ నమోదు చేసుకుంటుంది. ఇప్పటికే ఇస్రో పీఎస్‌ఎల్‌వీ ద్వారా విజయవంతంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది.
ట్రాన్స్‌పాండర్స్
కమ్యూనికేషన్ ఉపగ్రహాలలోని ప్రత్యేక ఎలక్ట్రానిక్ పరికరాలను ట్రాన్స్‌పాండర్లు అని పిలుస్తారు. ఇందులో ఒక రిసీవర్, మాడ్యులేటర్, ట్రాన్స్‌మిటర్ ఉంటాయి. మొబైల్, ల్యాండ్‌లైన్, బ్రాడ్ బ్యాండ్ కమ్యూనికేషన్ రేడియో, టీవీ కార్యక్రమాల బ్రాడ్ క్యాస్టింగ్, డీటీహెచ్ సేవలు, వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ సేవల ప్రసారాలకు ట్రాన్స్‌పాండర్లు కీలకం. నేల నుంచి అప్‌లింక్ ద్వారా సమాచారాన్ని తీసుకొని, మళ్లీ నేలపై ఉన్న రిసీవర్‌లకు డౌన్‌లింక్‌ను ట్రాన్స్‌పాండర్లు నిర్వహిస్తాయి. ఒక అప్‌లింక్ పౌనఃపున్యం, ఒక డౌన్ లింక్ పౌనఃపున్యంను కలిపి బ్యాండ్ విడ్త్ అంటారు. పౌర అవసరాలకు సంబంధించి బ్యాండ్ విడ్త్‌ను వివిధ దేశాలకు టెలీకమ్యూనికేషన్స్ యూనియన్(జెనీవా, స్విట్జర్లాండ్) కేటాయించింది. సాధారణంగా ట్రాన్స్‌పాండర్లు ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్, కేయూ- బ్యాండ్, కేఏ బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లుగా ఉంటాయి. ఎస్-బ్యాండ్, సీ-బ్యాండ్ అల్ప బ్యాండ్ విడ్త్‌లో సేవలను అందించగా కేయూ-బ్యాండ్, కేఏ-బ్యాండ్ అధిక బ్యాండ్ విడ్త్‌లో సేవలను అందిస్తాయి.
ప్రధానాంశాలు
ఉపగ్రహ సర్వీసులు కమ్యూనికేషన్, శాటిలైట్ నేవిగేషన్
కక్ష్య | 93.50 తూర్పు రేఖాంశం (భూస్థిర కక్ష్య) |
ఉపగ్రహ జీవితకాలం | 12 ఏళ్లు |
లిఫ్ట్ ఆఫ్ మాస్ | 3164 కిలోలు |
డ్రై మాస్ | 1440 కిలోలు |
ప్రొపల్షన్ సిస్టం | బై ప్రొపల్లెంట్ |
టీటీసీ | సీ-బ్యాండ్ |
జీశాట్-15
జీశాట్-15లో మొత్తం 24 కమ్యూనికేషన్ ట్రాన్స్‌పాండర్లు ఉన్నాయి. ఇవన్నీ కేయూ-బ్యాండ్ ట్రాన్స్‌పాండర్లు. డెరైక్ట్ టు హోం(డీటీహెచ్) టెలివిజన్ సేవలు, టెలీ కమ్యూనికేషన్స్ వీశాట్(వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్) సేవలను మరింత విస్తరించడంలో జీశాట్-15 ఉపయోగపడుతుంది. ఇందులో ఒక కేయూ-బ్యాండ్ బీకన్ ఉంది. నేలపై ఉన్న యాంటెన్నాలు ఉపగ్రహం వైపు నిర్దిష్టంగా చూడడానికి ఈ బీకన్ ఉపయోగపడుతుంది. జీశాట్-15 ఉపగ్రహంలో గగన్ (GAGAN - GPS Aided Geo Augmented Navigation) పేలోడ్‌ను కూడా ప్రయోగించారు. దీనికి ముందు జీశాట్-8, జీశాట్-10లో రెండు సార్లు గగన్ పేలోడ్‌ను ఇస్రో ప్రయోగించింది. జీశాట్-15 జీవితకాలం 12 ఏళ్లు.
గగన్
ఉపగ్రహ ఆధారిత విమానయానం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), అంతరిక్ష విభాగం సంయుక్తంగా గగన్‌ను నిర్మించాయి. గత కొన్నేళ్లుగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ భారత్‌ను ఉపగ్రహ ఆధారిత విమానయాన వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. గ్రౌండ్ ఆధారిత నావిగేషన్ కంటే ఉపగ్రహ ఆధారిత విమానయానం ద్వారా ఇంధన వ్యయం తగ్గుతుంది. టేక్ ఆఫ్, ల్యాండింగ్ ప్రమాదాలను అరికట్టవచ్చు. ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణ సమర్థవంతంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే తొలి గగన్ పేలోడ్‌ను జీశాట్-8లో, ఆ తర్వాత జీశాట్-10లో ఇస్రో ప్రయోగించింది. ఇప్పుడు మూడో సారి జీశాట్-15లో ప్రయోగించింది. గగన్‌లో ప్రత్యేక శాటిలైట్ బేస్డ్ ఆగ్‌మెంటేషన్ సిస్టం(ఎస్‌బీఏఎస్) వ్యవస్థ ఉంటుంది. ఇది ఎల్1, ఎల్5 బ్యాండ్‌తో పనిచేస్తుంది. గగన్ సేవలను కేంద్ర విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు ఈ ఏడాది జూలై 13న ప్రారంభించారు. భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా వరకు గగన్ సేవలు విస్తరించి ఉన్నాయి.
- భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించే వీలున్న సరికొత్త జీఎస్‌ఎల్‌వీ మార్క్-III అనే నౌకను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. 4500- 5000 కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ఇది ప్రయోగించగలదు.
- డెరైక్ట్ టు హోం(డీటీహెచ్) టెలివిజన్ సేవలు, టెలీ కమ్యూనికేషన్స్ వీశాట్(వెరీ స్మాల్ అపర్చర్ టెర్మినల్) సేవలను మరింత విస్తరించడంలో జీశాట్-15 ఉపయోగపడుతుంది.
- జీఎస్‌ఎల్‌వీ మార్క్-IIIను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే భారీ ఉపగ్రహాల కోసం విదేశీ రాకెట్లపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
- ఉపగ్రహ ఆధారిత విమానయానం కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), అంతరిక్ష విభాగం సంయుక్తంగా గగన్‌ను నిర్మించాయి.
- భారత్, ఆగ్నేయాసియా, ఆఫ్రికా వరకు గగన్ సేవలు విస్తరించి ఉన్నాయి.
ఇస్రో ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు
వాహక నౌక | ఉపగ్రహం | ప్రయోగ తేదీ |
డెల్టా | ఇన్‌శాట్-1ఏ | ఏప్రిల్ 10, 1982 |
పామ్-డి షటిల్ | ఇన్‌శాట్-1బీ | ఆగస్టు 30, 1983 |
ఏరియేన్-3 | ఇన్‌శాట్-1సీ | జూలై 21, 1988 |
డెల్టా 4925 | ఇన్‌శాట్-1డీ | జూన్ 12, 1990 |
ఏరియేన్-4 | ఇన్‌శాట్-2ఏ | జూలై 10, 1992 |
ఏరియేన్-4 | ఇన్‌శాట్-2బీ | జూలై 23, 1993 |
ఏరియేన్-4 | ఇన్‌శాట్-2సీ | డిసెంబర్ 07, 1995 |
ఏరియేన్-4 | ఇన్‌శాట్-2డీ | జూన్ 04, 1997 |
ఏరియేన్-44 ఎల్‌హెచ్10 | ఇన్‌శాట్-2డీటీ | జనవరి 01, 1998 |
ఏరియేన్-42పీ | ఇన్‌శాట్-2ఈ | ఏప్రిల్ 03, 1999 |
ఏరియేన్5-జీ | ఇన్‌శాట్-3బీ | మార్చి 22, 2000 |
జీఎస్‌ఎల్‌వీ-డీ1 | జీశాట్-1 | ఏప్రిల్ 18, 2001 |
ఏరియేన్5-వీ147 | ఇన్‌శాట్-3సీ | జనవరి 24, 2002 |
పీఎస్‌ఎల్‌వీ-సీ4 | కల్పన-1 | సెప్టెంబర్ 12, 2002 |
ఏరియేన్5-వీ160 | ఇన్‌శాట్-3ఏ | ఏప్రిల్ 10, 2003 |
జీఎస్‌ఎల్‌వీ-డీ2 | జీశాట్-2 | మే 08, 2003 |
ఏరియేన్5-వీ162 | ఇన్‌శాట్-3ఈ | సెప్టెంబర్ 28, 2003 |
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ఓ1 | ఎడ్యుశాట్ | సెప్టెంబర్ 20, 2004 |
ఏరియేన్5-వీ169 | ఇన్‌శాట్-4ఏ | డిసెంబర్ 22, 2005 |
ఏరియేన్-5 | ఇన్‌శాట్-4బీ | మార్చి 12, 2007 |
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌ఓ4 | ఇన్‌శాట్-4సీఆర్ | సెప్టెంబర్ 02, 2007 |
ఏరియేన్-5వీఏ 202 | జీశాట్-8 | మే 21, 2011 |
పీఎస్‌ఎల్‌వీ-సీ17 | జీశాట్-12 | జూలై 15, 2011 |
ఏరియేన్-5వీఏ-209 | జీశాట్-10 | సెప్టెంబర్ 29, 2012 |
ఏరియేన్-5వీఏ-214 | ఇన్‌శాట్-3డి | జూలై 26, 2013 |
ఏరియేన్-5వీఏ-215 | జీశాట్-7 | ఆగస్టు 30, 2013 |
జీఎస్‌ఎల్‌వీ-డీ5 | జీశాట్-14 | జనవరి 05, 2014 |
ఏరియేన్-5వీఏ 221 | జీశాట్-16 | డిసెంబర్ 07, 2014 |
జీఎస్‌ఎల్‌వీ-డీ6 | జీశాట్-6 | ఆగస్టు 27, 2015 |
ఏరియేన్-5వీఏ 227 | జీశాట్-15 | నవంబర్ 11, 2015 |