Skip to main content

ఇస్రో మిషన్: చంద్రయాన్-2

చంద్రునిపై మనిషి ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి కావల్సిన వాతావరణ పరిస్థితులు, అక్కడి స్థితిగతులు, వనరులు, ఖనిజ నిక్షేపాలు నీరు.. వంటి విషయాలపై అధ్యయనం చేయడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగమే చంద్రయాన్-2. అయితే నీరు ధ్రువప్రాంతాల్లో అధికంగా ఉంటుందనే భావనతో చంద్రయాన్-2ను చంద్రుని దక్షిణధ్రువంపైకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపారు.
చంద్రయాన్-1 ద్వారా చంద్రునిపై నీటి ఉనికిని కనుగొంటే చంద్రయాన్-2 దానికి కొనసాగింపుగా అంటే ధ్రువ ప్రాంతాల్లో మంచురూపంలో ఉండే నీటిపై, చంద్రుని లోపలి పొరల్లో నీటి జాడపై పరిశోధన చేస్తుందన్నమాట.

చంద్రయాన్-1 ఏం చేసింది?
భారత్ గతంలో చంద్రుడి పైకి చేసిన చంద్రయాన్-1 ప్రయోగం విజయంతమైంది. భారతదేశం నుంచి చంద్రుడిపైకి వెళ్లిన మొదటి అంతరిక్ష వాహనం అది. చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్-1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్-1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ-సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది.నిజానికి చంద్రయాన్-1ను రెండేళ్లు పనిచేసేలా రూపొందించారు. కానీ పది నెలల తర్వాత అంటే 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. అందులో పరికరాలు విఫలమయ్యాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్-1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్-1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్-1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టైుున్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. ఇక చంద్రయాన్-1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్-2’ ప్రయోగాన్ని తలపెట్టింది.

చంద్రయాన్ -2 ప్రయోగం ఇలా..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-2 (మొత్తం బరువు 3,447 కేజీలు లేదా 3.8 టన్నుల బరువు) ప్రాజెక్టులో భాగంగాపూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1 రాకెట్ ద్వారా ‘త్రీ-ఇన్-వన్‌గా చెప్పకునే ఆర్బిటర్, ల్యాండర్ (విక్రమ్), రోవర్ (ప్రజ్ఞాన్) కాంపోజిట్ ఎర్త్‌స్టాక్ (పీఈఎస్)ను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి 2019, జులై 22న జాబిల్లి దక్షిణ ధ్రువం మీదకు పంపించారు. భూమికి దగ్గరగా (పెరిజీ) 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 38,000 కిలోమీటర్లు ఎత్తులో హైలీ ఎసిన్‌ట్రిక్ ఆర్బిట్ (అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి ప్రవేశపెడుతుంది. ఈ ప్రయోగం జరిగిన 16 రోజుల్లో అపోజిని 38,000 కిలోమీటర్లు నుంచి 1,41,000 పెంచేందుకు ఆర్బిటర్‌ను మండించి పెంచే ప్రక్రియను చేపట్టారు. ఐదోసారి ఆర్బిటర్‌కు ట్రాన్‌‌స లూ నార్ ఇంజెక్షన్ ద్వారా చంద్రుడివైపు ప్రయాణం చేసేందుకు మళ్లించారు. తదనంతరం చంద్రుని చుట్టూ కక్ష్య ఏర్పరిచేందుకు చంద్రునికి చుట్టూరా రెట్రోబర్న్ చేసి వంద కిలోమీటర్లు వ ృత్తాకార కక్ష్యను తగ్గించడానికి నాలుగుసార్లు ఆపరేషన్ చేపట్టారు. 100 కిలోమీటర్లు నుంచి 30 కిలోమీటర్లు ఎత్తుకు తగ్గించుకుంటూ ఆర్బిటర్‌ను మండించారు. ఆ తరువాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయి చంద్రుడి మీదకు ప్రయాణం చేసింది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండర్ మృదువైన ప్రదేశంలో నెమ్మదిగా దిగాలి. కానీ అలా జరగలేదు...

చివరి నిముషంలో.. భూమితో పోలిస్తే జాబిల్లిపై గురుత్వ శక్తి మూడొంతులే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో జాబిల్లి గురుత్వశక్తి ప్రభావానికి గురైన వెంటనే వేగంగా జారిపడిపోవడం మొదలవుతుంది. గాలి కూడా ఉండదు కాబట్టి.. పతనాన్ని నిరోధించే అవకాశం ఉండదు. గాలి లేకుండా ప్యారాచూట్స్ పనిచేయవు. ఇన్ని ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ నాలుగు మోటార్ల సాయంతోనే వేగాన్ని నియంత్రించుకుంటూ గంటకు 3.6 కిలోమీటర్లు లేదా అంతకంటే తక్కువ వేగంతో దిగాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల మధ్య చివరి నిముషంలో సరిగ్గా చంద్రుని ఉపరితలానికి 2.1 కి.మీ. దూరంలో ల్యాండర్ సిగ్నల్స్ కోల్పోవడంతో సాఫ్ట్ ల్యాండ్ కాకుండా హార్డ్ ల్యాండ్ ద్వారా చంద్రుని ఉపరితలాన్ని చేరడంతో ప్రయోగంలో అత్యంత కీలకమైన రోవర్ పరిశోధన ఇలా అర్ధాంతరంగా ముగిసింది. దీనితో ల్యాండర్ ప్రయోగం విఫలం అయింది. ఇక ఆర్బిటర్ విజయవంతంగా దానిపని అది చేయడంలో సఫమైందని చెప్పవచ్చు.

చంద్రయాన్ -2లోని పరికరాలు:
చంద్రయాన్ -2తో మొదటి ప్రయత్నంలోనే జాబిల్లి దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి దేశంగా భారత్ చరిత్రలో నిలిచిపోయింది. అంతేకాకుండా జాబిల్లిపైకి ల్యాండర్‌ను పంపిన నాలుగో దేశంగానూ రికార్డుల్లోకి ఎక్కుతుంది. ఇతర గ్రహాలపై సాఫ్ట్‌ల్యాండింగ్‌కు ప్రయత్నించడం ఇస్రోకు ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపారు.
  • ఆర్బిటర్ ఏం చేస్తుంది?
    చంద్రయాన్-2 ప్రయోగంలో భాగంగా చంద్రుడి చుట్టూ తిరిగే ఆర్బిటర్ బరువు 2,379 కిలోలు. ఇది సొంతంగా దాదాపుగ వెయి్య వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటుంది. చంద్రుడి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల ఎత్తులో చక్కర్లు కొడుతూ జాబిల్లిలోని ఖనిజాలు, ఇతర వనరులపై పరిశీలనలు జరుపుతుంది. మొత్తం 8 శాస్త్రీయ పరికరాలు కలిగి ఉన్న ఆర్బిటర్ జాబిల్లి ఉపరితలం మ్యాపులు (ఫొటోలు) సిద్ధం చేస్తుంది. సూర్యుడి నుంచి ఎక్స్‌రే ఉద్గారాలను పరిశీలిస్తుంది. చంద్రుని పై పొర మందాన్ని కొలుస్తుంది. అంతేకాకుండా అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఆర్బిటర్‌లో హై క్వాలిటీ కెమెరా ఒకటి ఉంది. చంద్రుడి మీది పలుచటి వాతావరణాన్ని విశ్లేషించే ఒక పరికరం కూడా ఉంది.భూకంపాల మాదిరిగానే చంద్రుడి మీద కూడా చంద్రకంపాలు వస్తుంటాయి. భూకేంద్రంతో, ల్యాండర్‌తో కమ్యూనికేషన్లు సాగిస్తుంది. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దీన్ని రూపొందించింది. చంద్రున్ని ల్యాండర్ పూర్తిగా పరిశీలించలేదు. మామూలుగా అయితే ఆర్బిటర్ జీవితకాలం 12 నెలలుకాగా, వాహకనౌకను అత్యంత కచ్చితత్వంతో ప్రయోగించడం, మిషన్ నిర్వహణ పద్ధతుల కారణంగా ఆర్బిటర్ జీవితకాలం 7 సంవత్సరాలు పెరిగింది.
  • విక్రమ్ ఏం చేస్తుంది?
    చంద్రయాన్-2 ద్వారా జాబిల్లిపైకి దిగే ల్యాండర్ పేరు ‘విక్రమ్’. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ స్మారకార్థం ల్యాండర్‌కు ఈ పేరు పెట్టారు. ఇది దాదాపు 1,471 కిలోల బరువుంటుంది. 27 కిలోల బరువున్న ప్రజ్ఞాన్ సౌరశక్తి సాయంతో 500 మీటర్ల దూరం ప్రయాణిస్తుంది. విక్రమ్‌లో మూడు పరికరాలున్నాయి. వీటి సాయంతో అది జాబిల్లి ఉపరితలంతోపాటు..లోపల ఉన్న మూలకాలపై కొన్ని పరిశోధనలు చూపడుతుంది. చంద్రుని ఉపరితలాన్ని స్కాన్ చేస్తుంది. అక్కడి ఉష్ణోగ్రతల్లోని వెరుద్యాలకు కారణాలను విశ్లేషిస్తుంది. ఇది 14 రోజుల (ఒక లూనార్ రోజు) పాటు పనిచేస్తుంది. ఇది ఆర్బిటర్‌తో, రోవర్‌తో, ఇండియన్ డీస్‌స్పేస్ నెట్‌వర్క్‌తో కమ్యూనికేషన్ జరుపుతుంది. విక్రమ్ ద్వారా రోవర్ యంత్రాన్ని చంద్రుని ఉపరితలం మీదకు సాఫ్ట్‌ల్యాండ్ పద్ధతిలో దించుతుంది. కాబట్టి
    రోవర్ సాఫ్ట్‌ల్యాండ్ అవ్వడంలో కీలక పాత్ర దీనిదే.
  • ప్రజ్ఞాన్ ఏం చేస్తుంది?
    ఆరు చక్రాలుండే రోవర్ పేరు ప్రజ్ఞాన్. 27 కిలోల బరువుంటుంది. ఇది సెకనుకు ఒక సెంటీమీటరు మాత్రమే సంచరిస్తూ ఉంటుంది. చంద్రుడి ఉపరితలంపై అడుగిడిన దగ్గరి నుంచి సౌర శక్తి సాయంతో 500 మీటర్ల మేర ప్రయాణించగలదు. ఇది ఎక్స్‌రే కిరణాలను ప్రసారం చేస్తూ చంద్రుడి ఉపరితలంపై ఏయే మూలకాలుఎక్కువగా ఉన్నాయో చెబుతుంటుంది. రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, నీటి అణువుల గురించితెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టైుున్ మ్యాపింగ్ కెమెరా-2 (టీఎంసీ-2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ-సార్) పరికరాలు చంద్రయాన్-1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ-2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ-సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. ల్యాండర్‌తో కమ్యూనికేషన్ జరుపుతుంది. ఇది కూడా 14 రోజుల పాటు పనిచేస్తుంది.

ఒకవేళ సాఫ్ట్ ల్యాండింగ్ జరిగి ఉంటే..
చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ మృదువైన చోట ల్యాండ్ అయిన తరువాత రోవర్ లోపల ఉండే తలుపు తెరుచుకునే విధంగా ఇస్రో శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుడి ఉపరితలంపై రావడానికి సుమారు నాలుగు గంటల సమయాన్ని తీసుకుని మరీ బయటకు వస్తుంది. రోవర్ సెకెన్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. ఈ 14 రోజుల్లో 500 మీటర్లు దూరం ప్రయాణించి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ఉండే ఈ రోబో మూలాలను పరిశోధించి భూ నియంత్రిత కేంద్రానికి సమాచారాన్ని చేరవేస్తుంది. ఈ రోవర్‌లో రెండు పరికరాలు ఉంటాయి. ల్యాండైన ప్రాంతం నుంచి ప్రయాణిస్తూ.. అక్కడి మట్టిని పరిశీలిస్తుంది. ఏయే మూలకాలు ఎంత ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తుంది. దక్షిణ ధృవం వద్ద సూర్యరశ్మి ఉండే 14 రోజుల పాటు ఈ రోవర్ పనిచేసేలా డిజైన్ చేశారు. ఇలా రియల్ టైమ్‌లో అంతరిక్ష నౌక ల్యాండింగ్ ఏ దేశమూ ఇప్పటివరకూ చేపట్టలేదు. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. విక్రమ్‌లోని కెమెరాలు, దూరాన్ని కొలిచే లేజర్ పరికరాలు, కంప్యూటర్లు, భూమ్మీది శాస్త్రవేత్తలు అత్యంత కచ్చితత్వంతో, సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది. ప్రయోగాలన్నింటినీ పూర్తి చేసి 2022 లోగా చంద్రునిపైకి మానవుడిని పంపాలని ఇస్రో భావించింది. అంతేకాకుండా ఈ ప్రయోగానికి కేవలం రూ. 978 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి.

విజయవంతంగా ప్రయోగం..
విజ్ఞానశాస్త్రంలో వైఫల్యాలుండవు. ప్రయత్నాలు, ప్రయోగాలు మాత్రమే ఉంటాయి. కాబట్టి విక్రమ్‌ను కోల్పోయినంత మాత్రన ప్రయోగం విఫలమైనట్టు కాదు. చంద్రయాన్-2లో మొత్తం 13 పరిశోధన పరికరాలు ఉండగా..వాటిలో 8 ఆర్బిటర్‌లోనే ఉన్నాయి. ల్యాండర్‌లో 3, రోవర్‌లో 2 ఉన్నాయి. అయిలే ఆర్బిటర్ చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తోంది. అక్కడ అది రిమోట్ సెన్సింగ్ పరిశీలనలు, ఫొటోలు తీయడం, అక్కడి బాహ్యవాతావరణాన్ని పరిశీలించడం, నీరు, ఖనిజాల జాడను తెలుసుకోవడం వంటివి చేస్తుంది. 95 శాతం పరిశోధన వీటి ద్వారానే సాగుతుంది. విక్రమ్, ప్రజ్ఞాన్‌ల విషయంలో 5 శాతం మాత్రమే విఫలమైంది. అయితే ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో భారత్ నాలుగోదేశంగా ఖ్యాతి గడించనుంది. ఇప్పటి దాకా రష్యా, అమెరికా, చైనాకు చెందిన అంతరిక్ష సంస్థలు మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రయాన్-1 పేరుతో ఉపగ్రహాన్ని చంద్రుడికి చుట్టూ పరిభ్రమించేలా చేసిన మొట్ట మొదటి దేశంగా భారత్‌కు పేరుంది. ఇప్పుడు చంద్రయాన్-2 పేరుతో ఆర్బిటర్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను పంపించే నాలుగోదేశంగా అవతరించనుంది.

చంద్రయాన్ ప్రస్థానం ఇలా..
జూలై 15: తెల్లవారుజామున 2:30 గంటలకు ఇస్రో చంద్రయాన్-2 మిషన్‌ను ప్రయోగించాల్సి ఉండగా.. సరిగ్గా 56 నిమిషాల ముందు సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయోగాన్ని నిలిపివేసినట్లు ఇస్రో ప్రకటించింది.
జులై 22: జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా చంద్రయాన్-2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది.
జూలై 24: భూమి చుట్టూ తిరిగే కక్ష్య దూరం తొలిసారి పెంపు. అతిదగ్గరగా 230 బై 45,163 కిలో మీటర్లతో కక్ష్య
జూలై 26: రెండోసారి కక్ష్య దూరం పెంపు. ఈ సారి అతిదగ్గరగా 251 బై 54,829 కిలోమీటర్లతో కక్ష్య
జూలై 29: మూడోసారి కక్ష్య దూరం పెంపు. చోదక వ్యవస్థలను సుమారు 989 సెకన్లు వాడుకుంటూ.. భూమికి అతిదగ్గరగా 276 బై 71,792 కిలోమీటర్లతో కక్ష్య.
ఆగస్టు 2: నాలుగో కక్ష్య పెంపు ప్రయోగం విజయవంతం. భూమికి 277 బై 89,472 కిలోమీటర్ల దూరంగా కొత్త కక్ష్య మార్గం.
ఆగస్టు 6: చివరి భూ కక్ష్య పెంపు పూర్తి. చోదక వ్యవస్థలను ఉపయోగించుకుని భూమికి దగ్గరగా 276 బై 1,42,975 కి.మీ. కక్ష్య.
ఆగస్టు 14: సుమారు 5 సార్లు భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన తరువాత చంద్రయాన్-2 భూ కక్ష్యను దాటి జాబిల్లివైపు ప్రయాణం ప్రారంభించింది. ఆరోసారి లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ నౌకను ప్రవేశపెట్టారు.
ఆగస్టు 20: భూ కక్ష్యనుంచి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది.
కక్ష్య తగ్గింపు
ఆగస్టు 20: ఇప్పటి వరకూ లూనార్ ట్రాన్స్‌ఫర్‌లో తిరుగుతున్న చంద్రయాన్-2 నౌక లూనార్ ఆర్బిట్‌లో అంటే చంద్రుడికి దగ్గరగా 114 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 18,072 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘచతురస్రాకారంలో కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రక్రియను బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఈ కక్ష్యదూరాన్ని పెంచే ప్రక్రియను చేపట్టారు. చంద్రయాన్-2 మిషన్ భూమధ్యంతర కక్ష్యలో ఉన్నప్పుడు కక్ష్య దూరాన్ని పెంచుకుంటూ పోతే, లూనార్ ఆర్బిట్‌లో ప్రవేశించాక కక్ష్య దూరాన్ని తగ్గించుకుంటూ రావడం ఈ ప్రయోగంలో విశేషం.
ఆగస్టు 21: జాబిల్లి చుట్టూ తిరుగుతున్న కక్ష్య దూరం తగ్గింపు. అతిదగ్గరి దూరం 118 బై 4,412 కిలోమీటర్లకు తగ్గింపు. అదే రోజు చంద్రయాన్-2 తొలిసారిగా చంద్రుని ఫొటోలు తీసింది.
ఆగస్ట్ 26: చంద్రయాన్- 2 మిషన్‌లో భాగంగా ఆర్బిటర్‌కు అమర్చిన టెరియన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ- 2) మరోమారు చంద్రుడిని ఫొటోలు తీయగా వాటిని ఇస్రో విడుదల చేసింది.
ఆగస్టు 28: మూడో కక్ష్య కుదింపు ప్రక్రియ విజయవంతం. తాజా కక్ష్య మార్గం అతి దగ్గరగా 179 బై 1,412 కి.మీలు.
ఆగస్టు 30: నాలుగో కక్ష్య కుదింపు ప్రక్రియ. చోదక వ్యవస్థలను 1,155 సెకన్ల సేపు వాడుకుని కక్ష్య మార్గాన్ని 124 బై 164 కిలోమీటర్లకు కుదించారు.
సెప్టెంబర్ 2: ఆర్బిటర్ నుంచి విజయవంతంగా వేరుపడిన ల్యాండర్ విక్రమ్. జాబిల్లి చుట్టూ 119 బై 127 కిలోమీటర్ల కక్ష్యలో విక్రమ్ భ్రమణం. ల్యాండర్ కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రునిపై దిగడం దీని అంతిమ లక్ష్యం.
సెప్టెంబర్ 3: ఆర్బిటర్ కక్ష్య సవరణ ప్రక్రియ మొదలు. 4 సెకన్ల పాటు ఇంజన్లను వాడుకోవడం ద్వారా విక్రమ్ కక్ష్యను 104 బై 128 కిలోమీటర్లుగా మార్పు.
సెప్టెంబర్ 4: విక్రమ్‌ను జాబిల్లికి మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నం సక్సెస్. తాజాగా విక్రమ్ కక్ష్య 35 బై 101 కిలోమీటర్లు. మరోవైపు.. ల్యాండర్‌ను వదిలిపెట్టిన ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో చంద్రుడికి దగ్గరగా 96 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 125 కిలోమీటర్లు ఎత్తులోవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ల్యాండర్ కదలికలను తెలియజేసే పనిలో నిమగ్నమై ఉంది.
సెప్టెంబర్ 7: అంతా అనుకున్నట్టు జరిగితే మరి ట్విస్ట్‌లు కూడా ఉండొద్దు. అందుకేనేమో సెస్టెంబర్ 7 (శుక్రవారం) అర్ధరాత్రి దాటాక 1:38 గంటలకు ల్యాండర్ 30 కి.మీ. దూరంలో ఉందని కౌంట్‌డౌన్ పూర్తయి విక్రమ్ కక్ష్య నుంచి దిగుతూ చంద్రుని వైపు 1630 కి.మీ. వేగంతో దూసుకెళ్లింది. కొన్ని క్షణాల అనంతరం ల్యాండర్‌లోని ఇంజిన్లను మండించి వేగాన్ని భారీగా తగ్గించారు. రఫ్ బ్రేకింగ్ ప్రక్రియ పూర్తయిన త ర్వాత ఫైన్ బ్రేకింగ్ ఫేస్ ప్రారంభమైంది (విక్రమ్‌లో అటానమస్ ల్యాండింగ్ సిస్టమ్ అంటే దానంతట అదే అనువైన చోట ల్యాండయ్యే విధానం ఉంది). కేవలం చంద్రుని చేరడానికి 2.1 కి.మీ. ఉందనగా ల్యాండర్ నుంచి సంకేతాలు భూకేంద్రానికి సంకేతాలు స్తంభించాయి. విక్రమ్‌లో అటానమస్ ల్యాండింగ్ సిస్టమ్, సమాచార వ్యవస్థలు సమన్వయం కలిగి ఉంటాయి. దీనితో ఇస్రో శాస్త్రవేత్తలకు ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. జాబిల్లి దిశగా 48 రోజుల అద్భుత ప్రయాణం తార్వాత తుది దశలో విఫలం అయింది. జాబిల్లిపై ఇస్రో సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగం చేయడం ఇదే తొలిసారి.
సెప్టెంబర్ 8: విక్రమ్‌కు కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయిన తర్వాత చందమామ కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌కు అమర్చిన కెమెరాలు ‘విక్రమ్’కు సంబంధించిన థర్మల్ ఇమేజ్‌లను చిత్రీకరించింది.
సెప్టెంబర్ 9: ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని, ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని, విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నట్టు ఇస్రో ప్రకటన.
సెప్టెంబర్ 21: చంద్రయాన్-2లో అమర్చిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలుపునరుద్ధరించలేకపోయామని, ఆర్బిటర్ మాత్రం చాలా బాగా పని చేస్తోందని, చంద్రయాన్-2 ఫలితం ప్రభావం గగన్‌యాన్ ప్రయోగంపై ఉండబోదని స్పష్టం చేసిన ఇస్రో చైర్మాన్ శివన్.
అక్టోబర్ 14: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్ధ (నాసా)కు చెందిన లూనార్ రికానోయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్వో) చంద్రయాన్ - 2 లోని విక్రమ్ లాండర్ జాడను గుర్తించేందుకు, ల్యాండర్ దిగినట్టుగా భావిస్తున్న ప్రాంతాన్ని ఫొటోలు తీసింది. కానీ ఆ ఫొటోల్లో ల్యాండర్ జాడను నాసా గుర్తించలేక పోయింది.
అక్టోబర్ 23: చంద్రుని కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్ పరిశోధనలు ప్రారంభించింది. చంద్రునిపై ఉన్న బిలాలు, ఉల్కల తాకిడికి సంబంధించిన గుర్తులతోపాటు వీటి ప్రభావంతో ఏర్పడే గోతుల ఫొటోలను ఆర్బిటర్‌లోని డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ (డీఎఫ్- సార్) అందించింది. ఇవి చంద్రుడి వాతావరణ, భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి.

నోట్:
కక్ష్యా అంటే?
ఖగోళ వస్తువుల చలనానికి ఒక నిర్దిష్ట మార్గం ఉంటుంది. దీన్నే కక్ష్యా అంటారు. ఒక్కోసారి ఇవి కోడిగుడ్డు ఆకారంలో కూడా ఉంటాయి. ఈ మార్గంలో ఖగోళవస్తువుకు అత్యంత దగ్గరగా ఒక బిందువు, అత్యంత దూరంగా ఒక బిందువు ఉంటాయి. ఈ బిందువుల మధ్య దూరాన్ని కి.మీ.లలో కొలుస్తారు. చంద్రయాన్-2 వ్యోమనౌక మొదట భూ కక్ష్యలో తిరిగి, తర్వాత చంద్రుని చుట్టూ తిరుగుతూ క్రమంగా కక్ష్య దూరాన్ని తగ్గించడం ద్వారా అది చంద్రునికి సమీపంగా వెళ్లింది.

మీకు తెలుసా!
భూమి-చంద్రుడి మధ్య సరాసరి దూరం: 3,84,000 కి.మీ.
భూమి పరిమాణంలో చంద్రుని పరిమాణం: 27 శాతం.
చంద్రుడి వ్యాసం: 3475 కి.మీ.
చంద్రుడి బరువు: 81 మిలియన్ బిలియన్ టన్నులు
చండ్రుని రాత్రి ఉష్ణోగ్రత: -180 డిగ్రీల సెల్సియస్
చంద్రుని పగటి ఉష్ణోగ్రత: 130 డిగ్రీల సెల్సియస్
చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి మానవుడు: అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (నాసా)
చంద్రునిపై వేసిన తొలి పంట: చైనా పత్తి విత్తనాలు మొలకెత్తించింది (అత్యల్ప ఉష్ణోగ్రత వల్ల చనిపోయాయి).

దక్షిణ ధృవం ప్రత్యేకత?
అమెరికా, రష్యాతో పాటు చైనా కూడా ఇప్పటికే చందమామపై అనేక ప్రయోగాలు చేపట్టింది. అయితే చంద్రగ్రహ మధ్యరేఖకు కొంచెం అటు ఇటు మాత్రమే ప్రయోగాలు చేశాయి. సూర్యరశ్మి బాగా ఉంటుంది కాబట్టి పరికరాలకు అవసరమైన విద్యుత్తు తయారు చేసుకోవడం సులువు కాబట్టి.. అందరూ ఈ ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. కానీ.. ఇస్రో ల్యాండర్ దిగిన దక్షిణ ధృవ ప్రాంతం మాత్రం వీటన్నింటికంటే భిన్నమైంది. 50 ఏళ్ల జాబిల్లి యాత్రలో ఇప్పటివరకు ఎవరూ కాలు పెట్టని, పరిశీలనలు జరపని ప్రాంతాల్లో ఇది ఒకటి. భూమి నుంచి విడిపోయేటప్పటి శిలాజాలు ఈ ప్రాంతంలో చెక్కు చెదరకుండా ఉండే అవకాశముంది. చంద్రయాన్ -1 ద్వారా జాబిల్లిపై నీరు ఉన్న విషయం స్పష్టమైంది. చంద్రయాన్-2 ద్వారా ఎంతమేర నీరు ఉందో తెలిసే అవకాశముంది. అమెరికాకు చెందిన అపోలో-16, సర్వేయర్-7లు మాత్రమే ఇప్పటివరకూ ఎగువ మైదాన ప్రాంతాల్లో దిగాయి. మిగతా వ్యోమనౌకలన్నీ చీకటిమయంగా ఉండే, నున్నగా ఉండే లావా మైదాన ప్రాంతాల్లో కాలుమోపాయి. చంద్రయాన్-2 కాలుమోపుతున్న దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలో వ్యోమనౌకలేవీ ఇప్పటివరకూ దిగలేదు. చంద్రయాన్-2 ల్యాండింగ్‌తో చంద్రుడి దక్షిణధ్రువంపై వ్యోమనౌకను దించిన తొలిదేశంగా భారతదేశం నిలుస్తోంది.
Published date : 09 Sep 2019 08:51PM

Photo Stories