Skip to main content

దిక్సూచిలో మూడో అడుగు... పీఎస్‌ఎల్‌వీ-సీ26

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌లోని మూడోదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సిని విజయవంతంగా రోదసిలోకి పంపింది.. తద్వారా జీపీఎస్ తరహా వ్యవస్థను సొంతంగా ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకు వేసింది...

పూర్తి స్థాయి స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన.. పీఎస్‌ఎల్‌వీ-సీ 26 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV- C26) ప్రయోగం విజయవంతమైంది. 1,425 కిలోల బరువు గల ఇండియన్ రీజియనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1సి (IRNSS-1C) ఉపగ్రహన్ని నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 26 రాకెట్ సాయంతో ఇస్రో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.

పాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ:
ప్రాంతీయ దిక్సూచి శాటిలైట్ వ్యవస్థ కలను సాకారం చేసేందుకు ఉద్దేశించింది.. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్. దీనిలో మొత్తం 7 ఉపగ్రహాలు ఉంటాయి. ఇస్రో ఇప్పటివరకు మూడు ఉపగ్రహాలను ప్రయోగించింది. వీటిలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి మూడోది. దీన్ని 67 గంటల కౌంట్‌డౌన్ అనంతరం అక్టోబరు 16న అర్ధరాత్రి దాటాక గం. 1.32 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సీ 26 ప్రయోగించారు. లిఫ్ట్ ఆఫ్ సమయంలో పీఎస్‌ఎల్‌వీ-సీ26 బరువు సుమారు 320 టన్నులు. లిఫ్ట్ ఆఫ్ జరిగిన 20.18 నిమిషాల అనంతరం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని 282.56 కిలోమీటర్ల పెరెజీ ఁ 20,670 కిలో మీటర్ల అపోజీ ఉన్న భూ స్థిర కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ 26 రాకెట్ ప్రవేశపెట్టింది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగం నిర్వహించడం ఇది రెండోసారి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ ఉపగ్రహాన్ని ఇదే విధంగా 2013, జూలై 1న ఇస్రో పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ప్రయోగించింది. ఈ విధంగా ఇప్పటివరకు మూడు ఉపగ్రహాల(ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1ఎ, 1బి, 1సి)ను ఇస్రో నావిగేషన్ వ్యవస్థలో భాగంగా ప్రయోగించింది. భారత్‌కు చెందిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థలో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ప్రయోగించే అవకాశం ఉంది. భారత ప్రధాన భూభాగంతో పాటు, ప్రధాన భూభాగం సరిహద్దుల నుంచి 1500 కిలోమీటర్ల పరిధి వరకు దీని కవరేజీ ఉంటుంది. 2015-16 నాటికి ఈ వ్యవస్థను పూర్తిచేయాలని ఇస్రో భావిస్తోంది.

జీపీఎస్ ఆవిర్భావం వెనుక:
దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ ఉపగ్రహాలతో పలు ప్రయోజనాలు ఉన్నాయి. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను తొలిసారిగా 1973లో అమెరికా రక్షణ విభాగం అభివృద్ధి చేసింది. ఉపగ్రహం ఆధారంగా సైనికులు, రవాణా వాహనాలు, యుద్ధ విమానాలు, నౌకల దిశా నిర్దేశం కోసం ప్రారంభంలో జీపీఎస్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆ తర్వాత వాణిజ్య, సాంకేతిక అనువర్తనాలకు దీన్ని విస్తరించారు. ఈ రాకెట్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్‌నే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) అని పిలుస్తారు. రవాణా రంగంలో సాధారణ వ్యక్తులు తమ గమ్యాన్ని చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంత దూరంలో ఉందో గుర్తించడంలో ఈ వ్యవస్థ ఉపకరిస్తుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించడానికి ఇది దోహదపడుతుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి దిశా నిర్దేశం చేస్తుంది.

ఐదో దేశం భారత్:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (IRNSS) ద్వారా బహిరంగ వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఈ రకమైన సేవలకు ఉపగ్రహాలపై కంటే దేశీయ నావిగేషన్‌పై ఆధారపడటం మంచిది. పూర్తి భద్రతతో కూడిన సైనిక కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఎంతగానో ఉపకరిస్తుంది. ఇప్పటికే రష్యా గ్లోనాస్ (GLONA, గ్లోబల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టమ్), ఐరోపా-గెలీలియో, చైనా-బెయ్‌డోవ్ (BieDou), జపాన్-క్వాసీజెనిథ్ (Quasi-Zenith), వంటి నావిగేషన్ వ్యవస్థలను అభివృద్ధి చేసుకుంటున్నాయి. కాగా ఈ పరిజ్ఞానం సమకూర్చుకున్న ఐదో దేశంగా భారత్ ఘనత సాధించింది.

మూడోది:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి.. దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థలో మూడోది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎని పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా 2013 జూలై, ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ -1బి ను, పీఎస్‌ఎల్‌వీ-సీ 24 ద్వారా 2014 ఏప్రిల్‌లో ఇస్రో ఇప్పటికే ప్రయోగించింది. ఇప్పుడు ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి దాదాపు వాటినే పోలి ఉంటుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి బరువు 1425 కిలోలు. దాదాపు పదేళ్ల పాటు ఇది సేవలను అందిస్తుంది. దీంట్లో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్. రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు నావిగేషన్ సంకేతాలను అందించడంలో నావిగేషన్ పేలోడ్ ఉపయోగపడుతుంది. L-5, S-బ్యాండ్‌లలో ఇది పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్ధిష్టతతో కూడిన రుబీడియం అణు గడియారం (అటామిక్ క్లాక్) ఇందులో ఉంటుంది. ఉపగ్రహం పరిధిని నిర్దేశించే ది C-బ్యాండ్. ఇది ట్రాన్స్‌ఫార్మర్ రేంజింగ్ పేలోడ్‌లో ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్స్ కూడా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సిలో ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ:
ఇస్రో ప్రయోగించిన 28వ పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ-సీ 26. ఇది ఇస్రో సాధించిన 27వ వరుస పీఎస్‌ఎల్‌వీ ప్రయోగ విజయం. దీన్ని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచిపీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ క్రమంలో స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణాన్ని పెంచుతారు. ఇలాంటి తరహాలో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించడం ఇది ఏడో సారి.

పయోగాలు:
ఇదివరకటి పీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ ప్రయోగాల వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో పీఎస్‌ఎల్‌వీ-సీ11 / చంద్రయాన్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ17/ జీశాట్-12, పీఎస్‌ఎల్‌వీ-సీ19 / రీశాట్-1, పీఎస్‌ఎల్‌వీ-సీ 22/ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి-1ఎ, పీఎస్‌ఎల్‌వీ-సీ25 / మంగళ్‌యాన్, పీఎస్‌ఎల్‌వీ-సీ24 / ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి.

అరుదైన వాహక నౌక... పీఎస్‌ఎల్‌వీ:
ప్రపంచ వ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకమైంది. పీఎస్‌ఎల్‌వీ కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికీ ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఏఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయ వంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు. బరువు 294 టన్నులు. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని తొలుత రూపొందించారు. భూస్థిర, భూ అనువర్తిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ఇది ప్రయోగించగలదు. ఇది నాలుగు దశల నౌక. మొదటి, మూడో దశలలో ఘన ఇంధనం, రెండు, నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. పీఎస్‌ఎల్‌వీ జనరిక్ రూపంలో మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంచారు. పీఎస్‌ఎల్‌వీ -కోర్ అలోన్ రూపంలో స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉండవు. పీఎస్‌ఎల్‌వీ -ఎక్స్‌ఎల్ రూపంలో ఈ స్ట్రాప్ ఆన్ మోటార్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది.

విజయ పరంపర:
ప్రపంచంలోని పూర్తి విజయవంతమైన అతికొద్ది రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు దీని ద్వారా ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటివరకు చేపట్టిన 28 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 25 కార్యాచరణ ప్రయోగాలు. 1993, సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 27 ప్రయోగాలు వరుసగా విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకు పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో 71 ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. వీటిలో 31 స్వదేశీ, 40 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి.

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ

ప్రయోగతేదీ

ప్రయోగించిన ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-డీ1

సెప్టెంబర్ 20, 1993

ఐఆర్‌ఎస్-1ఈ ప్రయోగం విఫలం

పీఎస్‌ఎల్‌వీ-డీ2

అక్టోబర్ 15, 1994

ఐఆర్‌ఎస్-పీ2

పీఎస్‌ఎల్‌వీ-డీ3

మార్చి 21, 1996

ఐఆర్‌ఎస్-పీ3

పీఎస్‌ఎల్‌వీ-సీ1

సెప్టెంబర్ 29, 1997

ఐఆర్‌ఎస్ - 1డీ

పీఎస్‌ఎల్‌వీ-సీ2

మే 26, 1999

ఐఆర్‌ఎస్ -పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ)

పీఎస్‌ఎల్‌వీ-సీ3

అక్టోబర్ 22, 2001

టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌‌డ(జర్మనీ), ప్రోబా(బెల్జియం)

పీఎస్‌ఎల్‌వీ-సీ4

సెప్టెంబర్ 12, 2002

కల్పన-1

పీఎస్‌ఎల్‌వీ-సీ5

అక్టోబర్ 17, 2003

ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌‌సశాట్-1)

పీఎస్‌ఎల్‌వీ-సీ6

మే 5, 2005

కార్టోశాట్-1, హామ్‌శాట్ (Hamsat)

పీఎస్‌ఎల్‌వీ-సీ7

జనవరి 10, 2007

కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా)

పీఎస్‌ఎల్‌వీ-సీ8

ఏప్రిల్ 23, 2007

ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం)

పీఎస్‌ఎల్‌వీ-సీ10

జనవరి 21, 2008

టెక్సార్ (ఇజ్రాయెల్)

పీఎస్‌ఎల్‌వీ-సీ9

ఏప్రిల్ 28, 2008

కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ- సీ11

అక్టోబర్ 22, 2008

చంద్రయాన్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ12

ఏప్రిల్ 20, 2009

రీశాట్-2+అనుశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ14

సెప్టెంబర్ 23, 2009

ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ15

జూలై 12, 2010

కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్

పీఎస్‌ఎల్‌వీ-సీ16

ఏప్రిల్ 20, 2011

రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ17

జూలై 15, 2011

జీశాట్12

పీఎస్‌ఎల్‌వీ-సీ18

అక్టోబర్ 12, 2011

మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ19

ఏప్రిల్ 26, 2012

రీశాట్-1

పీఎస్‌ఎల్‌వీ-సీ20

ఫిబ్రవరి 25, 2013

సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు

పీఎస్‌ఎల్‌వీ-సీ21

సెప్టెంబర్ 9, 2012

స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్)

పీఎస్‌ఎల్‌వీ-సీ22

జూలై 1, 2013

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎ

పీఎస్‌ఎల్‌వీ-సీ25

నవంబర్ 5, 2013

మంగళ్‌యాన్ (మార్స్ ఆర్బిటర్ మిషన్-మామ్)

పీఎస్‌ఎల్‌వీ-సీ24

ఏప్రిల్ 4, 2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బి

పీఎస్‌ఎల్‌వీ-సీ23

జూన్ 30, 2014

స్పాట్-7 (ఫ్రాన్స్)+ ఎన్‌ఎల్‌ఎస్-71,ఎన్‌ఎల్‌ఎస్-72(కెనడా)+ ఏఐ శాట్ (జర్మనీ)+ వెలాక్స్-1 (సింగపూర్)

పీఎస్‌ఎల్‌వీ-సీ26

అక్టోబరు 16,2014

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి

Published date : 28 Oct 2014 12:26PM

Photo Stories