Skip to main content

భావ ప్రకటన స్వేచ్ఛ.. సుప్రీంకోర్టు తీర్పు

బి.కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్.
సమాచార సాంకేతిక విప్లవం ప్రపంచాన్ని కుగ్రామంగా మార్చేసింది. నేల నలుచెరగులా ఎక్కడ, ఎప్పుడు ఏ సంఘటన జరిగినా నిమిషాల్లో దృశ్య సాక్షాత్కారమవుతోందంటే కారణం సమాచార సాంకేతిక పరిజ్ఞానమే. ఇక ప్రసార, సామాజిక మాధ్యమాలైతే మనిషిని మరింత చేరువ చేశాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగే పలు సంఘటనలపై తమ అభిప్రాయాల్ని పంచుకోవడానికి ఈ మాధ్యమాలు ఎంతగానో దోహదం చేస్తున్నాయి. తమ భావాల్ని స్వేచ్ఛగా ఇతరులతో పంచుకొనే చక్కటి వేదికలయ్యాయి. ఇటీవల పాలనాపరమైన అంశాలు, రాజకీయ నాయకులపై పలు వ్యాఖ్యానాలూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇది పాలక పెద్దలకు కంటగింపుగా మారింది. కొత్తచట్టం తీసుకువచ్చి భావ ప్రకటనకు సంకెళ్లు వేశారు. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం స్పందించింది. భావప్రకటనకు, స్వేచ్ఛకు విఘాతం కల్గించే సెక్షన్ 66 (ఎ) రాజ్యాంగ విరుద్ధమంటూ సముచిత తీర్పునివ్వడంపై సర్వత్రా హర్షం వెల్లివిరిసింది.

జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ మానవులకు జన్మతః సిద్ధిస్తాయి. భావ వ్యక్తీకరణ మానవులకు మాత్రమే ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పవచ్చు. వీటిని భారత రాజ్యాం గంలో ప్రాథమిక హక్కులుగా గుర్తించడమే కాకుండా వాటి రక్షణకు కూడా మేధావులు పెద్దపీట వేశారు. అయితే పౌరులకు గల తెలుసుకునే హక్కును నేరుగా దెబ్బతీస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞాన చట్టం (ఐటీ యాక్ట్)లోని సెక్షన్ 66 (ఎ) రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సామాన్యుడి మనోభిప్రాయానికి సామాజిక మాధ్యమాలు ప్రధాన వేదికలుగా ఉన్న నేటి కాలంలో వ్యక్తుల మౌలిక హక్కును ఉల్లంఘిస్తున్న ఈ చట్టంలోని 66 (ఎ) పూర్వాపరాలను, వాటి దుర్వినియోగం, పౌర సమాజ క్రియాశీలత సంబంధిత పరిణామాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అధికరణ 19 (1 ఎ) - భావ ప్రకటన స్వేచ్ఛ
భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుల అధ్యాయంలో అధికరణ 19(1ఎ)లో పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. ప్రతి పౌరుడు తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించవచ్చు. మాటలు, రచనలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాన్ని తెలియ జేయవచ్చు. తన భావాలే కాకుండా ఇతరుల భావాలను కూడా వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంటుంది. ఇతర భావాలను వ్యక్తీకరించడం ‘మీడియా’ ద్వారా సాధ్యమవుతుంది.

వ్యక్తి స్వేచ్ఛ - సహేతుక నియంత్రణ
వార్తా పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రజల పక్షాన వారి భావాలను, అభిప్రాయాలను ఉటంకించవచ్చు. కాబట్టి పత్రికా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కులలో అంతర్భాగం. అయితే వాటిపైన హేతుబద్ధమైన పరిమితులు విధించవచ్చు. దేశ సమగ్రత, సార్వభౌమత్వాన్ని, దేశ భద్రత, విదేశాలతో మైత్రి సంబంధాలు, శాంతి భద్రతలు, నైతిక ప్రవర్తన, కోర్టు ధిక్కారం, నేరానికి పురికొల్పడం, పరువునష్టం వంటి కీలకాంశాల్లో వ్యక్తి స్వేచ్ఛను సహేతుకంగా నియంత్రించవచ్చు.

ఐటీ చట్టం 66 (ఎ) - ఆవిర్భావం
సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన ఆవిష్కరణల వల్ల అంతర్జాలం (ఇంటర్‌నెట్), ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక అనుసంధాన వేదికలపై పౌరులు తమ భావోద్వేగాలను, ఆయా అంశాలు, పరిణామాలపై తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరాలు, అవాంఛనీయ సమాచారం, సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిని నియంత్రించడానికి 2000 సంవత్సరంలో ఐటీ చట్టాన్ని రూపొందించారు. 2009లో తిరిగి ఈ చట్టానికి సవరణ చేసి 66 (ఎ) అనే నిబంధనను ప్రవేశపెట్టారు.

ఐటీ చట్టం 66 (ఎ) - నిబంధనలు
ఐటీ చట్టం 66 (ఎ) నిబంధనల ప్రకారం
 1. కంప్యూటర్‌ను గానీ, ఇతర సమాచార పరికరాన్ని గానీ ఉపయోగించి ఇతరులకు హానికర, అభ్యంతరకర సమాచారాన్ని చేరవేయడం నేరం.
 2. ఒక సమాచారం తప్పు అని తెలిసినప్పటికీ ఇతరులకు కోపం, అసౌకర్యం, ప్రమాదం, అడ్డంకి కలిగించే నేరపూరిత ఉద్దేశంతో శత్రుత్వం, ద్వేష భావంతో కంప్యూటర్ ద్వారా దాన్ని వినియోగించకూడదు.
 3. ఇతరులకు అసౌకర్యం కలిగించేలా లేదా తప్పుదారి పట్టించేలా ఏదైనా ఇ-మెయిల్‌ను వాడుకున్నా ఈ సెక్షన్ కింద మూడేళ్లవరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
సెక్షన్ 66 (ఎ) ఎందుకు చెల్లదు?
ఈ సెక్షన్ అనేక పర్యాయాలు దుర్వినియోగం అయింది. అందువల్లే న్యాయ స్థానం కొట్టివేయాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఈ చట్టం కింద ఎందరో బాధితులు పలు ఇబ్బందులు పడ్డారు. అందుకు నిదర్శనాలు కొన్ని....
 • 2012లో శివసేన అధినేత బాల్‌థాకరే మృతికి నిరసనగా బంద్‌ను చేపట్టారు. ఈ చర్యపై పూణెకు చెందిన దాదాషాహిన్ అనే అమ్మాయి ఫేస్‌బుక్‌లో ప్రశ్నంచగా, మరో అమ్మాయి రినూ శ్రీనివాసన్ దానికి మద్దతు తెలిపింది. వీరిద్దరి అభిప్రాయాలను తప్పుబడుతూ పోలీసులు వారిద్దర్నీ అరెస్ట్ చేశారు.
 • తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రిమమతాబెనర్జీపై వ్యంగ్య చిత్రాలను పెట్టినందుకు జాదవ్‌పూర్ విశ్వ విద్యాలయ అధ్యాపకుడు అంబికేశ్‌ను అరెస్ట్ చేశారు.
 • పార్లమెంట్, రాజ్యాంగం సమర్థంగా పనిచేయడం లేదంటూ అసీమ్ త్రివేది కార్టూన్లు వేయడంతో రాజద్రోహం నేరంపై 2012లో ఆయన్ని అరెస్టు చేశారు.
 • సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌పై అవినీతి ఆరోపణలు చేసినందుకు కన్వాల్ భారతి అనే విద్యార్థినిని 2013లో అరెస్ట్ చేశారు.
 • ఆనాటి కేంద్ర మంత్రి చిదంబరం కుమారుడు కార్తీని అవినీతి పరుడంటూ రవి శ్రీనివాసన్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో వ్యాఖ్య చేసినందుకు పుదుచ్చేరి పోలీసులు 2012లో అరెస్టు చేశారు.
నిబంధనకు చరమగీతం
సెక్షన్ 66 (ఎ) భావ ప్రకటన స్వేచ్ఛకు బంధనంగా ఉందని 2012లో శ్రేయా సింఘాల్ అనే న్యాయ విద్యార్థిని తొలుత ప్రజాహిత వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తర్వాత మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2015, మార్చి 20న న్యాయమూర్తులు జె.చలమేశ్వర్, ఆర్. నారీమన్లతో కూడిన అత్యున్నత ధర్మాసనం సెక్షన్ 66 (ఎ)ని కొట్టివేస్తూ కింది వ్యాఖ్యలు చేసింది.
 • వెబ్‌సైట్లలో తీవ్ర ప్రమాదకర వ్యాఖ్యలు చేసిన వారిపై కేసులు పెట్టవచ్చని చట్టం నిర్దేశిస్తోంది. అయితే వాటిని నిర్ణయించేదెవరన్నదే అసలు ప్రశ్న. ఈ మాటలకు స్పష్టత లేదు. నేర స్వరూపం తెలుసుకోవడం పోలీసులకు గానీ, అది చేసినవారికీ కష్టం. న్యాయశాస్త్ర శిక్షణ పొందినవారు మాత్రమే దీనిపై నిర్ధారణకు రాగలరు. చట్టాన్ని అమలు చేసే పోలీసులకు సాధ్యం కాదు.
 • ఒకరికి ప్రమాదకరం (అఫెన్సివ్) అనిపించింది, మరొకరికి కాకపోవచ్చు. సామాజిక మాధ్యమాల్లోని వ్యాఖ్యల్ని శాంతి భద్రతలతో ముడిపెట్టడం సరైంది కాదు.
 • సాధారణ వ్యాఖ్యలకు కూడా విస్తృతార్థాన్ని అన్వయించి తాము తలచుకున్నప్పుడు ఈ సెక్షన్ ఎవరిపైఅయినా ప్రయోగించే అధికారాలు ఉండటం వల్ల చాలా సందర్భాల్లో ఈ సెక్షన్ దుర్వినియోగం అయింది.
 • స్వేచ్ఛను అడ్డుకోవడానికి అర్థం లేని భయాలు కారణం కాకూడదు. అభిప్రాయాన్ని చెప్పనిస్తే విపత్తు ముంచు కొస్తుందని భావించడానికి కూడా బలమైన ప్రాతిపదికలు ఉండాలి.
 • భావ ప్రకటనకు ఉపయోగించిన భాష, పదజాలం ఏమాత్రం నిర్దిష్టంగా లేకుండా అత్యంత అలవోకగా ఉండటంతో పోలీసులకు అవసరం మేర దాని విస్తృతిని పెంచుకోవడానికి, నచ్చిన భాష్యం చెప్పి, నచ్చనిచోట అమల్లో పెట్టగలిగే ప్రమాదం ఉంటుంది. తీవ్ర మనస్థాపం వంటి అనేక పదాలకు కచ్చితమైన నిర్వచనాలు చెప్పకపోవడం వల్ల తనకు నచ్చిన ఒక వాదననో, ఒక విశ్లేషణనో వాటితో విభేదించేవారికి పంపించడం కూడా నేరంగా మారే ప్రమాదం ఉంది.
పౌర స్వేచ్ఛకు పట్టం
దేశ వ్యాప్తంగా న్యాయస్థానాలన్నీ భావప్రకటనకు, స్వేచ్ఛకు గొడుగుపట్టాలి. దాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వాలు చేసే చట్టాల్ని,చర్యల్ని తోసిపుచ్చడం వాటి ప్రాథమిక విధి. పౌరుల స్వేచ్ఛను అణగదొక్కేందుకు భారతీయ శిక్షాస్మృతిలో కీలకమైన సెక్షన్ 124 (ఎ) ప్రకారం రాజద్రోహం కింద ప్రజల స్వేచ్ఛను హరించవచ్చు. బ్రిటీష్ వలస పాలకులు చేసిన ఈ చట్టాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. సెక్షన్ 66 (ఎ) రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేక మందిని కాపాడింది.

నియంత్ర ణా అవశ్యమే
హేతుబద్ధమైన నియంత్రణ లేకపోతే ఏ స్వేచ్ఛ అయినా విశృంఖలత్వానికి దారి తీస్తుంది. సభ్య సమాజం అలాంటి స్వేచ్ఛను అంగీకరించదు. సెక్షన్ 66 (ఎ) కొట్టివేసినంత మాత్రాన నియంత్రణ ఉండదని అనుకోవద్దు. చట్టంలోని 69 (ఎ) సెక్షన్ ప్రకారం అవాంఛనీయ వెబ్‌సైట్లను మూసివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ సెక్షన్ చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి నేర పూరితమైన వ్యాఖ్యలు, పరువు నష్టం లాంటి అంశాలు ఉన్నందున డిజిటల్ మాధ్యమాన్ని దుర్వినియోగం చేయకుండా నియంత్రించవచ్చు. అలాంటి నియంత్రణల ఆవశ్యకత ఎంతో ఉంది. ఏది ఏమైనా ఇంటర్‌నెట్ అనేది సమాచార చేరవేత, పంచుకోవడం అనే అంశాల్ని గుణాత్మకంగా, క్రియాశీలకంగా ప్రజాస్వామ్యీకరించిందని చెప్పవచ్చు. 21వ శతాబ్దంలో ఆన్‌లైన్ స్విచ్ కొత్త పుంతలను తొక్కుతూ కొంగొత్త ఆవిష్కరణలకు బాట వేస్తుండటం గమనార్హం.
Published date : 09 Apr 2015 06:22PM

Photo Stories