Skip to main content

ప్రపంచ సంతోష నివేదిక–2017

ప్రపంచ సంతోష నివేదిక.. ప్రపంచ సంతోష కొలమానానికి సంబంధించి ముఖ్యమైన సర్వేగా ప్రసిద్ధి చెందింది. అంతర్జాతీయ సంతోష దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 20న ఐక్యరాజ్యసమితిలో ప్రపంచ సంతోష నివేదిక–2017ను విడుదల చేశారు. ఇందులో 155 దేశాల్లోని సంతోష స్థాయిలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపర్చారు.

సామాజిక ప్రగతి, ప్రభుత్వ విధాన లక్ష్యాలను కొలవడంలో సంతోషాన్ని ముఖ్య కొలమానంగా తీసుకుంటున్నారు. 2012 నుంచి ఇప్పటివరకు ఐదు ప్రపంచ సంతోష నివేదికలు విడుదలయ్యాయి. ప్రభుత్వాలు, సంస్థలు, పౌర సమాజం తమ విధాన నిర్ణయాల్లో సంతోష సూచికలను ఉపయోగిస్తున్నాయి. దీంతో ప్రపంచ సంతోష నివేదిక–2017కుS ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యం ఏర్పడింది. తాజా నివేదిక.. పనిచేసే స్థలంలో ఉండే సంతోషంతో పాటు చైనా, ఆఫ్రికాలపై ప్రధానంగా దృష్టిసారించింది. ఈ నివేదికను సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ సొల్యూషన్స్‌ నెట్‌వర్క్‌ ప్రచురించింది. ఎర్నెస్టో ఇల్లీ ఫౌండేషన్‌ అనే సంస్థ మూడేళ్ల గ్రాంట్‌ అందించడం ద్వారా నివేదిక వెలువడేందుకు తగిన మద్దతునిచ్చింది.

మొదటి నివేదిక
మొదటి ప్రపంచ సంతోష నివేదిక ఐక్యరాజ్య సమితి అత్యున్నత సమావేశం మద్దతుతో 2012, ఏప్రిల్‌లో సంతోషం, శ్రేయస్సుపై ప్రచురితమైంది. తర్వాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక మార్పులు సంభవించాయి. 2016, జూన్‌లో ఓఈసీడీ దేశాలు వృద్ధిని పునర్‌ నిర్వచించడానికి అంగీకరించాయి. ఈ దేశాలు ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రజాశ్రేయస్సును కేంద్ర బిందువుగా గుర్తించాయి. ప్రపంచ ప్రభుత్వ సదస్సులో భాగంగా 2017, ఫిబ్రవరిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ప్రపంచ సంతోష సమావేశాన్ని నిర్వహించింది.
ఈ నివేదిక సంతోషంలో తగ్గుదలకు సంబంధించి అమెరికాను ఉదాహరణగా పేర్కొంది. 2007లో ఓఈసీడీ దేశాల్లో మూడో స్థానం పొందిన అమెరికా.. 2016లో 19వ స్థానానికి దిగజారింది. అవినీతి పెరగడం, సాంఘిక మద్దతు తగ్గడం వంటివి అమెరికా స్థితి దిగజారేందుకు కారణమయ్యాయి.

దేశాల మధ్య తేడాలు ఇలా
ప్రపంచ సంతోష నివేదిక–2017 సంతోషానికి సంబంధించి సోషల్‌ ఫౌండేషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. దీన్ని ర్యాంకింగ్‌లలో మొదటి పది, చివరి పది దేశాల జీవిత అనుభవాల ఆధారంగా తెలుసుకోవచ్చు. ఈ రెండు గ్రూపుల్లోని దేశాల మధ్య సంతోషంలో నాలుగు పాయింట్ల తేడా ఉంది. స్వేచ్ఛ, అవినీతి నుంచి స్వేచ్ఛ, తలసరి స్థూల దేశీయోత్పత్తి, ఆయుఃప్రమాణం వంటి చలాంకాల ఆధారంగా ఆయా దేశాలకు సంబంధించి సంతోషంలో తేడాను గమనించవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా సంతోషంలోని 80 శాతం తేడాను ఆయా దేశాల లోపలే (వితిన్‌ ద కంట్రీ) గమనించొచ్చు. ధనిక దేశాలకు సంబంధించి సంతోషంలో తేడాలను ఆదాయ అసమానతలతో పాటు మానసిక, భౌతిక ఆరోగ్యం, వ్యక్తిగత సంబంధాలు వంటి అంశాల ఆధారంగా గమనించొచ్చు. వీటిలో మానసిక అనారోగ్యం ప్రధానమైంది. పేద దేశాల్లో సంతోషంలో తగ్గుదలకు మానసిక అనారోగ్యం ప్రధాన కారకమైనప్పటికీ ఆదాయ అసమానతలు కూడా సంతోషంలో తేడాలకు కారణమవుతున్నాయి. సంతోషాన్ని ప్రభావితం చేసే మరో ముఖ్య కారకం పని. నిరుద్యోగిత సంతోషంలో అధిక తగ్గుదలకు కారణమవుతుంది. ఉపాధి పొందుతున్నవారి సంతోషంలో అధిక తేడాలకు పని నాణ్యత కారణమవుతుంది.

ప్రథమ స్థానంలో ‘నార్వే’
2016 ప్రపంచ సంతోష ర్యాంకింగ్స్‌లో నార్వే 4వ స్థానం పొందగా,∙2017లో ప్రథమ స్థానం పొందింది. నార్వే తర్వాతి స్థానాల్లో వరుసగాlడెన్మార్క్, ఐస్‌లాండ్, స్విట్జర్లాండ్‌ నిలిచాయి. సంతోషం కలిగించే అన్ని అంశాల్లో పై నాలుగు దేశాలు ఉత్తమంగా నిలిచాయి. సంరక్షణ, స్వేచ్ఛ, దాతృత్వం, నిజాయతీ, ఆరోగ్యం, ఆదాయం, సుపరిపాలన వంటి అంశాలు సంతోషాన్ని ప్రభావితం చేసేవిగా ఉన్నాయి. ప్రపంచ సంతోష ర్యాంకింగ్స్‌లో తొలిæనాలుగు స్థానాలు పొందిన దేశాల సగటులు చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో సగటుల్లో వచ్చే స్వల్ప హెచ్చుతగ్గులు కూడా ఆయా దేశాల ర్యాంకింగ్స్‌లో మార్పులకు కారణమవుతున్నాయి. చమురు ధరలు బలహీన పడినా ప్రపంచ సంతోష ర్యాంకింగ్స్‌–2017లో నార్వే ప్రథమ స్థానం పొందింది. చమురు సంపద కారణంగా నార్వే అధిక హ్యాపీనెస్‌ పొందలేదు. చమురు ఉత్పత్తిని నెమ్మదిగా కొనసాగించడం ద్వారా రాబడులను ప్రస్తుత అవసరాలకు వినియోగించుకోకుండా భవిష్యత్తు కోసం పెట్టుబడులుగా మరల్చుతున్నందువల్లే నార్వే ప్రథమ స్థానం పొందిందని నివేదిక పేర్కొంది. అధిక వనరులు కలిగిన అనేక ధనిక దేశాల మాదిరిగా నార్వే వ్యాపార చక్రాల బారిన పడలేదు. అధిక స్థాయిలో మ్యూచువల్‌ ట్రస్ట్, షేర్డ్‌ పర్పస్, దాతృత్వం, సుపరిపాలన వంటి వంటి అంశాల కారణంగా నార్వేతోపాటు ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో ఉన్న దేశాలు వ్యాపార చక్రాలను అధిగమించగలిగాయి.

వివిధ దేశాల స్థానాలు

దేశం

ర్యాంకు

స్కోరు

నార్వే 1 7.537
డెన్మార్క్‌ 2 7.522
ఐస్‌లాండ్‌ 3 7.504
స్విట్జర్లాండ్‌ 4 7.504
చైనా 79 5.273
శ్రీలంక 120 4.440
ఇండియా 122 4.315

దుఃఖదాయక దేశాలు
యెమన్‌ 140 3.59
లైబీరియా 148 3.53
రువాండ 151 3.47
సిరియా 152 3.40
టాంజానియా 153 3.35
బురిండి 154 2.91
సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ 155 2.69

2014 నుంచి∙2016 వరకు ఆర్థిక, ఆరోగ్యానికి సంబంధించిన గణాంకాలను సేకరించి మూడు సంవత్సరాలకు సంబంధించి వాటి సగటులను తీసుకొని ఆర్థికవేత్తలు వివిధ దేశాల స్కోర్లను నిర్ణయించారు. 2016లో ప్రపంచ సంతోష ర్యాంకింగ్‌లో ప్రథమ స్థానం పొందిన డెన్మార్క్‌ను పక్కకునెట్టి ఈ ఏడాది నార్వే ఆ స్థానాన్ని ఆక్రమించింది. 2017 ర్యాంకింగ్‌లో మొదటి పది స్థానాలు పొందిన దేశాలు అధిక సంపదతో కూడిన అభివృద్ధి చెందిన దేశాలు. ఆయా దేశాలు సంతోష ర్యాంకింగ్స్‌లో ముందు వరుసలో నిలవ డానికి కేవలం ‘ధనం’ (ద్రవ్యం) ఒక్కటే కారణం కాదని నివేదిక పేర్కొంది.

భారత్‌లో సంతోష లేమి
ప్రపంచ సంతోష నివేదిక–2017లో మొత్తం 155 దేశాలకు ర్యాంకింగ్స్‌ ప్రకటించగా, భారత్‌కు 122వ స్థానం దక్కింది. సార్క్‌లోని ఇతర దేశాలతో పోల్చితే ర్యాంకింగ్‌లో భారత్‌ వెనుకంజలో ఉంది. గతంలో 118వ స్థానంలో ఉన్న భారత్‌.. ప్రస్తుతం 122వ స్థానానికి దిగజారింది. దీన్నిబట్టి సంతోషంలో తగ్గుదలను అర్థంచేసుకోవచ్చు. మొత్తం 8 సార్క్‌ దేశాల్లో పాకిస్తాన్‌ 80వ స్థానం, నేపాల్‌ 99వ స్థానం, భూటాన్‌ 97వ స్థానం, బంగ్లాదేశ్‌ 110వ స్థానం, శ్రీలంక 120 స్థానం పొందాయి. అఫ్గానిస్తాన్‌ 141వ స్థానం పొందింది. చైనాలో గత 25 ఏళ్ల కాలంలో తలసరి ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఏర్పడినప్పటికీ జీవన ప్రమాణాలకు సంబంధించి 1990–2005లో స్థిరమైన తగ్గుదల ఏర్పడింది. తిరిగి చైనాలో 2005 తర్వాత కాలంలో జీవనప్రమాణాలు 1990 నాటి స్థాయికి పురోగమించాయని నివేదికS పేర్కొంది.
నిరుద్యోగిత పెరుగుదల, సాంఘిక భద్రత తక్కువగా ఉండటం వంటి అంశాలు సంతోష ర్యాంకింగ్‌లో చైనా వెనకబాటుకు కారణమయ్యాయి. ఆఫ్రికాలో అధిక దేశాల్లో సంతోషంలో క్షీణత ఏర్పడినట్లు నివేదిక పేర్కొంది.

సంతోష స్థాయిల్లో మార్పు (2005–07 నుంచి 2014–16)
అనేక పరిశీలనలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా 126 దేశాలకు సంబంధించిన సంతోష స్థాయిల్లో మార్పులను నివేదిక రూపొందించింది. ఇందులో ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ముందు కాలమైన 2005–07 సంతోష స్థాయితో ఇటీవలి మూడేళ్ల (2014–16 కాలం) సంతోష స్థాయిని పోల్చారు.

2005–07తో పోల్చినప్పుడు 2014–16లో సంతోష స్థాయిలో మార్పునకు సంబంధించి నికరాగువా (1.364), లాత్వియా (1.162), సియెరాలియాన్‌ (1.103), ఈక్వెడార్‌ (0.998), బల్గేరియా (0.870), రష్యా (0.845) మొదటి ఏడు స్థానాలు పొందాయి. ఇదే కాలంలో శ్రీలంకలో సంతోష స్థాయిలో మార్పు 0.061గా నమోదైంది. జపాన్, ఇండియా, అమెరికా, యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, ఇటలీ, సౌదీ అరేబియా లాంటి దేశాల సంతోష స్థాయిల్లో మార్పు రుణాత్మకంగా ఉంది. 2005–07తో పోల్చినప్పుడు 2014–16లో సంతోష స్థాయిలో మార్పు భారత్‌లో – 0.839గా నమోదైంది.

126 దేశాల్లో ఇదే కాలానికి సంబంధించి 95 దేశాల్లో సంతోష స్థాయిలో చెప్పుకోదగ్గ మార్పులు సంభవించగా, వాటిలో 58 దేశాల్లో సంతోష స్థాయిలో పెరుగు దల స్కేలు(0–10)పై 0.12 నుంచి 1.36 పాయింట్లుగా నమోదైంది. మరో 38 దేశాల్లో సంతోష స్థాయిలో ఏర్పడిన తగ్గుదల – 0.12 నుంచిl– 1.6 పాయింట్ల వరకు ఉంది. మిగిలిన 30 దేశాల్లో ఇదే కాలానికి సంబంధించి సంతోష స్థాయి ధోరణిలో చెప్పుకోదగ్గ మార్పులు సంభవించలేదు. సంతోష స్థాయిలో పెరుగుదల, తగ్గుదల ప్రపంచవ్యాప్తంగా ఒకే విధంగా లేదు. పశ్చిమ యూరప్‌లో 11 దేశాల్లో సంతోష స్థాయిలో తగ్గుదల నమోదవగా ఒక దేశంలో పెరిగింది. మధ్య, తూర్పు యూరప్‌లలో 12 దేశాల్లో సంతోష స్థాయిలో పెరుగుదల ఏర్పడితే, ఒక దేశంలో తగ్గింది. లాటిన్‌ అమెరికా, కరేబియన్, కామన్వెల్త్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ స్టేట్‌లలో సంతోష స్థాయిలో పెరుగుదల ఏర్పడిన దేశాలు, నష్టపోయిన దేశాల కంటే అధికంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో సంతోష స్థాయిలో పెరుగుదల, తగ్గుదల సంభవించిన దేశాలు సమాన స్థాయిలో ఉన్నాయి.
- డా‘‘ తమ్మా కోటిరెడ్డి, ప్రొఫెసర్‌, ఐబీఎస్, హైదరాబాద్‌

Published date : 18 May 2017 05:08PM

Photo Stories