Skip to main content

ఈజిప్టు సంక్షోభం - సైన్యం తిరుగుబాటు

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే ఈజిప్టు మరోసారి సంక్షోభంలో మునిగిపోయింది. సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ముబారక్ పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యపథంలోకి అడుగుపెట్టిన ఈజిప్ట్ మళ్లీ సంక్షోభంలోకి జారిపోయింది. 2012 జూన్ లో జరిగిన ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన మహమ్మద్ మోర్సీ పదవి ఏడాదిన్నరలోనే ముగిసింది. అయనను జులై 3న సైన్యం పదవీచ్యుతుడ్ని చేసింది. ముస్లిం బ్రదర్ హుడ్ ప్రభుత్వాన్ని కూలదోసి, దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈజిప్టు ప్రధాన న్యాయమూర్తి అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ పరిణామాలను మోర్సీ మద్దతుదార్లు సైనిక తిరుగుబాటుగా అభివర్ణిస్తే, సైన్యం మద్దతుదార్లు, మోర్సీ వ్యతిరేకులు మాత్రం విప్లవంగా ప్రకటించారు.

మోర్సీ పాలనకు, విధానాలకు వ్యతిరేకంగా ఈజిప్టులో ప్రజలు గత కొన్ని నెలలుగా నిరసనలు, ప్రదర్శనలు జరుపుతున్నారు. వీటికి మోర్సీ ప్రభుత్వం తగిన విధంగా ప్రతిస్పందించకపోతే 48 గంటలలోపు రంగంలోకి దిగుతామంటూ జులై 1న సైన్యం హెచ్చరించింది. మోర్సీ తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడననీ, రాజీనామా చేయననీ తేల్చి చెప్పడంతో ముందుగా హెచ్చరించినట్లే సైన్యం రంగంలోకి దిగి సైనిక చర్య ద్వారా మోర్సీని గద్దె దింపింది. తర్వాత అడ్లీ మన్సూర్ ను తాత్కాలిక అధ్యక్షుడిగా జనరల్ అల్ సిసీ ప్రకటించాడు. మోర్సీని గృహ నిర్బంధం కింద ఉంచారు. ఆయన నాయకత్వం వహిస్తున్న బ్రదర్ హుడ్ పార్టీ నేతలు పలువురిని అరెస్టు చేశారు. సైనిక చర్య వార్తలు వెలువడగానే మోర్సీ అనుకూల, వ్యతిరేక వర్గాల ప్రదర్శనలు, ఘర్షణలు హింసాకాండ చెలరేగాయి. వీటిలో 51 మంది మరణించారు. 450 మందికి పైగా గాయపడ్డారు.

సైన్యం తిరుగుబాటు నేపథ్యం:
రెండున్నరేళ్ల క్రితం 2011 ఫిబ్రవరిలో మొదటగా ట్యునీషియాలో మొదలైన అరబ్ వసంతం (Arab Spring) ఈజిప్టుకు వ్యాపించింది. 1981లో అన్వర్ సాదత్ హత్యానంతరం ఈజిప్టు పాలనాధికారం చేపట్టిన హోస్నీ ముబారక్ 2011 వరకు ఆ దేశాన్ని తన నియంతృత్వ పోకడలతో పాలించాడు. తన తదనంతరం కుమారుడికి అధికారం దక్కేలా చర్యలు చేపట్టడంతో దేశంలో 8 కోట్ల మంది ప్రజలు ఉవ్వెత్తున తిరగబడి 18 రోజుల పాటు ప్రజా విప్లవాన్ని నడిపించారు. దాంతో ఆయనకు అధికారం వదులుకోక తప్పలేదు. దేశ రాజధాని కైరోలోని టెహ్రీర్ స్క్వేర్ (tahrir square) ఈ విప్లవానికి కేంద్రంగా నిలిచింది. తర్వాత 2012 జూన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ నాయకుడు మహమ్మద్ మోర్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈజిప్టు దేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు ఈయనే.

రాజకీయ సుస్థిరత, అభివృద్ధి, సమన్యాయం, ప్రజల సంక్షేమం తదితరాలు ప్రాధమ్యాలుగా పనిచేస్తానని అధికారం చేపట్టిన మోర్సీ తర్వాత క్రమంగా ఆధిపత్య ధోరణి అవలంబించారు. మొదట ముబారక్ పాలన కింద పని చేసిన సైనికాధికారులందర్నీ తొలగించిన మోర్సీ 2012 నవంబర్ లో తన పదవికి ( అధ్యక్ష పదవి) అపరిమిత అధికారాలు కల్పించుకున్నారు. రాజ్యాంగంలోని పలు అధికరణలను తనకు అనువుగా మార్చుకోవడానికి వేగంగా పావులు కదిపారు. మోర్సీ ఈజిప్టులో ఉదారవాదులు, లౌకికవాదుల్ని నిర్లక్ష్యం చేస్తూ ఇస్లామిస్టు అజెండాను నడిపిస్తున్నారనీ, ఆర్థిక సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడంలేదనీ, ఆయన ఆధిపత్య ధోరణి అంతకంతకూ పెరిగిపోతోందనీ, తన పదవికి అపరిమిత అధికారాలు కట్టబెట్టుకుంటున్నారనీ ప్రజల ఆరోపణ. వీటన్నింటికీ ఆందోళన చెందిన ప్రజలు 2012 అక్టోబర్ నుంచే దేశ వ్యాప్తంగా మోర్సీ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు. 2012 జూన్ లో మోర్సీ ప్రజాదరణ రేటు 79 శాతం ఉంటే 2013 ఫిబ్రవరి నాటికి 49 శాతానికి పడిపోయింది. మొదట్లో ఆయన తన ధోరణి మార్చుకోవాలని డిమాండ్ చేసినా తర్వాత ఆయన రాజీనామాను కోరుతూ ప్రదర్శనలు నిర్వహించారు. ముబారక్ నిరంకుశత్వాన్ని రూపుమాపడానికి తిరుగుబాటు జరిపినా టెహ్రీర్ స్క్వేర్ దగ్గరే మోర్సీ వ్యతిరేక ప్రదర్శనలు కూడా వెల్లువెత్తాయి. మోర్సీకి వ్యతిరేకంగా నిరసనలు, ప్రదర్శనలే కాక ఆయన వెంటనే రాజీనామా చెయ్యాలంటూ సంతకాలు సేకరించే తమరోద్ (అరబిక్ భాషలో తిరుగుబాటు అని అర్థం) ఉద్యమం కూడా మొదలైంది. 2013 జూన్ 30 నాటికి మోర్సీ అధికారానికి వచ్చి సరిగ్గా ఏడాది పూర్తయింది. అంతలోనే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 15 మిలియన్ల సంతకాలు సేకరిస్తామనీ వెంటనే ఆయన పదవి నుంచి వైదొలగాలనీ తమరోద్ ప్రజా ఉద్యమం డిమాండ్ చేసింది. ఈ ఉద్యమానికి పలు ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిచ్చాయి. అన్నట్లుగానే ఈ ఉద్యమం జూన్ 29 నాటికి 22 మిలియన్ల సంతకాలు సేకరించామనీ, మోర్సీ తక్షణమే రాజీనామా చెయ్యాలనీ ప్రకటించింది. తనపై వ్యతిరేకతను గుర్తించిన మోర్సీ ఈజిప్టు ప్రజా ప్రాతినిధ్య సభకు ఎన్నికలు నిర్వహిస్తామంటూ పేర్కొన్నా ప్రజలు శాంతించలేదు. నిరసనలు, ప్రదర్శనలు మొదట శాంతియుతంగానే జరిగాయి. వారిని అణచివేసేందుకు మోర్సీ ప్రయత్నించారు. మోర్సీ తన పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి వారితో తనను వ్యతిరేకించిన వారిపై దాడులు చేయించారు. తన పాలనకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన మహిళలపై సామూహిక అత్యాచారాలు, దాడులు, బెదిరింపులు నిత్యకృత్యమయ్యాయి. పోలీసు కాల్పుల్లో 5 మంది మోర్సీ వ్యతిరేకులు మరణించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో జులై 1న మోర్సీ వ్యతిరేకులు కైరోలోని ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీ కార్యాలయాన్ని విధ్వంసం చేయడంతో ఘర్షణలు తీవ్రమై ఎనిమిది మంది మరణించారు. జూలై 3న కూడా ఇరువర్గాల మధ్య ఘర్షణలు, దుండగుల కాల్పుల్లో 18 మంది చనిపోగా 200 మంది గాయపడ్డారు. వీటన్నింటి నేపథ్యంలోనే సైన్యం మోర్సీకి 48 గంటలు గడువిస్తూ అల్టిమేటం జారీచేసింది. ఆలోగా మోర్సీ దిగకపోవడంతో జూలై 3న సైన్యం పరిస్థితిని తన చేతుల్లోకి తీసుకుంది. సాయుధ దళాలు రంగంలోకి దిగి మోర్సీని పదవి నుంచి తొలగించి గృహ నిర్బంధంలో ఉంచినట్లు ప్రకటించాయి. ముస్లిం బ్రదర్ హుడ్ ముఖ్యనేతలందరినీ అదుపులోకి తీసుకున్నాయి.

మోర్సీ స్వయం కృతాపరాధం:
టెహ్రీర్ స్క్వేర్ ప్రజాందోళనల స్ఫూర్తిని గ్రహించడంలో మోర్సీ విఫలమయ్యారు. సైనికాధికారిగా పనిచేసి, వారి ప్రతినిధిగా అధ్యక్ష ఎన్నికల్లో తనపై పోటీచేసిన అహ్మద్ షఫీక్ ను కాదని, ప్రజలు తనకు అధికారం అప్పగించడం వెనుక ఉన్న పరమార్థాన్ని ఆయన గ్రహించలేకపోయారు. సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించక పోగా అదనపు సమస్యలను సృష్టించారు. ఉదారవాదిగా తెరపైకి వచ్చిన మోర్సీ ఛాందసవాదానికి, మత తత్వానికి దూరంగా ఉంటానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారు. నూతన రాజ్యాంగ రచనలో తప్పిదాలు చోటు చేసుకున్నట్టు అంగీకరించినా వాటిని సరిదిద్దేందుకు ప్రయత్నించకపోవడం మోర్సీ పట్ల జనంలో అసంతృప్తి పెరిగేందుకు కారణమైంది. తాను తీసుకున్న నిర్ణయాలను కఠినంగా అమలు చేయాలన్న పట్టుదల కూడా ఆయనపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగేందుకు దోహదం చేసింది. దేశం ఒకవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంటే, వాటిని పట్టించుకోకపోగా తనకు తాను అపరిమిత అధికారాలు కట్టబెట్టుకుంటూ వరుస డిక్రీలు జారీ చేశారు. ప్రజల్ల భిన్నవర్గాల మధ్య ఘర్షణలను రేకెత్తించి తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్రయత్నించారు. ప్రజా ప్రాతినిధ్య సభకు ఎన్నికలు జరపకుండా కాలయాపన చేశారు. తన అధికార పరిధిని విస్తరించేందుకునేందుకు రాజ్యాంగం ద్వారా ప్రయత్నించి తీవ్ర వివాదాలకు కారణమయ్యారు. మహిళలు, మైనారిటీల ప్రయోజనాలకు భంగం వాటిల్లే అధికరణలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వివిధ అంశాలపై రాజకీయ ఏకాభిప్రాయ సేకరణకు ప్రయత్నించలేదు. అంతేకాదు తమ సొంత పార్టీ ముస్లిం బ్రదర్ హుడ్ ప్రయోజనాలకే పెద్ద పీట వేయడం కూడా మోర్సీకి ప్రతికూల పరిస్థితులను తెచ్చిపెట్టింది. సైన్యంతోనూ సఖ్యంగా వ్యవహరించడంలో మోర్సీ విఫలమయ్యారు. ఇక న్యాయవ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చేసిన ప్రయత్నం ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది.

రోడ్ మ్యాప్:
మోర్సీని తొలగించిన అనంతరం తాత్కాలిక అధ్యక్షుడి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీలతో కలిపి ఈజిప్టు భవితవ్యంపై చర్చించి ఆరు నెలల కాలవ్యవధి గల రోడ్ మ్యాప్ రూపొందించారు. రోడ్ మ్యాప్ లో భాగంగా రాజ్యాంగంలో పలు మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. అనంతరం నూతన రాజ్యాంగంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి తద్వారా పార్లమెంటరీ ఎన్నికలు నిర్వహిస్తామని తాత్కాలిక అధ్యక్షుడు మన్సూర్ వెల్లడించారు. పార్లమెంటు ఎన్నికలు జరిగి కొత్త పార్లమెంటు కొలువుదీరిన తర్వాత అధ్యక్ష ఎన్నికలను నిర్వహిస్తామని వివరించారు. అయితే రోడ్ మ్యాప్ ను ముస్లిం బ్రదర్ హుడ్ తిరస్కరించింది. ఇది చట్ట వ్యతిరేకమైనదని పేర్కొంది. కాల వ్యవధితో కూడిన రోడ్ మ్యాప్ ను ప్రకటించేందుకు తాత్కాలిక ప్రభుత్వానికి ఎటువంటి హక్కు లేదని వాదించింది.

అప్రమత్తత అవసరం:
మోర్సీ ప్రభుత్వ నిర్వాకంతో విసిగిపోయిన ప్రజలు సైనిక తిరుగుబాటును ఆహ్వానించారు. ఒకవేళ సైన్యం జోక్యమే జరిగి ఉండకపోతే ఈజిప్టు దేశం మరింత అస్థిరతలోకి జారిపోయి ఉండేది. ముస్లిం బ్రదర్ హుడ్ కు అనుకూలంగా వ్యతిరేకంగా ఉన్నవారి మధ్య భౌతిక ఘర్షణలు చోటుచేసుకొని ఉండేవి. ఈ నేపథ్యంలో సైన్యం జోక్యాన్ని ప్రజలు, ప్రతి పక్షాలు, చాలా మంది ఉదారవాద మేధావులు సైతం సమర్థించారు. తిరుగుబాటుకు నాయకత్వం వహించిన సైన్యం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఎన్నికల అనంతరం తాను సాధారణ బాధ్యతలకే పరిమితమవుతామని సైన్యం వెల్లడించింది. అయితే సైన్యం పట్ల కూడా అప్రమత్తత అవసరం. దేశ రాజకీయాల్లో తిరిగి సైన్యం కేంద్ర స్థానానికి చేరడం పట్ల ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తంగా ఉండాలి. ముబారక్ పాలన అనంతరం ప్రమాదంలో పడిన ఈజిప్టు దేశ అస్థిత్వాన్ని కాపాడిన శక్తిగా సైన్యం ముందుకు వస్తోంది. రాజకీయ సుస్థిరత, సామాజిక న్యాయం, దేశభక్తి, జాతీయ అస్థిత్వాలకు హామీ ఇచ్చే మహత్తర శక్తిగా సైన్యాన్ని చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది. ప్రతిపక్షాల మద్దతు, ప్రజా సమీకరణ సైన్యం పలుకుబడిని పెంచాయి. అయితే ఈజిప్టు సైన్యం స్వభావాన్ని కూడా విస్మరించకూడదు. గతంలో సైన్యం అవినీతి, అణచివేతలకు కేంద్రబిందువుగా ఉన్న చరిత్రను మరిచిపోరాదు. అంతేకాదు ఈజిప్ట్ సైన్యం అమెరికాకు సన్నిహితంగా ఉంటుంది. ముబారక్ హయాంలో సైన్యం నిర్వహించిన పాత్ర అనేక సార్లు వివాదాస్పదమైంది. అందుకే తిరుగులేని అధికారాలను మరోసారి సైన్యానికి ఇవ్వడం వల్ల ఈజిప్ట్ రాజకీయ చిత్రంలో ఏర్పడే పరిణామాల పట్ల జాగరూకత అవసరం. ముస్లిం బ్రదర్ హుడ్ పాలనలో అస్థిరత నెలకొనడంతోనే సైన్యం తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని జనరల్ అల్ సిసి ప్రకటించారు. కానీ ఈజిప్టు ప్రస్తుత పరిస్థితికి సైన్యం కూడా కారణమని చెప్పాలి. గత 50 ఏళ్ల ఈజిప్టు చరిత్రలో సైన్యం అవినీతి కుంభకోణాల్లో చిక్కుకుంది. అనేక వివాదాలు చుట్టుముట్టాయి. అనేక సార్లు అధికార దుర్వినియోగానికి కూడా పాల్పడింది.

పశ్చిమ దేశాల వైఖరి:
ఈజిప్టులో సైన్యం అనేక ఆకృత్యాలకు పాల్పడుతూ ఉన్నా పశ్చిమదేశాలు నిరసించలేదు. ప్రజాస్వామ్య స్థాపనే తమ లక్ష్యమని చెప్పుకునే పశ్చిమ దేశాలు సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం కోసం ఆరాటపడుతున్న ఈజిప్టు ప్రజల ఆకాంక్షలను మాత్రం పెడచెవిన పెట్టాయి. సైన్యం దాన్ని అణచివేసినంత కాలం దానితో పశ్చిమ దేశాలకు ఎలాంటి పేచీ రాలేదు. అందుకే ఇకనైనా ఈజిప్టులో స్వేచ్ఛగా, న్యాయంగా ఎన్నికలు జరగాలని, ప్రజల ఆశలకూ ఆకాంక్షలకూ అనుగుణమైన ప్రభుత్వం ఏర్పడాలని పశ్చిమదేశాలు కూడా గుర్తించాలి.

బ్రదర్ హుడ్ నేపథ్యం:
ముస్లిం బ్రదర్ హుడ్ ఈజిప్టులోని అత్యంత ప్రాచీనమైన ఇస్లామిక్ సంస్థ. ముస్లిం బ్రదర్ హుడ్ అరబిక్ నామం అల్ - ఇఖ్వాన్ అల్ – ముస్లిమన్ ( al ikhwan al muslimin). ఈ సంస్థను 1928లో హసన్ అల్ – బన్నా స్థాపించారు. ఇస్లామిక్ నైతిక సూత్రాలను, మంచి పనులను ప్రచారం చెయ్యాలనే లక్ష్యంతో ఏర్పడిన ఈ సంస్థ క్రమంగా రాజకీయాల్లో ప్రవేశించింది. ఒక వైపు రాజకీయంగా చురుగ్గా ఉంటూ, మరో పక్క ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ ఉద్యమాలన్నింటినీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈజిప్టుపై బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలనకు వ్యతిరేకంగా పోరాడింది.
దేశంలో పాశ్చాత్య ప్రభావాన్ని పూర్తిగా పోగొట్టేందుకు కృషి చేసింది. ఈ సంస్థ ప్రజాస్వామ్య సూత్రాలకు మద్దతిస్తామని చెబుతూనే, ఇస్లామిక్ చట్టాల కింద దేశాన్ని పాలించడం తమ లక్ష్యాల్లో ఒకటని పేర్కొంటుంది. ఇస్లామే పరిష్కారం అనే నినాదాన్ని ఇది ప్రపంచమంతటా ప్రచారం చేస్తోంది. ఈజిప్టులో ఈ సంస్థను అనుసరించేవారి సంఖ్య 1940 నాటికి 20 లక్షలకు చేరింది. ఆ దశలోనే వ్యవస్థాపకుడు హసన్ బన్నా ముస్లిం బ్రదర్ హుడ్ కి పారా మిలటరీ విభాగాన్ని కూడా రూపొందించి బ్రిటిష్ పాలనకు వ్యతరేక పోరాటంలో దించారు. 1952లో బ్రిటిష్ పాలన అంతమయ్యాక ఈజిప్టు పాలకులు దీనితో కొంత సత్సంబంధాలే కలిగి ఉన్నారు. 1954లో అప్పటి అధ్యక్షుడు నాజర్ పై హత్యాయత్నం చేసిందన్న ఆరోపణలతో ఈ సంస్థను నిషేధించి సభ్యులను చిత్రహింసలకు, హత్యలకు గురిచేశారు. దాంతో సంస్థలో ప్రముఖ సభ్యుడైన సయ్యద్ కుతుబ్ ‘జిహాద్’ చేపట్టాలంటూ పిలుపునిచ్చాడు. ఆయన జిహాద్ కు సంబంధించి పలు పుస్తకాలు కూడా రాశాడు. వాటి స్ఫూర్తితోనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ జిహాద్, అల్ ఖైదా వంటివి ఏర్పడ్డాయని భావిస్తారు. 1966లో ఈజిప్టు ప్రభుత్వం సయ్యద్ కుతుబ్ ను హతమార్చడంతో పలు ముస్లిం సంస్థలకు అమరవీరుడిగా మారాడు. 1980ల్లో ముస్లిం బ్రదర్ హుడ్ రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాలని ప్రయత్నించింది. ఇతర పార్టీలైన వఫ్డ్ పార్టీ, లేబర్, లిబరల్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఈజిప్టులో ప్రధాన ప్రతిపక్షంగా రూపుదిద్దుకుంది. 2005 ఎన్నికల్లో ఈ పార్టీ ఈజిప్టు పార్లమెంటు దిగువ సభలో 20 శాతం స్థానాలు గెలుచుకోవడంతో అప్పటి అధ్యక్షుడు హోస్నీ ముబారక్ దీన్ని అణచివేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నించారు. మతవాద పార్టీలు రాజకీయాల్లోకి రాకూడదంటూ రాజ్యాంగ సవరణలు చేశాడు. దాంతో ఈ సంస్థ సభ్యులు వీలైనంత వరకు రహస్యంగా తమ కార్యక్రమాలు నడుపుతూ వచ్చారు. ముబారక్ పతనం అనంతరం 2012లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ పేరిట పోటీ చేసి దిగువసభలో సగం స్థానాలు గెలుచుకుంది. ఛాందసవాద సలాఫిస్ట్ నూర్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అంటే ఈజిప్టు పార్లమెంటులోని దిగువ సభలో 70 శాతం స్థానాలు ఇస్లామిస్టులకు దక్కాయి. దాంతో అధికార పార్టీ తమకు నచ్చిన విధంగా పాలిస్తూ రాజ్యాంగ సవరణలు చేపడుతూ వచ్చింది. దీన్ని దేశంలో ఉదారవాద, లౌకికవాద వర్గాలు, కాప్టిక్ క్రైస్తవులు, యువతరం, మహిళలు వ్యతిరేకిస్తూ వచ్చారు. తాజాగా 2013 జులై 3న ఈ పార్టీ నేత దేశాధ్యక్షుడు అయిన మహమ్మద్ మోర్సీని సైన్యం అధికారంలో నుంచి తొలగించి ఇతర నేతలందరినీ అదుపులోకి తీసుకుంది.

ముస్లిం బ్రదర్ హుడ్ పై నిషేధం:
ముస్లిం బ్రదర్ హుడ్ పై కైరో న్యాయస్థానం నిషేధం విధించింది. సంస్థ కార్యకలాపాలు నిర్వహించకుండా గ్రూపు ఆస్తులను జప్తు చేయాలని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన పాలకులు ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడవచ్చని వచ్చిన ఊహాగానాలు నిజమయ్యాయి. ఈ నిషేధ ఆదేశాల వెనుక సైన్యం ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రదర్ హుడ్ పై నిషేధం విధించడం వల్ల ఈజిప్టులో మరింత అశాంతి తప్పదు. ఇప్పటికే దేశంలోని మత, మితవాద, ఉన్నత వర్గాల్లో ముస్లిం బ్రదర్ హుడ్ పార్టీకి బలమైన మద్దతు ఉంది. ముబారక్ నిరంకుశ పాలనలో ముస్లిం బ్రదర్ హుడ్ తీవ్ర నిర్బంధానికి గురయ్యింది. ముబారక్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమంలో ముస్లిం బ్రదర్ హుడ్ పరోక్ష చేరికతోనే ఈ ఉద్యమానికి బలం వచ్చిందన్న వాదనలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో చూసినప్పుడు ప్రస్తుత పాలకుల ముందున్న కర్తవ్యం ప్రతీకారానికి పాల్పడకుండా దేశంలో నిజమైన ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిజాయితీతో ప్రయత్నించాలి. బ్రదర్ హుడ్ పై నిషేధం ఎత్తివేయటం శ్రేయస్కరం. ఎన్నికలు స్వేచ్ఛగా, శాంతియుతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సైన్యంపై ఉంది. ఈ ఎన్నికల్లో ముస్లిం బ్రదర్ హుడ్ కు కూడా అవకాశం ఇవ్వాలి. ముస్లిం బ్రదర్ హుడ్ కు, సైన్యానికీ మధ్య అధికారం కోసం ఘర్షణ జరిగితే మరోసారి ఈజిప్ట్ అశాంతిని ఎదుర్కోక తప్పదు. ముస్లిం బ్రదర్ హుడ్ కు ఉన్న సంప్రదాయ మద్దతు వల్ల వివిధ వర్గాల మధ్య హింసకు దారితీసే ప్రమాదం ఉంది. అందుకే, ఈజిప్ట్ లో ప్రజాస్వామిక ఎన్నికలు జరిపినప్పుడు ఈ పార్టీకి కూడా సమాన అవకాశాలు ఇవ్వడం అవసరమని పరిశీలకుల అభిప్రాయం.

బ్రదర్ హుడ్ ముందు రెండే ప్రత్యామ్నాయాలు:
ముస్లిం బ్రదర్ హుడ్ కూడా తాజా పరిణామాల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం, రాజకీయాలంటే ఎన్నికలే కావు. ఎన్నికల్లో గెలిచిన పార్టీకి ఏమైనా చేసే హక్కును ప్రజలు ఇవ్వలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కూడా ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరించి మనుగడ సాధించలేదు. ముబారక్ పతనానంతరం జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కట్టారని, అపరిమిత అధికారాలున్నాయని ముస్లిం బ్రదర్ హుడ్ భావించింది. ప్రజలెలా ప్రవర్తించాలి. మహిళలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలి. మీడియాలో ఏం ప్రచురించాలి. ఏది ప్రసారం చేయాలి అని ప్రజలకు చెప్పే హక్కు తమ ప్రభుత్వానికి ఉందని భావించారు. అధ్యక్షుడు మోర్సీ రక్త చరిత్ర కలిగిన వివాదాస్పద వ్యక్తులను కూడా గవర్నర్ లుగా నియమించారు. ఇది వారు అధికార దుర్వినయోగానికి పాల్పడ్డారనడానికి నిదర్శనం. మిలటరీ తిరుగుబాటులో అధికారాన్ని కోల్పోయిన ముస్లిం బ్రదర్ హుడ్ ముందు రెండు మార్గాలున్నాయి. తమ లోపాలు గుర్తించి, గుణపాఠాలు నేర్చుకుని కొత్తగా మళ్లీ రాజకీయ ప్రక్రియలో భాగస్వాములు కావడం లేదా తమను సైన్యం అన్యాయంగా అధికారం నుంచి తొలగించిందని అందుకు వ్యతిరేకంగా రంగంలోకి దిగడం. ముందుగా వాగ్ధానం చేసినట్లు సైన్యమే ఎన్నికలు నిర్వహించాలి. రాజకీయ ప్రక్రియలో ముస్లిం బ్రదర్ హుడ్ కొనసాగాలి. ఇందుకు సైన్యం కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఇది జరగనట్లయితే టెహ్రీర్ స్క్వేర్ ప్రజా ఉద్యమం సాధించిన విజయాలు నిష్ఫలమవుతాయి.

ముగింపు:
టెహ్రీర్ స్క్వేర్ ఘటనల తర్వాత ముబారక్ గద్దె దిగారు. అప్పుడు సైన్యం దేశాన్ని పాలించాలని చూసింది. కానీ టెహ్రీర్ స్క్వేర్ ఉద్యమ సమయంలో ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా లేనప్పటికీ అధికారాన్ని చేపట్టాలని చూసినప్పుడు మాత్రం సైన్నాన్ని వ్యతిరేకించారు. ఈ అనుభవాన్ని గమనించిన సైన్యం ఇప్పుడు ప్రత్యక్షంగా అధికారాన్ని చేపట్టకుండా తాత్కాలిక పౌర యంత్రాంగాన్ని నియమించింది. సైన్యం ప్రజల ఆకాంక్షలను గుర్తించకపోతే ఈజిప్టులో మరోసారి ప్రజల తిరుగుబాటు రావడం ఖాయం. తిరుగుబాటు చేయడం తేలికే కానీ తిరుగు బాట వేయడమే కష్టం. ప్రజాస్వామ్యం పాదుకొలిపితేనే ఈజిప్టులో శాంతి సాధ్యమవుతుంది.

ప్రేమ విఘ్నేశ్వర్ రావు కె.
Published date : 22 Oct 2013 04:22PM

Photo Stories