Skip to main content

అణుభద్రత సదస్సు-2014

ఎం.నందకిశోర్ రెడ్డి, ఐఐఎస్, డిప్యూటీ డెరైక్టర్,సమాచార ప్రసార మంత్రిత్వశాఖ.
అణుభద్రత సదస్సు-2014కు నెదర్లాండ్స్ రాజధాని హేగ్ వేదికైంది. మార్చి 24-25 తేదీల్లో రెండురోజుల పాటు సాగిన ఈ సదస్సులో 53 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సులో ప్రధానంగా ఉగ్రవాదుల చేతుల్లోకి అణుపదార్థాలు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలని సభ్యదేశాలు గట్టిగా సంకల్పించాయి. వీటితోపాటు పలు సవాళ్లపై చర్చించాయి. అణు ఆధారిత పదార్థాల తస్కరణ, దారిమళ్లింపు జరగకుండా కాపాడేందుకు ఆవిర్భవించినదే అణుభద్రత సదస్సు. అణు పదార్థ్ధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లి, దుర్వినియోగానికి గురికాకుండా కాపాడడమే అణు భద్రత సదస్సు ప్రధాన లక్ష్యం. అణుభద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవడం.. పరిస్థితులకు అనుగుణంగా తక్షణమే స్పందించడం అణుభద్రతలో కీలకమైన అంశం.

అణుభద్రత సదస్సు- కార్యాచరణ:
అణ్వాయుధాలపై 2009 ఏప్రిల్‌లో చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చారిత్రక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అణుపదారా ్థలను జాతీయ, అంతర్జాతీయ సమాజం నియంత్రణలోకి తీసుకు రావాలన్నారు. ఈ లక్ష్య సాధనకు ఒబామా నాలుగేళ్ల గడువు విధించారు. ప్రేగ్ ప్రసంగం తర్వాత రెండు అణుభద్రత సదస్సులు జరిగాయి. మొదటిది 2010- వాషింగ్టన్‌లో.. రెండోది 2012-దక్షిణకొరియా రాజధాని సియోల్‌లో! ఈ రెండు సదస్సులూ అణు ఆధారిత పదార్థాలకు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించాయి. వాషింగ్టన్ సదస్సులో రాజకీయ ఒప్పందాల గురించి ప్రస్తావిస్తే.. సియోల్ సదస్సులో ఆయా ఒప్పందాల అమలుపై చర్చించారు. 2014 హేగ్ సదస్సులో అణుభద్రతకు సంబంధించి ఇప్పటివరకు సాధించిన ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై ప్రధానంగా దృష్టిసారించారు. అణుభద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని, పారదర్శకతను మెరుగుపరచుకోవాలని సదస్సులో పాల్గొన్న దేశాలను కోరడం జరిగింది.

హేగ్ సదస్సు-ఒప్పందాలు:
హేగ్ సదస్సులో.. అణు ఉగ్రవాదాన్ని అధిగమించటానికి అంతర్జాతీయంగా పరస్పర సహకారం ఆవశ్యకతను ప్రపంచ దేశాలన్నీ నొక్కి చెప్పాయి. 2010 వాషింగ్టన్, 2012 సియోల్ సదస్సుల నాటి అనుభవాల ఆధారంగా హేగ్ సదస్సులో కొత్త ఒప్పందాలు జరిగాయి. అవి...
  • ప్రపంచ వ్యాప్తంగా యురేనియం(హెచ్‌ఈయూ), ప్లుటోనియంల పరిమాణం తగ్గించడం.
  • ప్రమాదకర అణుధార్మిక పదార్థాల్లో బాగా శుద్ధి చేసిన యురేనియం, ప్లుటోనియం నిల్వలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించడం.
  • రేడియోధార్మిక పదార్థ్ధాల (తక్కువగా శుద్ధి చేసిన యురేనియం, ప్లుటోనియం సహా)కు భద్రత కట్టుదిట్టం చేయడం.
  • పరస్పర అంతర్జాతీయ సమాచార మార్పిడి, సహకారం, సమష్టి అభివృద్ధి. శక్తి ఉత్పాదనలో వీలున్నంతవరకు తక్కువ పరిమాణంలో అణు ఇంధన వినియోగం. బాగా శుద్ధి చేసిన యురేనియం (హెచ్‌ఈయూ-హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియం), ప్లుటోనియంల వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించడం.
  • తక్కువగా శుద్ధి చేసిన యురేనియం, కోబాల్ట్-60, స్ట్రాన్షియమ్-90, సీజియమ్-137లాంటి ఇతర స్వల్ప రేడియోధార్మిక పదార్థాల గురించి కూడా ఒప్పందం జరిగింది. వీటిని ఎక్కువగా వైద్య, పారిశ్రామిక, పరిశోధనతోపాటు సాధారణ పేలుడు పదార్థాల తయారీలోనూ ఉపయోగిస్తారు.
సాధించిన విజయాలు:
  • 500 కిలోల బాగా శుద్ధి చేసిన యురేనియం(హెచ్‌ఈయూ), ప్లుటోనియాన్ని అమెరికా, యూకేలకు తిరిగి పంపించివేయాలని జపాన్ నిర్ణయించింది. ఇది విజయం కిందే లెక్క. ఎందుకంటే.. 500 కిలోల అణు పదార్థాలతో 50 నుంచి 70 అణు బాంబులు తయారుచేయొచ్చు.
  • ఇక 2014 హేగ్ సదస్సు విషయానికి వస్తే.. ఈ వేదికపై సాధించిన అతిపెద్ద విజయం-అణుభద్రతను మరింత పటిష్టం చేసేందుకు 35 దేశాలు సంతకం చేయడానికి ముందుకు రావడం ఈ చర్య అణుభద్రతకు సంబంధిం చిన ప్రగతి, సంస్థాగత వ్యవహారంగా మార్చేందుకు దోహదపడుతుంది. ఇలాంటి విధానం ద్వారా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) సూచించిన భద్రతా ప్రమాణాలకు సభ్యదేశాలు కట్టుబడి ఉండేలా అమెరికా, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ కృషిచేస్తున్నాయి.
అణుభద్రత సదస్సు-అపజయాలు:
  • సురక్షితం కానీ అణు ఆధారిత పదార్థ్ధాలన్నింటికీ నాలుగేళ్లలోపు భద్రత కల్పించాలని 2010 నాటి తొలి సదస్సు పిలుపునిచ్చింది. అయితే, అది కార్యరూపందాల్చలేదు . వాస్తవానికి వేటిని సురక్షితం కానివిగా భావించాలి? అనే విషయంలో దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అణు పదార్థ్థాల విషయంలో తమ సార్వభౌమత్వాన్ని కోల్పోకూడదని దేశాలు భావిస్తున్నాయి.
  • ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సున్నితమైన అణుపదార్థ్ధాల నిల్వలు అధిక మొత్తంలో ఉన్నాయన్నది వాస్తవం. 1390 టన్నుల హెచ్‌ఈయూ, 490 టన్నుల ప్లుటోనియం నిల్వలు ఉన్నట్లు అంచనా. ఇందులో 85 శాతం మిలటరీ రంగంలో ఉంది.
అణుభద్రత - భారత్ - అనుకూలత:
సదస్సు లక్ష్య సాధనలో భారతపాత్ర మిశ్రమమనే చెప్పాలి.
  • అంతర్జాతీయ ఉగ్రవాదం నిరోధానికి అంతర్జాతీయంగా ఆమోదించిన 13 సూత్రాల విధానంలో భారత్ భాగస్వామి. అణు పదార్థ్ధాల భౌతిక రక్షణకు సంబంధించిన కన్వెన్షన్‌లో కూడా మన దేశానికి భాగస్వామ్యం ఉంది. ఆ కన్వెన్షన్‌కు 2005లో జరిగిన సవరణలను సైతం భారత్ ఆమోదించింది. అలాగే అణు ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ ద సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టైజం)లోనూ భారత్ భాగస్వామిగా ఉంది. ఈ రెండు ఒప్పందాలకూ తన మద్దతును కొనసాగిస్తూనే ఉంది.
  • అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)... ఆధ్వర్యంలో అణు విద్యుత్ కేంద్రాల(న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్) పరిశీలనను భారత్ ఎన్నడూ వ్యతిరేకించలేదు. వాస్తవానికి ఐఏఈఏ బృందం చేస్తున్న సమీక్షను సమర్థిస్తూ వస్తోంది. తద్వారా తన అణు పదార్థాల విషయంలో అంతర్జాతీయ భద్రత ప్రమాణాలు పాటిస్తోందనే భరోసాను ప్రపంచానికి ఇస్తోంది. అంతేకాకుండా అణు భద్రత ప్రమాణాలపై ఏర్పాటైన ఐఏఈఏ కమిషన్‌లో, అణు భద్రతపై సలహా సంఘంలోనూ భారత్ సభ్యదేశం. ఐఏఈఏ ఆధ్వర్యంలో అణు భద్రత పత్రాల రూపకల్పనలోనూ మన దేశం చురుగ్గా పాల్గొంది. అణు భద్రతపై ఐఏఈఏ కార్యాచరణకు కూడా తన వంతు తోడ్పాటును అందించింది. రేడియోధార్మిక వనరులను సమర్థవంతంగా గుర్తించలేని దేశాలకు వాటి పరిశోధన, సేకరణలో అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ద్వారా భారత్ తనవంతు సహకారాన్ని అందిస్తోంది.
  • విధ్వంసకర ఆయుధాలు ఉగ్రవాదులకు అందకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 2002లో భారత్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతేకాకుండా అణు ఉగ్రవాద నిరోధానికి అంతర్జాతీయంగా చేపడుతున్న అన్ని చర్యల్లోనూ మన దేశం భాగస్వామిగా ఉంటూ ఆయా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటోంది.
  • భారత అణుశక్తి చట్టం-1962 కార్యాచరణ ప్రణాళిక అణుధార్మిక పదార్థాల భద్రతకు చట్టబద్ధత కల్పిస్తోంది. ఈ చట్టానికి సవరణల ద్వారా అణు భద్రత ప్రమాణాలకు మరింత పటిష్టత చేకూర్చాలనే ప్రతిపాదన ఉంది. 2005, జూన్‌లో భారత్ సామూహిక హనన ఆయుధాలు, పంపిణీ వ్యవస్థల (ప్రొహిబిషన్ ఆఫ్ అన్‌లాఫుల్ యాక్టివిటీస్) చట్టం 2005ను ఆమోదించింది. అలాగే మన దేశం ఎన్‌ఎస్‌జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్) మార్గదర్శకాలకు కట్టుబడి ఉంది. అణు భద్రత నిర్వహణ వ్యవస్థ(న్యూక్లియర్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ) ఏర్పాటుకు వీలు కల్పించే బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
  • అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఫర్ క్యాన్సర్ థెరపీ(పీఏసీటీ) కార్యక్రమానికి భారత్ తన సహకారాన్ని అందిస్తోంది. మన దేశంలో తయారుచేసిన క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడే కోబాల్ట్ టెలిథెరపీ మిషన్ (భాభాట్రాన్ 2)ను అందించేందుకు వీలుగా ఐఏఈఏ, శ్రీలంక, నమీబియాలతో త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంది. ఇలాంటి యంత్రాన్నే 2008లో వియత్నాంకు అందించింది.
  • మొదటి అణుభద్రత సదస్సు సందర్భంగా అణు శక్తి భాగస్వామ్యం కోసం గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్‌షిప్(జీసీఎన్‌ఈపీ) అనే అంతర్జాతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని భారత్ ప్రకటించింది. ఐఏఈఏతోపాటు ఇతర దేశాల భాగస్వామ్యంతో ఇది అంతర్జాతీయ ప్రమాణాలు కలిగి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఒప్పందాలు కూడా జరిగాయి. ఈ సెంటర్‌లో ముఖ్యంగా అడ్వాన్స్‌డ్ న్యూక్లియర్ ఎనర్జీ సిస్టమ్ స్టడీస్, న్యూక్లియర్ సెక్యూరిటీ, రేడియేషన్ సేఫ్టీ, అప్లికేషన్ ఆఫ్ రేడియోఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ఈ కేంద్రం దీర్ఘకాలంలో అణుభద్రతకు వీలు కల్పించే టెక్నాలజీ, వ్యవస్థల అభివృద్ధికి సంబంధించి పరిశోధనలు కొనసాగిస్తుంది.
  • అణు భద్రత సదస్సు కార్యాచరణలో భాగంగా.. వాషింగ్టన్ సదస్సు తీర్మానాల అమలుకు భారత్ మద్దతు తెలుపుతుంది. ఎన్‌ఎస్‌ఎస్ ప్రక్రియకు 2012 జనవరి 16-17 తేదీల్లో ఢిల్లీ సమావేశం ఏర్పాటుకు భారత్ సహకరించింది.
విమర్శలు:
భారత అణు భద్రతా చర్యలపై సమీక్షకు ఆహ్వానించడంలేదని న్యూక్లియర్ మెటీరియల్స్ సెక్యూరిటీ ఇండెక్స్ తన నివేదికలో విమర్శించింది. పౌర అణు సౌకర్యాల భద్రతకు తీసుకున్న అత్యవసర ఏర్పాట్ల గురించిన సమాచారాన్ని భారత్ బహిరంగ పరచడంలేదని పేర్కొంది. అంతేకాకుండా గతంలో జరిగిన సదస్సులో ఇచ్చిన హామీలను భారత్ పూర్తిస్థాయిలో నిలబెట్టుకోలేకపోయింది. తన అణు కార్యక్రమాల పర్యవేక్షణకు స్వతంత్ర రెగ్యులేటరీ బోర్డును ఏర్పాటు చేస్తానని 2012నాటి అణు భద్రత సదస్సులో ప్రకటించింది. ఇందుకు సంబంధించిన బిల్లు 2011లో పార్లమెంటు ముందుకు వచ్చినప్పటికీ ఆమోదం పొందలేదు. ఇదిలాఉంటే అణుభద్రతను పెంచేందుకు ఉద్దేశించి 2014 హేగ్ సదస్సులో జరిగిన ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. తద్వారా ఐఏఈఏ సూచించిన అణుభద్రతా ప్రమాణాలకు భారత్ పూర్తిస్థాయిలో కట్టుబడలేదనే విమర్శలకు ఆస్కారం ఇస్తోంది.

భారత్ అణు సిద్ధాంతం:
అణ్వాయుధాల విషయంలో భారత్ ప్రత్యేక అణువిధానాన్ని కొనసాగిస్తుంది. దీని ప్రకారం- భారత్ అణ్వస్త్రాలను మొదటగా ప్రయోగించదు. అలాగే అణ్వాయుధ రహిత దేశాలపై అణుదాడులు చేయదు. దాంతోపాటు అణ్వాయుధాలకు సంబంధించి నియంత్రణ, నిర్ణయాధికారం రాజకీయ నాయకత్వం చేతిలో ఉంటుంది.

  • అణ్వస్త్రాలను ముందుగా ప్రయోగించరాదనే సిద్ధాంతానికి భారత్ కట్టుబడి ఉంది. ముందుగా ప్రయోగించకుండటం(నో ఫస్ట్ యూజ్).. శత్రు దేశం నుంచి ప్రమాదం రాకుండా అడ్డుకోవడానికి వీలుగా కనీస అణ్వాయుధ సంపత్తి(థియరీ ఆఫ్ మినిమమ్ డిటరెన్స్).. రెండూ సమాంతరంగా పనిచేస్తాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఇరు దేశాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందే తప్ప, ఎలాంటి అర్థవంతమైన పరిష్కారానికి దారితీయదు. ఇలాంటి పరిస్థితుల్లో ముందుగా అణ్వాయుధాలు ప్రయోగించకూడదనే భారత విధానం ఎంతో సముచితంగా కనిపిస్తుంది.
  • కనీస అణ్వాయుధ సంపత్తి(క్రెడిబుల్ మినిమమ్ డిటరెంట్) కలిగి ఉండాలనే విధానంలో భాగంగా.. ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉన్న సరిపడ అణుబలాలు.. సమర్థవంతమైన ఆదేశ, నియంత్రణ విధానం.. పటిష్టమైన నిఘా, ముందస్తు హెచ్చరికల విభాగం.. వ్యూహానికి అనుగుణంగా సమగ్రమైన ప్రణాళిక, శిక్షణ.. అణు ఆయుధాలు, బలాలను మోహరించే సంకల్పం కలిగి ఉండాలి. దాడిచేసిన శత్రుదేశాన్ని శిక్షించి గట్టిగా జవాబుచెప్పే స్థాయిలో కనీస అణ్వాయుధ సంపత్తి ఉండాలి. సమర్థత, విశ్వసనీయత, సంసిద్ధత అనేవి భారత అణు విధానం మూల సూత్రాలు. మన అణువిధానం.. అణ్వస్త్రాల పరిమాణం కంటే కూడా వాటి సమర్థతకే అధిక ప్రాధాన్యం ఇస్తోంది. నావిక, వైమానిక, భూమార్గాల్లో సమర్థంగా పనిచేయగల అణు బలాలపై ఎక్కువ దృష్టి సారిస్తోంది.
న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ):
  • అణ్వాయుధాల నిర్వహణ కోసం మూడంచెల న్యూక్లియర్ కమాండ్ అథారిటీ (ఎన్‌సీఏ)ని భారత్ 2003, జనవరి 4న వెల్లడించింది. ఎన్‌సీఏలో రాజకీయ మండలి, కార్యనిర్వహణ మండలి, వ్యూహాత్మక దళం (ఎస్‌ఎఫ్‌సీ) అనే మూడు విభాగాలు ఉంటాయి. రాజకీయ మండలి ప్రధానమంత్రి నేతృత్వంలో పనిచేస్తుంది. అణ్వాయుధాల ఉపయోగానికి సంబంధించిన నిర్ణయాలను ఈ మండలి తీసుకుంటుంది. అలాగే ప్రధానమంత్రి భద్రతాసలహాదారు ఆధ్వర్యంలో కార్యనిర్వహణ మండలి పనిచేస్తుంది. రాజకీయ మండలి ఆదేశాలను ఎన్‌సీఏ అమలు చేసేందుకు అవసరమైన సమాచారాన్ని కార్యనిర్వహణ మండలి సిద్ధం చేస్తుంది. కార్యనిర్వహణ మండలిలో రక్షణ దళాల అధిపతులు, ఐఐసీ చైర్మన్, ఎన్‌ఎస్‌ఏబీ కన్వీనర్, కేబినెట్ సెక్రటరీ, నిఘావిభాగాల ముఖ్యులు, కేబినెట్ కమిటెడ్ ఆఫ్ సెక్యూరిటీ(సీసీఎస్) సంబంధిత మంత్రుల కార్యదర్శులు ఉంటారు. వ్యూహాత్మక దళం(ఎస్‌ఎఫ్‌సీ) అణ్వాయుధాల నిర్వహణ, వాస్తవంగా ప్రయోగించడం తదితర వ్యవహారాలను చూస్తుంది.
సాధించాల్సింది ఎంతో ఉంది:
  • హేగ్ సదస్సు ముగింపు రోజున అమెరికా అధ్యక్షుడు ఒబామా కొన్ని సలహాలు, సూచనలు చేశారు. అణు భద్రత విషయంలో తీసుకోవాల్సిన చర్యల జాబితాను ఆయా దేశాలు ముందుగా సిద్ధం చేయాలన్నారు. తద్వారా 2016 సదస్సు నాటికి మరింత సమర్థంగా ముందడుగు వేయొచ్చన్నారు. అణ్వాయుధాల భద్రత కోసం మంత్రులు, సాంకేతిక నిపుణుల ప్రమేయంతో పనిచేసే ప్రత్యామ్నాయ వ్యవస్థను రూపొందించాలని ఒబామా సూచించారు.
  • అణు భధ్రత సదస్సు ప్రక్రియ ఆయా దేశాలపై చేసిన ఒత్తిడి కారణంగానే సమాచార మార్పిడి, నిర్వహణ, అవగాహన, పనితీరు సమీక్ష సాధ్యమైంది. మొత్తంగా చూస్తే అణుభద్రత విషయంలో 2016 సదస్సు నాటికి వ్యవస్థాగతంగా మరింత పటిష్టం కావాల్సి ఉంది. ఇది స్వచ్ఛంధ సంస్థ స్థాయిని దాటి సమర్థ వ్యవస్థగా రూపొందాలి. పరస్పర సహకారం, ప్రోత్సాహం, అంకితభావం, సమీక్షించే విషయాల్లో చొరవ చూపాలి. లేకుంటే.. అణుభద్రత సదస్సుల ఆశయాలు, లక్ష్యాలు ఎక్కువ కాలం నిలబడలేవు.
Published date : 11 Apr 2014 11:30AM

Photo Stories