ఆధిపత్యానికి ఇజ్రాయెల్... అస్తిత్వానికి పాలస్తీనా
Sakshi Education
డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
అభం శుభం తెలియని చిన్నారులపై బుల్లెట్ తూట్లు... ప్రాణం పోసే ఆసుపత్రిపై కర్కశంగా బాంబు దాడులు... పసికందుల నుంచి పండు ముదుసలి వరకు విచక్షణారహితంగా సాగించిన మానవ హననం... వందల్లో మృతులు... వేలల్లో క్షతగాత్రులు... ఇలా ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. తాగుదామంటే నీరులేదు. అయినవారిని బతికించుకుందామంటే ఆసుపత్రుల్లో మందుల్లేవు. రాత్రీ, పగలనే తేడా లేదు... ఎటుచూసినా అంధకారమే. ఇవీ గత రెండు వారాల్లో పాలస్తీనాలో అలముకున్న విషాద ఛాయలు. ఆధిపత్య పోరులో ఇజ్రాయెల్ సాగించిన హింసాకాండకు అద్దం పట్టే దృశ్యాలు.
ఈ ఏడాది జూలై 8వ తేదీ నుంచి రెండు వారాలపాటు పాలస్తీనాలోని ప్రముఖ పట్టణమైన గాజాలో కొనసాగిన ఇజ్రాయెల్ దాడుల్లో వెయ్యి మందికిపైగా మరణించారు. క్షతగాత్రుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. ఈ సంక్షోభానికి దారి తీసిన పరిస్థితుల వెనక అసలు కారణమేంటి?
చరిత్ర ఏం చెబుతోందంటే?
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐక్యరాజ్యసమితి ప్రధానాంగమైన భద్రతాసమితి తీర్మానం మేరకు పాలస్తీనా దేశంలోని కొంత భూభాగంలో ఇజ్రాయెల్ అనే రాజ్యం ఏర్పాటైంది. అయితే ఆ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న అరబ్‌లు (పాలస్తీనియన్లు) దీన్ని వ్యతిరేకించారు. దాని పరిణామమే ఇజ్రాయెల్, పొరుగు అరబ్ దేశాల మధ్య యుద్ధానికి దారీతీసింది. ఫలితంగా ప్రస్తుత సంక్షోభానికి కేంద్రబిందువైన గాజా ఈజిప్ట్ నియంత్రణలోకి, వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం జోర్డాన్ ఆధీనంలోకి వెళ్లాయి.
1967లో ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య జరిగిన యుద్ధంలో పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. కొన్నేళ్లపాటు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనాలో తిష్టవేశాయి. తన అస్తిత్వాన్ని గుర్తించడానికి నిరాకరించిన అరబ్ దేశాలు ఏనాటికైనా దిగివచ్చి, ఉనికిని అధికారంగా ఆమోదిస్తాయనే ఉద్దేశంతో ఈ ఆక్రమణను ఇజ్రాయెల్ కొనసాగించింది.
1973లో తిరిగి అరబ్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం సంభవించింది. యాంకిప్పూర్ యుద్ధం లేదా రమాదాన్ యుద్ధంగా ప్రాచుర్యం పొందిన ఈ ఆరు రోజుల పోరులో ప్రారంభ దశలో ఈజిప్ట్, సిరియా దేశాల సైన్యాలు ముందంజ వేసినప్పటికీ యుద్ధం ముగిసే నాటికి ఇజ్రాయెల్‌దే పైచేయి అయింది. సీనాయ్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఆక్రమించుకుంది. అగ్రరాజ్యాలైన అమెరికా, సోవియట్ యూనియన్ (అమెరికా ఇజ్రాయెల్ వైపు-రష్యా పాలస్తీనా వైపు) ఈ యుద్ధంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకున్నాయి. ఐక్యరాజ్యసమితి చొరవతో కాల్పుల విరమణ కుదిరింది. కానీ అరబ్ దేశాలు ఊహించని ఓటమి చవిచూశాయి. 1978లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ చొరవతో క్యాంప్ డేవిడ్ ఒప్పందం జరిగింది. దీని ఫలితమే మొదటిసారిగా ఇజ్రాయెల్ దేశాన్ని ఈజిప్ట్ గుర్తించడం, తాను ఆక్రమించిన సీనాయ్ భూభాగాన్ని ఇజ్రాయెల్ తిరిగి ఈజిప్ట్‌కు అప్పగించింది.
ఇజ్రాయెల్‌ను గుర్తించని హమాస్
ఇజ్రాయెల్ 1967 నుంచి తన ఆక్రమణలో ఉన్న గాజా ప్రాంతం నుంచి 2005లో సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఆ తర్వాత గాజాలో జరిగిన ఎన్నికలలో ఉగ్రవాద భావాలు కలిగిన హమాస్ వర్గం ఫతా అనే వర్గాన్ని ఓడించి అధికారాన్ని చేజిక్కించుకుంది. హమాస్ నేతృత్వంలోని గాజా ప్రభుత్వం ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి నిరాకరించింది. అప్పటి నుంచి నేటి వరకు గాజా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ దిగ్బంధానికి గురిచేసి అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతోంది. గాజా నుంచి వ్యక్తులు, సరుకుల రాకపోకల విషయంలో పలు అడ్డంకులు కలిగిస్తోంది. అయితే గాజా నుంచి హమాస్ వర్గానికి చెందిన వారు ఇజ్రాయెల్‌పై దాడిచేయడం, సరిహద్దు ప్రాంతంలో నివసించే ఇజ్రాయెల్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటివి మరవలేనివి. మొత్తం మీద గాజా ప్రాంతంలో సగటు ప్రజల జీవనం దుర్భరంగా ఉంది. రోజురోజుకీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య, మౌలిక సదుపాయాల (నీరు, విద్యుచ్ఛక్తి, రవాణా) కొరత, ఇజ్రాయెల్ సైన్యం చీటికీ మాటికీ పౌర జీవనాన్ని ఏదో ఒక నెపంతో స్తంభింపజేయడం, పాలస్తీనా యువకులను విచక్షణారహితంగా నిర్బంధించి హింసించడం పరిపాటి అయింది. 1948, 1967, 1973లలో జరిగిన యుద్ధాలలో వేలాది మంది పాలస్తీనియన్లు తమ నివాసాలను వదిలి ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్ దేశాలకు పారిపోయి కాందిశీకులుగా తలదాచుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి, పొరుగు అరబ్ దేశాలు అందించే ధన సహాయంతో వీరంతా మనుగడ సాగిస్తున్నారు.
వరుస దాడులు:
2008లో ఇజ్రాయెల్ గాజాపై చేసిన దాడిలో 1,300 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది సాధారణ పౌరులే. 13 మంది ఇజ్రాయెల్ సైనికులు కూడా మరణించారు. తిరిగి 2012లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో గాజాలో నివసిస్తున్న 167 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. ఇలా పదేపదే గాజాపైకి ఇజ్రాయెల్ దాడి చేయడానికి కారణం హమాస్ వర్గ కవ్వింపు చర్యలే అనడంలో సందేహం లేదు. అయితే 1967 నుంచి తన ఆక్రమణలో ఉన్న గాజాకు న్యాయపరమైన పాలన అందించడం, అక్కడి ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ఇజ్రాయెల్‌పై ఉంది. ఇది అంతర్జాతీయ న్యాయ నిబంధన.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
ప్రపంచ వ్యాప్తంగా గాజా, వెస్ట్‌బ్యాంక్ తీరాన్ని కలిపి పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని, దానికి ఇజ్రాయెల్ మాదిరిగానే రాజ్య హోదాని కల్పించాలని మేధావులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు. ఇజ్రాయెల్ మాత్రం తన భద్రతకు, మనుగడకు హామీ లభించినప్పుడే పాలస్తీనా ఏర్పడటానికి ఒప్పుకుంటామని వాదిస్తోంది. అయితే అతివాద భావాలు కలిగిన హమాస్ వర్గం ఇందుకు ఒప్పుకుంటుందా? వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెలీలు అక్రమంగా చేపట్టిన గృహ నిర్మాణాల సంగతేంటి? ఓవైపు ముస్లింలకు, మరోవైపు యూదులకు, ఇంకోవైపు క్రైస్తవులకు పవిత్రస్థలం అయిన జెరూసలెం హోదా ఏమిటి? ఇది ఎవరి ఆధీనంలో ఉండాలి? 4.6 మిలియన్ల పాలస్తీనియన్లు పొరుగు దేశాలలో కొన్ని దశాబ్దాల తరబడి కాందిశీకులుగా దుర్భర జీవనం సాగిస్తున్నారు. వీరి భవిష్యత్ ఏమిటి? వీరంతా ఇప్పుడు స్వదేశానికి తిరిగి రావొచ్చా? వారిని అనుమతిస్తే ఇజ్రాయెల్ భద్రతకు భంగం కలుగుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు దొరకడం కష్టం.
అరాఫత్‌కు ముందు... ఆ తర్వాత:
పాలస్తీనా చరిత్రను యాసర్ అరాఫత్‌కు ముందు.. ఆ తర్వాతగా చెప్పవచ్చు. అరాఫత్ మరణించిన తర్వాత పాలస్తీనా ఉద్యమం రెండుగా చీలిపోయింది. వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని అల్ ఫతా చేజిక్కించుకోగా... గాజా హమాస్ చేతుల్లోకి వెళ్లింది. ఈ రెండు బృందాల మధ్య కొరవడిన ఐక్యత పాలస్తీనాకు శాపంగా మారింది. యాసర్ అరాఫత్ మరణం తర్వాత ఆ దేశ విముక్తికి కలసికట్టుగా పోరాడేవారు కరువయ్యారు. ప్రపంచ దేశాల నుంచి సైతం పాలస్తీనాకు మద్దతు తగ్గిపోయింది. పాలస్తీనాకు జాతీయ ప్రతిపత్తి కల్పించి, స్వేచ్ఛను ప్రసాదించాలంటూ అరాఫత్ అంతర్జాతీయ వేదికపై తుదిశ్వాస వరకూ శాంతి యుతంగా పోరాడారు.
భారత్ వైఖరి:
పాలస్తీనా ఉద్యమ నిర్మాత అయిన యాసర్ అరాఫత్ భారత్ చిరకాల మిత్రుడు. నెహ్రూ, ఇందిరాగాంధీలకు సన్నిహితుడు. యూదులతోపాటు పాలస్తీనాలో నివసించే అరబ్‌లు కూడా ఒక రాజ్యంగా అవతరించే హక్కు ఉందని భారత్ ఎప్పుడూ వాదిస్తూనే ఉంది. అంతమాత్రాన భారత్ ఇజ్రాయెల్ ఉనికికి వ్యతిరేకమని భావించకూడదు. 1948లో ఇజ్రాయెల్ అవతరించినపుడు దాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి మూడు దేశాలలో భారత్ ఒకటి. అయితే పాలస్తీనా ప్రజల పట్ల అనుసరిస్తున్న దురాక్రమణ విధానాన్ని నిరసిస్తూ కొన్ని దశాబ్దలపాటు ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను నెలకొల్పడానికి ఇష్టపడలేదు. ఆనాటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో మొదటిసారిగా పూర్తి స్థాయి దౌత్య సంబంధాలకు పునాది పడింది. వాజ్‌పేయి కాలంలో ఈ సంబంధాలు మరింత పటిష్టమ య్యాయి. అప్పటి నుంచి నేటి వరకు ఇజ్రాయెల్‌తో సంబంధాలు మరింత బలపడ్డాయి. భారతదేశ భద్రతను సవాలు చేస్తూ కొనసాగుతున్న అంతర్గత, అంతర్జాతీయ ఉగ్రవాద కార్యకలాపాలను పసిగట్టి, వాటిని అరికట్టడంలో ఇజ్రాయెల్ ఎంతగానో సహకరిస్తుంది. దీనికి కారణం ఈ రెండు దేశాలకూ ఉమ్మడి శత్రువు పశ్చిమ ఆసియాలో విజృంభిస్తున్న ఉగ్రవాద సంస్థలే. వ్యవసాయరంగంలోనూ ఇజ్రాయెల్ నుంచి భారత దేశానికి సాంకేతిక పరిజ్ఞానం లభిస్తోంది.
ఇజ్రాయెల్ నుంచి ఆయుధ సంపత్తి:
దేశ రక్షణకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి భారత్ భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది. ఆయుధాల తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ రక్షణ రంగంలో స్వయంసమృద్ధికి తనవంతు సహకారాన్నందిస్తోంది. ఓవైపు చైనా, మరోవైపు పాకిస్థాన్ నుంచి ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో ఇజ్రాయెల్ పరోక్షంగా సహయపడుతోంది.
ఇజ్రాయెల్ విషయంలో భారత వైఖరి మారడానికి అమెరికా కూడా కొంతవరకు కారణమే. గత రెండు దశాబ్దాలలో భారతదేశ విదేశాంగ విధానం క్రమేణా మారుతూ వచ్చింది. ఒకప్పుడు అలీన దేశాల నాయకత్వంలో ప్రముఖపాత్ర పోషించిన మనదేశం నేడు అమెరికా, దాని మిత్రదేశాలకు దగ్గరవుతోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో మన ఆర్థికవిధానంలో కూడా మార్పులు వచ్చాయి. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వైపు మొగ్గు చూపుతోంది. అమెరికా, ఐరోపా దేశాల పెట్టుబడులను స్వీకరించడమే దీనికి ఉదాహరణ. ఇలా అగ్రరాజ్యాలు భారత్‌పై ఒత్తిడి తెచ్చి పాలస్తీనా విషయంలో వైఖరిని మార్చాయి.
మౌన ముద్ర వీడాలి:
ప్రతి దేశం తన మొదటి ప్రాధాన్యం దేశ భద్రతకు ఇస్తుంది. భద్రతాపరమైన అవసరాల దృష్ట్యా భారత్ ఇజ్రాయెల్‌కు దగ్గరకావడం, దాని విధానాలను సమర్థించడంలో తప్పేమీలేదు. కానీ పాలస్తీనాపై ఇజ్రాయెల్ సాగించిన దాష్టీకాన్ని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తుంటే భారత్ ఉదాసీనంగా వ్యవహరించడం సబబు కాదు. కొన్ని వందల ఏళ్ల వలసపాలనకు గురై, సామ్రాజ్యవాద కోరలలో నలిగిన భారత్ పాలస్తీనా పట్ల ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వలసవాద విధానాన్ని విమర్శించకుండా మౌనంగా ఉండిపోవడం సరైంది కాదు. మిత్రదేశంగా ఇజ్రాయెల్‌పై భారత్ నైతిక ఒత్తిడి తీసుకురావాలి. ఆయుధాల తయారీ, అమ్మకం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఆ దేశం నుంచి భారీఎత్తున ఆయుధాల దిగుమతి చేసుకునే భారతదేశం ఆయుధాల కొనుగోలును ఒక పావుగా ఉపయోగించి ప్రపంచశాంతికి, పాలస్తీనా ప్రజల మానవ హక్కుల పరిరక్షణకు చొరవ తీసుకోవడం ఎంతైనా అవసరం.

Published date : 01 Aug 2014 01:07PM