Burning Earth: భూగోళం.. ఇక మండే అగ్నిగోళం..
గ్లోబల్ వార్మింగ్ యుగం ముగిసిపోయిందని.. ఇక గ్లోబల్ బాయిలింగ్ శకం వచ్చేసిందని ఐక్యరాజ్యసమితి సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని యూరోపియన్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్, ప్రపంచ వాతావరణ సంస్థ వెల్లడించాయి.
సాధారణంగా జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యేదని.. కానీ, ఈ ఏడాది దాదాపు 17 డిగ్రీలకు పెరిగిందని వెల్లడించాయి. 1.20 లక్షల సంవత్సరాల్లో భూమి ఇంత వేడెక్కడం ఎప్పుడూ లేదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. విపరీత వేడి కారణంగా మంచు కరిగి వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే చైనా, దక్షిణ కొరియా, బ్రెజిల్, అమెరికా ఈశాన్య ప్రాంతాలు, జపాన్, భారత్, పాకిస్తాన్‌లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో పగటిపూటతో పోలిస్తే రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లబడుతుంది. కానీ, కాలిఫోర్నియాలోని ‘డెత్ వ్యాలీ’లో రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు.
☛☛ Environmental Changes: వాతావరణ మార్పులతో..అల్లకల్లోలం
అక్కడ జూలై నెలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అలాగే వాయవ్య చైనాలోనూ రికార్డు స్థాయిలో 52.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తరార్ధ గోళంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో వడగాడ్పులు వీచాయి. ఫలితంగా అంటార్కిటికాలో కూడా పెద్ద ఎత్తున మంచు కరిగిపోయింది. అలాగే ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, పోలాండ్ దేశాలను వడగాడ్పులు ఉక్కిరిబిక్కిరి చేశాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పొంచి ఉన్న కరువు ముప్పు..!
దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికా, ఆసియా దేశాలు వసంత కాలం చివరి నుంచి అత్యధిక వేడిని ఎదుర్కొన్నాయని యూరోపియన్ కోపర్నికస్ నివేదిక చెబుతోంది. అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో క్రమం తప్పకుండా 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. గ్రీస్, ఇటలీ, క్రొయేషియా, అల్జీరియా, కెనడాలో కార్చిచ్చులు చెలరేగి అడవులను దహించాయి. నాడాలో ఏకంగా నాలుగు వారాల్లో 46 వేల చదరపు మైళ్ల అడవులు బూడిదయ్యాయి. 60 శాతం దేశాల్లోని అడవుల్లో మంటలు చెలరేగాయని నివేదిక తెలిపింది.
☛☛ Environment and Human Life: కొంచెం నెమ్మదిస్తేనే... నిలవగలం!
వీటి ఫలితంగా 1950తో పోలిస్తే ప్రపంచ భూభాగంలో దాదాపు మూడో వంతు ఏటా కరువు సంభవిస్తుందని, ఇది 10 లక్షల మందిని తీవ్ర ఆకలిలోకి నెడుతుందని శాస్త్రవేత్తల నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఈ ఏడాది చివరితో పాటు 2024లో ఎల్‌నినో ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఫలితంగా బ్రిటన్, ఐర్లాండ్, బాల్టిక్ సముద్రం, జపాన్ సముద్రం, పసిఫిక్, పశ్చిమ హిందూ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముంది. కాగా, ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ మేర కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలతో కలిసి ఐక్యరాజ్యసమితి చర్యలు చేపడుతోంది.
☛☛ Forest Conservation Act: అటవీ సంరక్షణ చట్టం ఏం చెబుతోంది!