Skip to main content

జపాన్ తో బంధం... అభివృద్ధికి అందలం

డా॥బి.జె.బి. కృపాదానం, సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్
భారత ప్రధాని నరేంద్రమోడీ జపాన్ పర్యటన... ఆ సందర్భంలో ఇరు దేశాల ప్రధానుల శిఖరాగ్ర సమావేశాన్ని ప్రపంచం ఆసక్తిగా పరిశీలించింది. ఈ పరిణామం పొరుగునే ఉన్న చైనాలో గుబులు రేపింది. భారత్‌కు జపాన్ మరింత దగ్గర కావటాన్ని జీర్ణించుకోలేకపోయింది. స్నేహశీలత, చతురతను కలగలిపి సాహసోపేతంగా ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని రెట్టింపు చేస్తూ , ప్రత్యేక కీలక ప్రాపంచిక భాగస్వామ్య (స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్‌‌టనర్‌షిప్) హోదాని పొందడం జన చైనాను కలవరపరిచే అంశమే. ఈ పర్యటన ముగిసి రెండు వారాలు తిరక్కముందే చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌ను సందర్శించడం ఆసక్తికర విషయం. ఇందులో భాగంగా పలు అంశాలపై కీలక ఒప్పందాలు చేసుకోవడం భారత్‌కు శుభసూచికలే. అయితే చైనా, జపాన్‌ల మధ్య ఉన్న వైరం విషయంలో భారత్ ఏమేర ఆచితూచి అడుగేసి విదేశీ దౌత్యంలో రాణిస్తుందో చూడాలి.

నాడు రష్యా... నేడు జపాన్
ఆసియా భద్రతకు భారత్,జపాన్ దేశాలను లంగర్లు (యాంకర్స్)గా భావించడంలో అతిశయోక్తి లేదు. ఈ రెండు దేశాలు మరింత సన్నిహితం కావడాన్ని మిగతా అగ్రదేశాలు హర్షిస్తే, చైనాకు ఇది మింగుడుపడలేదు. ఇండియాకు, తనకు మధ్య ఎలాంటి అగాధాన్ని జపాన్ సృష్టిస్తుందోనని కలవరపాటుకు లోనైంది. అనేక దేశాలతో కీలక భాగస్వామ్య (స్ట్రాటజిక్ పార్‌‌టనర్‌షిప్) ఒప్పందాలు నెరపడంలో భారత్‌ది ప్రత్యేక స్థానం. అయితే ఒక్క పూర్వపు సోవియట్ యూనియన్‌తో మాత్రమే ప్రత్యేక కీలక భాగస్వామ్య ఒప్పందం కలిగి ఉంది. ఇప్పుడు జపాన్‌తో అలాంటి ప్రత్యేక బంధం పెనవేసుకోవడం ప్రధాని మోడీ పర్యటనలో ఓ కలికితురాయి. భారత్‌కు జపాన్ 35 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం అందించడంతోపాటు భారత్‌లో జపాన్ పెట్టుబడుల పెరుగుదల, పారిశ్రామిక రంగంలో మరింత సహకారం పెంపొందించడం ఇందులో ప్రధాన అంశాలు. 2013 నాటికి చైనా-జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 312 బిలియన్ డాలర్లు. ఇండియా -జపాన్‌ల మధ్య అది కేవలం 16.31 బిలియన్ డాలర్లు మాత్రమే. జపాన్ విదేశీ వాణిజ్యంలో ఇది కేవలం ఒక శాతం మాత్రమే. మన దేశం మొత్తం వాణిజ్యంలో ఇది 2.5 బిలియన్ డాలర్లు కాగా దేశానికి లభించే విదేశీ పెట్టుబడులలో ఇది ఏడు శాతం.

మోడీ జపాన్ పర్యటన ఫలితాలు
 • టోక్యో శిఖరాగ్ర సమావేశంలో అంగీకరించిన కీలక ఒప్పందాలు భారత్-జపాన్‌ల భద్రతకు దోహదపడతాయి. దీంతోపాటు ఇండో-పసిఫిక్ ఆసియా దేశాలకీ లబ్ధి చేకూరుస్తాయి.
 • ప్రత్యేక కీలక ఒప్పందంతో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోని చిన్న దేశాలు ఈ రెండు దేశాలకు దగ్గర కావడానికి అవకాశం ఏర్పడింది.
 • భవిష్యత్‌లో ఆసియాలో సైనిక ఘర్షణలు భూభాగంలో కాకుండా తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రం, హిందూ మహాసముద్రం తీరాలలో సంభవించవచ్చు. జపాన్-ఇండియా నౌకాదశాలు మరింత సంఘటితమై, భవిష్యత్‌లో ఇండో-పసిఫిక్ తీరంలో అమెరికా ప్రాబల్యం తగ్గినట్లయితే ఆ లోటును పూడ్చవచ్చు.
 • ఈ రెండు దేశాలకూ మరింత బలాన్ని చేకూర్చే సముద్ర తీర సహకారం, ఇండో -పసిఫిక్ దేశాలతో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ ప్రాచ్య ఆసియా దేశాలకు ఎంతో అవసరం. ఇది వారికి ఆమోదయోగ్యం కూడా.
 • ఇండియా-జపాన్‌ల మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు ఆసియాలో సమతౌల్యతకు దారితీస్తాయి. ఈ విషయంలో ప్రస్తుతానికి చైనా ఆధిపత్యం సాగుతోంది.
 • ఇకపై అమెరికా, ఆసియా భద్రతలో తీసుకునే నిర్ణయాలలో రెండు దేశాలకు సముచిత స్థానం ఇవ్వాల్సి వస్తుంది.
 • రక్షణ రంగంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలు మరింత పటిష్టమయ్యాయి.
అద్వితీయం.. జపాన్ సాంకేతిక పరిజ్ఞానం
రక్షణ రంగంలో జపాన్‌కున్న సాంకేతిక పరిజ్ఞానం, పాశ్చాత్య దేశాల కంటే మెరుగైంది. ఇదిలా ఉంటే జపాన్ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమెరికాతో పంచుకోవడానికి ఇష్టపడదు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో తలెత్తిన ఇబ్బందులే ఇందు కారణం. ఏవియెనిక్స్, ప్రసారాలు, ఎలక్ట్రానిక్ యుద్ధ సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో జపాన్ అగ్రగామి. నిఘా కార్యకలాపాలకు వాడే రాడార్ల తయారీలో ఈ దేశానికి ఇంకెవ్వరూ సాటిరారు. రక్షణ విధానంలో ఇటీవల కాలంలో వస్తున్న మార్పులు భారత్-జపాన్‌ల మధ్య రక్షణ రంగంలో మరింత సహకారానికి తోడ్పడతాయి. యుద్ధ నౌకల నిర్మాణంలో జపాన్‌దే పైచేయి. ఉమ్మడి సైనిక ప్రదర్శనలతో పాటు భారత నావికా రంగ ఆధునికీకరణలో జపాన్ సహకారాన్ని, భారతదేశ భద్రతకు సంబంధించి కీలక సమాచారాన్ని అందిపుచ్చుకోవచ్చు. చైనా మినహా అన్ని ఆసియా దేశాలు ఉమ్మడి భద్రతలో ఈ రెండు దేశాలవైపే చూస్తున్నాయి.

‘అణు’వంత జాప్యం... అయినా అభిలషణీయం
ఈ రెండు దేశాల మధ్య పౌర అణు సహకార ఒప్పందం (సివిలియన్ న్యూక్లియర్ కోపరేషన్ అగ్రిమెంట్) జరగలేదు. అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై సంతకం చేయని ఏ దేశంతోనైనా అణురంగంలో సహకార ఒప్పందాన్ని జపనీయులు వ్యతిరేకిస్తారు. మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి.

ఈ కారణంగానే అణు పరీక్ష నిషేధ ఒప్పందంపై మనం సంతకం చేయడం లేదు. ఈ అంశం చాలా సున్నితమైంది. ఈ నేపథ్యంలో పౌర అణు సహకార ఒప్పందంలో కొంత జాప్యం అనివార్యం. గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఈ రంగంలో ఒప్పందాన్ని జపాన్ వ్యతిరేకించడం లేదు. ఈ అంశంపై చర్చలు ప్రారంభించడానికి ఇరు దేశాల ప్రధానులు సంబంధిత నిపుణులను ఇప్పటికే ఆదేశించారు.

ఉభయ తారకమే శ్రీరామరక్ష
‘‘దురాక్రమణ విధానాలను అనుసరించే దేశాల విషయంలో జాగ్రత్త వహించాలం’’టూ టోక్యోలో చైనాను ఉద్దేశించి, భారత ప్రధాని నరేంద్రమోడి వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు మోడీ విదేశీ విధాన చతురతకు సముచితం కావు.

భారత్‌లో మౌలిక వసతుల వృద్ధికి లక్ష కోట్ల డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కావాలి. ఇందుకు 37 వేల కోట్లడాలర్ల విదేశీ ద్రవ్య నిల్వలతో ఉన్న చైనా, 12 వేల కోట్ల డాలర్ల నిల్వలున్న జపాన్‌ల సాయం ఎంతో అవసరం. మనకు చైనా, జపాన్ రెండూ అవసరం. ఇరు దేశాల నుంచి పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం కావాలి. ఓ విధంగా చెప్పాలంటే భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామి చైనానే. దాదాపు 9 శాతం వాణిజ్యం ఆ దేశంతోనే జరుగుతోంది. అంతే కాదు, రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేలు జరగకపోయినా, కీడుకే ఆస్కారముంది. కాబట్టి ఈ రెంటితో మైత్రి విషయంలో భారత్ సమతూకం పాటించాలి. అలాంటప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం.

చేతులు కలపడం వెనుక
Bavitha భారత్ పట్ల జపాన్ వైఖరిలో సృజనాత్మక ధోరణి, అనుకూలత నెలకొనడానికి కొన్ని బలమైన కారణాలున్నాయి.
 1. ఉదారవాదం, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణలో ఇండియా విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ఇది జపాన్‌కు ఇండియాలో తన ప్రాబల్యాన్ని బలపరచుకోవడానికి అవకాశం కలిగించింది.
 2. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే... ఆసియాలో చోటుచేసుకుంటున్న భౌగోళిక, రాజకీయ పరిణామాలు.
 3. ఆసియాలో నానాటికీ పెరిగిపోతున్న చైనా ఆధిపత్య ధోరణి
 4. చైనా-జపాన్‌ల మధ్య వాణిజ్య పెట్టుబడి రంగాల్లో చైనా అమెరికాను అధిగమించింది. 2007-10 మధ్య కాలంలో చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అప్పటివరకు ఆస్థానంలో ఉన్న జపాన్‌ను మూడో స్థానానికి నెట్టేసింది.
 5. చారిత్రాత్మకంగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న వైరం, భూభాగ వివాదాలు, చైనా ఆధిపత్య ధోరణి జపాన్‌ను కలవరపరుస్తుంది.
 6. జపాన్ రాజకీయ-ఆర్థిక ద్విభాగత్వాన్ని (పాలిటిక్స్-ఎకనమిక్స్ డై కాటమీ) పాటిస్తే, చైనా రెంటినీ పెనవేసి తన జాతీయ ప్రయోజనాలను కాపాడే నిమిత్తం ఆర్థిక కార్యకలాపాలను ఆయుధంగా వాడుకోవడానికి వెనకంజ వేయడం లేదు.
 7. ఢిల్లీ-ముంబై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆర్థిక సహకారానికి జపాన్ ముందుకు రావడంతో క్రమేణా జపాన్ ఆర్థిక వ్యవస ్థమీద చైనా ప్రాబల్యాన్ని తగ్గించడం
 8. జపాన్ తన పెట్టుబడులను ఇండియా వంటి దేశాలకు మళ్లించడం ద్వారా చైనా ప్రభావాన్ని పరిమితం చేయవచ్చన్నది వ్యూహం.
ఇలా అన్నిరంగాలలో ఆధిపత్యం చెలాయించాలనే చైనా ధోరణి ఇండియా-జపాన్‌లను మరింత దగ్గరకు చేర్చాయి. జపాన్ ప్రధాని షింజో అబే 2013లో రూపొందించిన ఆసియా ప్రజాస్వామ్య భద్రతా వజ్రం (ఆసియా డెమోక్రటిక్ సెక్యూరిటీ డైమండ్), జాతీయ భద్రతా కీలక రూపకల్పనలో ఇండియాను భాగస్వామిగా గుర్తించారు. జపాన్ ఉపప్రధాని టారో అసో మాటల్లో చెప్పాలంటే ‘ఇప్పటివరకు తమ దేశం రక్షణ పరికరాల ఎగుమతుల నిషేధాన్ని పాటించింది. మారిన పరిస్థితులలో ఆ విధానాన్ని పునఃపరిశీలించి భారతదేశానికి అవసరమైన సాంకేతిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. దానిద్వారా ఆసియాలో అతిపెద్ద సముద్రయాన ప్రజాస్వామ్య దేశాలైన ఇండియా, జపాన్‌లు భద్రతకు కృషి చేయాలి’.
Published date : 26 Sep 2014 10:47AM

Photo Stories