భారత్ – రష్యా ద్వైపాక్షిక సంబంధాలు
Sakshi Education
భారత్- రష్యా 14 వ వార్షిక శిఖరాగ్ర సదస్సు(Indo-Russian Anuual Summit) 2013 అక్టోబర్ 20-22 తేదీల్లో మాస్కోలో జరిగింది. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఇరు దేశాధినేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ మాస్కో పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య ఐదు కీలక ఒప్పందాలు జరిగాయి. అవి..
ఖైదీల బదిలీ (Tranfer of Senetenced Persons) ఒప్పందం:
భారత విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్, రష్యా న్యాయశాఖ మంత్రి అలెగ్జాండర్ కోనోవలోవ్ (Alexander Konovalov) లు ఖైదీల బదిలీ (Tranfer of Senetenced Persons) ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం వివిధ నేరాలు కింద భారత్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న రష్యా ఖైదీలు మిగతా శిక్షను స్వదేశంలో అనుభవించడానికి, అదే విధంగా రష్యా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు మిగిలిన శిక్షాకాలం స్వదేశంలో అనుభవించడానికి అవకాశం కల్పిస్తారు.
ఇంధన సామర్థ్యంపై అవగాహన ఒప్పందం:
ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు భారత బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియన్సీ, రష్యా ఎనర్జీ ఏజెన్సీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంధన సామర్థ్యానికి సంబంధించి ఇరుదేశాలకు చెందిన సంస్థలు, కంపెనీలు ఉమ్మడిగా ప్రాజెక్టులు, కార్యకలాపాలు చేపడతాయి. స్మార్ట్ గ్రిడ్స్ (smart grids) లలో అనుసరించే ఉత్తమ విధానాలు, ఇంధన సామర్థ్యం కలిగిన బిల్డింగ్ ఆకృతులు, పారిశ్రామికంగా సామర్థ్యం కలిగిన టెక్నాలజీ తదితర విషయాల్లో ఇరు దేశాల సంస్థలు, కంపెనీలు సహకరించుకుంటాయి.
ప్రమాణీకరణం, అనుసరణ అంచనా (Standardization and Conformity Assessment ) రంగంలో అవగాహన ఒప్పందం:
సమాచారం, అనుసరిస్తున్న bfb bfbbbవిధి విధానాలు, నైపుణ్యతల పరస్పర వినిమయం ద్వారా ప్రమాణీకరణ (standardization) రంగంలో సన్నిహిత సాంకేతిక సహకారం కోసం భారతీయ ప్రమాణాల సంస్థ (Bureau of Indian Standards), రష్యాకు చెందిన సాంకేతిక నియంత్రణ, కొలతల ఫెడరల్ ఏజెన్సీల (Federal Agency on Technical Regulation and Metrology GOST-R) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా ప్రమాణాల లావాదేవీలకు ఒక సమీకృత ఆధారాలను అందించే వాణిజ్య, వ్యాపార రంగాలకు బహుళ ప్రయోజనం చేకూరనుంది.
సైన్స్, టెక్నాలజీ, సృజన రంగాల్లో సహకార కార్యక్రమం:
భారత్–రష్యా దేశాల మధ్య శాస్త్ర సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో మరింత బలమైన సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉద్దేశించిన ఒప్పందమిది. ఈ ఒప్పంద ప్రకారం విద్య, పరిశోధన, అభివృద్ధి, పారిశ్రామిక సంస్థలలో సహకార భాగస్వామ్యం ఉంటుంది. దీంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కూడా పరస్పర సహకారం ఉంటుంది. ఈ రెండు దేశాలు తాము చేపట్టే ఉమ్మడి ప్రాజెక్టుల్లోకి టెక్నాలజీ బదిలీ చేస్తాయి. అంతేకాకుండా ఐటీ, నానో టెక్నాలజీ, పర్యావరణ శాస్త్రాలు, ప్రత్యామ్నాయ ఇంధనం వనరులు వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. ఈ ఒప్పందం భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, రష్యా విద్య, శాస్త్ర మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అమలవుతుంది. 2014 -2017 మధ్యకాలంలో ఈ సహకార ఒప్పందం అమలులో ఉంటుంది.
బయోటెక్నాలజీ రంగంలో సహకార కార్యక్రమం:
బయోటెక్నాలజీ రంగంలో ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పెంచడం కోసం ఉద్దేశించిన కార్యక్రమమిది. భారత బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్, రష్యా ఎడ్యుకేషన్, సైన్స్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఈ సహకార కార్యక్రమం కొనసాగుతుంది. బయోటెక్నాలజీ రంగంలో సహకారాన్ని విస్తృత పరుచుకోవడం, పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడం, సంబంధిత పెట్టుబడుల ప్రవాహానికి ఈ కార్యక్రమం ఉద్దేశించారు. ఉమ్మడి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, పరస్పర వినిమయాల ద్వారా ఈ కార్యక్రమాన్ని 2014-17 మధ్య అమలు చేస్తారు.
ఉమ్మడి ప్రకటన -ముఖ్యాంశాలు
వాణిజ్య, పెట్టుబడులపై సంబంధాలను వృద్ధిచేసి ప్రోత్సాహించడం
2012వ సంవత్సరంలో ఈ రెండు దేశాలు వాణిజ్యంలో 11 బిలియన్ల అమెరికా డాలర్లకు చేరుకోవడంపై సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఆర్థిక సహకారంలో పెట్టుబడుల భాగస్వామ్యం ముఖ్యమైన అంశమని, ఇది ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల పెరగడానికి కూడా సహాయపడుతుందని ఇరు పక్షాలు అంగీకరించాయి. ప్రాధాన్యత ఉన్న పెట్టుబడి ప్రాజెక్టులపై భారత – రష్యా వర్కింగ్ గ్రూప్ తొలి భేటీ ఫలితంగా రెండు దేశాల్లోని ప్రధాన పెట్టుబడి ప్రాజెక్టులను గుర్తించడాన్ని ఇరు దేశాలు స్వాగతించాయి. పౌర విమానయానం (Civil Aviation), రసాయనాలు, ఎరువుల పరిశ్రమ, మైనింగ్, ఆటోమొబైల్స్ రంగాల్లో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరు వర్గాల మధ్య అంగీకారం కుదిరింది. దీంతో పాటు ఆధునికీకరణ, పారిశ్రామిక సహకారంపై మాస్కోలో జరిగిన భారత్ – రష్యా వర్కింగ్ గ్రూపు రెండో సమావేశం విజయవంతమైనట్లు ఇరు పక్షాలు గుర్తించాయి.
2013లో జూన్ 20న 17వ సెయింట్ పీటర్స్ బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక (International Economic Forum) కార్యప్రణాళికలో భాగంగా నిర్వహించిన సంప్రదాయ రష్యా- ఇండియా బిజినెస్ డైలాగ్ రౌండ్ టేబుల్ సమావేశం, 2013లో సెప్టెంబర్ 20న సెయింట్ పీటర్స్ బర్గ్ లో వాణిజ్యం, పెట్టుబడులపై జరిగిన ఏడో ఇండియా- రష్యా ఫోరమ్ తదితర అభివృద్ధి చెందుతున్న వ్యాపార భేటీలను (Business Interactions) ఇరు పక్షాలు స్వాగతించాయి. 2013లో నిర్వహించిన రెండు సమావేశాలలో ఉన్నత వ్యాపార సహకారానికి సంబంధించిన అంశాలను దేశాలు స్వాగతించాయి. రెండు దేశాల్లోని చమురు, గ్యాస్, ఔషధ (Pharmaceutical), వైద్య పరిశ్రమ, మౌలిక సదుపాయాలు, మైనింగ్, ఆటోమొబైల్స్, ఎరువులు (Fertilizers), విమాన యానం రంగాలతో పాటు పారిశ్రామిక సదుపాయాల ఆధునీకరణ తదితర రంగాల్లో సహకారానికి గణనీయమైన అవకాశాలున్నాయని ఇరు పక్షాలు నొక్కి చెప్పాయి.
ఆర్థిక, పెట్టుబడుల రంగాల్లో ముఖాముఖి (Interaction) వృద్ధి చేయటంలో వాణిజ్య, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక, సాంస్కృతిక సహకారంపై ఏర్పాటుచేసిన భారత్–రష్యా అంతర్ ప్రభుత్వ సంఘం (Indo-Russian Inter Governamental Commission-IGC) విధి నిర్వహణ కీలకమని ఇరు పక్షాలు నొక్కి వక్కాణించాయి. 2013లో అక్టోబర్ 4న మాస్కోలో జరిగిన IGC 19వ సమావేశం సానుకూల ఫలితాలను ఇచ్చినట్లు ఇరు పక్షాలు అంగీకరించాయి. భారత్, కస్టమ్స్ యూనియన్ ఆఫ్ బెలారస్, కజకిస్థాన్, రష్యన్ ఫెడరేషన్ ల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (Comprehensive Economic Cooperation Agreement -CECA) పై సంతకం చేయడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి జాయింట్ స్టడీ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ విషయం ప్రస్తుతం యూరేషియా ఆర్థిక సంఘం (Eurasian Economic Community) పరిశీలనలో ఉందని రెండు దేశాలు స్పష్టం చేశాయి.
ఇంధన సహకారం (Energy Cooperation):
2010లో డిసెంబర్ 21 న జరిగిన గ్యాస్, చమురు రంగంలో సహకారం పెంపుదలకు ఉద్దేశించిన ఒప్పందాన్ని అమలు చేయడంలో తమ నిబద్ధతను భారత్, రష్యాలు పునరుద్ఘాటించాయి. రష్యా నుంచి భారత్ కు హైడ్రోకార్బన్ల దీర్ఘకాలిక సరఫరా నిర్వహణలో సహకారం ఆవశ్యకతను ఇరు పక్షాలు గుర్తించాయి. ఈ సహకారం భారత ఇంధన భద్రత పటిష్టతకు తోడ్పడుతుంది. ఈ సహకారం LNG (Lliquefied Natural Gas) సరఫరాల ద్వారా రష్యా నుంచి భారత్ కు ఇందన దిగుమతి చేసుకోవడానికి తోడ్పడుతుంది. భారత్ కు దీర్ఘకాలిక LNG సరఫరాలకు వీలు కల్పించి, భారతీయ కంపెనీల మధ్య క్రియాశీల సహకారం వృద్ధి చెందినందుకు ఇరు పక్షాలు సంతృఫ్తిని వ్యక్తం చేశాయి. రష్యా నుంచి భారత్ కు నేరుగా భూమార్గం ద్వారా హైడ్రోకార్బన్లను రవాణా చేయడానికి ఉన్న అవకాశాలను అన్వేషించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ దిశగా ఉమ్మడి అధ్యయన బృందాన్ని(Joint Study Group) ఏర్పాటు చేయాల్సిన అవసరాన్నిరెండు దేశాలు గుర్తించాయి. దీంతో పాటు రష్యా కంపెనీలతో కలిసి ఆర్కిటిక్ ప్రాంతంలో హైడ్రోకార్బన్ల అన్వేషణలో పాల్గొనడానికి భారత్ తరపు నుంచి ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ (ONGC Videsh Ltd.) ఆసక్తిని వ్యక్తం చేసింది. ఇంధన సామర్థ్యానికి సంబంధించిన అవగాహనా ఒప్పందం ఏర్పాటు చేయడాన్ని ఇరుపక్షాలు స్వాగతించాయి.
కుడంకుళంలో అణు విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్ పనిచేయడం ప్రారంభించి, సాధించిన పురోగతిపై ఇరు పక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రెండో యూనిట్ పూర్తిచేయడానికి అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని అంగీకరాన్ని తెలిపాయి. అదేవిధంగా కుడంకుళం విద్యుత్ కేంద్రం మూడు, నాలుగు యూనిట్ల కోసం సాధారణ కార్య ఒప్పందం (General Framework Agreement) ద్వారా సాంకేతిక –వాణిజ్య ధర (Techno Commercial Offer)ను త్వరగా నిర్ణయించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. కుడంకుళంలో అదనపు అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం, భారతదేశంలో ఇంకా కొన్ని చోట్ల రష్యా రూపకల్పన చేసిన అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకారంపై 2008 డిసెంబర్ 5న ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై తమ నిబద్ధతను ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి.
అదే విధంగా శాంతియుత ప్రయోజనాలకు అణు శక్తి వినియోగించడం, భారతదేశంలో రష్యా డిజైన్ చేసిన క్రమ అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో సహకారంపై 2010 మార్చి 12న భారత్, రష్యాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని తిరిగి పునరుద్ఘాటించాయి. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న విద్యుత్ కేంద్రాల ఆధునీకరణతో పాటు నూతనంగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం కోసం రెండు దేశాల విద్యుత్ రంగ కంపెనీల మధ్య సహకారానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ఇరుపక్షాలు నొక్కివక్కాణించాయి.
శాస్త్ర సాంకేతిక రంగంలో సహకారం(Cooperation in Science and Technology)
డీఎస్టీ-ఆర్ఎఫ్బీఆర్ (DST-RFBR ) కార్యక్రమం కింద బేసిక్ సైన్సెస్ లో సహకారం, ఇంటెగ్రేటెడ్ లాంగ్ టెర్మ్ ప్రోగ్రామ్ (ILTP) వంటి వివిధ శాస్త్రరంగాల పురోగతిపై ఇరు పక్షాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. రష్యా విద్యా - శాస్త్ర మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో నూతన సంస్థాగత యంత్రాగాల ఏర్పాటును ఇరు దేశాలు స్వాగతించాయి. ఈ నూతన యంత్రాంగాలు టెక్నాలజీ అభివృద్ధి, నూతన మేధోసంపద సృష్టించడం ద్వారా భారత్ – రష్యాల్లో పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులకు తోడ్పడతాయి. భారత్ - రష్యాలు 2014-2020 సంవత్సరాల మధ్య జాతీయ ప్రాధాన్యత ఉన్న శాస్త్ర సాంకేతిక ప్రాజెక్టులను చేపడతాయి.
విద్యా రంగంలో సహకారం (Education Sector Cooperation)
వైద్య విద్యకు సంబంధించిన డిగ్రీలు, సర్టిఫికెట్లను గుర్తించడానికి అంతర్ ప్రభుత్వ ఒప్పందానికి సంబంధించి సత్వరమే తుది నిర్ణయానికి రావాలని రెండు పక్షాలు అంగీకరించాయి.
సాంస్కృతిక రంగంలో సహకారం (Cultural Cooperation)
శతాబ్దాలుగా స్నేహితులుగా ఉంటూ, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న ఈ రెండు దేశాలు సంస్కృతి, కళలను విస్తృతంగా పరస్పరం వినియోగించాలని అంగీకరించాయి. భారత, రష్యా సాంస్కృతిక శాఖలు 2012 డిసెంబర్ 24న సంతకం చేసిన సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (Cultural Exchange Programme ) 2013-15 అమలు తీరుపై ఇరు దేశాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. ఇరు దేశాల్లో ఉన్న ప్రధాన మ్యూజియంల మధ్య అనుసంధానంతో పాటు సంస్కృతి, కళలకు సంబంధించి సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించారు.
ప్రజల నుంచి ప్రజల స్థాయిలో ఉన్నత స్థాయి సౌహార్థం, సంస్కృతి పట్ల పరస్పర ప్రశంసలను ఇరు దేశాలు ప్రస్తావించాయి. గత రెండేళ్లలో పర్యాటకుల రాకపోకలు 20 శాతం పెరగడంతో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు విస్తరించడాన్ని రెండు దేశాలు స్వాగతించాయి. 2012లో భారత్ లో నిర్వహించిన రష్యా సాంస్కృతిక ఉత్సవం (Festival of Russian Culture), 2013 లో రష్యాలో భారత సాంస్కృతిక ఉత్సవం (Festival of Indian Culture) పై ఇరు పక్షాలు ప్రశంసించాయి. దీనిలో భాగంగా క్రమం తప్పకుండా భారత్ లో రష్యా సాంస్కృతిక ఉత్సవాలు, రష్యాలో భారత్ సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించాలని ఇరు దేశాలు అంగీకరించాయి
అంతర్ ప్రాంతీయ సహకారం (Inter-Regional Cooperation)
భారత, రష్యాలలోని రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య సహకారం కోసం జరిగిన ఒప్పందం (Agreement for Cooperation between States and Regions of India and Russia 2000) పై ఇరు దేశాలు పునరావలోకనం జరిపాయి. రెండు దేశాలలోని ప్రాంతాల మధ్య వినిమయాలు (Exchanges) బలోపేతం చేసేందుకు మద్దతు తెలిపాయి. రెండు దేశాల మధ్య ప్రాంతీయ స్థాయిలో ఆర్థిక, సాంస్కృతిక, ఆరోగ్య, విద్య, ప్రభుత్వ విధానాలన్నింటిలో ప్రోత్సాహమివ్వాలన్న దృష్టితో నగరాల మధ్య సహకారం కోసం ఇరు దేశాధినేతలు ప్రోత్సహించారు.
అంతరిక్షశోధన (Exploration of Outer Space)
పరస్పర ఉపయోగం ఉండే అంతరిక్ష ప్రయోగాల్లో మరింత సహకారం కోసం ఇరు దేశాలు తమ నిబద్ధతను వ్యక్తపరిచాయి. అంతరిక్షం బయట శాంతియుత ఉపయోగాలపై ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిటీ పరిధిలో రష్యా, భారత్ ల మధ్య సహకారానికి ఇరు దేశాలు మద్దతు తెలుపుతూ ఆచరణాత్మకంగా, స్థిరంగా ముందుకు వెళ్ళాలని అంగీకరించాయి. ముఖ్యంగా ఇరుదేశాలు బాహ్య అంతరిక్ష కార్యకలాపాల దీర్ఘకాలిక స్థిరత్వ మార్గదర్శకాలనేర్పరచడానికి ప్రస్తుత కమిటీ ప్రయత్నాల ఆధారంగా సమన్వయ చర్యల్లో పరస్పర ఆసక్తిని వ్యక్తపరిచాయి.
సైనిక, సాంకేతిక సహకారం (Military and Technical Cooperation)
ఇరుదేశాల సన్నిహిత సైనిక, సాంకేతిక సహకారం కీలక అంశమని, ఇది రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి విశ్వాసంలో ప్రతిఫలిస్తుందని ఉద్ఘాటించాయి. 2013 సంవత్సరాంతంలో మాస్కోలో సైనిక, సాంకేతిక సహకారంపై రష్యా-ఇండియా అంతర్ ప్రభుత్వ సంఘం (Russian-Indian Inter-Governmental Commission on Military-Technical Cooperation) 13వ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో క్రమబద్ధ ద్వైపాక్షిక సంప్రదింపులు, సైనిక, సాంకేతిక సహకారాలతో పాటు 2013 అక్టోబర్ లో ఉభయ దేశాల ఆర్మీలు సంయుక్తంగా నిర్వహించిన ఇంద్ర (INDRA) సైనిక విన్యాసాలను ఇరు దేశాలు ప్రస్తావించాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య సేవల మార్పిడి (service-to-service exchanges)పెంపు, శిక్షణలో సహకారం, క్రమబద్ధమైన సైనిక విన్యాసాల గురించి రెండు పక్షాలు ఉద్ఘాటించాయి.
2013లో రష్యా నిర్మించిన యుద్ధనౌక త్రికండ్ (Trikand)ను భారత్ కు అందజేయడం, భారత్ లో సు-30 ఎంకేఐ (Su-30MKI) ఎయిర్ క్రాఫ్ట్, టీ-90ఎస్ (T-90S) ట్యాంకుల లైసెన్స్ ఉత్పత్తి చేయడంతో పాటు ఎయిర్ క్రాప్ట్ వాహక నౌక విక్రమాధిత్య (Vikramaditya) ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేయడం వంటి వాటిని ఇరు దేశాలు స్వాగతించాయి. ఉమ్మడి రూపకల్పన (Joint Design), ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం కల సైనిక పరికరాల అభివృద్ధి, ఉత్పత్తులతో పాటు ఐదో తరం యుద్ధ ఎయిర్ క్రాఫ్ట్, బహుళ ప్రయోజన రవాణా ఎయిర్ క్రాఫ్ట్ నిర్మాణం, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి (BrahMos supersonic missile) నిర్మాణ ప్రాజెక్టుల్లో పురోగతిపై ఇరు పక్షాలు చర్చించాయి. రాకెట్, క్షిపణులతో పాటు నౌకా సాంకేతికతలు (naval technologies), ఆయుధ వ్యవస్థలు వంటి రంగాలలో సహకారాన్ని పెంచుకోవాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై సహకారం (Coordination on International and Regional Issues)
దేశాల మధ్య సమాన భాగస్వామ్యాలు, అంతర్జాతీయ న్యాయ చట్టం, యూఎన్ చార్టర్ ప్రయోజనాలు, సూత్రాలపై గౌరవం తదితరాలపై ఆధారపడి మరింత స్థిరత్వం, భద్రత, న్యాయమైన వ్యవస్థ కలిగిన అంతర్జాతీయ సంబంధాలను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. అంతర్జాతీయ శాంతిభద్రతలు, స్థిరమైన సామాజికార్థిక అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. కొత్తగా తలెత్తున్న సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత ప్రాతినిధ్యం, ప్రభావవంతమైన ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి సంస్కరణలు అవసరముందని రెండు దేశాలు పునరుద్ఘాటించాయి. భద్రతా మండలి విస్తరణ వర్తమాన వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా ఉండాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. ఈ విషయంలో సంస్కరించబడిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వంపై తమ మద్ధతు ఉంటుందని రష్యా ప్రభుత్వం పునరుద్ఘాటించింది.
ఉగ్రవాదంపై పోరాటం:
2001లో నవంబర్ 6న అంతర్జాతీయ ఉగ్రవాదంపై రష్యా, భారత్ ల మధ్య జరిగిన మాస్కో ప్రకటన (Moscow Declaration)ను ఇరు పక్షాలు పునరావలోకనం చేశాయి. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని శాంతి, భద్రతలకు ప్రమాదంగా, మానవ హక్కులకు ఉల్లంఘనగా, మానవత్వంపై నేరంగా పునరుద్ఘాటించాయి. ఉగ్రవాదాన్ని ఓటమి పాలు చేయటానికి అన్ని దేశాలు ఉమ్మడి కృషి చేయాల్సిన అవసరముందని నొక్కి చెప్పాయి. ఉగ్రవాద కార్యకలాపాలను, వారి ప్రణాళికలను ఖండించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఆయుధాలు సమకూర్చడం, శిక్షణనివ్వడం, నిధులు సమకూర్చడంపై సానుభూతి చూపించరాని అంగీకరించాయి.
భారత్, రష్యాలలో తప్పుదారి పట్టించే నినాదాలతో చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలతో సమాజాల స్వేచ్ఛ, ప్రజాస్వామిక విలువలపై దాడి చేసి మన దేశాల భౌగోళిక సమగ్రతలకు భంగం కలిగించేందుకు లక్ష్యం చేసుకున్నాయి. ఇటువంటి కార్యకలాపాలు సరిహద్దుల వెంబడి, సరిహద్దులకు వెలుపల విస్తరించి అంతర్జాతీయ అనుసంధానాలను (International Linkages) కలిగి ఉండవచ్చు. అటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు సహాయం, ప్రోత్సాహం, ఆశ్రయం కల్పిస్తున్న దేశాలు సైతం ఉగ్రవాద చొరబాటుదారులతో సమానంగా దోషులే. దేశాలన్నీ తమ భౌగోళిక ప్రాంతాలు, తమ నియంత్రణలో ఉన్న ప్రదేశాల నుంచి కొనసాగుతున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించాలని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలు ఉగ్రవాద నెట్ వర్కులు, వ్యవస్థలు, మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరముందని డిమాండ్ చేశాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యులైనవారిపై విచారణను ప్రత్యక్షంగా వేగంగా చేపట్టి, సత్వరమే అన్ని ఉగ్రవాద చర్యలకు తగిన న్యాయం జరిగేలా చూడాలి. సైద్ధాంతిక, మతపరమైన, రాజకీయ, జాతి లేదా ఇతర కారణాలతో ఉగ్రవాద చర్యలను సమర్థించరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. అనేక మంది అమాయక ప్రజల ప్రాణాలను బలితీసుకున్న ముంబాయి ఉగ్రవాద దాడులు, బెస్లాన్ (Beslan) ఉగ్రవాద దాడి ఘటనలు సమర్ధనీయం కాదని స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన పాత్రను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి క్రియాశీలక చొరవ చూపించటానికి ఇరుదేశాలు ఆసక్తి వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్రమైన ఒప్పందంపై ముసాయిదా చర్చలను వేగవంతం చేయాలని ఇరు పక్షాలు పిలుపునిచ్చాయి. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరాటానికి సంబంధించి ద్వైపాక్షిక జాయింట్ వర్కింగ్ గ్రూప్ (Bilateral Joint Working Group on Countering International Terrorism) పద్ధతి లో చర్చలు కొనసాగించాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
అంతర్జాతీయ సమాచార భద్రత: (International Information Security)
ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజీలను క్రిమినల్, ఉగ్రవాద చర్యలకు, ఐక్యరాజ్యసమితి చార్టర్ (నిబంధనావళి)కు విరుద్ధంగా వినియోగిస్తున్న ప్రమాదం పెరుగుతుండటంపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజీలను వినియోగించడంలో దేశాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి సార్వజనీన నిబంధనలు, నియమాలు, సూత్రాలను అంతర్జాతీయ సమాజం అంగీకరించాల్సిన అవసరముందని రెండు దేశాలు నొక్కి చెప్పాయి. ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజీల వినియోగానికి సంబంధించిన గ్లోబల్ అంశాలపై ద్వైపాక్షిక సంప్రదింపులు, సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని రెండు పక్షాలు అంగీకరించాయి. అంతర్జాతీయ సమాచార భద్రత రంగంలో సహకారానికి సంబంధించి ప్రతిపాదిత అంతర్ ప్రభుత్వ ఒప్పందంపై పరిశీలనను వేగవంతం చేయాలని కూడా ఇరు దేశాలు నిర్ణయించాయి. సంబంధిత దేశ చట్టాలకు అనుగుణంగా అంతర్గత వ్యవహారాల్లో జోక్యరహిత సూత్రంతో పాటు ఇంటర్నెట్ లో మానవహక్కులు (ఏకాంతంగా ఉండే హక్కు- ప్రైవసీ హక్కుతో సహా) ఉన్నాయో లేదో పరిశీలించాల్సిన అవసరం ఉందని రెండు దేశాలు వక్కాణించాయి.
నిరాయుధీకరణ, ఆయుధ వ్యాప్తి నిరోధక రంగాలలో సహకారం (Cooperation in the field of Disarmament and Non-proliferation)
సామూహికంగా ప్రజలను చంపే ఆయుధాలు, వాటి పంపిణీ మార్గాల వ్యాప్తిని నిరోధించడం ఇరు దేశాల ఉమ్మడి బాధ్యతగా భారత్, రష్యాలు పరిగణించాయి. అంతర్జాతీయ శాంతి, భద్రత, స్థిరత్వం పెంపొందించడానికి నిరాయుధీకరణ రంగంలో సంబంధిత పక్షాల భాగస్వామ్యంతో క్రమానుగత వృద్ధి (step-by-step progress) ప్రాముఖ్యతను ఇరు దేశాలు నొక్కి వక్కాణించాయి.
2013 మేలో న్యూఢిల్లీలో జరిగిన ఆయుధాల నియంత్రణ, వ్యాప్తి(Arms Control and Non-Proliferation) పై ద్వైపాక్షిక సంప్రదింపులను ఇరు పక్షాలు స్వాగతించాయి. దీనివల్ల చర్చనీయాంశాలన్నింటిపై అభిప్రాయాలు పంచుకునేందుకు అవకాశం లభించింది. ప్రపంచ వ్యాప్తి నిరోధక పద్దతిలో ముఖ్యమైన అంశాలైన ఎగుమతి నియంత్రణ విధానాలను బలోపేతం చేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. ఎంటీసీఆర్ (MTCR), వాస్సెనార్ ఒప్పందాల (Wassenaar Arrangement) లో పూర్తి సభ్యత్వంపై భారతదేశ ఆసక్తిని రష్యా సానుకూలంగా పరిగణించింది. అణు సరఫరాల సమూహం (న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్) లో భారతదేశానికి పూర్తి సభ్యత్వంపై సహాయం, చర్చకు తోడ్పాటు, సానుకూలంగా నిర్ణయం తీసుకోడానికి రష్యా తన సంసిద్ధతను పునరుద్ఘాటించింది. సంపూర్ణ సభ్యత్వం కోరడంలో భారత్ ఆసక్తిని రష్యా స్వాగతించింది. అణువ్యాప్తిని నిరోధించడానికి తగిన సహకారాన్నిఅంతర్జాతీయ సమాజానికి అందిస్తానని ఇండియా నొక్కి చెప్పింది.
దేశాలన్నీ అణుశక్తిని శాంతి భద్రతల కోసమే ఉపయోగించాలని, అసాంఘిక శక్తులకు అణుశక్తి చేరకుండా అడ్డుకోవాలని రష్యా, భారత్ దేశాలు నొక్కి వక్కాణించాయి. ఐఏఈఏ (IAEA) ప్రధాన పాత్రను రెండు పక్షాలు సమర్థించాయి. ముఖ్యంగా చట్టబద్ధమైన రక్షణ, కట్టుబాట్లు గల దేశాల శాంతియుత ప్రయోజనాల కోసం అణు శక్తిని ఉపయోగించుకునే విషయంలో ఐఏఈఏ భద్రత ఆంక్షల వ్యవస్థను, నిబంధనావళిని ఇరు దేశాలు సమర్థించాయి.
బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాలకు వినియోగిండానికి హామీనిచ్చే అంతర్జాతీయ ప్రయత్నాలకు రెండు పక్షాలు మద్దతు తెలిపాయి. ఆసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భద్రతాసహకారం విస్తరణ (Enhancing Security Cooperation in Asia and the Asia Pacific)
అంతర్జాతీయ వ్యవహారాల్లో ఆసియా - పసిఫిక్ ప్రాంతం ప్రాధాన్యత పెరుగుతోందని ఇరు పక్షాలు గుర్తించాయి. ప్రపంచ వృద్ధి కోసం మరింత ప్రాంతీయ సమగ్రత, సహకారానికి మద్దతు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా అంగీకరించే అంతర్జాతీయ చట్టం, దాపరిక లేమి, పారదర్శకత, సమానత్వం వంటి సూత్రాలు, నిబంధనలు ఆధారంగా ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో భద్రతా సహకారం బలోపేతం చేయడానికి అవసరమైన కార్య సూత్రాలపై చర్చించడానికి రెండుదేశాలు సన్నిహితంగా పరస్పరం చర్చలు జరుపుకోవాలని అంగీకరించాయి.
2013 అక్టోబర్ 9-10 తేదీలలో బ్రూనే దరుస్సలమ్ (Brunei Darussalam) లో జరిగిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు ( East Asia Summit - EAS)లో చేసుకన్న ఒప్పందం ఆధారంగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సమానత, భద్రత, పరస్పర ప్రయోజనదాయక సహకారంపై మరిన్ని చర్చలను ప్రోత్సహించేందుకు క్రియాశీల పాత్ర పోషించాలని రెండు పక్షాలు అంగీకరించాయి. ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో సభ్యదేశాల నేతల మధ్య రాజకీయ, ఆర్థిక సహకారానికి సంబంధించిన అంశాలపై వ్యూహాత్మక చర్చలకు ఈఏఎస్ (EAS ) కీలకమైన వేదిక అని రెండు పక్షాలు భావించాయి. యూరేషియాలో శాంతి, స్థిరత్వం, ఆర్థిక వృద్ధి, సౌభాగ్యానికి షాంఘై సహకార సంస్థ (Shanghai Cooperation Organization - SCO) మంచి కృషి చేసిందని ఇరు దేశాలు అంగీకరించాయి. SCO లో పరిశీలక దేశంగా భారతదేశ క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన రష్యా, భారతదేశానికి సంపూర్ణ సభ్యత్వం హోదా కల్పించడానికి తమ పూర్తి మద్ధతును పునరుద్ఘాటించింది.
చైనా, భారత్, రష్యాల మధ్య రాజకీయ భేటీలు మరింత విస్తృతపరుచుకోవాలని ఇరు దేశాలు అంకితభావం వెల్లడించాయి. 2013 నవంబర్ లో న్యూఢిల్లీలో జరగనున్నమూడు దేశాల విదేశాంగ వ్యవహారాల మంత్రుల సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ఇరు పక్షాలు స్పష్టం చేశాయి. చైనా, భారత్, రష్యాల ఉన్నతస్థాయి ప్రతినిధులు ప్రాంతీయ భద్రతపై సంప్రదింపులు కొనసాగించడానికి ఇది అవసరమని ఇరు దేశాలు భావించాయి. ఆసియా-పసిఫిక్ లో వాణిజ్యం, పెట్టుబడి సహకారం, ప్రాంతీయ సమగ్రత వృద్ధికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించేందుకు ముఖ్యమైన యంత్రాంగం ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార వేదిక (Asia-Pacific Economic Cooperation forum-APEC) పాత్రను ఇరు పక్షాలు గుర్తించాయి. అపెక్ లో భారత్ శక్తివంతమైన సభ్యత్వం, ప్రాంతీయ, ప్రపంచ వాణిజ్యంలో ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంపై తదుపరి చర్చల పురోగతికి దోహదం చేస్తుందని రష్యా పునరుద్ఘాటించింది. భారత సభ్యత్వ విస్తృతిపై అపెక్ లో ఏకాభిప్రాయం సాధించడానికి అపెక్ కి అధ్యక్ష హోదా దిశగా భారత్ కు తన మద్ధతును రష్యా పునరుద్ఘాటించింది.
ఆసియా- పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాలను నెలకొల్పడానికి సాధ్యమైన సహకారం, ఉగ్రవాదంపై పోరాటం, సీమాంతర నేరాలు, ఇన్ఫర్మేషన్ కమ్యునికేషన్ టెక్నాలజీలపై ప్రపంచ ప్రయత్నాలకు తోడ్పాటునందించేందుకు ఆసియాన్ ప్రాంతీయ వేదికను మరింత బలోపేతం చేయటానికి ఇరు దేశాలు కృతనిశ్చయాన్ని వ్యక్తపరిచాయి. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం ప్లస్ (ADMM Plus పద్ధతి)లో భాగంగా విధుల సమన్వయానికి, పరస్పర ఆశ్రిత, మద్ధతు కల్పించడం కోసం ఆసియా – పసిఫిక్ ప్రాంతంలో బహుళపక్ష సైనిక సహకారం మరింత పెరుగుదలకు ప్రోత్సాహం అందించాలన్న ఆకాంక్షను ఇరు పక్షాలు వెల్లడించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వ సౌభాగ్యాలను సాధనకు , ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న అంతర్ దేశ కూటముల (ఆసియా – యూరోప్ మీటింగ్ ఫోరమ్, కాన్ఫరెన్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ కాన్ఫిడెన్స్ – బిల్డింగ్ మెజర్స్ ఇన్ ఆసియా, ఆసియా కోపరేషన్ డైలాగ్) మధ్య సహకారం, సమన్వయానికి తమ నిబద్ధతను మరింత విస్తృతపరచాలని ఇరు పక్షాలు పునరుద్ఘాటించాయి.
బ్రిక్స్ దేశాల మధ్య సహకారం (Cooperation among BRICS countries)
2013 మార్చి 27న డర్బన్ లో జరిగిన ఐదో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit ) ఫలితాలను భారత్, రష్యా పునరుద్ఘాటించాయి. పటిష్టమైన, సంతులితమైన, సమగ్రమైన మార్గంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ సమాజం చేపట్టిన చర్యల్లో బ్రిక్స్ విస్తృతమైన పాత్ర పోషించిందని ఇరు దేశాలు నొక్కి చెప్పాయి. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యలపై సభ్యదేశాలు చేపట్టిన వ్యూహాత్మక, సమన్వయ కార్యకలాపాల కోసం ఉపయోగపడే ఒక యంత్రాంగంలా బ్రిక్స్ ను బలోపేతం చేయాలని భారత్, రష్యాలు ఉద్ఘాటించాయి. 2013 బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఆమోదించిన థెక్విని కార్యాచరణ ప్రణాళిక(థెక్విని యాక్షన్ ప్లాన్) కు పూర్తి మద్ధతు తెలిపేందుకు ఇరు దేశాలు హామీ ఇచ్చాయి. ఈ ప్రణాళిక అమలుకు క్రియాశీలకంగా దోహదచేసేందుకు నిబద్ధతను వ్యక్తం చేశాయి. సభ్యదేశాల మధ్య మరింత వైవిధ్య సంబంధాలు పటిష్టపరిచేందుకు కీలకమైన బ్రిక్స్ కూటమిలోని బహుళ పక్ష సహకారం యొక్క అన్ని కోణాలను అభివృద్ధిచేయాల్సిన అవసరాన్ని భారత్, రష్యా నొక్కి వక్కాణించాయి. బ్రిక్స్ అభివృద్ధి బ్యాంకు (BRICS Development Bank) బ్రిక్స్ దేశాల మధ్య సంచిత నిధి (Contingent Reserve Arrangement) సదుపాయం ఏర్పాటుకు సంబంధించిన ప్రాజెక్టులకు ఇరు దేశాలు మద్దతు తెలిపాయి. బ్రిక్స్ సభ్య దేశాల బహుళ పక్ష ఆర్థిక భాగస్వామ్య (Multilateral Economic Cooperation) వ్యూహం అభివృద్ధి చేయాలన్న రష్యా ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు భారత్ అంగీకరించింది. బ్రెజిల్ లో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంతర్జాతీయ యవనికపై బ్రిక్స్ పాత్రను పటిష్ఠం చేస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశాయి.
సిరియా పరిస్థితి (Situation in Syria)
సిరియా సంక్షోభాన్ని సైనికబలంతో పరిష్కరించలేమని, రాజకీయ మార్గాల ద్వారానే సమస్య సమసిపోతుందని రెండు పక్షాలు బలమైన విశ్వాసం వ్యక్తం చేశాయి. సంఘర్షణలో ఉన్న అన్ని పక్షాలను చర్చావేదికపైకి తీసుకువచ్చేందుకు 2012 జూన్ లో ఆమోదించిన జెనీవా-1 అధికార ప్రకటన (విజ్ఞప్తి) (Geneva-I Communique ) ముందుకు నడిపించేందుకు సిరియాపై అంతర్జాతీయ సమావేశానికి (జెనీవా-2) ( "International Conference on Syria" (Geneva-II)) త్వరగా శ్రీకారం చుట్టేందుకు తమ మద్దతునిస్తామని ఇరు పక్షాలు వ్యక్తం చేశాయి. సిరియా సంఘర్షణకు దౌత్యపరమైన పరిష్కారానికి రష్యా చేసిన కృషిని భారత్ శ్లాఘించింది. జెనీవా-2లో భారత్ పాల్పంచుకుంటే స్వాగతిస్తామని రష్యా ప్రకటించింది. 2013 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 2118 ప్రకారం రసాయనిక ఆయుధాల ఒప్పందం (Chemical Weapons Convention) అనుసరించి సిరియాలో రసాయనిక ఆయుధాలు అంతర్జాతీయ నియంత్రణ కిందకు వెళ్లడం, రసాయనిక ఆయుధాల నిషేధ సంస్థ (Organisation for the Prohibition of Chemical Weapons - OPCW) వాటిని ధ్వంసం చేయడం తదితర చర్యలకు రష్యా, భారత్ మద్దతు తెలిపాయి.
ఆప్ఘనిస్థాన్ లో స్థిరత్వం (Stabilization of the Situation in Afghanistan)
సాయుధ ప్రతిపక్ష బలగాలతో ఆప్ఘన్ ప్రభుత్వం స్వయంగా ప్రారంభించిన రాజీపై చర్చల ప్రక్రియ ప్రయత్నాలను ఇరు దేశాలు ఆమోదించాయి. ఆప్ఘనిస్థాన్ రాజ్యాంగాన్ని గుర్తించడం, హింసను విడనాడటం, ఆల్ ఖైదా, ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు తెంచుకోవడం మొదలైన అంతర్జాతీయ సమాజం ఆమోదించిన సూత్రాలను సాయుధ ప్రతిపక్ష బలగాలను తప్పనిసరిగా గౌరవించటానికి సిద్ధంగా ఉండాలని ఇరుపక్షాలు ఉద్ఘాటించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఒక కీలకమైన సాధనాలై (tools)న తాలిబాన్లపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రవేశపెట్టిన ఆంక్షల విధానాన్ని విస్తరించాల్సిన అవసరముందని ఇరు పక్షాలు భావించాయి. ఆప్ఘనిస్థాన్ ఇరుగుపొరుగు దేశాలతో పాటు ఆ ప్రాంతంలో దేశాలు, వ్యవస్థలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తిలో ఉందని ఇరు దేశాలు గుర్తించాయి. షాంఘై సహకారం సంస్థ ( Shanghai Cooperation Organization SCO), కలెక్టివ్ సెక్యురిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ (సీఎస్టీవో) (the Collective Security Treaty Organization CSTO), దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) ( South Asian Association for Regional Cooperation (SAARC), రిక్(RIC) దేశాల మధ్య చర్చలు, ఇస్తాంబుల్ ప్రక్రియ (Istanbul Process) వంటి ప్రస్తుతం ఉన్న ప్రాంతీయ భాగస్వామ్య కార్యచట్రాల మధ్య భేటీల వృద్ధి, మెరుగుదలకు ఇరు పక్షాలు బలంగా పిలుపునిచ్చాయి.
ఆప్ఘనిస్థాన్ లో శాంతి, స్థిరత్వాలకు ప్రధాన ప్రమాదం ఉగ్రవాదమని, దీనివల్ల ఆ ప్రాంతంతో పాటు మొత్తం ప్రపంచమే ప్రమాదంలోకి నెట్టివేయబడిందని ఇరు దేశాలు ఆమోదించాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రాంతీయ కోణాలను నొక్కిచెబుతూ 2014లో అంతర్జాతీయ బలగాల ఉపసంహరించుకోనున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని దేశాలు అన్ని రకాల, రూపాల్లో ఉన్న ఉగ్రవాదంపై పోరాడటానికి (ఉగ్రవాదులకు సురక్షిత స్వర్గధామాలు తొలగింపు, ఆర్థిక సహాయం నిలుపుదలతో పాటు) ఉమ్మడిగా, సమన్వయ ప్రయత్నాలతో సహకరించుకోవాలని ఉద్ఘాటించాయి. ఆప్ఘనిస్థాన్ లో అక్రమ మాదక ద్రవ్యాల ఉత్పత్తి, మాదక ద్రవ్యాల తరలింపు (drug trafficking) ద్వారా వచ్చే ఆదాయం ఉగ్రవాద సంస్థలకు ధనావసరాల్లో ప్రధానం కావడంపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఆప్ఘన్ నుంచి అక్రమ మాదక ద్రవ్యాల తరలింపును నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు కొనసాగించాలని ఇరు పక్షాలు అంగీకరించాయి. పారిస్ ఒప్పంద ప్రయత్నా(Paris Pact initiative)నికి శాశ్వతమైన, క్రియాశీల మద్ధతు ఇవ్వడంపై దృష్టిపెట్టాలని అంగీకరించాయి.
ఇరాన్ అణు కార్యక్రమం:
ఇరాన్ దేశ పరిస్థితులు, అణు కార్యక్రమాలపై ఇరు దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ, దౌత్య మార్గాల ద్వారా చర్చలకు సంస్థాగత ఏర్పాట్లతో సమగ్రమైన, శాశ్వతమైన పరిష్కారం కోసం తమ మద్దతు ఇవ్వడానికి ఇరు దేశాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. తన అంతర్జాతీయ అనివార్యతల వల్ల శాంతియుత ప్రయోజనాల కోసం అణు శక్తిని వినియోగించుకోవటానికి ఇరాన్ కు ఉన్న హక్కుని ఇరుదేశాలు గుర్తించాయి. ఇరాన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐఏఈఏ (అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ)తో సహకరించాలని భారత్, రష్యాలు హితువు పలికాయి.
బహుళ ధృవ ఆర్థిక భాగస్వామ్యం, విత్త (ఫైనాన్షియల్) సంస్కరణలు:
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సంబంధించి ఇప్పటికీ అనేక సవాళ్లు ఉన్నాయని ఇరు దేశాలు పేర్కొన్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు బహుళధృవ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అవసరమని ఉద్ఘాటించాయి. ఈ విషయంలో అంతర్జాతీయ ఆర్థిక భాగస్వామ్యంలో ప్రాథమిక (ప్రధాన) కూటమి అయిన జీ20 (G20) ప్రత్యేక ప్రాధాన్యతను ఇరుదేశాలు గుర్తించాయి. జీ20కి రష్యా అధ్యక్షత వహించడాన్ని, సెయింట్ పీటర్స్ బర్గ్ జీ20 శిఖరాగ్ర సదస్సు నిర్ణయాలను భారత్ ఘనంగా ప్రశంసించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం, మధ్యస్థ విడత ద్రవ్య ఐక్యత, అధిక ఉపాధి, వాణిజ్య సరళీకరణ, వృద్ధిని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలు ఉన్న నిర్ణయాలతో కూడిన జీ20 సదస్సు సిఫార్సులను నిరంతరాయంగా అమలుచేయటం వలన కీలకమైన ప్రపంచ ఆర్థిక సమస్యలకు పరిష్కారించవచ్చని ఇరు దేశాలు ఉద్ఘాటించాయి. సెయింట్ పీటర్స్ బర్గ్ శిఖరాగ్ర సదస్సు విజయవంతం కావడానికి భారతదేశం అందంచిన ప్రముఖమైన తోడ్పాటుకు రష్యా కృతజ్ఞతలు తెలియజేసింది. మరింత ప్రాతినిధ్యం, న్యాయబద్ధత కలిగిన అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని రష్యా, భారత్ లు నొక్కిచెప్పాయి. దీనికి సంబంధించి 2014 జనవరిలోపే అంతర్జాతీయ ద్రవ్య నిధి కోటాలపై పదిహేనవ సాధారణ సమీక్ష ప్రాధమిక పని పూర్తిచేయాలని ఇరుదేశాలు అంగీకరించాయి. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడటానికి, ఫైనాన్షియల్ మార్కెట్లను అస్థిరపరచడాన్ని నిరోధించడానికి రిజర్వ్ దేశ కరెన్సీలలో ద్రవ్య విధానంపై జీ20 విధాన సమన్వయ పద్ధతి మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రెండు దేశాలు వక్కాణించాయి.
పర్యావరణ, సంతులిత అభివృద్ధి:
2012 జూన్ 20-22 తేదీలలో బ్రెజిల్ లోని రియో డి జెనీరోలో జరిగిన సంతులిత అభివృద్ధిపై ఐక్యరాజ్యసమితి సమావేశం రియో +20 సమావేశ ఫలితాలను ఇరు పక్షాలు స్వాగతించాయి. ఈ సమావేశం నిర్ణయాలను అమలు చేయడానికి స్థిరంగా కృషిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి. అంతేకాదు ప్రపంచ వాతావరణ మార్పు సమస్యను అర్థవంతంగా పరిష్కరించడం అత్యంత ముఖ్యమైనదని ఇరుపక్షాలు ఉద్ఘాటించాయి. 2015 నాటి కల్లా సమగ్రమైన, సంతులితమైన నూతన పర్యావరణ మార్పు ఒప్పందం రూపొందించే లక్ష్యంతో ప్రోత్సహించాల్సిన అంతర్జాతీయంగా ప్రయత్నాల ప్రాధాన్యతను ఇరు దేశాలు నొక్కిచెప్పాయి.
భారత్ –రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం సాంప్రదాయక స్నేహపూర్వక, పరస్పర అవగాహన పూరిత వాతావరణంలో జరిగాయి. మాస్కోలో తనకు లభించిన ఆతిథ్యానికి, గౌరవ స్వాగతానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రష్యా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాదు రష్యా అధ్యక్షుడ్ని భారతదేశానికి ఆహ్వానించారు. రష్యా అధ్యక్షుడు ఆహ్వానానికి సాదరంగా ఆమోదం తెలిపారు.
భారత్ –రష్యా సంబంధాల నేపథ్యం:
పాకిస్తాన్ 1947లో ఏర్పడిన నాటి నుంచి 1991లో సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు సామ్రాజ్యం విచ్ఛిన్నమయ్యేవరకు రష్యా ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ద్వైపాక్షికంగాను, అంతర్జాతీయ వేదికలమీద మన దేశాన్ని సమర్ధించింది. అలాగే అమెరికా పాకిస్తాన్‌కు వెన్నుదన్నుగా నిలిచింది. ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను వదిలించుకొని రష్యా ప్రజాస్వామ్య దేశంగా అవతరించిన తరువాత ఆదేశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య భారత్‌తో 1990 పూర్వం నాటి పటిష్ఠమైత్రిని కొనసాగించకపోయాయి. బోరిస్ ఎల్సిన్ అధ్యక్షుడుగా కొనసాగినన్నాళ్ళు ఈ పరిస్థితి కొనసాగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తరువాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించడం, ఆ ఉభయదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పూర్తి కావడం దీనికి మొదటి కారణం. ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ శతాబ్ది ఆరంభం వరకు రష్యా ఆర్థికంగాను, సైనికపటిమ పరంగాను అమెరికాతో పోటీపడలేకపోయింది. అంతర్గత సమస్యలను పరిష్కరించుకొనడంలోను, ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థీకరించుకోవడంలోను తలమునకలైంది. ఈ దశాబ్దకాలంలో మనదేశం తమను పట్టించుకోవడం లేదన్నది ఇటీవలి కాలం వరకు రష్యా భావించింది. దీనికి కారణం మన ప్రభుత్వం ప్రపంచీకరణ ప్రభావంతో అమెరికా వైపు మొగ్గు చూపడమే. బోరిస్ ఎల్సిన్ తరువాత వ్లాదిమిర్ పుతిన్ పరిపాలన శకం ఆరంభమైన తరువాత ఉభయదేశాల మధ్య మళ్ళీ సహకారం, మైత్రి, పెరుగుతోంది. అధ్యక్షుడిగా, ప్రధానిగా, మళ్ళీ అధ్యక్షుడిగా గత పదమూడేళ్ళకు పైగా పుతిన్ రష్యా విధానాలను నిర్ధారిస్తున్నారు. ఈ మధ్యకాలంలో భారత రష్యా మైత్రి పెరుగుతున్నప్పటికీ 1990కి పూర్వం నాటి ద్వైపాక్షిక అంతర్జాతీయ సహకారం మాత్రం పునరుద్ధరణకు నోచుకోలేదు. విక్రమాదిత్య విమానవాహక యుద్ధ నౌకను మనకు అమ్మినప్పటికీ మరమ్మతుల పేరుతో దాన్ని మనకు అప్పగించకుండా తొమ్మిదేళ్ళు రష్యా కాలయాపన చేసింది. 2010 లో ద్వైపాక్షిక అణు సహకార ఒప్పందం కుదిరినప్పటికీ రష్యా అణు రియాక్టర్‌ను అప్పగించడంలో జాప్యం చేస్తూనే ఉంది. మనం స్వదేశీయ పరిజ్ఞానంతో అరిహంత అణు జలాంతర్గామిని నిర్మించుకొని మూడేళ్ళు దాటింది. అయినప్పటికీ రెండవ జలాంతర్గామిని సరఫరా చేయడానికి 2010లో అంగీకరించిన రష్యా ఇంతవరకు మాట నిలబెట్టుకోలేదు. ప్రధాని ప్రస్తుత పర్యటన సందర్భంగా ఇది నెరవేరలేదు. రష్యాతో మన మైత్రి దశాబ్దానికి పైగా మెరుగుపడినప్పటికీ మునుపటిలా వెలుగులీనకపోవడానికి కారణం చైనా. 1962లో చైనా మన ప్రభుత్వాన్ని దారుణంగా వెన్నుపోటు పొడిచి మన సరిహద్దులను దురాక్రమించిన సమయంలో అప్పటి సోవియట్ రష్యా ప్రభుత్వం మనకు సహాయం చేయలేదు. చైనా, రష్యాలు అప్పుడు పరస్పరం ద్వేషించుకునప్పటికీ కమ్యూనిస్టు వ్యవస్థలేని భారత్‌పై సాటి కమ్యూనిస్టు దేశమైన చైనా చేసిన దాడిని నిరసించడానికి రష్యాలోని కమ్యూనిస్టులు సాహసించలేదు. అదంతా గతం. ఇప్పుడు రష్యా ప్రజాస్వామ్య దేశం. అయినప్పటికీ అమెరికాను నిరోధించే వ్యూహంలో భాగంగా రష్యా చైనాతో జట్టు కట్టింది. అంతేకాదు మధ్య ఆసియా దేశాలు సోవియట్ రష్యా నుంచి విడిపోయిన తర్వాత చైనా రష్యాల మధ్య సరిహద్దు నిడివి బాగా తగ్గిపోయింది. గతంలో ఏర్పడిన సరిహద్దు తగాదా అలా సహజంగానే సమసిపోయింది. అంతర్జాతీయ వేదికలపై రష్యా, చైనా జతకట్టి ఉన్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా చైనా రష్యాలు ఒకవైపున, భారత్ అమెరికా మరోవైపున నిలబడిన ఘటనలు సమీపగతంలో సంభవించాయి. ఇరాన్, సిరియాల బీభత్స విధానాలను అమెరికా నిరసించడం, రష్యా-చైనాలు బలపరచడం నిన్నమొన్నటి గతం... ఈ అంతర్జాతీయ పరిణామాల ప్రభావానికి అతీతంగా ద్వైపాక్షిక మైత్రిని పెంపొందించుకొనడానికి ఉభయదేశాలు యత్నించాయన్నది మన్మోహన్ సింగ్ పర్యటన స్పష్టం చేస్తుంది. అది సంతోషించదగింది.
ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా రష్యాతో కుదిరిన ఒప్పందాలూ, వెలువడిన సంయుక్త ప్రకటనా అన్నీ ఇరు దేశాల చిరకాల మైత్రీ సంబంధాల కొనసాగింపు దిశలో ఉండటం సంతోషకరం.

Published date : 19 Nov 2013 03:56PM