Skip to main content

ఆసియాన్ సదస్సు-2015

ఆగ్నేయాసియా దేశాల ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధి కోసం ఆసియాన్ సభ్యదేశాల 27వ వార్షికసమావేశం మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో ఈ ఏడాది నవంబరు 18 నుంచి 22 వరకు జరిగింది. ప్రభుత్వాధినేతలు/ ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్‌సీఈపీ)లో పాల్పంచుకునే దేశాలు (ఆసియాన్ సభ్యదేశాలు, ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, కొరియా, న్యూజిలాండ్) చర్చల పురోగతిని సమీక్షించాయి. 2013 మేలో ప్రారంభమైన ఆర్‌సీఈపీ చర్చల్లో పురోగతి సాధించినట్లు ప్రభుత్వాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు..
వస్తు వాణిజ్యం, సేవలు, పెట్టుబడికి సంబంధించి సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. ప్రపంచ జనాభాలో సగం వాటా, ప్రపంచ ఉత్పత్తి, వాణిజ్యంలో 30 శాతం వాటా కలిగిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యానికి కొన్ని బిలియన్ల ప్రజల జీవన ప్రమాణం పెంపునకు తగిన సామర్థ్యం ఉన్నట్లు నేతలు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. ఈ ప్రాంతంలో వృద్ధిని పెంపొందించటంతోపాటు ఆర్థిక సమగ్రతకు మార్గం సుగమమం చేయటానికి ఆర్‌సీఈపీ దోహదపడుతుంది. 2016 నాటికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేయాలని మంత్రులకు, చర్చల్లో పాల్గొనేవారికి సూచించినట్లుగా ప్రభుత్వాధినేతలు తమ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. దీంతో ప్రాంతీయ, ప్రపంచ ఆర్థిక సమగ్రత, సమానత్వంతో కూడిన ఆర్థికాభివృద్ధి, ఆర్థిక సహకారం పటిష్టం కావటానికి మార్గం సుగమమం అవుతుందని సంయుక్త ప్రకటన వివరించింది.

వివిధ ఒప్పందాలు
సదస్సులో ముఖ్యాంశాలను నాయకుల సంతకాలతో డాక్యుమెంట్ల రూపంలో పొందుపరిచారు. డాక్యుమెంట్ల వివరాలు..
 • ఆసియాన్ కమ్యూనిటీ ఏర్పాటుకు కౌలాలంపూర్ డిక్లరేషన్ 2015.
 • ఆసియాన్ 2025 కౌలాలంపూర్ డిక్లరేషన్.
 • మనుషుల అక్రమ రవాణాను నిరోధించటం (ముఖ్యంగా స్త్రీలు, చిన్నపిల్లలు).
 • వృద్ధుల సాధికారతకు కృషిచేయటం.
 • వాతావరణ మార్పుపై సంయుక్త ప్రకటన.
 • ఉన్నత విద్యకు సంబంధించి ఒప్పందం.
 • సామాజిక భద్రతను పటిష్టపరచేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించటం.
 • మహిళలపై హింసను నివారించేందుకు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు.
 • బాలలపై హింసకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించటం.
 • పర్యావరణ స్థిరత్వం, వాతావరణ మార్పులపై అజెండా.

ముఖ్యాంశాలు
ఆర్థిక వృద్ధి
 • ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ.. ఆసియాన్ దేశాల ఆర్థిక ప్రగతి స్థిరంగా ఉంది. ప్రపంచ చమురు ధరల్లో తగ్గుదల ప్రభావం, అమెరికా డాలర్‌తో పోల్చినపుడు ప్రాంతీయ కరెన్సీల విలువలో తగ్గుదల, చైనా వృద్ధిరేటులో తగ్గుదల లాంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఆసియాన్ దేశాల ఆర్థిక ప్రగతిలో స్థిరత్వం కనిపిస్తోందని సదస్సులో దేశాధినేతలు అభిప్రాయపడ్డారు.
 • 2015 ఆర్థిక సంవత్సరంలో ఆసియాన్ దేశాల వాస్తవిక స్థూల దేశీయోత్పత్తి వృద్ధి 4.4 శాతంగా ఉండగలదనే విశ్వాసాన్ని నాయకులు వ్యక్తపరిచారు. ప్రపంచ ఆర్థిక వాతావరణంలో ప్రోత్సాహకర పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్న నేపథ్యంలో 2016లో ఈ ప్రాంత జీడీపీ వృద్ధి 4.9 శాతంగా ఉండగలదని అంచనా వేశారు.
 • ఆర్థిక వాతావరణం సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రాంతీయ సమగ్రతను పెంపొందించటానికి తాము కట్టుబడి ఉన్నట్లు నాయకులు తెలిపారు. ఈ ప్రాంతంలో అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధికి తగిన నిధుల కోసం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించాలంటే ఆర్థిక సమగ్రత పెంపొందించుకోవటం ఆసియాన్ దేశాలకు చాలా ముఖ్యమని నాయకులు గుర్తించారు.
 • ఆసియాన్ ఆర్థిక సంఘం-2015 అజెండాను ప్రాధాన్యతా క్రమంలో 2016లో పూర్తయ్యేలా చర్యలు చేపడతామని సదస్సు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆసియాన్ సమగ్రత నివేదిక 2015ను ప్రారంభించటాన్ని సదస్సు స్వాగతించింది.
 • ఆసియాన్ ఆర్థిక సంఘం ఏర్పాటు, పేదరిక రేటులో తగ్గుదల, ఆసియాన్ ప్రజల శ్రేయస్సు పెరుగుదల, అభివృద్ధిలో వ్యత్యాసం తగ్గింపు, పటిష్ట ఆర్థికాభివృద్ధి, వాణిజ్యం వంటి అంశాలు పెట్టుబడులు పెరిగేందుకు దోహదపడ్డాయి.
 • 2007లో ఆసియాన్ సభ్యదేశాల ప్రపంచ వాణిజ్యం 1.61 ట్రిలియన్ డాలర్లు. 2014లో ఇది 2.53 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ప్రాంతానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వృద్ధిలోనూ గణనీయమైన పెరుగుదల ఏర్పడింది. ఆసియా ప్రాంత మొత్తం వాణిజ్యంలో అంతర్గత వాణిజ్య వాటా 2014లో 24.1 శాతం (విలువ - 608.3 బిలియన్ డాలర్లు). ఒక భాగస్వామిగా, ఈ ప్రాంతపు పెద్ద మార్కెట్‌గా ఆసియాన్ అవతరించింది.
 • ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహంలో అంతర్గత ఆసియా పెట్టుబడుల వాటా 17.9 శాతం. 2014లో ఆసియా దేశాల మధ్య జరిగిన పెట్టుబడులు 24.4 బిలియన్ డాలర్లు. గతంలోలాగా 2015లో కూడా ఆసియాన్ దేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల్లో వృద్ధి కొనసాగుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు. 2014లో ఈ ప్రాంత ఉమ్మడి జీడీపీ 2.57 ట్రిలియన్ డాలర్లు. సగటు తలసరి స్థూల దేశీయోత్పత్తి 4135 డాలర్లు.

పరిశ్రమలకు ఊతం
 • చిన్న మధ్య తరహా సంస్థల అభివృద్ధి 2016-2025కు సంబంధించి ఆసియాన్ వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయటాన్ని నాయకులు స్వాగతించారు.
 • చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025 ఉత్పాదకత పెంపు, సాంకేతిక పరిజ్ఞానం, నవకల్పనలు, ఫైనాన్స్ లభ్యత అవకాశాల పెంపు, మార్కెట్ లభ్యత, విధానపరమైన, నియంత్రణ వాతావరణం పెంపు, ఉద్యమిత్వాన్ని ప్రోత్సహించటం, మానవ మూలధనం అభివృద్ధి వంటి అంశాలపై దృష్టిసారిస్తుంది.
 • పోటీతత్వం, సామర్థ్య పెంపు ద్వారా సూక్ష్మ సంస్థల అభివృద్ధి 2025 కార్యాచరణ ప్రణాళికను సమర్థంగా అమలుచేసేందుకు ఈ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా సంస్థల మద్దతు అవసరం. ఆసియాన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా ప్రాంతీయ సరఫరా సమగ్రత నుంచి లబ్ధి పొంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు ఉమ్మడిగా ఆసియాన్ సమగ్రతను పెంపొందిస్తాయి.
 • ఈ ప్రాంతంలో వృద్ధి, అభివృద్ధిని పెంపొందించేందుకు వ్యూహాత్మకంగా నవకల్పనలను అమలుపరచేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు నాయకులు పేర్కొన్నారు. సైన్స్, టెక్నాలజీలపై ఆసియాన్ కార్యాచరణ ప్రణాళిక 2016-25 ద్వారా నవకల్పనలు, పోటీతత్వం, శక్తిమంతమైన, సుస్థిర, ఆర్థిక సమగ్రతతో కూడిన ప్రాంతంగా రూపొందేలా చేసే ప్రయత్నాలకు ఆసియాన్ దోహదపడుతుంది.
 • ఆసియాన్ ఆర్థిక సంఘం బ్లూప్రింట్ 2025లో పొందుపరచిన వ్యూహాత్మక చర్యలను కార్యాచరణలోకి తీసుకురావటం ద్వారా అనేక ఇతర రంగాల 2015 తర్వాతి ప్రణాళికలను పూర్తిచేయాలని నాయకులు అభిలషించారు.
 • అనేక చర్యల ద్వారా వాణిజ్య సదుపాయం పెంపునకు జరుగుతున్న ప్రయత్నాలను నాయకులు స్వాగతించారు. ఆసియాన్ సెల్ఫ్ సర్టిఫికేషన్ స్కీం, ఆసియా ట్రేడ్ రిపాజిటరీ సిస్టం ఏర్పాటు, ఆసియాన్ సింగిల్ విండో ఏర్పాటు లాంటి చర్యలు వాణిజ్య సదుపాయాన్ని ప్రోత్సహిస్తాయి.
 • పెట్టుబడులు, సేవలు, వాణిజ్యం వంటి అంశాల సమస్యల పరిష్కారాన్ని నాయకులు స్వాగతించారు.
 • ఆసియాన్ ఆర్థిక సంఘం బ్లూప్రింట్ 2025లో పేర్కొన్న విధంగా రాబోయే పది సంవత్సరాల్లో ఆర్థిక సమగ్రత ప్రక్రియ కొనసాగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు నాయకులు అభిప్రాయపడ్డారు.
 • 2025 నాటికి ఆసియాన్ ఆర్థిక సంఘాన్ని అమలుపరచే విధంగా వ్యూహాత్మక చర్యలు చేపట్టాలని డాక్యుమెంట్‌లో పొందుపరిచారు. ఆసియాన్ ఆర్థిక సంఘంలో పెంపొందించే లక్షణాలు..
  • ఆర్థిక సమగ్రతతో కూడిన నిర్బంధ (cohesive) ఆర్థిక వ్యవస్థ.
  • పోటీతత్వం, నవకల్పనలు, చలనాత్మక ఆసియాన్.
  • అనుసంధానత పెంపు, వివిధ రంగాల మధ్య సహకారం.
  • స్థితిస్థాపక, సమ్మిళిత, ప్రజల ఆధారిత, కేంద్రీకృత ఆసియాన్.
  • ఆసియాన్‌ను ప్రపంచవ్యాప్తం చేయటం.

సేవల రంగానికి ప్రాధాన్యం
 • ఆసియాన్ ఆర్థిక వ్యవస్థల్లో సేవా రంగం వాటాలో ఉత్పత్తి, ఉపాధి పెంపులో గణనీయమైన పెరుగుదలను నాయకులు గుర్తించారు. ఈ ప్రాంతంలో వాణిజ్యం చేయటానికి, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ప్రైవేటు రంగానికి అవకాశం లభిస్తుంది.
 • ఆసియా ఆర్థిక వ్యవస్థల్లో ఉత్పత్తి, ఉపాధి పెంపులో సేవారంగం వాటాలో గణనీయమైన పెరుగుదలను నాయకులు గుర్తించారు. ఈ ప్రాంతంలో వృద్ధికి సేవా రంగం అధికంగా దోహదపడగలదని, ఈ నేపథ్యంలో సేవా రంగంలో సరళీకరణ విధానాల అమలుకు ప్రాధాన్యమివ్వాలని, నాయకులు అభిప్రాయపడ్డారు. పదో ఆసియాన్ సర్వీస్ ప్యాకేజీల అమలుకు ప్రోటోకాల్ ఖరారులో సాధించిన ప్రగతిని నాయకులు స్వాగతించారు.
 • ఇంజనీరింగ్ సర్వీసెస్, నర్సింగ్ సర్వీసెస్, ఆర్కిటెక్చరల్ సర్వీసెస్, అకౌంటింగ్ సర్వీసెస్, డెంటల్ ప్రాక్టీషనర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్, సర్వేయింగ్, టూరిజం ప్రొఫెషనల్స్‌కు సంబంధించి ఎనిమిది పరస్పర గుర్తింపు ఒప్పందాలు జరిగాయి. తద్వారా ఆయా దేశాల మధ్య స్వేచ్ఛాయుతమైన సేవల ప్రవాహానికి అవకాశం ఏర్పడుతుంది. తాత్కాలికంగా వృత్తి నిపుణులు, నేర్పరితనం గల శ్రామికులు ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
 • ఆర్థిక సంస్కరణలు, ఇతర పెట్టుబడి సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులను పెంపొందించేందుకు ఆసియా సభ్యదేశాలు జరుపుతున్న కృషిని నాయకులు స్వాగతించారు.
 • పోటీతత్వం, సంస్థలు, చట్టాల ఏర్పాటు వంటి సంస్కృతిని పెంపొందించేందుకు 8 ఆసియా దేశాలు పోటీ చట్టాలను రూపొందించాయి. ఆసియా పోటీ ప్రణాళిక 2016-25ను నాయకులు స్వాగతించారు.
 • మేధోసంపదను వినియోగించుకోవటం ద్వారా ఆసియాను నవకల్పనలు, పోటీతత్వంతోకూడిన ప్రాంతంగా రూపుదిద్దటానికి ఆసియా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కార్యాచరణ ప్రణాళిక 2011-15 అమలులో ప్రగతి సాధించినట్లు నాయకులు తెలిపారు. 2016-25 కాలానికి నూతన వ్యాపార నమూనాలను రూపొందించటంతోపాటు సమర్థవంతమైన ప్రపంచ స్థాయి సర్వీసులను అందించగలదని నాయకులు అభిలషించారు.
 • ప్రాంతీయ సమగ్రత కృషిలో ఆసియా బిజినెస్ అడ్వయిజరీ కౌన్సిల్ నిర్వహించిన పాత్రను సదస్సు స్వాగతించింది. 2015 ఆసియా బిజినెస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్, ఆసియా బిజినెస్ అవార్డ్స్‌కు కౌన్సిల్ ఆతిథ్యం ఇచ్చినందువల్ల స్వదేశీ కంపెనీలు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల్లో నవకల్పనలు, పోటీతత్వం పెరిగింది.
 • ఆసియా సభ్యదేశాల్లో 9 దేశాలు వినియోగదారుని రక్షణ చట్టాలు తీసుకురావటాన్ని నాయకులు గుర్తు చేసుకున్నారు. ఆసియా వినియోగదారుని భద్రత 2016-25 కార్యాచరణ ప్రణాళిక ద్వారా ఆసియా పౌరుల్లో విశ్వాసం పెంపొందించటానికి ఉపకరిస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

ఆసియాన్ సభ్యదేశాలు
ఇండొనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనై, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా.
Published date : 11 Dec 2015 10:28AM

Photo Stories