Skip to main content

ఆగ్నేయాసియా, భారత్ మైత్రి

బాలలత మల్లవరపు, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్.
భారత్ తొలినుంచి ప్రపంచ శాంతి కాంక్షిస్తున్న దేశం. సూపర్ పవర్‌గా ఎదుగుతున్నా.. ఎప్పుడూ ఇతర దేశాలపై పెత్తనం చేయాలని చూడలేదు. ఈ వైఖరే ప్రపంచ దేశాల మన్ననలు పొందేలా చేసింది. తాజాగా భారత్ ‘తూర్పు దిశగా కార్యాచరణ’లో భాగంగా గణతంత్ర దినోత్సవానికి ఆగ్నేయాసియా దేశాధినేతలకు ఆతిథ్యమిచ్చి.. ఆ దేశాలతో మైత్రీ బంధాన్ని నూతన స్థాయికి తీసుకెళ్లింది. ఇదే సమయంలో చైనా దురాక్రమణ విధానాలతో విసిగిపోయిన ఆగ్నేయాసియా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో ఆగ్నేయాసియాలో భారత్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఆగ్నేయాసియాలోని చాలా దేశాలు రెండో ప్రపంచయుద్ధానంతరం స్వాతంత్య్రం పొందాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆయా దేశాల మధ్య సరిహద్దు తగాదాలు మొదలయ్యాయి. ఈ వివాదాలను పరిష్కరించే నెపంతో పాశ్చాత్య దేశాలు తిరిగి ఆగ్నేయాసియాలో జోక్యం చేసుకున్నాయి. దీన్ని గుర్తించి సుహార్తో, మహతిర్ మహ్మద్, లీ కెన్ యూ తదితర నాయకులు పరస్పర చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా సింగపూర్‌లో 1967, ఆగస్టు 8న ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్‌లు కలిసి కూటమి (ఆసియాన్)గా ఏర్పడుతూ సంబంధిత ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది బ్యాంకాక్ తీర్మానంగా ప్రసిద్ధి చెందింది. అనంతరం 1984లో బ్రూనై; 1995లో వియత్నాం; 1997లో లావోస్, మయన్మార్; 1999లో కంబోడియాలు ఆసియాన్‌లో చేరాయి. దీంతో ఈ కూటమిలోని దేశాల సంఖ్య పదికి చేరింది. ఆసియాన్ దేశాలు ప్రపంచ భూభాగంలో 3 శాతం; జనాభాలో 9 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఆసియాన్ దేశాలను ఒక ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తే ఆసియాలో మూడవ; ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది. ఈ కూటమి వాణిజ్యం, రక్షణ తదితర రంగాల్లో సహకారం కోసం భారత్, జపాన్, చైనా, దక్షిణ కొరియాలను భాగస్వాములుగా చేసుకొని ముందుకు సాగుతోంది. ఆసియాన్ 2017లో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఆసియాన్-భారత్
ఆంగ్లేయులు రాకముందుఆసియాన్ దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య సంబంధాలు ఉండేవి. వలస పాలనలో ఇవి పూర్తిగా దెబ్బతిన్నాయి. స్వాతంత్య్రానంతరం భారత్ 1980, 90 దశకాల్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఆ సమయంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలతోపాటు ‘తూర్పు వైపు చూపు’ అనే విధానాన్ని ప్రారంభించారు. భారత్-ఆసియాన్‌ల మధ్య 1992లో అంశాల వారీగా చర్చలు ప్రారంభం కాగా, 1996 నుంచి పూర్తిస్థాయి చర్చలు జరుగుతున్నాయి. తొలి ఆసియాన్-భారత్ సదస్సు కంబోడియా రాజధాని నాంఫెన్‌లో జరిగింది. 2002 నుంచి ఏటా ఆసియాన్ దేశాల శిఖరాగ్ర సదస్సు అనంతరం ఆసియాన్-భారత్ సదస్సు జరుగుతుంది. 2012 నుంచి ఆసియాన్‌తో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోంది. 2014లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ‘తూర్పు దిశగా కార్యాచరణ’ ప్రారంభమైంది. భారత్-ఆసియాన్ చర్చల భాగస్వామ్యానికి ఇటీవల 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఆసియాన్ కూటమిలోని చాలా దేశాలు అలీనోద్యమం (నామ్), బిమ్స్‌టెక్ (బే ఆఫ్ బెంగాల్ ఇనీషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోపరేటివ్)లో సభ్యులుగా ఉన్నాయి. ఈ దేశాలన్నీ అంతర్జాతీయ వేదికలపై భారత్‌తో కలిసి పనిచేస్తున్నాయి.

చైనా ప్రభావం
ఇటీవల ప్రపంచంపై అమెరికా పట్టు క్రమంగా సడలుతోంది. దీంతో ప్రపంచానికి నాయకత్వం వహించాలని చైనా ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా ఆసియా మార్కెట్లను గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యం చలాయిస్తూ చుట్టుపక్కల దేశాలపై పెత్తనం చేస్తోంది. ఈ చర్యలను ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం తీవ్రంగా వ్యతిరేకించాయి. చైనాకు వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్ అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ ఆ ప్రాంతంలోని అన్ని దేశాలకు దక్షిణ చైనా సముద్రంపై హక్కులు ఉన్నాయని తేల్చిచెప్పింది. కానీ, చైనా మాత్రం ఆ ఆదేశాలను లెక్కచేయడం లేదు. దీంతోపాటు చైనా చేపట్టిన ‘వన్ బెల్ట్ వన్ రోడ్’ ప్రాజెక్టు కూడా ఆగ్నేయాసియా దేశాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు భారత్ తోడ్పడగలదని ఆసియాన్ దేశాలు భావిస్తున్నాయి.

ఆర్థిక సంబంధాలు
ప్రపంచీకరణ ఫలితంగా అంతర్జాతీయ సంబంధాల్లో ఆర్థిక, వాణిజ్య పరమైన అంశాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. కాబట్టి ఆసియాన్ దేశాలతో భారత్ వాణిజ్య సంబంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉంది. వస్తు సరఫరాకు సంబంధించి ఆసియాన్‌తో 2009లో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరగా, 2014లో సేవల ఒప్పందం కుదిరింది. భారత్ ఎగుమతుల్లో ఆసియాన్ వాటా 8.1 శాతంగా ఉంది. 2016-17లో భారత్.. ఆసియాన్‌కు చేసిన మొత్తం ఎగుమతుల విలువ 3,107 కోట్ల డాలర్లు కాగా, దిగుమతులు 4,063 కోట్ల డాలర్లు. వాణిజ్య లోటు 956 కోట్ల డాలర్లుగా ఉంది. ఆసియాన్-భారత్ మధ్య వాణిజ్యాన్ని 2022 నాటికి 200 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఆసియాన్ దేశాల్లో మయన్మార్‌తో మాత్రమే భారత్‌కు భూమార్గ అనుసంధానం ఉంది. ఇది అంత అనుకూలంగా లేకపోవడంతో జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నారు. కాలడాన్ మల్టీ-మోడల్ ట్రాన్సిస్ట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టులో భాగంగా కోల్‌కతా రేవుతో మయన్మార్‌లోని సిథ్వేని అనుసంధానిస్తున్నారు.

భారత్-మయన్మార్-థాయిలాండ్ మధ్య 1700 కిలోమీటర్ల పొడవైన హైవే నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మార్గంలో భారత్ 69 వంతెనలు నిర్మిస్తోంది. భవిష్యత్తులో ఈ మార్గాన్ని కాంబోడియా, లావోస్, వియత్నాం వరకు విస్తరించే అవకాశం ఉంది. ఆసియాన్‌తో అనుసంధానానికి భారత్ ‘మాస్టర్ ప్లాన్ ఆఫ్ ఆసియాన్ కనెక్టివిటీ’ పేరుతో ప్రణాళిక రూపొందించింది. ఇందులో నిర్దేశించుకున్న లక్ష్యాలను 2025లోగా చేరుకోవాలని నిర్ణయించింది.

ఆసియాన్‌తో వాణిజ్యంలో చైనాతో పోల్చితే భారత్ బాగా వెనకబడి ఉంది. 2014-15లో ఆసియాన్-భారత్ వాణిజ్యం 76.53 బిలియన్ డాలర్లు కాగా, ఆసియాన్-చైనా వాణిజ్యం 452.2 డాలర్లు (6 రెట్లు అధికం)గా ఉంది. 2015-16లో ఆసియాన్ దేశాల్లో భారత్ పెట్టుబడులు 224 మిలియన్ డాలర్లు కాగా, చైనా పెట్టుబడి 3 బిలయన్ డాలర్లుగా ఉంది.

ఆసియాన్ దేశాలు సముద్రమార్గం ద్వారా భారత్‌తో వాణిజ్యం సాగిస్తున్నాయి. ఈ మార్గాల్లో అక్రమ రవాణా, సముద్ర దొంగల తాకిడి ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సముద్ర భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.

ఢిల్లీ డిక్లరేషన్
ఆసియాన్-భారత్ సంబంధాలకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత్ ఆహ్వానం మేరకు ఆగ్నేయాసియా దేశాధినేతలు జనవరి 25న ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ‘విలువల భాగస్వామ్యం, ఉమ్మడి లక్ష్యం’ ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సు 36 అంశాలతో కూడిన తీర్మాన పత్రాన్ని విడుదల చేసింది. ఇందులో సముద్ర జలాలపై హక్కులకు సంబంధించి దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి తీర్మానం (1982), అంతర్జాతీయ నిబంధలకు లోబడి నడుచుకోవాలని పిలుపునిచ్చాయి.

సాంస్కృతిక బంధం
ఆసియాన్ దేశాలతో భారత్‌కు బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. హిందూ, బౌద్ధ సంప్రదాయాలు ఈ బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయి. మయన్మార్‌లోని బౌద్ధ పగోడాల రక్షణలో భారత్ పాలుపంచుకుంటోంది. అలాగే మన దేశంలోని నలంద విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో భాగమయ్యేందుకు ఆసియాన్ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఆసియాన్‌లోని చాలా దేశాల్లో రామాయణ గాథలు వివిధ రూపాల్లో ప్రాచుర్యంలో ఉన్నాయి. భారతీయ చిత్రాలకు సింగపూర్, మలేషియాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. సింగపూర్‌లో ఒక ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. దీన్నిబట్టి ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న అనుబంధం అర్థమవుతుంది.

సంపూర్ణ సహకారం
  • వస్తు, సేవలకు పరిమితం కాకుండా విద్య, వైద్యం, శాస్త్ర, సాంకేతికత, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారం దిశగా ఆసియాన్-భారత్ బంధం కొనసాగుతోంది.
  • 2016లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఆసియాన్-భారత్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్రమోదీ.. భౌగోళిక, డిజిటల్ అనుసంధానానికి రూ.100 కోట్ల రుణం ప్రకటించారు.
  • ఆసియాన్-భారత్ శాస్త్ర సాంకేతిక అభివృద్ధి నిధిని 10 లక్షల డాలర్ల నుంచి 50 లక్షల డాలర్లకు పెంచాలని నిర్ణయించారు.
  • వియత్నాం కేంద్రంగా త్వరలో అంతరిక్ష రంగంలో ఆసియాన్-భారత్ సహకార ప్రాజెక్టు ప్రారంభం కానుంది.
  • వియత్నాం రక్షణను బలోపేతం చేసేందుకు క్షిపణుల ఎగుమతి, ఆ దేశ వాయుసేన పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉంది.
  • భారత్.. ఆసియాన్ దేశాలతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతోంది. గతేడాది సింగపూర్ నావికాదళంతో కలిసి సింబెక్స్-17 పేరుతో దక్షిణ చైనా సముద్రంలో వారం రోజులపాటు విన్యాసాలు నిర్వహించింది.
  • మలేషియా, వియత్నాం, మయన్మార్ తదితర దేశాలు భవిష్యత్‌లో భారత్ ఇంధన అవసరాలను తీర్చడంలో కీలకపాత్ర పోషించనున్నాయి.
Published date : 03 Mar 2018 03:21PM

Photo Stories