Skip to main content

CPF - Central Police Force

సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్స్‌లో చేరాలనుంది. దీనికి కావాల్సిన అర్హతలేంటి, ప్రకటన వివరాలు తెలపండి?
+
సాహసోపేతమైన, బాధ్యతాయుతమైన ఉద్యోగంగా సెంట్రల్‌ పోలీస్‌  ఫోర్స్‌ను చెప్పుకోవచ్చు. ఈ సర్వీసుకు ఎంపికైనవాళ్ల కెరీర్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌గా ప్రారంభమవుతుంది. ఆకర్షణీయ వేతనంతోపాటు అలవెన్సులూ ఉంటారుు. కేంద్ర ప్రభుత్వ విభాగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీల్లో అసిస్టెంట్‌ కమాండెంట్‌గా నియూమకానికి యూపీఎస్‌సీ ప్రతి ఏటా ప్రకటన విడుదల చేస్తుంది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసి.. 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతులకు వయసు విషయంలో సడలింపు ఉంటుంది. సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. ఎన్‌సీసీ బి, సి సర్టిఫికేట్లు ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
+
మెడికల్‌ టెస్ట్‌ క్వాలిఫై అయిన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూకు హాజరు కావాలి. మెడికల్‌ టెస్ట్‌లో విఫలమైన అభ్యర్థులకు..మరోసారి తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు  అవకాశం కల్పిస్తారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులను కూడా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూకు 150 మార్కులు కేటాయించారు. ఈ సమయంలో అభ్యర్థులు ఏ దళంలో చేరాలనుకుంటున్నారో.. దానికి సంబంధించి తమ ప్రిఫరెన్స్‌ను తెలియజేయాలి.
ఫిజికల్‌ స్టాండర్డ్‌/ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌ ఏవిధంగా ఉంటుంది?
+
ఫిజికల్‌ స్టాండర్డ్‌/ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌లో నాలుగు విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. అవి..100 మీటర్ల పరుగు, 800 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, షార్ట్‌పుట్‌. 100 మీటర్ల దూరాన్ని పురుష అభ్యర్థులు..16 సెకన్లలో..మహిళ అభ్యర్థులు 18 సెకన్లలో పూర్తి చేయాలి. 800 మీటర్ల దూరాన్ని పురుష అభ్యర్థులు 3 నిమిషాల 45 సెకన్లలో, మహిళ అభ్యర్థులు 4 నిమిషాల 45 సెకన్లలో చేరుకోవాలి. లాంగ్‌జంప్‌ను పురుష అభ్యర్థులు(3 ప్రయత్నాల్లో) 3.5 మీటర్ల దూరం దూకాలి. మహిళల అభ్యర్థులు(3 ప్రయత్నాల్లో) 3 మీటర్లు దూకితే సరిపోతుంది. షార్ట్‌పుట్‌(7.26 కిలోలు)ను పురుష అభ్యర్థులు 4.5 మీటర్ల దూరం విసరాలి. దీని తర్వాత మెడికల్‌ టెస్ట్‌ ఉంటుంది.
రాత పరీక్షలో కనీస క్వాలిఫై మార్కులు నిబంధన ఉందా?
+
పేపర్‌-1, పేపర్‌-2 కు ప్రత్యేకంగా క్వాలిఫైయింగ్‌ మార్కులు ఉంటాయి. నిర్దేశించిన విధంగా పేపర్‌-1లో స్కోర్‌ చేసిన అభ్యర్థుల పేపర్‌-2నే మూల్యాంకనం చేస్తారు. కాబట్టి అభ్యర్థులు పేపర్‌-1 విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
రాత పరీక్షలో ఏయే అంశాలు ఉంటాయి?
+
రాత పరీక్ష పేపర్‌-1, 2 భాగాలుగా ఉంటుంది. పేపర్‌-1 జనరల్‌ ఎబిలిటీ అండ్‌ ఇంటలిజెన్స్‌ టెస్ట్‌. కేటాయించిన మార్కులు: 250. సమయం: 2 గంటలు. ఇంగ్లిష్‌/హిందీ భాషల్లో అబ్జెక్టివ్‌ పద్ధతిలో ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, జనరల్‌ సైన్స్‌, కరెంట్‌ అఫైర్స్‌, ఇండియన్‌ పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, ఇండియా-వరల్డ్‌ జాగ్రఫి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

పేపర్‌-2లో జనరల్‌ స్టడీస్‌, ఎస్సే, కాంప్రెహెన్షన్‌ విభాగాలు ఉంటాయి. కేటాయించిన మార్కులు: 200. ఎస్సే రాయిటింగ్‌ను ఇంగ్లిష్‌, లేదా హిందీలలో రాయొచ్చు. మిగతా ప్రశ్నలకు మాత్రం ఇంగ్లిష్‌లోనే సమాధానాలు ఇవ్వాలి. సమయం: 3 గంటలు. ఈ పేపర్‌ పార్ట్‌-ఎ, బి రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్‌-ఎలో మోడ్రన్‌ ఇండియన్‌ హిస్టరీ, భారత స్వాతంత్య్ర పోరాటం, ఎకనామీ, పాలిటీ, జాగ్రఫి, మానవ నిర్దేశించిన అంశంపై ఎస్సే రాయాలి. ఇందుకోసం 80 మార్కులు కేటాయించారు. పార్ట్‌-బిలో కాంప్రెహెన్షన్‌ ప్యాసేజెస్‌, ప్రిసీస్‌ రాయిటింగ్‌, ఆర్గ్యుమెంట్స్‌, గ్రామర్‌, ఇంగ్లిష్‌ భాష సామర్థ్యాన్ని పరీక్షించే అంశాలు ఉంటాయి. ఈ విభాగానికి కేటాయించిన మార్కులు: 120.
ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
+
ఎంపిక ప్రక్రియ పలు దశలతో కూడి ఉంటుంది. మొదట దశలో రాత పరీక్ష ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి ఫిజికల్‌ స్టాండర్డ్‌/ఫిజికల్‌ ఎఫిసియెన్సీ టెస్ట్‌ తర్వాత మెడికల్‌ టెస్ట్‌ చివరగా పర్సనాలిటీ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఉంటాయి.
ఈ ఎగ్జామ్‌కు మహిళలు కూడా అర్హులేనా?
+
నిర్దేశిత పోస్టులకు మహిళలు కూడా అర్హులే. సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీ, సీఐఎస్‌ఎఫ్‌ దళాల్లో ప్రవేశానికి మహిళ అభ్యర్థులను కూడా నియమిస్తారు. బీఎస్‌ఎఫ్‌, ఐటీబీఎఫ్‌లకు మాత్రం పురుషులు మాత్రమే అర్హులు.
సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(ఏసీ) ఎగ్జామ్‌కు కావల్సిన అర్హతలు?
+
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ. వయసు: 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిర్దేశిత అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోసడలింపు ఉంటుంది. నిర్దేశించిన విధంగా శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఈ ఎగ్జామ్‌ ద్వారా ఏయే విభాగాల్లో రిక్రూట్‌మెంట్‌ చేస్తారు?
+
యూపీఎస్సీ నిర్వహించే సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(ఏసీ) ఎగ్జామ్‌ ద్వారా...సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌(సీఐఎస్‌ఎఫ్‌),  ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్‌(ఎస్‌ఎస్‌బీ)లలో అసిస్టెంట్‌ కమాండెట్ల(గ్రూప్‌-ఎ) నియామకం జరుగుతుంది.
సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(ఏసీ) ఎగ్జామ్‌ వివరాలను తెలపండి?
+
సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెసెస్‌లో అసిస్టెంట్‌ కమాండెట్ల(గ్రూప్‌-ఎ) నియామకం కోసం యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) ప్రతి ఏడాది సెంట్రల్‌ పోలీస్‌ ఫోర్సెస్‌(ఏసీ) ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. సంబంధిత నోటిఫికేషన్‌ ప్రతి ఏడాది జూలై/ఆగస్టు నెలలో వెలువడుతుంది.