డీఎస్సీ-ఎస్‌జీటీ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు ఎలా సిద్ధం కావాలి?
- ఎస్.రాధాకృష్ణ, మచిలీపట్నం.
Question
డీఎస్సీ-ఎస్‌జీటీ సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు ఎలా సిద్ధం కావాలి?
మెథడాలజీకి సంబంధించిన అంశాలు చదువుతున్నప్పుడు అర్థమైనట్లే ఉంటాయి. తీరా పరీక్షలో సమాధానాలు గుర్తించేటప్పుడు గందరగోళం తలెత్తుతుంది. ఇచ్చిన అన్ని ఆప్షన్లు కచ్చితమైనవేనన్న భావన కలుగుతుంది. అందువల్ల చదువుతున్నప్పుడు విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి.
- సాంఘిక శాస్త్రం-స్వభావం-పరిధి, చరిత్ర, అభివృద్ధిలో సాంఘికశాస్త్రం ఎప్పుడు ఆవిర్భవించింది? మనదేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు? వివిధ కమిటీలు, నిర్వచనాలకు సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. లేదంటే సాంఘికశాస్త్రం-సామాజికశాస్త్రాలతో గల సంబంధాలు, పోలికలపై తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి వీటిపైనా దృష్టిసారించాలి.
- సాంఘిక శాస్త్ర ఆశయాలు-లక్ష్యాలు-విలువల విభాగంలో ఆశయాలు/ఉద్దేశాలు, లక్ష్యాలు-స్పష్టీకరణల నుంచి ప్రశ్నలు వస్తాయి. జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యాలు, అభిరుచి, ప్రశంస, వైఖరి లక్ష్యాల్లోని స్పష్టీకరణలపై తప్పనిసరిగా పట్టు సాధించాలి.
- విద్యార్థులకు జ్ఞానాత్మక, గుణాత్మక విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు ఉపయోగించే పరికరాలను బోధనోపకరణాలు అంటారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఉపయోగించే గ్రాఫిక్స్ ఉపకరణాలు, ప్రదర్శనా బల్లలు, శ్రవణ ఉపకరణాలు, దృశ్య-శ్రవణ ఉపకరణాలు, ప్రక్షేపిత ఉపకరణాలు, త్రిమితీయ ఉపకరణాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ఏ అంశాల బోధనకు ఏ ఉపకరణాలు బాగా ఉపయోగపడతాయనే దాన్ని తెలుసుకోవాలి.
- విద్యార్థి అభ్యసనం ద్వారా సాధించిన ప్రగతిని శాస్త్రీయంగా తెలియజేసేందుకు, ఉపాధ్యాయుడు బోధనా విజయాన్ని తెలుసుకునేందుకు మూల్యాంకనం ఉపయోగపడుతుంది. అభ్యర్థులు మూల్యాంకనంలోని అంశాలు, సోపానాలు, రకాలను తెలుసుకోవాలి. సాంఘికశాస్త్ర పాఠ్యప్రణాళిక, పాఠ్యపుస్తకం, సోషల్ లేబొరేటరీలు, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు తదితర అంశాలపై దృష్టిసారించాలి.