Skip to main content

జూన్ 2017 అవార్డ్స్

అజిమ్ ప్రేమ్‌జీకి కార్నెగీ పురస్కారం
Current Affairs
భారత్‌లో పాఠశాల వ్యవస్థ అభివృద్ధి కోసం చూపుతున్న దాతృత్వానికిగాను ప్రముఖ పారిశ్రామకవేత్త, విప్రో చైర్మన్ అజిమ్ ప్రేమ్‌జీ ప్రతిష్టాత్మక కార్నెగీ అవార్డుకు ఎంపికయ్యారు. దాతృత్వ విభాగంలో అమెరికాలో అందజేసే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఇది.
అజిమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలకు విద్యనందిస్తున్నారు. ప్రస్తుతం ఏడు రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది పిల్లలు ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ సేవలకు గానూ.. ప్రేమ్‌జీ కార్నెగీ అవార్డును అందుకోనున్నారు.
నిస్వార్థభావంతో సేవలు చేసేవారిని ప్రోత్సహించేందుకుగాను అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ పేరు మీదుగా 2001 నుంచి రెండేళ్లకోసారి ఈ అవార్డులు అందజేస్తున్నారు. 2017 సంవత్సరానికి గానూ 9 మంది ఈ అవార్డుకు ఎంపికకాగా అందులో ప్రేమ్‌జీ ఒకరు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కార్నెగీ పురస్కారం - 2017
ఎప్పుడు : జూన్ 23
ఎవరు: అజీమ్ ప్రేమ్‌జీ
ఎందుకు : భారత్‌లో పాఠశాల వ్యవస్థ అభివృద్ధి కోసం చూపుతున్న దాతృత్వానికిగాను

ధన్‌రాజ్ పిళ్లైకి భారత్ గౌరవ్ పురస్కారం
భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్ ధన్‌రాజ్ పిళ్లై అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికయ్యారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫుట్‌బాల్ క్లబ్ ప్రదానం చేసే ఈ పురస్కారాన్ని.. క్లబ్ వ్యవస్థాపక దినమైన ఆగస్టు 1వ తేదీన ప్రదానం చేయనున్నారు. భారత హాకీ జట్టుకు అందించిన అపారమైన సేవలకు గుర్తింపుగా 2017 సంవత్సరానికిగాను పిళ్లైని ఈ పురస్కారానికి ఎంపిక చేశామని జూన్ 27న ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కళ్యాణ్ మజుందార్ వెల్లడించారు. క్లబ్ మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు సయ్యద్ నయీముద్దీన్, శుభాష్ బౌమిక్‌లకు లైఫ్‌టైమ్ ఎచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నట్లు చెప్పారు.
ఆధునిక భారతీయ హాకీ జట్టులో అతిపెద్ద స్టార్‌గా నిలిచిన పిళ్లై... తన 15 ఏళ్ల క్రీడా జీవితంలో అనేక అంతర్జాతీయ వేదికలపై ఒలిపిక్స్‌తోపాటు ప్రపంచ టోర్నీలు, చాంపియన్ ట్రోఫీలు, ఏషియన్ గేమ్స్‌లలో ఆడారు. మొత్తం 339 మ్యాచ్‌ల్లో 170 గోల్స్ సాధించి, అరుదైన గుర్తింపును దక్కించుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దన్‌రాజ్ పిళ్లైకి భారత్ గౌరవ్ పురస్కారం
ఎప్పుడు : జూన్ 27
ఎవరు: పశ్చిమ బెంగాల్ ఫుట్‌బాల్ క్లబ్
ఎందుకు : భారత హాకీకి అందించిన సేవలకు గాను

పశ్చిమ బెంగాల్‌కు ఐరాస పురస్కారం
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రతిష్టాత్మక ప్రజా సేవ పురస్కారాన్ని గెలుచుకుంది. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఆ రాష్ర్టం ప్రవేశపెట్టిన కన్యశ్రీ ప్రకల్ప పథకానికి ఈ పురస్కారం దక్కింది. ఈ అవార్డుకు 62 దేశాల నుంచి 552 ప్రాజెక్టులు పోటీ పడగా కన్యశ్రీ ప్రకల్పకు తొలి స్థానం దక్కింది.

డేవిడ్ గ్రాస్‌మన్‌కు మ్యాన్‌బుకర్ ప్రైజ్
Current Affairs
బ్రిటన్ అందించే ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను 2017 ఏడాదికి ఇజ్రాయెల్‌కు చెందిన రచయిత డేవిడ్ గ్రాస్‌మన్ గెలుచుకున్నారు. ‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టు ఎ బార్’ అనే నవలకుగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌మనీ మొత్తం 50 వేల పౌండ్లు (దాదాపు రూ.41.2 లక్షలు) కాగా డేవిడ్ నవలను ఇంగ్లిష్‌లోకి అనువాదం చేసిన జెస్సికా కొహెన్‌కు కూడా ప్రైజ్‌మనీలో సగం ఇవ్వనున్నారు.
మ్యాన్ బుకర్ ప్రైజ్‌ని మ్యాన్ గ్రూప్ పీఎల్‌సీ సంస్థ 1969లో ప్రారంభించింది. బ్రిటన్‌లో పబ్లిష్ అయిన ఆంగ్ల నవలకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మ్యాన్‌బుకర్ ప్రైజ్ - 2017
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : డేవిడ్ గ్రాస్‌మన్ (ఇజ్రాయెల్)
ఎందుకు : ‘ఎ హార్స్ వాక్స్ ఇన్‌టు ఎ బార్ నవలకు గాను

భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం
సామాజిక కార్యకర్త డాక్టర్ భారతీ శర్మకు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్(చావలియర్ డి ఆర్డ్రే నేషనల్ డి లా లీజియన్ డి హానర్) లభించింది. బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఫ్రాన్స్ ఈ అవార్డును అందించింది. భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి అలెగ్జాండర్ జిగ్లర్ నివాసంలో జూన్ 15న జరిగిన కార్యక్రమంలో ఆమెకు అవార్డును ప్రదానం చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చావలియర్ డి ఆర్డ్రే నేషనల్ డి లా లీజియన్ డి హానర్
ఎప్పుడు : జూన్ 15
ఎవరు : సామాజిక కార్యకర్త డాక్టర్ భారతీ శర్మ
ఎందుకు : బాలల రక్షణ, మహిళా సాధికారతకు ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా
Published date : 08 Aug 2017 04:57PM

Photo Stories