ISRO: జూన్ 22న నింగిలోకి జీశాట్–24
Telugu Current Affairs - Science & Technology: జీశాట్–24 ఉపగ్రహాన్ని జూన్ 22న కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ–మార్క్3 ద్వారా నింగిలోకి పంపాలని ఇస్రో భావించింది. ఇది కార్యరూపం దాల్చకపోవడంతో యూరోపియన్ యూనియన్ కు చెందిన ఏరియన్–5 రాకెట్ ద్వారా కౌరులోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం ఎన్ ఎస్‌ఐఎల్ సమకూర్చింది.ఏరియన్ స్పేస్ ద్వారా కక్ష్యలోకి పంపుతున్న 25వ భారతీయ ఉపగ్రహం ఇది. దేశ డీటీహెచ్ అవసరాలను తీర్చనుంది.
నౌక విధ్వంసక క్షిపణి తొలి పరీక్ష సక్సెస్
శత్రు దేశ యుద్ధనౌకలను తుత్తునియలు చేసే అధునాతన క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) ప్రకటించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలో సముద్రతీర ప్రాంతంలో భారత నావికా దళం, డీఆర్‌డీవో సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారికావడం గమనార్హం. నావికాదళ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించిన ఈ కొత్త యాంటీ–షిప్ మిస్సైల్ అత్యంత కచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించిందని డీఆర్‌డీవో వర్గాలు వెల్లడించాయి.