Skip to main content

ఫిబ్రవరి 2018 రాష్ట్రీయం

తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఖరారు Current Affairs
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను శాశ్వతంగా గుర్తుచేసుకునేందుకు ప్రమిద ఆకారంలో ఏడు అంతస్తులతో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు సంబంధించిన నమూనా ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సంతకం చేశారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ వద్ద ఈ స్తూపాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నారు. ఇందులో సందర్శకుల కోసం అన్ని సౌకర్యాలను కల్పించనున్నారు. తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల జ్ఞాపకార్థం తెలంగాణ ప్రభుత్వం భారీ స్తూపాన్ని నిర్మించాలని నిర్ణయించడం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ అమరవీరుల స్తూపం డిజైన్ ఖరారు
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : సీఎం కేసీఆర్
ఎక్కడ : హుస్సేన్‌సాగర్, హైదరాబాద్

కమల్‌హాసన్ పార్టీ మక్కళ్ నీది మయ్యం’
తమిళనాట మరో నటుడు రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రఖ్యాత హీరో, లోకనాయకుడుగా పేరుగాంచిన కమల్ హాసన్ ఫిబ్రవరి 21న మదురైలో పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కళ్ నీది మయ్యం (ప్రజా న్యాయ వేదిక)’ పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించారు. అలాగే, ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆరు చేతులు ఒకదాన్కొకటి మణికట్టు దగ్గర పట్టుకున్నట్లుగా, వర్తులాకృతిలో ఉన్న చిత్రం, మధ్యలో నక్షత్రం ఉండేలా పతాక రూపకల్పన చేశారు. ఆ చేతులు ఎరుపు, తెలుపు రంగుల్లో ఒకదాని తరువాత మరొకటి ఉండేలా చిత్రించారు. ఆ ఆరు చేతులు ఆరు దక్షిణాది రాష్ట్రాలకు ప్రతీకలని తన ప్రసంగం సందర్భంగా కమల్ వివరించారు. సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సైతం హాజరయ్యారు.

పెనుకొండలో కియా మోటార్స్’ ప్రారంభం
అనంతపురం జిల్లా పెనుకొండ వద్ద ఏర్పాటు చేస్తున్న ‘కియా మోటార్స్’ ఫ్రేమ్‌వర్క్ ఇన్‌స్టలేషన్ విభాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 22న ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బెంగళూరు, హైదరాబాద్, కృష్ణపట్నానికి దగ్గరగా ఏర్పాటవుతున్న ఈ కార్ల ప్లాంట్ భారత్‌లోనే అతిపెద్దది అవుతుందన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ భారత్‌లో 15వదని కియా ప్రెసిడెంట్, సీఈఓ హాన్-వూపార్క్ తెలిపారు. వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోపు పనులు పూర్తి చేసి ద్వితీయార్థంలో కార్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని.. ఏటా 3 లక్షల కార్లను ఉత్పత్తి చేస్తామని చెప్పారు. త్వరలో 3 వేల మంది ఉద్యోగులను నియమిస్తామని.. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకు కల్పిస్తామని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కియో మోటార్స్ కార్ల పరిశ్రమ
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు
ఎక్కడ : పెనుకొండ, అనంతపురం జిల్లా

డబుల్ బెడ్రూం పథకానికి హడ్కో పురస్కారం
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పథకంలో ప్రభుత్వం రూపొందించిన తీరు, వాటి నమూనా తదితరాలను పరిశీలించిన హడ్కో.. 2017 సంవత్సరానికి హడ్కో డిజైన్ అవార్డును ప్రకటించింది. పేదలకు పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో, ప్రత్యేక డిజైన్‌ను అనుసరిస్తున్నందుకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఏప్రిల్ చివరి వారంలో ఢిల్లీలో పురస్కార ప్రదానం ఉంటుందని వెల్లడించింది. ఇటీవల హడ్కో బృందం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట, ఖమ్మం, నారాయణ్‌పేటల్లోని ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించింది.

టీఎస్ కాప్’కు ఎన్‌సీఆర్‌బీ ట్రోఫీ
ఎన్‌సీఆర్‌బీ-2017 ట్రోఫీని తెలంగాణ పోలీస్ శాఖ గెలుచుకున్నట్లు ఎన్‌సీఆర్‌బీ జాయింట్ డెరైక్టర్ సంజయ్ మాథుర్ వెల్లడించారు. ఈ నెల 28న చెన్నైలో జరిగే కాన్ఫరెన్‌‌సలో ఈ ట్రోఫీని అందించనున్నట్లు పేర్కొన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఏటా నిర్వహించే టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖలో కంప్యూటరీకరణ తదితర అంశాలపై రాష్ట్రాలకు పోటీలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఎన్‌సీఆర్‌బీ-2017 ట్రోఫీ కోసం గత నవంబర్‌లో నామినేషన్‌‌స అడిగారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రారంభించబోతున్న టీఎస్ కాప్ యాప్‌ను నామినేషన్‌కు పంపించారు. ఏపీ, చండీగఢ్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పలు టెక్నాలజీ అంశాలపై నామినేషన్లు వచ్చాయి. ఈ నెల 9న అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నామినేషన్లను కమిటీ పరిశీలించింది. ఇందులో ‘ది బెస్ట్ ఐటీ ప్రాజెక్ట్-2017’గా టీఎస్ కాప్ ఎంపికై నట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ‘టీఎస్ కాప్’కు ఎన్‌సీఆర్‌బీ ట్రోఫీ - 2017
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ఎన్‌సీఆర్‌బీ
ఎందుకు : టెక్నాలజీ అమలు, వినియోగం, పోలీస్ శాఖలో కంప్యూటరీకరణకు గాను

తమిళనాడులో అమ్మ టూవీలర్’ పథకం
తమిళనాడు దివంగత సీఎం జయలలిత 70వ జయంతి సందర్భంగా మహిళా ఉద్యోగులకు రాయితీపై ద్విచక్ర వాహనాలు అందించే పథకం ‘అమ్మ టూవీలర్’ను ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న చెన్నైలో ప్రారంభించారు. ఐదుగురు లబ్ధిదారులకు తాళాలు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు అందించారు. గవర్నర్ బన్వరీలాల్, సీఎం పళనిస్వామి, డెప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2016 ఎన్నికల్లో జయలలిత ఈ పథకాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. దీని ప్రకారం.. స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్న ఉద్యోగినికి మొత్తం వ్యయంలో 50 శాతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సుమారు 3 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటి పరిశీలన జరుగుతోందని అధికార అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. అనంతరం.. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సీఎం, డిప్యూటీ సీఎంలు జయలలిత విగ్రహాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమ్మ టూవీలర్ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : తమిళనాడు

విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు
ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. సదస్సుకి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతు.. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ పురోగతిలో ఉందని.. ఏపీని 2022 నాటికి దేశంలో మూడో రాష్ట్రంగా, 2029 నాటికి దేశంలో నంబర్‌వన్‌గా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. గత మూడేల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి 1,946 అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నామని, వీటి ద్వారా రూ. 13.54 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, 31 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసినట్టు సీఎం తెలిపారు. ఇప్పటికే 531 పరిశ్రమలు ఉత్పత్తిలోకి వచ్చాయని, రూ. 1.03 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని, 2.65 లక్షల మందికి ఉపాధి లభించిందని ప్రకటించారు. మరో 1,143 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, వీటి ద్వారా రూ. 5.69 లక్షల కోట్ల పెట్టుబడి వస్తుందని, పారిశ్రామిక పెట్టుబడుల పురోగతి దేశంలోనే అత్యధికంగా 59 శాతం నమోదైందని చెప్పారు. మరో ఐదేళ్లలో 20 లక్షల మంది ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఎం తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్‌లో 15వ బయో ఆసియా సదస్సు
15వ బయో ఆసియా సదస్సు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 22న ప్రారంభమైంది. సదస్సుకి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు.


ప్రొఫెసర్ హాల్‌కు ఎక్సలెన్సీ అవార్డు

జీవశాస్త్ర రంగంలో విశిష్ట సేవలందించే వారికి బయో ఆసియా అందించే జినోమ్ వ్యాలీ ఎక్సలెన్సీ అవార్డును ఈ ఏడాది ప్రొఫెసర్ మైకేల్ ఎన్ హాల్‌కు అందించారు. స్విట్జర్లాండ్‌లోని బేసిల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హాల్ కణాల పెరుగుదలలో ర్యాపమైసిన్ ప్రోటీన్ల పాత్రపై పరిశోధనలు చేశారు. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలకు అనుగుణంగా శరీరంలోని ఒక వ్యవస్థ కణాల సైజును తగ్గిస్తుందన్న ఈయన పరిశోధన.. అవయవ మార్పిడిని మరింత సులభతరం చేసింది. రోగ నిరోధక వ్యవస్థ కొత్త అవయవాన్ని తిరస్కరించకుండా చూసేందుకు ఉపయోపడింది.
మూడు రోజుల పాటు జరిగే బయో ఆసియా సదస్సులో దేశవిదేశాల నుంచి వచ్చిన 1,600 మంది పారిశ్రామిక వేత్తలు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పాల్గొంటున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 15వ బయో ఆసియా సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 22 - 24
ఎక్కడ : హైదరాబాద్

రైతు కార్పొరేషన్ మార్గదర్శకాలు జారీ
తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఫిబ్రవరి 22న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్‌మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయిలను డెరైక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్‌కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డెరైక్టర్ల పేరిట కేటాయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.
ఇవీ ప్రధాన మార్గదర్శకాలు..
  • రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి.
  • రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా.
  • రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం.
  • సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం.
కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ..
  • వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం
  • వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం
  • రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం
  • రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం
  • కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం
  • మార్కెట్‌లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం
  • ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం
  • నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం
  • అవసరమైతే సొంత ఔట్‌లెట్లను ఏర్పాటు చేయడం
  • వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం
క్విక్ రివ్యూ :
ఏమిటి : రైతు కార్పొరేషన్ మార్గదర్శకాలు జారీ
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం

జినోమ్ వ్యాలీలో మరో బయోకాన్ యూనిట్
బయో టెక్నాలజీ దిగ్గజం బయోకాన్ హైదరాబాద్ నగరంలో కొత్తగా యూనిట్ ప్రారంభించనుంది. దీంతోపాటు ప్రస్తుత యూనిట్‌ను మరింత విస్తరించనుంది. హైదరాబాద్‌లో బయో ఆసియా సదస్సులో భాగంగా మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 23న బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షాతో సమావేశమయ్యారు. తమ అనుబంధ కంపెనీ సింజెన్ ద్వారా జినోమ్ వ్యాలీలో బయోకాన్ కొత్త ఆర్ అండ్ డి సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 1,000 హై స్కిల్డ్ ఉద్యోగాలు వస్తాయన్నారు. దీంతోపాటు బయోకాన్లోని సిబ్బందిని రెట్టింపు చేస్తామని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైదరాబాద్‌లో కొత్తగా బయోకాన్ యూనిట్
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : బయోకాన్ లిమిటెడ్
ఎక్కడ : జీనోమ్ వ్యాలీ

బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్ల ఆవిష్కరణ
భారతీయ సినీ పితామహుడు, దివంగత సినీ దర్శక, నిర్మాత.. వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్లను ఫిబ్రవరి 23న చెన్నైలో ఆవిష్కరించారు. నాగిరెడ్డి 105 వ వర్ధంతి (ఫిబ్రవరి 25) పురస్కరించుకుని ఈ తపాలా బిళ్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ హాజరయ్యారు. ఐదు రూపాయల విలువైన ఈ తపాలా బిళ్లను వెంకయ్యనాయుడు ఆవిష్కరించగా తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ ‘బి.నాగిరెడ్డి ది లెజెండ్’పుస్తకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బి.నాగిరెడ్డి పేరుతో తపాలా బిళ్ల ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : తపాలా శాఖ
ఎక్కడ : చెన్నైలో

హైదరాబాద్‌లో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఫిబ్రవరి 26న ఈ-గవర్నెన్‌‌స జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు.. డిజిటల్ ప్రజాస్వామ్యానికి ప్రజలు డిజిటల్ విప్లవం బాట వేయాలని, సాంకేతిక విజ్ఞాన ఫలాలను ప్రజలు ఆర్థికాభివృద్ధికి వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 180 రకాల పౌర సేవలను మొబైల్ ద్వారా అందించేందుకు ‘టీ యాప్ ఫోలియో’ పేరుతో త్వరలో కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇది మీ-సేవ ప్రాజెక్టుకు 2.0 (ఆధునిక వెర్షన్) అన్నారు. ఏడేళ్ల కిందట ప్రారంభమైన మీ-సేవ కేంద్రాల ద్వారా రాష్ట్రంలో జరిగిన లావాదేవీల సంఖ్య ఇటీవలే 10 వేల కోట్లు దాటిందని చెప్పారు. రాష్ట్రంలో 4,500 మీ-సేవ కేంద్రాల ద్వారా ప్రతి రోజూ 1.5 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 26న
ఎక్కడ : హైదరాబాద్‌లో

విశాఖ సీఐఐ సదస్సులో 734 ఒప్పందాలు
వరుసగా మూడవ ఏడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఫిబ్రవరి 26న ముగిసింది. ముగింపు సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ ఏడాది భాగస్వామ్య సదస్సులో 4,253 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొనడమే కాకుండా రూ. 4.39 లక్షల కోట్ల విలువైన 734 ఒప్పందాలు కుదిరినట్లు తెలిపారు. 50 దేశాల నుంచి 280 మంది విదేశీ ప్రతినిధిలు, 3,673 మంది దేశీయ పారిశ్రామికవేత్తలు, 30 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ సమావేశాల్లో భాగస్వామ్యులు కావడానికి విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారని, ఈసారి జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్ కంట్రీల సెషన్‌‌స జరిగాయని, వచ్చే ఏడాది శ్రీలంక, రష్యా సెషన్‌‌స కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మూడున్నరేళ్లలో మొత్తం 1,946 ఒప్పందాలు కుదిరాయని, వీటి ద్వారా రూ.13.54 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు రావడమే కాకుండా 31 లక్షల మందికి ఉపాధి లభించనుందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సీఐఐ భాగస్వామ్య సదస్సు-2018
ఎప్పుడు : ఫిబ్రవరి 24 -26
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

ఘంటా చక్రపాణికి తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం
టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి సాహిత్య ప్రక్రియలో తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం లభించింది. చక్రపాణి రచించిన తెలంగాణ జైత్రయాత్ర అనే రచనకు ఈ పురస్కారం దక్కింది. 2015 సంవత్సరానికి గాను ఎంపికైన ఈ పురస్కారాన్ని ఫిబ్రవరి 26న నాంపిల్లిలోని పొట్టి శ్రీ రాములు తెలుగు వర్సిటీలో అందజేశారు. అవార్డు కింద రూ.20,116 నగదు, ప్రశంసా పత్రాన్ని ఇచ్చారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : తెలుగు వర్సిటీ సాహిత్య పురస్కారం - 2015
ఎప్పుడు : ఫిబ్రవరి 26
ఎవరు : ఘంటా చక్రపాణి
ఎందుకు : తెలంగాణ జైత్రయాత్ర రచనకు గాను

టీఎస్ ఆర్టీసీకి జాతీయ పురస్కారాలు
ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో టీఎస్‌ఆర్టీసీ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. కొన్నేళ్లుగా ఈ విభాగాల్లో ఉత్తమ రవాణాసంస్థగా పురస్కారాలు సొంతం చేసుకుంటున్న ఆర్టీసీ ఈసారీ అవార్డులను దక్కించుకుంది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను పలు విభాగాల్లో ఎంపిక చేసిన రవాణా సంస్థలకు అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్ట్ అండర్‌టేకింగ్‌‌స (ఏఎస్‌ఆర్టీయూ) ఢిల్లీలో జరిగిన 62వ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశంలో పురస్కారాలు ప్రదానం చేసింది. వాహన ఉత్పాదకత, ఇంధన పొదుపు లో టీఎస్‌ఆర్టీసీ ఉత్తమ రవాణా సంస్థగా పురస్కారాలు దక్కించుకుంది. వాహన ఉత్పాదకతలో 318.27 కి.మీ. నుంచి 328.27 కి.మీ.(కి.మీ./వెహికల్/డే)కు మెరుగుపరుచుకుని టాప్‌లో నిలిచింది. ఇక 7,500 వాహనాలు ఉన్న రవాణాసంస్థల కేటగిరీలో ఇంధనపొదుపునకు సంబంధించి 5.51 కేఎంపీఎల్‌తో ఉత్తమంగా నిలిచింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టీఎస్ ఆర్టీసీకీ జాతీయ పురస్కారాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎవరు : అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్‌‌సపోర్ట్ అండర్‌టేకింగ్‌‌స
ఎక్కడ : న్యూఢిల్లీలో
ఎందుకు : ఇంధన పొదుపు, వాహన ఉత్పాదకతలో

తెలంగాణలో 3 ఏళ్లలో 1,149 రైతుల ఆత్మహత్య
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూడేళ్లలో 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు నివేదికను సిద్ధం చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 ఆగస్టు 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,066 రైతు ఆత్మహత్య కేసులు నమోదయ్యాయని గుర్తించింది. అందులో వ్యవసాయ సంబంధిత కారణాల వల్ల ఎందరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై 1,808 కేసులను తీసుకొని జిల్లాల్లో త్రిసభ్య కమిటీలు విచారణ చేపట్టాయి. చివరకు 1,149 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ కేసుల్లో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 168 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 144 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 109 మంది ఆత్మహత్య చేసుకోగా, ఇప్పటికే 846 మంది రైతు కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించినట్లు నివేదికలో వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 3 ఏళ్లలో 1,149 రైతుల ఆత్మహత్య
ఎప్పుడు : ఫిబ్రవరి 27
ఎక్కడ : తెలంగాణలో

బీఎస్‌ఈలో చేరిన జీహెచ్‌ఎంసీ
హైదరాబాద్ మహా నగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) ఫిబ్రవరి 22న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో చేరింది.

హైదరాబాద్‌లో అంతర్జాతీయ మైనింగ్ సదస్సు
Current Affairs హైదరాబాద్‌లో 4 రోజుల అంతర్జాతీయ మైనింగ్ సదస్సు జరిగింది. మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫిక్కీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు, ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గనులేమీ అక్షయ పాత్రలు కావని.. దుర్వినియోగం చేస్తే వైపరీత్యాలు, ఆపదలు తప్పవని గవర్నర్ అన్నారు. గనుల తవ్వకాల కోసం ధ్వంసం చేసిన అడవులను తప్పనిసరిగా పునరుద్ధరించాలని, లేదంటే కఠినంగా శిక్షించే చట్టాలు తీసుకురావాలన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అంతర్జాతీయ మైనింగ్ సదస్సు
ఎప్పుడు : ఫిబ్రవరి 14 - 17
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్‌లో ఇరాన్ అధ్యక్షుడి పర్యటన
భారత పర్యటనలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ.. ఫిబ్రవరి 16న (శుక్రవారం) చారిత్రక మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతు.. భారతదేశానికి పెట్రోల్, గ్యాస్ విక్రయించడానికి ఇరాన్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తమ దేశంలో చబహార్ ఓడరేవు ప్రారంభమైందని, దీని వల్ల భారత్‌కు రవాణా మార్గం దగ్గర అవుతుందని పేర్కొన్నారు.
భారతదేశం ఓ పుష్పగుచ్ఛం లాంటిదని, ఓ పుష్పగుచ్ఛంలో అన్ని రకాల పువ్వులూ ఉంటాయని, అలాగే భారత్‌లో ఎన్నో మతాలు, కులాలు, తెగలు ఐకమత్యంతో ఉంటున్నాయని రౌహానీ పేర్కొన్నారు. ఇరు దేశాలు టెక్నాలజీ, వైజ్ఞానిక రంగాల్లో సహాయ, సహకారాలు అందించుకోవాలని సూచించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో ఇరాన్ అధ్యక్షుడి పర్యటన
ఎప్పుడు : ఫిబ్రవరి 16
ఎవరు : హసన్ రౌహాని

కావేరీ జలాల్లో కర్ణాటకకు మరో 14.75 టీఎంసీలు
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఫిబ్రవరి 17న కీలక తీర్పునిచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశమిచ్చింది. అంతే పరిమాణంలో తమిళనాడుకు కోత విధించింది. కేటాయింపుల్లో తాగు నీటికే తొలి ప్రాధాన్యత అని సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తేల్చింది. బెంగళూరుకు ఉన్న ‘ప్రపంచ స్థాయి నగరం’ హోదాను దృష్టిలో పెట్టుకుని తాజా కేటాయింపులు చేస్తున్నామంది. 14.75 టీఎంసీల్లో బెంగళూరు నగర అవసరాలకోసం 4.75 టీఎంసీల నీటిని కేటాయించింది. ఈ తీర్పుతో ఇరు రాష్ట్రాల సరిహద్దులోని బిలిగుండ్లు నుంచి తమిళనాడుకు కర్ణాటక 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది.
జాతీయ ఆస్తి.. రాష్ట్రాల సొత్తు కాదు
అంతర్జాతీయ నదీ జలాల సమాన పంపకాలకు సంబంధించిన హెల్సింకి, కాంపియన్, బెర్లిన్ నిబంధనలను తాజా తీర్పులో ఉటంకించిన కోర్టు.. నదులు జాతీయ ఆస్తులనీ, ఏ రాష్ట్రం కూడా ఒక నది పూర్తిగా తనకే చెందుతుందని చెప్పుకోజాలదని స్పష్టం చేసింది. ప్రకృతి వరప్రసాదాలైన నదీ జలాలను బాధ్యతాయుతంగా వాడుకునే హక్కు ఆ నది పారుతున్న ప్రతి రాష్ట్రానికీ ఉంటుందని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 363 ప్రకారం ఈ కేసును సుప్రీంకోర్టు విచారించకూడదన్న కేంద్రం వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కావేరీ జలాల వివాదం విషయమై 2016లో కర్ణాటక, తమిళనాడుల్లో ఘర్షణలు జరిగాయి.
తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75
సీడబ్ల్యూడీటీ 2007లో తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరిలకు వరుసగా 419, 270, 30, 7 టీఎంసీల నీటిని కేటాయించింది. తాజా తీర్పుతో తమిళనాడుకు 404.25, కర్ణాటకకు 284.75 టీఎంసీల నీళ్లు దక్కనున్నాయి. కేరళ, పుదుచ్చేరిల కేటాయింపుల్లో మాత్రం సుప్రీంకోర్టు ఎలాంటి మార్పులూ చేయలేదు. అలాగే నదీ పరీవాహక ప్రాంతం నుంచి 10 టీఎంసీల భూగర్భ జలాలను తోడుకునేందుకు తమిళనాడుకు అనుమతినిచ్చింది. తీర్పును అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్రానికి ధర్మాసనం ఆరు వారాల గడువిచ్చింది. 15 ఏళ్ల వరకు ఈ కేటాయింపులు అమలవుతాయని ధర్మాసనం తెలిపింది.
1881 నుంచి వివాదం
  • 1881వ సంవత్సరంలో కావేరీ నదిపై డ్యామ్ నిర్మించాలన్న అప్పటి మైసూర్ సంస్థానం ప్రయత్నాన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ అడ్డుకోవటంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం మొదలైంది. ఆ తర్వాత నదీ జలాల పంపిణీపై రెండు ప్రభుత్వాలు 1892, 1924వ సంవత్సరాల్లో వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకోవటంతో వివాదం పరిష్కారమయింది. ఈ ఒప్పందాల కాల పరిమితి 1974లో ముగిసింది.
  • 1990 - తమిళనాడు కోరిక మేరకు కేంద్రం కావేరీ జల వివాద ట్రిబ్యునల్(సీడబ్ల్యూడీటీ)ను ఏర్పాటు చేసింది.
  • 1991 - అత్యవసర సాయంగా కొంతనీరు విడుదల చేయాలన్న తమిళనాడు వినతిని సీడబ్ల్యూడీటీ తిరస్కరించింది. దీంతో తమిళనాడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం సూచనల మేరకు.. తమిళనాడుకు 205 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీడబ్ల్యూడీటీ కోరగా కర్ణాటక పట్టించుకోలేదు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నా కర్ణాటక దిగిరాలేదు. ఈ పరిణామంతో కేంద్రం సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను గెజిట్‌లో ప్రచురించింది.
  • 1998 - సీడబ్ల్యూడీటీ మధ్యంతర ఉత్తర్వులను అమలు పరిచేందుకు ప్రత్యేకంగా కేంద్రం కావేరి నదీ ప్రాధికార సంస్థ(సీఆర్‌ఏ)ను ఏర్పాటు చేసింది.
  • 2007 - ఏర్పాటైన 17 ఏళ్ల తర్వాత కావేరి జలాల పంపిణీ తుది అవార్డును సీడబ్ల్యూడీటీ ప్రకటించింది. నదీ జలాల పంపిణీపై 1892, 1924 సంవత్సరాల్లో కుదిరిన ఒప్పందాల అమలే సరైన పరిష్కారమని అందులో పేర్కొంది.
  • 2013 - కావేరి యాజమాన్య బోర్డు(సీఎంబీ) ఏర్పాటు చేయాలని తమిళనాడు కోరడంతో ఆ మేరకు కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • 2013 మే 28 - సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయనందుకు తనకు కలిగిన రూ.2,480 కోట్ల నష్టాన్ని కర్ణాటక చెల్లించాలంటూ తమిళనాడు సుప్రీంకు వెళ్లింది.
  • 2013 - నీటి విడుదలపై సీడబ్ల్యూడీటీ ఆదేశాలను అమలు చేయాలన్న తమిళనాడు డిమాండ్ సహేతుకం కాదని కావేరీ పర్యవేక్షక కమిటీ పేర్కొంది.
  • 2016 సెప్టెంబర్ 11 - కావేరి నీటి విడుదలపై ఉత్తర్వులను సవరించాలని కర్ణాటక వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

హైదరాబాద్‌లో వరల్డ్ ఐటీ కాంగ్రెస్
‘ఐటీ పరిశ్రమ ఒలింపిక్స్’గా ఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక ప్రపంచ ఐటీ కాంగ్రెస్ మూడు రోజుల సదస్సు హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగుతున్న ఈ సదస్సుని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోపాటు ప్రముఖ ఐటీ కంపెనీల సీఈఓలు ప్రసంగించారు. వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్‌‌స (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సదస్సును నిర్వహిస్తున్నాయి. 40 ఏళ్లగల చరిత్రగల ఈ సదస్సును తొలిసారి భారత్‌లో నిర్వహిస్తుండటంతో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది. 1978లో తొలిసారి ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు జరగ్గా 22వ సమావేశానికి హైదరాబాద్ వేదికైంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఐటీ కాంగ్రెస్
ఎప్పుడు : ఫిబ్రవరి 19 - 21
ఎక్కడ : హైదరాబాద్
ఎవరు : వరల్డ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్‌‌స (డబ్ల్యూఐటీఎస్‌ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా రజత్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో ఎన్నికల కమిషనర్ల పానెల్ సమావేశమై తెలంగాణకు కొత్త సీఈవోగా ఆయనను ఎంపిక చేసింది. 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రజత్‌కుమార్ ప్రస్తుతం అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేస్తున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 20న రీ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఈవోగా రజత్‌కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఈవోగా వ్యవహరించిన భన్వర్‌లాల్ ఏపీ విడిపోయాక రెండు తెలుగు రాష్ట్రాలకు సీఈవోగా కొనసాగారు. భన్వర్‌లాల్ పదవీ విరమణ పొందాక ఏపీ సీఈవోగా సిసోడియా బాధ్యతలు చేపట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు ఎన్నికల ప్రధానాధికారి నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎవరు : రజత్‌కుమార్

హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయం
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కేంద్రంగా కొనసాగుతున్న హైదరాబాద్‌లో మరో ఐటీ దిగ్గజ సంస్థ ఏర్పాటు కానుంది. ప్రముఖ ఐటీ సంస్థ అడోబ్ తమ కార్యాలయాన్ని హైదరాబాద్ పరిసరాల్లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్‌తో రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 19న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడోబ్ కార్యాలయాన్ని నెలకొల్పాల్సిందిగా కేటీఆర్ కోరారు. 2015, మే నెలలో శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో శంతన్ నారాయణ్‌తో తొలిసారి సమావేశమైన కేటీఆర్, తర్వాత పలుమార్లు ఆయన్ను కలిశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా కోరిన విషయాన్ని ఐటీ కాంగ్రెస్ సమావేశంలో గుర్తుచేశారు. దీనికి స్పందించిన శంతన్ నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానమిస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే అడోబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌‌స కేంద్రాన్ని ఇక్కడ నెలకొల్పుతామని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : హైదరాబాద్‌లో అడోబ్ కార్యాలయం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : అడోబ్ చైర్మన్, సీఈఓ శంతన్ నారాయణ్
ఎక్కడ : వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా అంగీకారం

వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొన్న రోబో సోఫియా
ప్రపంచంలోనే అత్యాధునిక హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’.. హైదరాబాద్‌లో జరిగిన వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ రోబో సృష్టికర్త, హాన్సన్ రోబోటిక్స్ కంపెనీ సీఈవో డేవిడ్ హాన్సన్‌తో కలసి ఫిబ్రవరి 20న సోఫియా సదస్సుకి హాజరైంది. ప్రసంగించడమే కాదు.. ప్రశ్నలు అడిగితే చకచకా సమాధానాలూ ఇచ్చింది. బాలీవుడ్‌లో నీకు ఇష్టమైన హీరో ఎవరనే ప్రశ్నకి.. షారూక్ ఖాన్ అంటు సమాధానం ఇచ్చింది.
హ్యూమనాయిడ్ రోబో సోఫియాకి సౌదీ అరేబియా 2017లోనే పౌరసత్వం ఇచ్చింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ఐటీ కాంగ్రెస్‌లో పాల్గొన్న హ్యూమనాయిడ్ రోబో సోఫియా
ఎప్పుడు : ఫిబ్రవరి 20
ఎక్కడ : హైదరాబాద్

ప్రమాదంలో 40 భాషలు
దేశంలోని 40కి పైగా భాషలు/మాండలికాలు అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 17న వెల్లడించింది. ఈ భాషలను (ఒక్కో భాష) మాట్లాడేవారి సంఖ్య 10 వేల కంటే తక్కువగా ఉందని తెలిపింది. ఈ జాబితాలో అండమాన్-నికోబార్ దీవులకు చెందిన భాషలు/ మాండలికాలు 11 ఉండగా, తర్వాతి స్థానాల్లో మణిపూర్ 7; హిమాచల్‌ప్రదేశ్ 4 ఉన్నాయి. అంధ్రప్రదేశ్‌కు చెందిన గడాబా, నైకీ భాషలు కూడా ఈ ముప్పును ఎదుర్కొంటున్నాయి.

తెలంగాణలో 17 పులులు ఉన్నట్లు ప్రాథమిక అంచనా
Current Affairs రాష్ట్ర అడవుల్లో పెద్ద పులులు, చిరుతల లెక్కలపై అటవీ శాఖ అధికారులు ఓ అంచనాకు వచ్చారు. మొత్తం 17 పులులు, 125 చిరుతలు ఉన్నాయని జాతీయ జంతు గణనలో భాగంగా సేకరించిన పాదముద్రల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. అత్యధికంగా నల్లమలలోని రాజీవ్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 21 పెద్ద పులులు, 57 చిరుతల అడుగు జాడలను సేకరిం చగా.. అవి 13 పులులు, 45 చిరుతల పాదముద్రలని భావిస్తున్నారు. రెండో స్థానంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ టైగర్ ప్రాజెక్టు పరిధిలో 4 పులులు, 25 చిరుతల అడుగుజాడలను గుర్తించారు. కచ్చితమైన నిరూపణ కోసం పాదముద్రలను డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు, పెంటిక (మలం) నమూనాలను సీసీఎంబీ హైదరాబాద్‌కు పంపించారు. కవ్వాల్ టైగర్ ప్రాజెక్టులోని జన్నారం దట్టమైన ఫారెస్టు పరిధిలో ఒకటంటే ఒక్క పులి అడుగు జాడ కనిపించలేదు.

ఈ-ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్‌వేర్
సాఫ్ట్‌వేర్ కంపెనీ పెగాసిస్టమ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేంద్రీకృత పోర్టల్ ‘ఈ-ప్రగతి’కి సాంకేతిక సేవలందించే ప్రాజెక్టును చేజిక్కించుకుంది. ఈ-ప్రగతి పోర్టల్ ద్వారా 33 ప్రభుత్వ విభాగాలు, 315 ఏజెన్సీలు, 745 పౌర సేవల్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.2,398 కోట్లు. ఒకే పోర్టల్ ద్వారా ఆన్‌లైన్లో పౌర సేవల్ని అందించటమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని ఈ-ప్రగతి సీఈవో ఎన్.బాలసుబ్రమణ్యం చెప్పారు. కేంద్రీకృత వ్యవస్థ కావడంతో ఏపీలో డిజిటైజేషన్‌కు ఇది ఊతమిస్తుందని, అన్ని విభాగాలపై నియంత్రణ ఉంటుందని తెలియజేశారు. కాగా, భారత్‌లో పెగాసిస్టమ్స్‌కు ఇదే తొలి ప్రాజెక్టు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఈ-ప్రగతి ప్రాజెక్టుకు పెగా సాఫ్ట్‌వేర్
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్‌లో

హైదరాబాద్‌లో ముస్లిం పర్సనల్ లా ప్లీనరీ సమావేశాలు
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 26వ ప్లీనరీ సమావేశాలు ఫిబ్రవరి 9-11 వరకు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ సమావేశాలకు కోర్ కమిటీ సభ్యుడు మౌలానా సల్మాన్ నద్వీ గైర్హాజరై బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించడానికి శ్రీ శ్రీ రవిశంకర్‌ను బెంగళూరులో కలవడం వివాదానికి దారి తీసింది. దీంతో సల్మాన్ బోర్డు నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించడంతో పాటు కొత్త బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. చివరి రోజైన ఫిబ్రవరి 11న బోర్డు హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో కొన్ని నిర్ణయాలను ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ 26వ ప్లీనరీ సమావేశాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 9-11 వరకు
ఎక్కడ : హైదరాబాద్

హైదరాబాద్‌లో తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు
చిన్నారులపై జరిగే అఘాయిత్యాలకు సంబంధించిన కేసుల విచారణకు దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు హైదరాబాద్‌లో ఏర్పాటవుతోంది. నాంపల్లిలోని హాకా భవన్‌లో ఉన్న భరోసా కేంద్రం ఆధీనంలోనే ఫిబ్రవరి 24న దీన్ని ప్రారంభించనున్నారు. నగర కమిషనరేట్ పరిధిలో అత్యాచారం, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలు, తీవ్రమైన గృహహింస కేసుల్లో బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి భరోసా కేంద్రాన్ని 2016, మే 7న ఏర్పాటు చేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలోనే తొలి చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : చిన్నారులపై జరిగే అఘాయిత్యాల కేసుల విచారణకు

7 దేశాల్లో తెలంగాణ మహిళల బైక్ యాత్ర
తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళలు బైక్‌లపై సాహసయాత్ర చేపట్టారు. ఈ మేరకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఫిబ్రవరి 11న యాత్రను ప్రారంభించారు. ఈ యాత్రా బృందానికి ప్రముఖ బైక్ రైడర్ జై భారతి నాయకత్వం వహిస్తుండగా ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతిలు సభ్యులుగా ఉన్నారు.
ఈ బృందం 50 రోజుల యాత్రలో భాగంగా హైదరాబాద్ నుంచి మేకాంగ్ వరకు భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం వంటి 7 దేశాల్లో రోడ్డు మార్గం ద్వారా సుమారు 17 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. వీరు 19 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు, 35 యునెస్కో సైట్లను సందర్శించి తెలంగాణ టూరిజం ప్రమోషన్‌తో పాటు, పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం నిర్వహిస్తారు. వీరికి 400 సీసీ బైకులను బజాజ్ ఆటో కంపెనీ స్పాన్సర్ చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : 7 దేశాల్లో తెలంగాణ మహిళల బైక్ యాత్ర
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎక్కడ : భారత్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, కంబోడియా, వియత్నాం
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి
ఎవరు : జై భారతి, ప్రియా బహదూర్, శిల్ప బాలకృష్ణన్, సుజన్ శాంతి

తెలంగాణలో బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు
తెలంగాణలో కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు ఏర్పాటుకు యూఏఈకి చెందిన కెఫ్ ఇన్‌ఫ్రా (కేఈఎఫ్ ఇన్‌ఫ్రా), రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకోసం కెఫ్ ఇన్‌ఫ్రా సంస్థ రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్లాంట్ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అలాగే పార్కులో ఏర్పాటు కానున్న 60-70 అనుబంధ పరిశ్రమలతో మొత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, దాదాపు 30 వేల మందికి పరోక్ష ఉపాధి దొరకనుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బిల్డింగ్ మెటీరియల్ మ్యానుఫాక్చరింగ్ పార్కు
ఎప్పుడు : త్వరలో
ఎక్కడ : తెలంగాణలో
ఎవరు : యూఏఈకి చెందిన కెఈఫ్ ఇన్‌ఫ్రా

హైదరాబాద్‌లో ఫ్రెంచ్ ఏరియల్ షో
దేశంలోనే తొలిసారి హైదరాబాద్ వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఫిబ్రవరి 13న రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : దేశంలో తొలి ఫ్రెంచ్ ఏరియల్ షో
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎక్కడ : హైదరాబాద్

తెలంగాణ నూతన సీఎస్‌గా శైలేంద్ర కుమార్ జోషి
Current Affairs రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శైలేంద్ర కుమార్ జోషి నియమితులయ్యారు. ప్రస్తుత సీఎస్ ఎస్పీ సింగ్ పదవీకాలం జనవరి 31తో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జోషిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్పీ సింగ్ పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆయన స్థానంలో ఎస్‌కే జోషిని నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. కొత్త సీఎస్‌గా నియమితులైన జోషి ప్రస్తుతం నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాలుగో సీఎస్‌గా జోషి నియమితులయ్యారు.
1984 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన జోషి ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందినవారు. 1959 జనవరి 20న జన్మించిన ఆయన రూర్కీ ఐఐటీలో ఇంజనీరింగ్ చదివారు. ఢిల్లీ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేశారు. టెరీ స్కూల్ ఆఫ్ అడ్వాన్‌‌సడ్ స్టడీస్ నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలంగాణకు నూతన ప్రధాన కార్యదర్శి
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : శైలేంద్ర కుమార్ జోషి

ఏటా ఏపీకి వచ్చే పర్యాటకులు 10 కోట్ల మంది
ఏటా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది. తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)కి పర్యాటక రంగం అండగా నిలుస్తోంది. 2017-18 (ఏప్రిల్-నవంబర్)లో రాష్ట్రానికి పర్యాటకుల ద్వారా రూ.36,034 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ కాలంలో రాష్ట్రాన్ని 10,62,80,739 మంది సందర్శించారని అధికారిక లెక్కల ద్వారా వెల్లడైంది.
రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా ఎక్కువ ఆదాయం చిత్తూరు జిల్లా నుంచే వస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుండటమే దీనికి కారణం. గతేడాది తిరుపతి సందర్శించిన పర్యాటకులతో పోల్చితే ఈ ఏడాది పర్యాటకుల సంఖ్య 2.84 లక్షలు పెరిగింది.

ముగిసిన మేడారం జాతర
తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ముగిసింది. ఫిబ్రవరి 2న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మేడారం చేరుకొని వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ‘‘మేడారంలో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తామన్నారు. జాతర కోసం 200 నుంచి 300 ఎకరాల స్థలం సేకరిస్తామని తెలిపారు.
తెలంగాణలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర దేశంలోనే అత్యంత ఎక్కువ మంది సందర్శించే గిరిజన ఉత్సవం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండంలోని మేడారంలో జరిగే ఈ జాతర ప్రతి రెండేళ్లకొకసారి జనవరి 31న ప్రారంభమై ఫిబ్రవరి 3న ముగుస్తుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగిసిన మేడారం సమ్మక్క - సారలమ్మ జాతర
ఎప్పుడు : జనవరి 31 - ఫిబ్రవరి 3
ఎవరు : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : మేడారం, తాడ్వాయి మండలం, జయశంకర్ భూపాలపల్లి

అమరావతిలో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(సీఎస్‌ఐఆర్) ప్రయోగ, ప్రదర్శన కేంద్రం ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. సీఎస్‌ఐఆర్ డెరైక్టర్ జనరల్ గిరీశ్ సాహ్నీ, సీనియర్ శాస్త్రవేత్తలు ఫిబ్రవరి 6న సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న సీఎస్‌ఐఆర్ ప్రయోగశాలల్లో కనుగొన్న పరిశోధన ఫలాల్ని, సరికొత్త ఆవిష్కరణలను పరీక్షించి, ప్రదర్శించడానికి వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వారు ప్రతిపాదించగా.. సీఎం అంగీకారం తెలిపారు. ‘సెంటర్ ఫర్ స్కేలింగ్ అప్ అండ్ డిమాన్‌స్ట్రేషన్ ఆఫ్ రెలవెంట్ సీఎస్‌ఐఆర్ టెక్నాలజీస్’ పేరుతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరో రెండు నెలల్లో సవివర కార్య ప్రణాళికను సిద్ధం చేసి తీసుకొస్తామని సాహ్ని తెలిపారు. కాగా, బౌద్ధ ఆలయం నిర్మాణానికి అమరావతిలో పదెకరాల స్థలం కేటాయిస్తామని సీఎం చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఐఆర్ ప్రయోగ కేంద్రం
ఎప్పుడు : ఫిబ్రవరి 6
ఎక్కడ : అమరావతిలో

ఏపీ తాత్కాలిక హైకోర్టుకు ఏఎన్‌యూ భవనాలు
తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేసేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ఏఎన్‌యూ) ప్రాంగణంలోని కొన్ని భవనాలను ఎంపిక చేశామని ఉమ్మడి హైకోర్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. ఆయా భవనాలను పరిశీలించేందుకు రావాలని కోరుతూ ఏపీ తాత్కాలిక హైకోర్టు భవనాల ఏర్పాటు పరిశీలన కమిటీకి సర్కార్ లేఖ రాసింది. యూనివర్సిటీ భవనాలను పరిశీలించిన తర్వాత కమిటీ.. తన అభిప్రాయాలను న్యాయమూర్తులందరితో కూడిన ఫుల్‌కోర్టు ముందు ఉంచుతుంది. ఫుల్‌కోర్టులో మెజారిటీ నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది.
Published date : 21 Feb 2018 03:18PM

Photo Stories